Posts

Showing posts from May, 2019

ఒక భార్గవి పుస్తకం గురించి దర్శకుడు వంశీ

Image
చాన్నాళ్ల నించి నేను రాసుకుంటూ వచ్చిన ఫేస్‌బుక్ పోస్టింగులు ‘‘ఎప్పటి మాట... ఇపుడా మనిషే లేదు’’ అన్న పేరుతో  పుస్తకం వేద్దామనుకున్నాను. Director Vamsy అన్న పేరుగల నా పేజి లో కెళ్ళి తీసిన ప్రింటవుట్స్‌ని పబ్లిషర్ గారికి పంపించేను. రష్యన్ డైరెక్టర్ టార్కవస్కీ సిన్మామీద రాసిన రివ్యూ తప్ప మిగతా ఆర్టికల్స్ అన్నీ బాగున్నాయి కానీ, బుక్ బల్క్‌నెస్ చాలదు. ఇంకా 70  పేజీలు కావాలన్నారా పబ్లిషర్ గారు. ఫ్యాషన్ డిజైనర్ సిన్మా ఫ్లాపయింతర్వాత నించీ నా పేజ్ లో  పోస్ట్‌లు  పెట్టడం మానేసేను. వాళ్లడిగిన ఆ డబ్బై పేజీలూ ఇప్పుడెక్కడ్నించి తేను? అనుకుంటా వుండి పోయిన నాకు మొన్న వేమూరి సత్యంగారు ఫోన్ చేసి.‘‘పామర్రులో ఒక డాక్టర్ గారు   నువ్వు తెద్దా మనుకున్న పుస్తకం కంటే గొప్ప  పుస్తకం తెచ్చేరు. నీక్కూడా కాపీ పంపిస్తారు చూసేక ఫోన్ చెయ్యి’’ అన్నారు. అలా ఆయనలాగన్న నాలుగు రోజులకి  రిజిస్టర్ పోస్ట్‌లో పుస్తకం వచ్చింది. డాక్టర్ భార్గవి గారు రాసిన ఆ పుస్తకం నిజంగా గొప్ప పుస్తకం. పేరు ‘‘ఒక భార్గవి’’ ప్రగతి వారి ప్రింటింగ్ అద్భుతం. గిరిధర్ గౌడ్‌గారి పెయింటింగ్స్ మరీ అద్భుతం లోపల గురుదత్‌ పెయింటింగ్ నైతే అలా చూస్త

మా మద్రాసు తాతయ్య

Image
అయిన వాళ్లూ,దగ్గర బంధువులూ ఆయన్ని పిలిచే పేరు ఆనంద్ . పరివారమూ , పరిజనమూ పెదనాయన అంటారు. స్నేహితులూ, దగ్గరగా తెలిసిన వాళ్లూ"చిక్కీ "అంటుంటారు. పాఠకులకీ, పై వాళ్లకీ తెలిసిన పేరు వే.ఆ.కృ.రంగారావు లేక వి.ఎ.కె .రంగారావు. కానీ దగ్గర పరిచయస్తులకీ ,తను అభిమానించే వాళ్లకీ, తనను అభిమానించే వాళ్లకీ---ఆయనే కోరి పిలిపించుకునే పేరు తీరు "మద్రాస్ తాతయ్య" చిన్నతనం నుండీ పత్రికలలో ఆయన వ్యాసాలు,(ముఖ్యంగా విజయచిత్రలో) చదివి చాలా ఆశ్చర్య పడుతూ వుండే దానిని. ఆయన నిర్మొహమాటం ,ఆయన విషయ పరిజ్ఞానం, ఆయన రాసే తెలుగు భాషా, ఆయన ఇతరుల కంటే విభిన్నం సుమా అని చెబుతున్నట్టుండేది. నాకాయన పరిచయమవుతారనీ, ఆయనతో మాట్లాడతాననీ, ఆయన పుస్తకం ప్రచురించిన మొట్ట మొదటి ప్రచురణ కర్తని నేనే అవుతాననీ(రెండో ప్రచురణ కర్త నా స్నేహితురాలు డా"శశికళ కోలా ) ఆయన మా ఇంటి సభ్యులలో ఒకరిలా అవుతారనీ పదహారేళ్లక్రితం ఊహామాత్రంగా కూడా అనుకోలేదు .అంతా "కృష్ణమాయ "అనిపించేట్టే జరిగింది. ఈ జన్మలో నాకు పట్టిన అదృష్టాలలో అదొకటి. 2002లో "వార్త" లో వస్తున్న కాలమ్ "ఆలాపన "అభిమానిగా ఆయనతో పరి

మమతల పాలవెల్లి మా అమ్మ

Image
నేను కళ్లు తెరిచేటప్పటికి ఆమె వొడి లోవున్నాను అప్పటినుండీ ఆమె కళ్లు మూసే వరకూ ఆ వొడిలోనే భద్రంగా వున్నాను ఆ తర్వాతే హఠాత్తుగా నా వయసూ , నా పెద్దరికం నాకు తెలిసింది. ఆమె నా కన్నతల్లి కాదనీ "పెద్దమ్మా " అని పిలవాలని నాకూ, నేను తన కన్నకూతురిని కాదనీ కాస్త వేరుగా చూడాలనీ ఆమెకూ యెవరెన్ని సార్లు గుర్తు చేసినా యిద్దరం ఆ విషయం అంగీకరించలేదు నేనే కాదు నా కొడుకు కూడా ఆమెనే "అమ్మా "అని పిలిచేది. నన్ను పెంచిన ఆరేళ్లకి పుట్టిన కూతురు కన్నా తనకు నేనే యెక్కువ . లంకంత కొంపలో పదమూడేళ్ల పసి వయసులో యింటికి పెద్దకోడలుగా అడుగు పెట్టి వంచిన నడుమెత్తకుండా చాకిరీ చేసి అత్త మామలకు ప్రీతి పాత్రమయిన కోడలుగా మెలిగింది. ఆడబడుచుల ఆరళ్లు తట్టుకుని నిలబడింది మరుదులందరికీ మాతృమూర్తిలాంటి వదినగా వెలిగింది  యెంత వయసొచ్చినా యిరుగు పొరుగుకే కాక యింటికెవరొచ్చినా చూడంగానే యిష్టపడే మూర్తిమత్వం మొక్కలనీ, కుక్కలనీ, పశువులనీ, పక్షులనీ, మనుషుల్లాగే ప్రేమించే మనస్తత్వం. నియంతలాంటి భర్తతో మెప్పూ,మెహర్బానీ లేని కాపురం యేభై యేళ్లు వెలిగించినా తన పుట్టిన రోజెపుడో పెళ్లి రోజెపుడో యెరగదు.  మావే కానీ తన

గాన సావిత్రి

Image
సావిత్రి మంచినటిగా మనందరికీ తెలిసిన విషయమే ,చిన్నప్పటి నుండీ ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగిన నేను ఆవిడలోని మంచి డాన్సర్ ని కనిపెట్ట లేకపోయాను . అందుకే ఆవిడ జీవిత చరిత్ర చదివి నపుడు డాన్సర్ గా ఆవిడ కళా జీవితం ప్రారంభ మయిందనీ కాకినాడ కళా పరిషత్తులో ఆవిడ చేసిన నాట్యానికి మంచి గుర్తింపు వచ్చిందనీ,పృథ్వీరాజ్ కపూర్ కూడా మంచి ఫుట్ వర్క్ అని ప్రశంసించారనీ చదివిఆశ్చర్య పోయాను.ఆ నాట్యం చూసే దోనేపూడి కృష్ణమూర్తి అనే ఆయన మొదట సినిమా ఛాన్స్ ఇచ్చారనీ ఆవిడ రేడియో ఇంటర్వ్యూలో చెప్పారు. నాకు ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఆవిడ చక్కగా శృతిశుధ్ధంగా పాడటం.ఎక్కడంటారా? -"మిస్సమ్మ" సినిమాలో "మీకు మీరే మాకు మేమే "అంటూ స్వరాలతో సహా అక్కినేని తో గొంతు కలిపిందికదా!.అసలా గొంతు ఆవిడకి ఆ చిత్రంలో ప్లేబాక్ పాడిన లీలదనుకున్నాను ,వి.ఎ.కె చేసిన "మిస్సమ్మ "సంక్షిప్త శబ్ద చిత్రం క్రెడిట్స్ లో ఆమె పేరు ఇవ్వడం వలనా ,ఆయన నాకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం వలనా తెలిసింది.ఆవిడ "నవరాత్రి" వీధి భాగవతంలో కూడా పాడింది,అందులో పాడటానికి వి.ఏ.కె. ఆ చిత్ర బృందానికి "ఆవిడ బాగా పాడుతుంది,వెరై

నృత్య తార-యల్ విజయలక్ష్మి

Image
పంతొమ్మిది వందల యాభయ్ -అరవవయ్యీ దశకాలలోని సినిమాల పట్ల అవగాహన వున్న వారికి యల్ .విజయలక్ష్మి పరిచయం అక్కరలేని పేరు అంత వరకూ నృత్యతారలుగా వెలుగుతున్న కుచలకుమారి,ఇ.వి. సరోజ,కమలాలక్ష్మణ్ (అడపాదడపా)రీటా, జ్యోతి వీరందరినీ తోసిరాజని తారాజువ్వలా దూసుకు వచ్చిన తార విజయలక్ష్మి. అంత పొడుగూ ,పొట్టీ కాని విగ్రహం,చక్కని కనుముక్కు తీరూఅన్ని భావాలనూ సున్నితంగా పలికించే చేప ల్లాంటి కళ్లూ ఆమెకు పెట్టని ఆభరాణాలయితే లయానుగుణంగా చురుకుగా పర్ఫెక్టుగా  కదిలే శరీరం, యెంత క్లిష్టమయిన నాట్య విన్యాసాన్నయినా అవలీలగా చేయగల సామర్థ్యం ఆమెను మేలి నాట్యతారగా నిలిపాయి. ఈమె శాస్త్రీయ నృత్యాలూ ,శృంగార నాట్యాలూ ,క్లబ్ సాంగ్స్ ,జానపద నృత్యాలూ యిలా అన్ని రకాలూ చేయగల దిట్ట అయితే ఈమె శృంగార నృత్యం చేసినా లేకిగా రెచ్చగొట్టేదిగా వుండదు. ఆమె తర్వాత వచ్చిన నటీమణుల నృత్యానికీ యీమె నృత్యానికీ యిదే తేడా అనిపిస్తుంది పైగా విజయలక్ష్మి డాన్స్ చూస్తుంటే ఆమె శరీరంలోని ప్రతి అణువూ నాట్యం చేస్తున్నట్టు వుంటుంది అదే మాట ఆమె తన యింటర్వ్యూలో చెప్పింది "నాట్యం నా పేషన్ ,నాట్యం చేస్తున్నపుడు నా హృదయాన్ని పరచినట్టుంటుంది "అని . 

వెండి తెరకు అమృతం తెచ్చిన జాబిలి కృష్ణకుమారి

Image
ఇది "మా అమ్మ కృష్ణకుమారి " అనే పేరుతో ఆమె కుమార్తె దీపికా మయ్యా ఇంగ్లీషులో రాసిన పుస్తకం చదివాక నాకు కలిగిన స్పందన. ఇది సినీ తార కృష్ణకుమారి జీవిత చరిత్ర. జీవిత చరిత్రలు రెండు రకాలుగా రాస్తారు. ఒకటి తమకు తామే రాసుకునే స్వీయచరిత్రలు ,రెండు ఇతరులు తమ గురించి రాసే జీవిత చరిత్రలు. స్వీయచరిత్రలో సాధికారత గురించి ప్రశ్నించ వలసిన అవసరం లేదు.  ఎందుకంటే ఒక వ్యక్తి తన గురించి స్వయంగా చెప్పుకుంటాడు కాబట్టి, జీవిత చరిత్ర విషయానికొస్తే అది రాసే వారిని బట్టి వుంటుంది. ఆ రాసే వ్యక్తి అంటే రచయిత సదరు వ్యక్తి కి పరిచయం వున్న వాడయి వుండచ్చు లేదా అసలు ముఖమే ఎరుగని అపరిచితుడయి వుండవచ్చు, అయితే రచయిత ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి అయి వుండి, దగ్గరగా గమనించి నిస్పక్షపాతంగా రాస్తే ఆ పుస్తకానికొక సాధికారత నిస్సందేహంగా చేకూరుతుంది. అలా ఈ పుస్తకంలో కృష్ణ కుమారి గారి గురించి రాసిన విషయాలలోనూ,సమాచారంలోనూ ఒక అథెంటిసిటీ వుందని భావిస్తున్నాను ,రాసింది వారి అమ్మాయి కాబట్టి. పుస్తకం రూపొందించిన విధానంలో కూడా ఒక వైవిధ్యముంది.ఆమె కుమార్తె దీపిక ,తన చిన్నతనంలో తల్లి నటించిన సినిమాల వీడియో కేసట్లు బడి నుండ