మా అమ్మ శ్రీమతి ఘంటసాల సావిత్రమ్మ
ఘంటసాల అనే ఈ ఇంటి పేరు చెప్పగానే ,కనీసం పూర్తి పేరు కూడా చెప్పకుండానే తటాలున తెలుగు ప్రజలందరికీ గుర్తువచ్చే సినీ నేపథ్య గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావుగారు. నేనాయన్ని కనీసం కంటితోనయినా చూడలేదు,కానీ నాకాయన బాగా తెలుసు ,ఎలాగంటారా మా చిన్నతనంలో ప్రతి ఇంటా,ప్రతి గంటా కంచు గంట లాగా మోగుతుండేది ఆయన కంఠం(అంతకాక పోయినా ఇప్పటికీ తరచుగా వినపడే గొంతే ఆయనది లేకపోతే ఆయన పోయి దాదాపు నలభై యేళ్లు దాటుతున్నా ఈ తరానికి చెందిన చిన్న చిన్న పిల్లలు కూడా ఆయన పాటలు నేర్చుకుని పాడటం జరగదు కదా )అది వింటూ పెరిగిన మేము ఆయనకు కూడా మరణం వుంటుందనే విషయం మర్చి పోయాం. 1974 ప్రాంతాలలో నేను బెజవాడలో ఇంటర్మీడియట్ చదువుకుంటూ మా బాబాయి గారింట్లో వుండేదాన్ని.పేరుకి వాళ్లింట్లో వుంటున్నానన్న మాటే గానీ,నా కాపరమంతా వాళ్ల మేడ మెట్ల మీదా ,మేడ పైన టెర్రస్ మీదే,ఏదైనా చదువుకోవాలన్నా,స్నేహితులతో కబుర్లాడుకోవాలన్నా అన్నిటికీ అడ్రస్ మేడమెట్లే. అలాంటి రోజుల్లో ఒక సాయంత్రం "ఘంటసాల "ఇక లేరనే వార్త మోసుకొచ్చారెవరో ,ఇక చూడండీ నా సామ్రాజ్యమయిన మేడమెట్లమీద కూర్చుని ఎంత ఏడ్చానో.నేనాయన్నెప్పుడూ చూడలేదు,ఆయనేం మా బంధు...