మా అమ్మ శ్రీమతి ఘంటసాల సావిత్రమ్మ




ఘంటసాల అనే ఈ ఇంటి పేరు చెప్పగానే ,కనీసం పూర్తి పేరు కూడా చెప్పకుండానే తటాలున తెలుగు ప్రజలందరికీ గుర్తువచ్చే సినీ నేపథ్య గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావుగారు. నేనాయన్ని కనీసం కంటితోనయినా చూడలేదు,కానీ నాకాయన బాగా తెలుసు ,ఎలాగంటారా మా చిన్నతనంలో ప్రతి ఇంటా,ప్రతి గంటా కంచు గంట లాగా మోగుతుండేది ఆయన కంఠం(అంతకాక పోయినా ఇప్పటికీ తరచుగా వినపడే గొంతే ఆయనది లేకపోతే ఆయన పోయి దాదాపు నలభై యేళ్లు దాటుతున్నా ఈ తరానికి చెందిన చిన్న చిన్న పిల్లలు కూడా ఆయన పాటలు నేర్చుకుని పాడటం జరగదు కదా )అది వింటూ పెరిగిన మేము ఆయనకు   కూడా మరణం వుంటుందనే విషయం మర్చి పోయాం.


1974 ప్రాంతాలలో నేను బెజవాడలో ఇంటర్మీడియట్ చదువుకుంటూ మా బాబాయి గారింట్లో వుండేదాన్ని.పేరుకి వాళ్లింట్లో వుంటున్నానన్న మాటే గానీ,నా కాపరమంతా వాళ్ల మేడ మెట్ల మీదా ,మేడ పైన టెర్రస్ మీదే,ఏదైనా చదువుకోవాలన్నా,స్నేహితులతో కబుర్లాడుకోవాలన్నా అన్నిటికీ అడ్రస్ మేడమెట్లే. అలాంటి రోజుల్లో ఒక సాయంత్రం "ఘంటసాల "ఇక లేరనే వార్త మోసుకొచ్చారెవరో ,ఇక చూడండీ నా సామ్రాజ్యమయిన మేడమెట్లమీద కూర్చుని ఎంత ఏడ్చానో.నేనాయన్నెప్పుడూ చూడలేదు,ఆయనేం మా బంధువు కాదు,వారి పాటల గొప్పతనం గురించి కూడా నాకానాడు పెద్దగా తెలీదు అయినా సరే మా దగ్గర బంధువెవరో చనిపోయినంత బాధ కలిగింది మనసుకి. 


అప్పుడు నాకు ఊహలో కూడా లేదు వారి కుటుంబంతో  నాకు పరిచయం ఏర్పడబోతోందని. అదెలా జరిగిందంటే 2003 ప్రాంతాలలో ఘంటసాల గారి చిన్నబ్బాయి ఘంటసాల రత్నకుమార్ గారు ,వారి తండ్రి గారి మీద ఒక డాక్యుమెంటరీ తీస్తూ ,అందులో భాగంగా (నా గురించి ఎవరో చెప్పినట్టున్నారు సినీ పాటల అభిమానినని )మా ఊరొచ్చి నన్ను కలిశారు వారి బృందంతో.మా ఊళ్లో కొంత మంది ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నారు.


ఆ తర్వాత ఒకసారి నేనూ ,నా స్నేహితురాలు శాంతకుమారీ మద్రాసు యేదో కాన్ఫరెన్సుకి వెళ్లినపుడు సావిత్రమ్మ గారిని కలిశాము,నా కింకా గుర్తే ఇంటో అడుగు పెడుతుండగానే కమ్మని తిరగమోత వాసన,ఒక్క సారిగా మన తెలుగు వారిల్లు సుమా అనిపించేసింది.తళతళలాడే ముఖ వర్ఛస్సూ,ఆప్యాయమైన మాటలధోరణీ,ఏ ముహూర్తంలో కలుసుకున్నామో ఆ రోజునుండీ నాకావిడ ఇంకో అమ్మలాగా,నేనావిడకి ఇంకో కూతుర్లాగా అయిపోయాం. ఆవిడది చాలా చక్కటి సోషల్ బిహేవియర్ ,ఏ మనిషితో ఎలా మాటాడాలో బాగా తెలిసిన మనిషి ,రక రకాల మనుషులతో మెలిగిన అనుభవం కదా, ఆవిడ పుస్తక పఠనాభిరుచి కూడా మెచ్చదగినది,మంచి మంచి పుస్తకాలు చదవడమే కాక ఆవిడ వెలిబుచ్చే అభిప్రాయాలు కూడావిలువగా వుంటాయి.ఆవిడా,మాలతీ చందూరు గారూ మంచి స్నేహితులు వారి ప్రభావం కూడా వుందేమో?


నాతో పరిచయమయ్యాక నేను ఇంట్లో వున్నా లేకపోయినా ,మా అమ్మకి ఫోన్ చేసి,ఇద్దరూ కబుర్లు చెప్పుకునే వారు, ఇప్పటికీ అప్పుడప్పుడూ కుశలం కనుక్కుంటూ వుంటారు.


నా "ఒక భార్గవి" పుస్తకం చదివాక ఫోన్ చేసి మెచ్చుకుంటూ ఒక మాటన్నారు"ఎంత బాగా రాశావమ్మా ,నువ్వు నా కూతురు వయినందుకు చాలా సంతోషిస్తున్నాను "అని,ఆ మాట చాలదా ఈ జన్మకి? అమ్మకి ప్రణామాలతో-భార్గవి

(ఫోటో కర్టసీ----శ్రీ ఘంటసాల.రత్నకుమార్)

Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము