మరణానంతరము


 నేను ఈ నవల 1991 లో విజయవాడ బుక్ ఫెస్టివల్ లో కొన్నాను.కొన్న వెంటనే చదివేశాను(అప్పట్లో దాదాపు నా దగ్గరున్న పుస్తకాలన్నీ నేను చదివినవే అయి వుండేవి,ఇప్పుడయితే నా కలెక్షన్లో నేను చదవనివి కనీసం వంద పుస్తకాలుండొచ్చు),సెల్ ఫోన్లూ ఫేస్ బుక్ లూ లేని కాలంకదా.నవల చదివిన దగ్గరనుండీ అది నన్ను వెంటాడుతూనే వుంది,ఆ నవల చదివి దాదాపు ముఫ్ఫయ్యేళ్లు దాటినా అది నా జ్ఞాపకాల పుటలనుండీ చెరిగిపోలేదు.


ఇంతకీ ఈ పుస్తకం కన్నడం నుండీ తెలుగులోకిఅనువదింపబడింది.కన్నడంలో దాని పేరు "అళిదమేలె",తెలుగులో శ్రీ తిరుమల రామచంద్ర "మరణానంతరము" అనే పేరుతో అనువదించారు.నేషనల్ బుక్ ట్రస్ట్ వారు 1972 లో ప్రచురించినట్టు వుంది, రచయిత కె.శివరామ కారంత రాసిన ముందు మాట వలన దీని రచనా కాలం 1960 అని తెలుస్తోంది,అంటే కన్నడంలో ప్రచురించ బడిన పన్నెండేళ్లకి NBT వారి అనువాదం వచ్చిందన్న మాట.

అరవయ్యేళ్ల క్రితం రాసిన పుస్తకమయినా ,తీసుకున్న కథావస్తువు వలన అది ఎప్పటికయినా చదవడానికి ఉచితమైన పుస్తకమే అనిపిస్తుంది.

రచయిత శివరామ కారంత ,ఉత్తమ పురుషలో అంటే తానే కథలో పాత్రధారిగా వుంటూ ,తన గొంతులోనే కథ చెబుతారు----
కారంత గారికి బొంబాయివెళ్లే రైలు ప్రయాణంలో,ఒక పెద్దమనిషి తారస పడతాడు.ఆయన ప్రవర్తనా,ఆయన ఆలోచనా ధోరణీ విభిన్నంగానూ పరిణతి చెందినవి గానూ అనిపిస్తుంది.పరస్పరాభిమానం వలన పరిచయం కొంత వృధ్ధి చెంది , అయిదారు సంవత్సరాల కాలంలో,కారంత గారు పది,పన్నెండు సార్లు బొంబాయి వెళ్లి ఆయనతో కొద్ది కాలం గడిపేటట్టు చేస్తుంది.
తనకంటే పెద్దవాడయిన ఆయన బొంబాయిలో ఒంటరిగా,"దాదా" అనే ఒక నౌఖరు సహాయంతో నివసిస్తూ వుంటాడు,పక్కింటి పార్సీ కుటుంబంతో చక్కటి అనుబంధం వున్నా ,ఆయన తన పరిమితులను దాటడు,ఆ మాటకొస్తే ఎవరితో నయినా ఆయన తన అనుబంధం ఒక స్థాయిని దాటకుండా జాగ్రత్త పడటం,తామరాకు మీది నీటిబొట్టులా ,విరాగిలా జీవితం గడపటం రచయిత గమనిస్తాడు.చేతనయినంత వరకూ ఇతరులకు సహాయపడటం,ఖాళీ సమయాలలో చిత్రలేఖనం తోనూ,పుస్తక పఠనం తోనూ గడపటం చేస్తూ వుంటాడాయన.ఆయన గతజీవితం గురించి కానీ,కుటుంబం గురించి కానీ వివరాలు తెలీవు ఆయన కూడా చెప్పడానికి విముఖత చూపిస్తూ వుంటాడు.రచయితతో అప్పుడప్పుడూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ వుంటాడు.చివరగా రాసిన వుత్తరంలో,మిత్రుని చూడాలని వుందనీ,ఈ సారి ఆయనొచ్చే వరకూ వుంటానో లేదో అనీ ,ఒక వేళ తాను పోతే ,తను రాసి పెట్టిన కొన్ని కాగితాలు స్వాధీన పరుచుకోమని అభ్యర్థిస్తాడు.ఆ తర్వాత ఆయన ఆరోగ్యం బాగా లేనట్టు వచ్చిన తంతి చూసుకుని అక్కడికి వెళ్లి చూసేటప్పటికే ఆయన కాలంచేస్తారు.ఆ తర్వాత జరగాలిసిన ఉత్తర క్రియలన్నీ జరిపించి,ఆయన వస్తువులు అంటే పెద్దగా యేమీ వుండవు పుస్తకాలూ,కొన్ని చిత్రాలూ,వాటిని మూటగట్టుకుని ఇంటికొచ్చేటప్పటికి ఆయన పోస్ట్ చేసిన వుత్తరమొస్తుంది.అందులో ఆయన వ్యక్తిగత జీవితం గురించీ,గత జీవితం గురించీ కొన్నివివరాలు అస్పష్టంగా వుంటాయి,ఇంకా కొంత డబ్బు ఈయనకు అప్పజెప్పి ,తనకి తోచినట్టు యెలా న్యాయంగా వుంటే అలా ఖర్చుపెట్టమనీ,క్రమం తప్పకుండా నెలనెలా తాను పైకం పంపే ముగ్గురు,నలుగురికీ మాత్రం ,వారు బతికున్నంత వరకూ ఈ అప్పజెప్పిన డబ్బునుండీ పంపుతూ వుండమనీ వుంటుంది,ఇంకా అందులో యేముంటుందంటే ఆయన గత జీవితంలో తన భార్యా బిడ్డల ప్రవర్తన వలన మనసుకి కష్టం కలిగి వారికి ఎక్కువ మొత్తం లో ధనం అప్పజెప్పి ,అన్ని బంధాలూ తెంచుకుని బొంబాయి వచ్చి అజ్ఞాతజీవితం గడుపుతున్నట్టూ వుంటుంది.అందులో ఆయన జీవన సూత్రం అనుకోదగిన వాక్యం ఒకటుంటుంది అదేమిటంటే "ఈ బతుకు లెక్కాచారంలో మనం ఇతరులనుండీ తీసుకున్న దానికంటే ఇతరులకి ఇచ్చేదే ఎక్కువ వుండేట్టు చూసుకోవాలనేది నాప్రయత్నం,అది కేవలం డబ్బు లెఖ్ఖని కాదు".

ఇదంతా తెలుసుకున్న కారంత్ గారు ఆయన మూలాలు తెలుసుకుని,వారికి కావలసిన వారిలో ఈ డబ్బు ఇవ్వదగిన యోగ్యత వున్న వారిని కనిపెట్టి ఇవ్వడానికి బయలు దేరి చేసిన ప్రయాణాలూ,ఆ ప్రయాణాలలో ఆయన కలిసిన వివిధ వ్యక్తులూ,వారివారి మనో చక్షువుల నుండీ చనిపోయిన వారి స్నేహితుల మూర్తిమత్వం అవగాహన కావడమే ఈ నవల కథాంశం.

చాలా చిన్నతనంలోనే తల్లిచనిపోతే ,యెంతో ప్రేమగా వారిని సాకినఒక బాల్యవితంతువు,ఒక పల్లెటూళ్లో ఒంటరిగా ,వృధ్ధాప్యంలో బీదరికంలో ,అనుక్షణం ఆ పెంచిన కొడుకునే తలుచుకుంటూ కాలం గడుపుతూ వుంటుంది,ఆమె కోరుకున్నదేమిటో తెలుసా,వారి ఊరిలో పాడుబడిపోయిన వినాయకుని దేవాలయం బాగుచేయించమనీ,తనకేమీ ధనం అవసరం లేదనీ.కారంత్ గారు ఆ గుడి బాగుచేయించడమే కాక ఆమెకు ఒక చిన్న నివాసం(తన స్నేహితుల పూర్వీకులు నివసించిన స్థలంలో) యేర్పాటు చేసి ,ఆమె మనసును సంతోషపెడతారు.

ఇంకా చనిపోయిన స్నేహితుని భార్యా పిల్లలను కలుస్తారు,వారిలో ఆయన కూతురు తండ్రి పట్ల యెంతో ప్రేమ కనపరుస్తుంది యెంతో పేదరికంలో వున్నప్పటికీ,తద్విరుధ్ధంగా ఆయన భార్యా కొడుకూ ఆయన గురించి అప్రియాలు మాట్లాడి,ఆయన మిగిల్చిన డబ్బు కోసం నానా విధాలుగా ప్రయత్నించి కారంత గారిని దూషించి,కోర్టుకేసులో ఇరికించడానికి కూడా ప్రయత్నిస్తారు.

చివరికి తన స్నేహితులని యెంతో ప్రేమగా చూసుకుని ఆయన ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చి ఆయననే తలుచుకుంటూ మరణించిన ఆయన ప్రియురాలి కూతురుని కూడా కలుసుకుని ఆమెకు అప్పజెప్ప వలసింది ఆమెకు అప్పజెప్పడంతో ,కారంత గారు తన స్నేహితుని కిచ్చిన మాట నెరవేర్చినట్టూ ,ఆయన సొమ్ము సద్వినియోగం చేసినట్టూ భావిస్తాడు.

ఈ నవల చదువుతుంటే ఒక మనిషి చనిపోయాక ,తనచుట్టూ వున్న మనుషుల హృదయాలలో తాను ఎలాంటి ముద్రలు వేస్తాడు,దానిని బట్టి అతని స్వభావాన్నీ ,అతని మూర్తినీ యెలా తెలుసుకోవచ్చూ అనేది తెలియడమే కాక,ఒక మనిషే తన చుట్టూ వున్నవారికి ,ఒక్కొక్కరికీ ఒకోరకంగా యెలా కనిపిస్తాడూ అనేది వివరించిన తీరు ఆశ్చర్యంగానూ మానవ స్వభావానికి అద్దం పట్టేది గానూ అనిపిస్తుంది.

నవల పూర్తి అయ్యేటప్పటికి ఆనవలలో మరణించిన రచయిత స్నేహితుని ఔన్నత్యమే కాదు ,రచయిత ఔన్నత్యం కూడా అర్థం అవుతుంది.ఇది చదవడం అంటే ఒకరకంగా మానవ స్వభావాన్ని చదవడమే ,అనువాదం చేసిన తిరుమల రామచంద్ర గారు ఉద్దండులు ,నేనాయన పేరు చూసే అసలు పుస్తకం కొన్నాను ,కానీ అనువాదం ఆశించినంత సరళంగా అనిపించలేదు ,కొన్ని తెలుగు పదాలయితే ఈనాడు వాడుకలో లేనివి.

.ఇదంతా నేను చాలా టూకీగా రాశాను,నిజానికి ఆయన ఈ నవలను చాలా అధ్భుతంగా నడిపారు,నాకెందుకో "సిటిజన్ కేన్ "సినిమా గుర్తొచ్చింది నవల చదువుతుంటే.

రచయిత శివరామ కారంత్ గురించి నాకు తెలిసింది కొంచెం మరింత సమాచారం తెలుసుకుందామని అంతర్జాలాన్ని ఆశ్రయించాను.ఆయన కన్నడంలో పేరెన్నిక గన్న రచయిత,బహు ముఖీనమైన ప్రజ్ఞ కలవారు,యెన్నో నవలలూ .కథలూ ,నాటకాలూ,బాల సాహిత్యమూ రాయడమే కాక ఎన్నో కవితలూ,వ్యాసాలూ కూడా రాసి కన్నడ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు,ఆయన రచనలు కన్నడప్రజలనెంతో ప్రభావితం చేశాయి.ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కన్నడ సాహిత్యంలో రవీంద్రనాథ్ టాగూర్ అంత వారు అంటారు ప్రఖ్యాత జర్నలిస్ట్ రామచంద్ర గుహ.ఆయన చిన్న తనంలో గాంధీ గారి సిధ్థాంతాలకు ఆకర్షింపబడి,స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు,ప్రకృతి ప్రేమికుడూ,చిత్రలేఖనంలో ప్రవేశముంది.

వ్యక్తిగత జీవితానికొస్తేతనతో భావాలూ,అభిరుచులూ కలిసిన యువతిని కులాంతర వివాహం చేసుకున్నారు,ఆ రోజుల్లో యెన్నో విమర్శలను యెదుర్కొన్నారు,ఆమె కూడా రచయిత్రీ,డాన్సర్ .
ఆయన ఇతర రచనలు కొన్నిటి పేర్లు

బెట్టదజీవ,మూకజ్జియ కణసుగళు,సరసమ్మన సమాథి,చోమన దుడి మొదలయినవి, ఇవేకాక యక్షగానాల గురించి రెండు పుస్తకాలు రాశారు.

ఈ "చోమన దుడి" అనే నవలని 1975లో బి.వి.కారంత్ దర్శకత్వంలో సినిమాగా తీస్తే దానికి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డుతోపాటు,అందులో నటించిన వాసుదేవరావుకి జాతీయఉత్తమ నటుడుఅవార్డూ,డైరెక్టర్ కి ఉత్తమ డైరెక్టర్ అవార్డూ వచ్చాయి.ఇంకా ఆయన నవలలు చాలా సినిమాలుగా వచ్చాయి.
ఇంక ఆయనకి వచ్చిన అవార్డులకి లెఖ్ఖేలేదు,అత్యుత్తమ జ్ఞానపీఠ అవార్డు,పద్మభూషణ్ ,సంగీత,సాహిత్య అకాడమీ అవార్డులూ,గౌరవ డాక్టరేటులూ ,ఆయన ముందు ఒదిగి నిలుచున్నాయి.

తొంభై అయిదేళ్ల నిండు జీవితం గడిపి,1997లో కొద్దిపాటి అస్వస్థతతో డిసెంబర్ 8న తనువు చాలించారు తన అపార సాహిత్య సంపద తన మరణానంతరం ,కన్నడ సాహిత్య ప్రియులకు వదిలి

ఇదీ ఈ నవల గురించిన కథ

Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ