షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ


నేను షికాగో లో అడుగు పెట్టినదగ్గరనుండీ, అక్కడ ఏ ఏ మ్యూజియమ్స్ ఉన్నాయో  చూడటానికి వెతుక్కుంటున్నా. షికాగో ఆర్ట్ మ్యూజియమ్ చాలా పెద్దదనీ, చాలా పెయింటింగ్స్ వున్నాయనీ చెప్పారు. ఎలా వెళ్లాలీ? యెవరిని తోడు తీసుకువెళ్లాలి అని ఆలోచిస్తుంటే మా అబ్బాయి ఫ్రెండ్ కోమల ఒక ఆదివారం తను వచ్చి తీసుకువెళతానంది. అనుకున్నట్టుగానే ఏప్రిల్ 30 2023 వ తారీఖు ఆదివారం కోమల వచ్చి ఆర్ట్ మ్యూజియమ్ కి తీసుకు వెళ్లింది. మ్యూజియమ్ కి ఇరుపక్కలా రెండు సింహాల  శిల్పాలు ఠీవిగా నుంచుని కనిపించాయి. కారు దిగుతుండగానే వర్షపు చినుకులతో కూడిన చల్లని గాలి పలకరించింది. మేము వెళ్లి టికెట్లకోసం క్యూ లో నిలుచున్నాం,ఈ లోపు మా అబ్బాయి ఫ్రెండ్ అశ్విన్ వాళ్లమ్మ గారు రాధ గారు వచ్చి కలిశారు. ఈ ఊళ్లో అంతా ఆవిడ నాకు తోడు మంచి కంపెనీ.

టికెట్లిచ్చే అమ్మాయి మాకు చాలా తక్కువ ధరకే టికెట్లిచ్చింది. ఇక్కడ చాలా సార్లు ఈ ఉదారత చూశాను ముఖ్యంగా మ్యూజియమ్స్ లో మనం సీనియర్ సిటిజన్సమనో, వేరే దేశం వాళ్లమనో,యేదో ఒక వంకతో కన్సెషన్లిస్తూ వుంటారు. భలే మంచి విషయం కదా! అయితే మేము వెళ్లిన సమయంలో సాల్వడార్ డాలీ రిట్రాస్పెక్టివ్ జరుగుతోంది.దానికి మాత్రం టికెట్ అదనంగా తీసుకోవాలనీ, చాలా రష్ వుంటుంది కాబట్టి టికెట్ తీసుకుని వెయిట్ చేస్తూ వుంటే మన వంతు రాంగానే మన ఫోన్ కి మెసేజ్ వస్తుందనీ అప్పుడు వెళ్లి చూడాలనీ చెప్పారు . ఓయమ్మ చాలా వుందే తతంగం అనుకున్నాం. అదృష్ట వశాత్తూ రాధగారు వాళ్లబ్బాయి దగ్గర్నుండీ తీసుకు వచ్చిన వి.ఐ.పి కూపన్ల సహాయంతో టికెట్లు తీసుకోకుండానే  డాలీ విభాగానికి అనుమతి దొరికింది మాకు. పావుగంట యెదురు చూసి  డాలీ చిత్రాలు చూడబోయాము మేము.

అసలు డాలీ అంటే యెవరూ? అతని ప్రత్యేకత యేమిటీ? ఇంత మంది ఇంత క్రేజ్ తో యెందుకు చూస్తున్నారు ఇతని చిత్రాలు? అని ఆలోచిస్తే అతని వివరాలు అతని చిత్రాలంత వింతగానూ  అనిపించాయి. సాల్వడార్ డాలీ స్పెయిన్ కి చెందిన కళాకారుడు. చిత్రకళలో "సర్రియలిజం" అనే ప్రక్రియలో నిష్ణాతుడు.అతనిని "మాస్టర్ ఆఫ్ సర్రియలిజం "అని కూడా అంటారు. "సర్రియలిజం"  అంటే వాస్తవానికి దూరంగా వుండి మన అంతశ్చేతనలో వుండే భావాలని ప్రతిబింబించే అస్తవ్యస్తమైన రూపాలని కలలలో కనపడే ఆకారాలనీ చిత్రించడం, బహుశా తెలుగులో "అధి వాస్తవికత" అనొచ్చేమో? యేదైనా అతి వాదం అంటారు చూశారా అలాంటిదన్నమాట. ఈ "సర్రియలిజం" అనే ధోరణి,చిత్రకళలోనూ ,సినిమాలలోనూ,నాటకాలలోనూ,సాహిత్యం లోనూ కూడా వుంది.

 సాల్వడార్ డాలీ చిత్రకళలోనే కాక శిల్పకళలోనూ, జ్యూవెలరీ డిజైన్ చేయడంలోనూ,ఆర్కిటెక్చర్ లోనూ, సినిమా సెట్టింగ్స్ రూపొందించడం లోనూ, సాహిత్యం లోనూ కూడా  కృషిచేశాడు.తనకి బాగా ఇష్టమైన సబ్జెక్ట్స్ మెటా ఫిజిక్స్ ,బయాలజీ అని చెప్పేవాడు.

చిత్రకళలో సర్రియలిజం లో మాత్రమే కాక డాడాయిజం,క్యూబిజం లో కూడా ప్రయోగాలు చేశాడు.అతని మీద క్యూబిజం కి ఆద్యుడైన పాబ్లో పికాసో ప్రభావమూ, ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రభావమూ వుండేవి. వీరిస్ఫూర్తితో అతను చిత్రించిన చిత్రాలు కళా ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపి ప్రభంజనాన్ని సృష్టించాయి. మానవుని అంతశ్చేతనలో దాగి వున్న భావాలూ,కలలలో కనపడే వింత ఆకారాలూ, కామవికారాలూ అతని చిత్రాలలో ప్రముఖంగా చోటు చేసుకునేవి. కళా ప్రపంచం అతనిని ఒక జీనియస్ గానూ, ఎక్సెంట్రిక్ గానూ పరిగణించింది. ప్రముఖ చిత్రదర్శకుడు ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ తన సినిమా "స్పెల్ బౌండ్" లో ఒక స్వప్న దృశ్యాన్ని చిత్రీకరించమని డాలీని పిలవడం, వాల్ట్ డిస్నీ కూడా ఒక యానిమేషన్ చిత్రం చేసిపెట్టమని ఆహ్వానించడం అతని ప్రతిభకు దక్కిన గౌరవాలు. నిజజీవితంలో కూడా అతని ప్రవర్తన వింతగానూ, మనఊహకు కూడా అందనంత విచిత్రంగానూ వుండేది. అతని చిత్రాలెంత విడ్డూరంగా వుండేవో అతని ప్రవర్తన అంతకంటే విడ్డూరంగా వుండేది. చిత్ర విచిత్రమైన మాస్కులు ధరించి తిరిగే వాడు. ఒకసారి లండన్లో జరిగిన ఒక పార్టీకి స్పేస్ సూట్ ధరించి హాజరయ్యాడు , చివరికి తలకి అతను ధరించిన హెల్మెట్ వలన ఊపిరి అందక ప్రాణం పోయే పరిస్థితి వస్తే గబగబా ఆ హెల్మెట్ తొలగించి అతనిని కాపాడవలసి వచ్చింది.

డాలీ పేరు చెప్పగానే ప్రజలకు అతని మీసాలు గుర్తు వస్తాయి.  మీసాలను బాగా పొడుగ్గా పెంచి పైకి వంపు తిప్పి నిటారుగా నిలబెట్టే వాడు.  అలాగే అతని చిత్రాలని తలుచుకుంటే పొడుగ్గా సాగి కరిగిపోతున్నట్టుగానూ,చీమలు తింటున్నట్టుగానూ చిత్రించిన పోకెట్ గడియారాలు గుర్తు వస్తాయి. వీటిని "మెల్టింగ్ వాచెస్ "అంటారు. బహుశా కాలమెప్పుడూ కరిగి ప్రవహిస్తూ వుంటుందనీ దానిని కొలవడం సాధ్యం కాదనీ  ఐన్ స్టీన్ సాపేక్షతా సిధ్ధాంతం ఇక్కడ వర్తింస్తుందనీ అతని భావన అని అంటారు. గడియారాలను చీమలు తింటున్నట్టుగా చిత్రించడం మరణాన్ని సూచిస్తుందనీ చిత్రకళా విమర్శకులు భావిస్తారు. అతని చిత్రాలలో పదే పదే కనపడే ప్రతీకలు గుడ్లు, గడియారాలు, మెర్మెయిడ్స్ , చీమలు, రైనో సారస్ లు, సంగీత వాయిద్యాలు వీటన్నింటికీ అతని నిజజీవితంలోని అనుభవాలూ, అనుభూతులూ ఆధారం అని భావిస్తారు.

డాలీ సిగ్మండ్ ఫ్రాయిడ్ రాసిన "ఇంటర్ప్రెటేషన్ ఆఫ్ డ్రీమ్స్" అనే పుస్తకం చదివి చాలా ప్రభావితుడయ్యాడు. ఆ ప్రభావం అతని చిత్రాలు చాలా వాటిల్లో కనిపిస్తుంది.అతను ఫ్రాయిడ్ ని కలిసి ఆయన పోర్ట్రయిట్ కూడా వేశాడు. ఫ్రాయిడ్ కూడా డాలీ ప్రతిభ గురించి మెచ్చుకోలుగా మాట్లాడాడు.అతని చిత్రాలలో ప్రముఖమైన "The persistence of memory "అనే చిత్రం మీద కూడా ఫ్రాయిడ్ సైకో అనాలిసిస్ ప్రభావముంది అని భావిస్తారు.

ఇంకా అతను చిత్రించిన చిత్రాలలో ప్రముఖమైనవి "మెటమార్ఫసిస్ ఆఫ్ నార్సిసస్ " "సాఫ్ట్ కన్స్ట్రక్షన్ విత్ బాయిల్డ్ బీన్స్ " "ది గ్రేట్ మాస్టర్బేటర్ " " మే వెస్ట్ లిప్స్ సోఫా" "స్వాన్స్ రిఫ్లెక్టింగ్ యెలిఫెంట్స్ "మొదలైనవి. అయితే అతను చివరి వరకూ చిత్రించిన చిత్రాలలో అతని భార్య "గాలా" చిత్రం తప్పని సరిగా వుంటూ వుండేది. ఆమె అతని చోదక శక్తి, బిజినెస్ మానేజర్ , అతను మిలియనీర్ అవడానికీ,అతనికి అఖండ కీర్తి రావడానికీ  ఆవిడే ముఖ్యకారణం. అతని యెన్నో చిత్రాలకు ప్రేరణ,అతని కలలూ, కామవికారాలూ, అంతశ్చేతనలో దాగి వున్న భయాలూ ,ఆందోళనలూ , నిస్సహాయతలూ అంటారు. అతని చిత్రాలలో కనపడే సంక్లిష్టతకీ, అస్తవ్యస్త రూపాలకీ సమాధానాలు అతని జీవితాన్ని పరిశీలిస్తే కొంతవరకూ అర్థమయ్యే అవకాశముంది. ఒక సారి అతని జీవితం గురించి తెలుసుకుందాం రండి. 

సాల్వడార్ డొమింగో ఫిలిప్ జసింటో డాలీ  మే 11 వతేదీ 1904 లో స్పెయిన్ కి చెందిన కాటలోనియా లోని ఫిగరెస్ (figueres)లో జన్మించాడు. అంటే నేటికి సుమారునూటపందొమ్మిది సంవత్సరాల క్రితం అన్నమాట . అతని తండ్రి లూకా డాలీ మధ్యతరగతికి చెందిన వాడు లాయర్  ఇంకా నోటరీ కూడా . సాల్వడార్ డాలీ మీద తల్లి ఫిలిపా ప్రభావం అధికంగా వుండేది . ఆమె డాలీని బాగా ప్రోత్సహించేది, తండ్రి కఠినమైన క్రమశిక్షణలో పెట్టేవాడు. డాలీ పుట్టడానికి తొమ్మిది నెలలముందు వారికి  ఒక కొడుకు పుట్టి ఇరవై రెండు నెలలు పెరిగి చనిపోయాడు. అతని పేరే సాల్విడార్ డాలీ. అదే పేరు రెండవ కొడుకుకు కూడా పెట్టారు తల్లిదండ్రులు. అతనే మళ్లీ జన్మించాడని నమ్మే వారు ,అతని సమాథి దగ్గరకు చిన్న సాల్వడార్ డాలీని తీసికెళ్లి చూపెట్టేవారు. ఈ జ్ఞాపకం,ఈ కన్ఫ్యూజన్  సాల్వడార్ డాలీని జీవితాంతం వెంటాడుతూనే వుండేది. అది అతని చిత్రాలలో కూడా ప్రతిబింబిస్తూ వుండేది.

అతను ఆర్టిస్ట్ యెలా అయ్యాడు?సర్రియలిజం వైపు యెలా ఆకర్షితు డయ్యాడు? అతని భార్య యెవరూ? ఆమె ప్రభావం యెలాంటిది? అతని జీవిత విశేషాలూ,చరమాంకం యెలా గడిచిందీ? తదీతర విషయాల గురించి  మళ్లీ మాట్లాడుకుందాం. సాల్వడార్ డాలీ ప్రవర్తన చిన్నతనం నుండీ కూడా విపరీతంగానూ , వింతగానూ ఉండేది .అతనొక కోపిష్టి. తోటి విద్యార్ధులతో యెప్పుడూ తగాదాలు పడుతూ వుండేవాడు.ఈ విషయంలో అతని తండ్రి అతనిని కఠినమైన క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నించే వాడు. అయితే అతని తల్లి అతను చేసే ప్రతిపనినీ వెనకేసుకు వస్తూ అతనికి రక్షణగా వుండేది. చాలా చిన్న వయసు నుండే  అతను చిత్రకళవేపు మొగ్గు చూపాడు. ఈ విషయంలో మాత్రం తల్లిదండ్రులిద్దరూ అతనిని ప్రోత్సహించే వారు.

సుమారు పదేళ్ల వయసునుండీ చిత్రకళ లో పాఠాలు నేర్వడం మొదలు పెట్టాడు. 1916. లో మున్సిపల్ డ్రాయింగ్ స్కూల్ లో చేరాడు అక్కడ మోడ్రన్ ఆర్ట్ గురించి ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నాడు. పధ్నాలుగేళ్ల వయసున్నప్పుడు 1918లో అతని తండ్రి డాలీ చిత్రించిన చార్కోలు డ్రాయింగ్స్ తో ప్రదర్శన యేర్పాటు చేశాడు.

1921లో అతని తల్లి కాన్సర్ తో మరణించింది ఇది అతనిని మానసికంగా చాలా బాధించింది. ఇది తన జీవితంలో తగిలిన గట్టి దెబ్బ అనీ ,తాను తల్లిని ఆరాధించే వాడిననీ, ఆవిడ మరణం కోలుకోలేనంత తనకు   పెద్ద గాయమనీ చెప్పేవాడు.

1922లో అతను మాడ్రిడ్ లోని రాయల్(శాన్ ఫెర్నాండో అకాడెమీ) అకాడెమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే కళాశాలలో చేరాడు.అక్కడున్నప్పుడే "ఇంప్రెషనిస్ట్స్" ని బాగా స్టడీ చేశాడు.అతనిని ప్రభావితం చేసిన వారిలో వర్మీర్ ,గోయా,రాఫేల్  ప్రముఖులు. డాలీ చాలా శ్రధ్ధగా  "పాయింటలిజం,ఫ్యూచరిజమ్ ,క్యూబిజమ్ "లాంటి వివిధ చిత్రకళా శైలులని ఆకళింపు చేసుకున్నాడు .క్యూబిజం లో అతను చాలా ప్రయోగాలు చేశాడు,వీటికి ప్రేరణ క్యూబిజంకి ఆద్యుడైన పాబ్లో పికాసో . అతను పికాసోని 1926లో పారిస్ లో కలుసుకున్నాడు .పికాసో కూడా ఇతని చిత్రాల పట్ల ఆసక్తి కనపరచాడు. 1926లో  ఫైనల్ ఎక్సామ్స్ ముందు డాలీని అతని ప్రవర్తన కారణంగా కాలేజ్ నుండీ బహిష్కరించారు.తన అధ్యాపకులకు తనకి బోధించేంత పరిజ్ఞానం లేదని హేళనగా మాట్లాడటం ,ప్రొఫెసర్ ని అవమానించడం కారణాలు. ఈ సమయంలోనే అంటే 1926లోనే అతను చిత్రకళా రాజధాని అయిన పారిస్ కి మకాం మార్చాడు.

1927 నుండీ సర్రియలిజం అతనిని ఆకర్షించింది. అతను చిత్రించిన సర్రియలిస్టిక్ చిత్రాలు కళాప్రపంచాన్ని అబ్బురపరిచాయి.సిగ్మండ్ ఫ్రాయిడ్ రచనలైన సైకోఅనాలిస్ ,ఇంటర్ ప్రెటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అతను బాగా చదివి ఆకళింపు చేసుకున్నాడు. అవి అతని చిత్రాలను ప్రభావితం చేశాయి. పారిస్ లో వున్న సర్రియలిస్ట్ గ్రూప్ అతనిని తమ సభ్యుడుగా చేర్చుకున్నారు. 1929 లో సర్రియలిస్ట్ కవి పాల్ ఎలార్డ్ తో పరిచయమైంది.ఇది డాలీ జీవితం లో ముఖ్యమైన మలుపుకి కారణమైంది. పాల్ ఎలార్డ్ కి అప్పటికే పెళ్లయింది అతని భార్య పేరు గాలా, వారిద్దరికీ ఒక పదకొండేళ్ల  కూతురు కూడా వుంది. 



డాలీ,గాలా - ప్రేమ, పెళ్ళి 

గాలా ఒక రష్యన్ వనిత ఆమె అసలు పేరు ఎలీనా ఇవనోవ్నా డయాకొనోవా .ఆమె పాల్ ఎలార్డ్ ని 1916లో స్విట్జర్లాండ్ లో కలుసుకుంది. 1917లో అతని కోసం పారిస్ వచ్చింది ఆ సంవత్సరమే వాళ్లిద్దరూ పెళ్లిచేసుకున్నారు. పారిస్ కళా ప్రపంచంలో చాలా మంది ఆర్టిస్టులకి గాలా ఒక ప్రత్యేక ఆకర్షణ గానూ, స్ఫూర్తిగానూ వుండేది. 1929లో సాల్వడార్ డాలీ ఆమెను కలిసిన మొదటి క్షణంలోనే ఆమెతో ప్రేమలో పడిపోయానని చెబుతాడు. ఆమె కూడా అతని లోని కళాప్రతిభకీ అతని వింత ధోరణికీ ఆకర్షించ బడింది.ఆమె డాలీకంటే పదేళ్లు పెద్దది. 1929నుండీ వారు కలిసి జీవించారు, గాలా పాల్ ఎలార్డ్ నీ, తన కూతురు సిసిల్ నీ వదిలివేసి డాలీ దగ్గరకు వచ్చేసింది. 1934లో వారు సివిల్ మారేజ్ చేసుకున్నారు. 1958లో కాథలిక్  మతాచారం ప్రకారం చర్చ్ లో మళ్లీ పెళ్లి చేసుకున్నారు.

జీవితాంతం వరకూ డాలీ ఆమె మీద అన్నిరకాలుగానూ ఆధారపడి వుండేవాడు. ఆమె అతనికి చిత్రకారుడుగా పేరు ప్రతిష్ఠలూ,డబ్బూ రావడానికి యెంతో దోహదపడింది. అతనికి స్ఫూర్తిగా వుండడమే కాక, అతని చిత్రాలకు మోడల్ గా వుండేది, అతని చిత్రాలను విశ్లేషించేది, అతని చిత్రాలను తీసుకుని ఆర్ట్ గేలరీలకు తిరిగి ప్రచారంచేసేది, చిత్రాల అమ్మకాల లావాదేవీలు చూస్తూ బిజినెస్ మానేజర్ గా వుండేది. అందుకే డాలీ "గాలా లేకపోతే సాల్వడార్ డాలీ  లేడు"  అని అనేవాడు. అంతేకాదు తను చిత్రించిన   చాలా చిత్రాల కు ’"గాలా సాల్వడార్ డాలీ" అనే సంతకం చేసేవాడు.  గాలా వలననే డాలీ బతికి వుండగానే బోలెడంత పేరునీ, డబ్బునీ సంపాదించి సౌకర్యవంతమైన జీవితం గడప గలిగాడు,(పాల్ గాగిన్ ,విన్సెంట్ వాంగో లాంటి వారు బతికినంత కాలం తగిన గుర్తింపుకోసం , డబ్బుకోసం  తపించి,తపించి తనువు చాలించారు.)
డాలీ తన చిత్రాలన్నింటిలో  గాలాను తప్పక యేదో ఒక రూపంలో చిత్రించేవాడు . డాలీ ఆమెలో తన తల్లినీ, ప్రేయసినీ, భార్యనీ అన్ని రూపాలనీ దర్శించే వాడు. అలా అని వారిది యే పొరపొచ్చాలు లేని ఆదర్శ దాంపత్యం అని కాదు. జీవితాంతం ఇద్దరి మధ్యా ఒక రకమైన ఒత్తిడి, సంఘర్షణ, సంక్లిష్టతా వుంటూనే వుండేవి .డాలీ కీ, గాలాకీ ఇద్దరికీ ఇతరులతో అనుబంధాలుండేవి . అలా వారు  సుమారు యాభై సంవత్సరాల కాలం గడిపారు. ఆ తర్వాత యేమైందో మళ్లీ చెప్పుకుందాం. ప్రస్తుతం డాలీ చిత్రకళా జీవితం వైపు కొన్ని కబుర్లు చెప్పుకుందాం. 

1918నుండీ అతను చిత్రించిన చిత్రాలలో ఇంప్రెషనిస్ట్ ల ప్రభావముండేది,స్పెయిన్ లో తను నివసించే ఫిగరెస్ ,కడక్ , పోర్ట్ లిగాట్ పట్టణాలలో కనపడే దృశ్యాలూ, బీచ్ లూ, కొండలూ, బండరాళ్లూ అతని చిత్రాలలో చివరి వరకూ కనపడుతూ వుండేవి. ఆ తర్వాత క్యూబిజమ్ తో కూడా ప్రయోగాలు చేశాడు. 1926 లో పారిస్ చేరిన డాలీ సర్రియలిస్ట్ గ్రూపులో కొన్నాళ్లు వున్నాడు.  అప్పుడు చిత్రించిన చిత్రాలు "హనీ ఈజ్ స్వీటర్ దేన్ బ్లడ్ (క్యూబిజమ్ ,సర్రియలిజమ్ కలిసి వున్న చిత్రం1928) ది గ్రేట్ మాస్టర్బేటర్ , లుగుబ్రియస్ గేమ్ , ది పర్సిస్టెన్స్ ఆఫ్ మెమరీ (1931)మొదలైనవి.

అతను రెండవప్రపంచ యుధ్ధ సమయంలో హిట్లర్ ని సమర్ధిస్తూ మాట్లాడటంతో సర్రియలిస్టులు తమ గ్రూపునుండీ అతనిని దాదాపు  బహిష్కరించినంత పని చేశారు. డాలీ పారిస్ వదిలి  తన సొంత దేశమైన స్పెయిన్ కు వెళ్ళి అక్కడ  నివసించ సాగాడు. 1934 లో అమెరికా సందర్శించాడు న్యూయార్క్ లోనూ ,కాలిఫోర్నియాలోనూ ప్రజలతనికి బ్రహ్మరథం పట్టారు. చాలా పార్టీలలోనూ, టెలివిజన్ షోలలోనూ వింత అలంకరణతోనూ,వింతైన ప్రవర్తనతోనూ కనిపించే అతనిని యెగబడి చూడసాగారు. 1936  ప్రపంచ ప్రఖ్యాత    "టైమ్" మాగజీన్  అతని ముఖచిత్రంతో వెలువడింది.

1938 లో ప్రముఖ రచయిత స్టీఫాన్ జ్విగ్ డాలీకి అతని అభిమాన రచయిత సిగ్మండ్ ఫ్రాయిడ్ ని పరిచయం చేశాడు. అప్పటిదాకా సర్రియలిస్ట్ లని అనుమానంగా చూసిన ఫ్రాయిడ్ డాలీ చిత్రం "మెటమార్ఫసిస్ ఆఫ్ నార్సిసస్ "ని మెచ్చుకుంటూ జ్విగ్ కి లేఖ రాశాడు. అతను కొన్ని సినిమాలకు కూడా పని చేశాడు .జ్యూవెలరీ డిజైన్ చేశాడు .ఇంటీరియర్ డిజైనింగ్ చేశాడు .శిల్పాలు చెక్కాడు , యేది చేసినా అందులో సర్రియలిస్టిక్ ధోరణి అనివార్యంగా వుండేది. 1942లో"సీక్రెట్ లైఫ్ ఆఫ్ సాల్వడార్ డాలీ" అనే పేరుతో  స్వీయచరిత్ర రాశాడు.
1948 లో అమెరికా నుండీ తిరిగి స్పెయిన్  కి చెందిన పోర్ట్ లిగాట్ లోని సొంత ఇంటికి చేరి అక్కడే నివసించడం మొదలు పెట్టారు గాలా ,డాలీ.  అప్పటి నుండీ  దాదాపు ముఫ్ఫయి సంవత్సరాలు పారిస్ , న్యూయార్క్ లలోనూ మిగతా కాలమంతా పోర్ట్ లిగాట్ లోనూ గడుపుతూ వుండేవారు.

1968 లో పుబోల్ అనే చోట గాలాకోసం ఒక కోట నిర్మించాడు డాలీ. అప్పటి నుండీ ఆమె అందులోనే నివసించసాగింది డాలీకి దూరంగా. ఆమె విందులూ విలాసాలూ ,ఆమె స్నేహితులు ఆమె ప్రపంచం ఆమెకు వేరుగా వుండేది. లిఖిత పూర్వక మైన ఆహ్వానం వుంటే తప్ప డాలీ ఆ కోటలో అడుగుపెట్ట కూడదని ఆజ్ఞాపించింది. డాలీ దానికి తలవంచాడు. కానీ అతనికి సర్వస్వమూ ఆమే కదా! అందుకే నెమ్మదిగా నైరాశ్యంలో కూరుకు పోయాడు. 1980లో మానసిక నైరాశ్యం, డ్రగ్ అడిక్షన్ ,నరాల బలహీనతలతో బాధపడ సాగాడు. కుడిచెయ్యి వణుకుతుండటంతో పెయింట్ చేయలేకపోయేవాడు.

1982 జూన్ పదవతేదీన తన 87వయేట గాలా కన్ను మూసింది .ఆమెను ఆమె కోటలోనే సమాథి చేశారు .అప్పటినుండీ డాలీ తన మకాం పుబోల్ కు మార్చాడు 1984నుండీ మానసికంగా కుంగిపోయిన డాలీ ఆహారం తీసుకోవడం మానివేశాడు. 1986లో జరిగిన అగ్నిప్రమాదంలో  డాలీ కి ఒళ్లు కాలింది అయినా బతికి బయట పడ్డాడు . 1989 జనవరి 29 సాల్వడార్ డాలీ ఈ లోకం నుండీ శాశ్వతంగా శెలవు తీసుకున్నాడు. అతని దేహాన్ని ఫిగరెస్ (స్పెయిన్ )లోని డాలీ థియేటర్ మ్యూజియమ్ స్టేజీ కింద సమాథి చేశారు . తన అభిమానుల పాదాల కింద తాను విశ్రమించాలని అతని కోరిక .

డాలీ చిత్రాలు ప్రదర్శించే మ్యూజియమ్స్  స్పెయిన్ లో మూడూ, ఫ్లోరిడా లో ఒకటీ వున్నాయి.

డాలీ థియేటర్ మ్యూజియమ్ ---ఫిగరెస్ ,కాటలోనియా ,స్పెయిన్ ఇక్కడ చాలా చిత్రాలు వున్నాయి.

గాలా డాలీ హౌస్ మ్యూజియమ్ --పుబోల్ కాజిల్ --పుబోల్ --కాటలోనియా

రీనా సోఫియా మ్యూజియమ్  ---మాడ్రిడ్ ---స్పెయిన్ 

సాల్వడార్ డాలీ హౌస్ మ్యూజియమ్ ---పోర్ట్ లిగాట్ ---కాటలోనియా ---స్పెయిన్ 

సాల్వడార్ డాలీ మ్యూజియమ్ ----సెంట్ పీటర్స్ బర్గ్ ---ఫ్లోరిడా

ఎప్పుడూ కలల్లో ఊహల్లో భ్రమల్లో జీవించే  వాటినే చిత్రించే సాల్వడార్ డాలీ జీవితం ఇది.

-భార్గవి

Comments

  1. Excellent life story about Salvador Dali Ma'am.... Congratulations....

    ReplyDelete
  2. Tq 🙏🙏🙏భార్గవి గారు

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

మరణానంతరము