నృత్య తార-యల్ విజయలక్ష్మి


పంతొమ్మిది వందల యాభయ్ -అరవవయ్యీ దశకాలలోని సినిమాల పట్ల అవగాహన వున్న వారికి యల్ .విజయలక్ష్మి పరిచయం అక్కరలేని పేరు అంత వరకూ నృత్యతారలుగా వెలుగుతున్న కుచలకుమారి,ఇ.వి. సరోజ,కమలాలక్ష్మణ్ (అడపాదడపా)రీటా, జ్యోతి వీరందరినీ తోసిరాజని తారాజువ్వలా దూసుకు వచ్చిన తార విజయలక్ష్మి. అంత పొడుగూ ,పొట్టీ కాని విగ్రహం,చక్కని కనుముక్కు తీరూఅన్ని భావాలనూ సున్నితంగా పలికించే చేప ల్లాంటి కళ్లూ ఆమెకు పెట్టని ఆభరాణాలయితే లయానుగుణంగా చురుకుగా పర్ఫెక్టుగా  కదిలే శరీరం, యెంత క్లిష్టమయిన నాట్య విన్యాసాన్నయినా అవలీలగా చేయగల సామర్థ్యం ఆమెను మేలి నాట్యతారగా నిలిపాయి. ఈమె శాస్త్రీయ నృత్యాలూ ,శృంగార నాట్యాలూ ,క్లబ్ సాంగ్స్ ,జానపద నృత్యాలూ యిలా అన్ని రకాలూ చేయగల దిట్ట అయితే ఈమె శృంగార నృత్యం చేసినా లేకిగా రెచ్చగొట్టేదిగా వుండదు. ఆమె తర్వాత వచ్చిన నటీమణుల నృత్యానికీ యీమె నృత్యానికీ యిదే తేడా అనిపిస్తుంది పైగా విజయలక్ష్మి డాన్స్ చూస్తుంటే ఆమె శరీరంలోని ప్రతి అణువూ నాట్యం చేస్తున్నట్టు వుంటుంది అదే మాట ఆమె తన యింటర్వ్యూలో చెప్పింది "నాట్యం నా పేషన్ ,నాట్యం చేస్తున్నపుడు నా హృదయాన్ని పరచినట్టుంటుంది "అని . 

లక్ష్శణన్ విజయలక్ష్మికి నాట్యంలో అభిరుచి కలగ డానికి ఆరేళ్ల వయసులో పూనాలో  పెరుగుతున్నపుడు (తండ్రి వుద్యోగరీత్యా) ఆమెచూసిన పద్మినీ ,కమలా లక్ష్మణ్ ,వైజయంతి మాలల నృత్యాలే కారణమట అవి చూసి ఇంటికి వచ్చి  తిరిగి అలాగే అనుకరిస్తు కుమార్తె లోని అభిరుచిని గుర్తించిన తండ్రి సుకుమారన్ పిళ్లై దగ్గర తర్ఫీదు యిప్పించారు మొదట తర్వాత తన తొమ్మిదో యేట ఆంధ్రదేశంలోని వొక గుడిలో ఆమె మొట్టమొదటి నాట్య ప్రదర్శన జరిగింది .ఆమె విద్యకు మెరుగులు దిద్దుకోడానికీ మరింత ప్రకాశించడానికి మద్రాసే సరి అయిన చోటు అని గ్రహించిన తండ్రి కాపురం మద్రాసు కు మార్చారు అక్కడ "వరూరు రామయ్య పిళ్లై "అనే గురువు చేతిలో సాన పెట్టిన వజ్రంలా ప్రకాశించింది ఆయన దగ్గరున్నపుడు ఇ.వి. సరోజ ఈమె సహాధ్యాయి.

తర్వాత "రసికరాజ సభ"లో జరిగిన ఆమె ఆరంగేట్రానికి ప్రఖ్యాత దర్శకుడు వి.శాంతారాం,ప్రముఖ నర్తకి కమలా లక్ష్మణ్ హాజరయి ఆశీర్వదించారు అదే సమయంలో సినిమారంగానికి చెందిన వ్యక్తుల దృష్టిలో పడటం జరిగింది. ఆమె మొదటి చిత్రం 1952 లో"మరుమకల్ "అనే మళయాళ చిత్రం అయితే తెలుగులో ఆమె మొదటి చిత్రం 1959 లో వచ్చిన "సిపాయి కూతురు " ఇందులో ఆమె రాజనాల యెదుట రెండు నృత్యాలు చేసింది అన్నట్టు ఈ సినిమా తోనే కైకాల సత్యనారాయణ పరిచయమయ్యారు హీరోగా. తర్వాత వరసగా తెలుగు ,తమిళ ,కన్నడ ,మళయాళ సినిమాలతో పాటు నాలుగయిదు హిందీ చిత్రాలలో నటించారు  హిందీలో సంజీవ్ కుమార్ తోనూ మళయాళంలో ప్రేమ్ నజీర్ తోనూ హీరోయిన్ గా నటించారు యెన్ని భాషలలో నటించినా తనకు తెలుగు చిత్రాలే పేరు తెచ్చి పెట్టాయనీ తెలుగుచిత్రాలంటేనే ఇష్టమనీ చెబుతారు.  కొన్నిటిలో సెకండ్ హీరోయిన్ గానూ కొన్నిటిలో సహాయనటిగానూ కొన్నిటిలో నాట్య ప్రధానమయిన పాత్రలలోనూ నటించారు కేవలం నాట్యాలు చేయడమే కాక  ఆమెకు మంచి మంచి పాత్రలూ నృత్యాలూ ఇచ్చి ప్రోత్సహించిన నిర్మాతలు  ప్రధానంగా రామానాయుడూ ,విజయా నాగిరెడ్డి.

ఆమె కెరీర్ మంచి వుఛ్ఛదశలో వున్నపుడే తన సోదరుని స్నేహితుడయిన "సూరజ్ కుమార్ డే దత్తా "ను పెళ్లాడి  ఫిలిప్పైన్స్ ,అక్కడనుండీ అమెరికా వెళ్లి స్థిరపడింది అయితే అక్కడ ఆవిడ జీవితం మరో మలుపు తిరిగింది లలిత కళలు చదువుకి ఆటంకం అనే వాళ్ళ అభిప్రాయం తప్పు అని నిరూపించే లాగా ఆవిడ చదువుకోవడం మొదలుపెట్టి అంచెలంచెలుగా పరీక్షలు పాసయి  మనదేశంలో CAకి సమానమయిన డిగ్రీ సంపాదించి ఆడిటర్ గా వున్నతమయిన స్థానంలో వుందంటే  పరిస్థితులకనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకున్న ఆమె వ్యక్తిత్వాన్ని మెచ్చుకోవాలనిపిస్తుంది.

తెలుగుచిత్రాలలో ఆమె చేసిన వొక నృత్యం యెంపిక చేసి పోస్ట్ చేయడం అసాధ్యమని పించింది.  నాకు యేదని యెంచుకునేది "జగదేకవీరునికథ నుండీ భక్త ప్రహ్లాద "వరకూ ఆమె చేసిన వన్నీ దేనికదే బాగుంటాయి  పూజా ఫలంలో ఆమె చేసిన "శివ దీక్షా పరురాలనురా "అపురూపమైనది. చివరకు పక్షపాత బుధ్ధితో నా కిష్టమయిన పాట "జయగణనాయక "యెంచుకుని లింక్ యిస్తున్నాను ఇది "నర్తనశాల "సినిమా లోది అందులో "సలలితరాగ సుధారస సారం " బాగా హిట్టయినప్పటికీ ఈ పాటచాలా ప్రత్యేకంగా వుంటుంది "గంభీర నాట, పున్నాగ వరాళి "రాగాల కలయికా,ఘంటసాల జతులు చెపుతూ నట్టువాంగం నడిపిన తీరూ, యెన్ టీ ఆర్ నాట్యం నేర్పుతూ చూపిన భంగిమలూ య. జానకీ ఘంటసాలల స్వర సమ్మేళనా యల్ విజయలక్ష్శి నాట్యానికి తోడవటం దాని కంత ఆకర్షణ తీసుకొచ్చినాయనుకుంటా.  నర్తనశాలలో యీ పాట బాగుంటుందని సూచించిన వి ఏకె కి కృతజ్ఞతలు.

https://www.youtube.com/watch?v=gHKCm8A-Nso

Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము