మమతల పాలవెల్లి మా అమ్మ


నేను కళ్లు తెరిచేటప్పటికి ఆమె వొడి లోవున్నాను అప్పటినుండీ ఆమె కళ్లు మూసే వరకూ ఆ వొడిలోనే భద్రంగా వున్నాను ఆ తర్వాతే హఠాత్తుగా నా వయసూ , నా పెద్దరికం నాకు తెలిసింది. ఆమె నా కన్నతల్లి కాదనీ "పెద్దమ్మా " అని పిలవాలని నాకూ, నేను తన కన్నకూతురిని కాదనీ కాస్త వేరుగా చూడాలనీ ఆమెకూ యెవరెన్ని సార్లు గుర్తు చేసినా యిద్దరం ఆ విషయం అంగీకరించలేదు నేనే కాదు నా కొడుకు కూడా ఆమెనే "అమ్మా "అని పిలిచేది. నన్ను పెంచిన ఆరేళ్లకి పుట్టిన కూతురు కన్నా తనకు నేనే యెక్కువ .

లంకంత కొంపలో పదమూడేళ్ల పసి వయసులో యింటికి పెద్దకోడలుగా అడుగు పెట్టి వంచిన నడుమెత్తకుండా చాకిరీ చేసి అత్త మామలకు ప్రీతి పాత్రమయిన కోడలుగా మెలిగింది. ఆడబడుచుల ఆరళ్లు తట్టుకుని నిలబడింది మరుదులందరికీ మాతృమూర్తిలాంటి వదినగా వెలిగింది  యెంత వయసొచ్చినా యిరుగు పొరుగుకే కాక యింటికెవరొచ్చినా చూడంగానే యిష్టపడే మూర్తిమత్వం మొక్కలనీ, కుక్కలనీ, పశువులనీ, పక్షులనీ, మనుషుల్లాగే ప్రేమించే మనస్తత్వం.

నియంతలాంటి భర్తతో మెప్పూ,మెహర్బానీ లేని కాపురం యేభై యేళ్లు వెలిగించినా తన పుట్టిన రోజెపుడో పెళ్లి రోజెపుడో యెరగదు.  మావే కానీ తను కొన్న కొత్త బట్టలు మేం కట్టినపుడూ,  తను చేసిన పిండి వంటలు మేం తిన్నపుడూ ఆమెకు పండగే. భర్త కోపాగ్ని కీలల నుండి మమ్మలిని తన కోడి రెక్కలకింద దాచి కాపాడి వొకో సారి తను బలయ్యేది.

నా చిన్నతనంలో వొకసారి తనూ నేనూ విడిపోయే విపత్కర పరిస్థితి వస్తుంది అనిపించినపుడు మా అమ్మ అన్న మాట మర్చిపోలేనిది ఆర్థిక స్వాతంత్ర్యం లేని తను "నిన్ను నానుండీ యెవరూ విడదీయలేరు కావాలంటే కూలిపనయినా చేసినిన్ను పోషించుకుంటాను "అంది. అప్పుడే అర్థమయింది నాకు అమ్మంటే రక్షణ నిచ్చే కోట. అమ్మంటే ఆడి తప్పని వొక మాట. అమ్మంటే వొక భరోసా అని. నడి వయసులో నావ దాటి పోయిన రేవు లాగా మిగిలిన నన్ను చూసి "నేను వున్నంతకాలం నీ కంట నీరు రాకూడదు" అంది అందుకేనేమో యిపుడు సదా నీరూరే చలమలయ్యాయి నా కళ్లు.

Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము