ఒక భార్గవి పుస్తకం గురించి దర్శకుడు వంశీ


చాన్నాళ్ల నించి నేను రాసుకుంటూ వచ్చిన ఫేస్‌బుక్ పోస్టింగులు ‘‘ఎప్పటి మాట... ఇపుడా మనిషే లేదు’’ అన్న పేరుతో  పుస్తకం వేద్దామనుకున్నాను. Director Vamsy అన్న పేరుగల నా పేజి లో కెళ్ళి తీసిన ప్రింటవుట్స్‌ని పబ్లిషర్ గారికి పంపించేను. రష్యన్ డైరెక్టర్ టార్కవస్కీ సిన్మామీద రాసిన రివ్యూ తప్ప మిగతా ఆర్టికల్స్ అన్నీ బాగున్నాయి కానీ, బుక్ బల్క్‌నెస్ చాలదు. ఇంకా 70  పేజీలు కావాలన్నారా పబ్లిషర్ గారు. ఫ్యాషన్ డిజైనర్ సిన్మా ఫ్లాపయింతర్వాత నించీ నా పేజ్ లో  పోస్ట్‌లు  పెట్టడం మానేసేను. వాళ్లడిగిన ఆ డబ్బై పేజీలూ ఇప్పుడెక్కడ్నించి తేను? అనుకుంటా వుండి పోయిన నాకు మొన్న వేమూరి సత్యంగారు ఫోన్ చేసి.‘‘పామర్రులో ఒక డాక్టర్ గారు   నువ్వు తెద్దా మనుకున్న పుస్తకం కంటే గొప్ప  పుస్తకం తెచ్చేరు. నీక్కూడా కాపీ పంపిస్తారు చూసేక ఫోన్ చెయ్యి’’ అన్నారు. అలా ఆయనలాగన్న నాలుగు రోజులకి  రిజిస్టర్ పోస్ట్‌లో పుస్తకం వచ్చింది.

డాక్టర్ భార్గవి గారు రాసిన ఆ పుస్తకం నిజంగా గొప్ప పుస్తకం. పేరు ‘‘ఒక భార్గవి’’ ప్రగతి వారి ప్రింటింగ్ అద్భుతం. గిరిధర్ గౌడ్‌గారి పెయింటింగ్స్ మరీ అద్భుతం లోపల గురుదత్‌ పెయింటింగ్ నైతే అలా చూస్తావుండి పోయేను. ఒక్క నీలం రంగే రకరకాల షేడ్స్. నా పసలపూడి కథల్లో ‘‘గాలిమేడ  కథకి బొమ్మ గుర్తొచ్చింది. ఇలాంటి స్కీమే ఈ బొమ్మలో గొప్పదనం ఏంటంటే మొత్తమంతా నీలంలో వేసి గురుదత్  ప్రాణమయిన వహిదా రహమాన్ పెదాలకి మట్టుకే ఎర్ర రంగుండటం. అలాంటి పెయింటింగ్స్ చాలా వున్నాయి పుస్తకంలో. ఎనభయ్యో పేజీలో పెయింటింగ్ నైతే  ఎప్పటికీ మర్చిపోలేం.

రచయిత్రి వృత్తి వైద్యం, ప్రవృత్తి సంగీత సాహిత్యాల లోతులు తెరచే ప్రయత్నమంట.చాలా మృదువుగా      పరిశీలించి చర్చించే  వీరి లాంటాళ్లు చాలా తక్కువ మంది.ఇది నా అనుభవంతో చెపుతున్న మాట. ఈ పుస్తకం కొనుక్కుని ఏదీ మిస్సవ్వకండా చదవాలంతా. చిన్నాపెద్దా కలిపి వంద ఆర్టికల్స్ ఉన్నాయి. వాటిల్లో మొదటిది ‘జ్ఞాపకాల పొదరిల్లు’’.  వాళ్ళింటి మీద రాసేరు. టైటిల్ చూసిన ఎవరికైనా తిలక్ గారి ‘‘ఊరి చివర ఇల్లు’’. గుర్తుకొస్తుంది. నాకైతే దాంతో పాటు కుప్పిలి పద్మగారి ‘‘ఆడిపాడిన ఇల్లు’’ కూడా గుర్తొచ్చింది. చదవడం మొదలెడ్తే...... అప్పుడే పసలపూడిలో చాకలి రత్తాలు ఉతికి తెచ్చిన గ్లాస్కో చీరకి రాసిన మా పిఠాపురం నూర్జహాను సెంటు వాసనొచ్చింది. ఆనాడు 9, 10 క్లాసులు చదివే రోజుల్లో తెల్లవారుజామునే లేచి కరెంటు దీపాలున్నా సరే హరికేన్ లాంతరు ముందు కూర్చుని దీక్షగా చదువుకుంటే ఇంటి ముందు పూసిన మాలతీ, మధుమాలతి సువాసనల్లో సన్నజాజి వాసన కలగలిసేదంట. చుక్కల ముగ్గులతో నిండిన వాళ్ళ వాకిలి, చుక్కలు నిండిన ఆకాశంతో పోటీ పడేదంట.  జంపాల చౌదరిగారి లాంటి సాహితీవేత్తలు మెచ్చుకున్న ఆర్టికల్ ఇది. నిజమే జ్ఞాపకం చాలా బాగుంటుంది. నాకైతే వర్తమానం కంటే జ్ఞాపకమే బాగుటుంది. నిత్యం జ్ఞాపకాల వరండా మెట్ల మీద నిలబడ్డమే ఇష్టం నాకు....

‘‘ఆనాటి వాన చినుకులు’’ అన్న పేరుతో సంకలం తెచ్చిన వేమూరి సత్యనారాయణగార్ని జ్ఞాపకాల మీదో కథాసంకలనం తెండి అంటా గొడవ చేస్తున్నా నీమధ్య. రచయిత్రి గారు సంగీతం మీద మంచి అవగాహన ఉన్న మనిషి. మొన్న విజయవాడలో బాలాంత్రపు రజనీకాంతరావు గారింట్లో జరిగిన ‘‘ఆనాటి వాన చినుకులు’’ సభలో అద్భుతంగా పాడేరంట. నటి స్వర్గీయ శాంతకుమారిగారు పీలు రాగంలో మనసుని పీల్చేసి పాడిన ఆపాటంటే చాలా ఇష్టమట. అసలు పేరు వెల్లాల సుబ్బమ్మ అయితే శాంతకుమారి అని పేరు పెట్టుకున్నఆవిడ,గాయనిగా పైకి రాకపోడానికి కారణం భర్త పి. పిల్లయ్యగారేనంట.  ఇళయరాజాగారు లలిత రాగంలో ట్యూన్ చేసిన లలిత ప్రియకమలం పాట గురించీ అదే లలితరాగంతో ఘంటసాల గారు రహస్యం సినిమాలో రాగమాలికలో చేసిన ఒక పాట చివరి చరణం గురించీ పరమానందంగా రాసేరు. ఈవిడకి ఘంటలసారి సంగీత దర్శకత్వం అంటే ఇష్టం అంట.  దైవం కొలువైన గొంతు అంటూ మహమ్మద్ రఫీ గురించి చాలా మందికి తెలీని చాలా సంగతులు చెప్పేరు. చలంగారు తన మ్యూజింగ్స్‌లో మహమ్మద్ రఫీక్ పియా’ అని మూలిగాడా ప్రాణం కొట్టుకుపోతుంది. అన్నారంట. సినిమా ఫీల్డులో కొచ్చిన  కొత్తలో రెండు మూడు సినిమాల్లో చిన్నా చితకా వేషాలు కూడా వేసేరంట రఫీ. గాంధీగారు చనిపోయినప్పుడు దేశమంతా ఏడుస్తున్న టైములో హసన్లాలాల్ భగత్‌రామ్ సంగీత దర్శకత్వంలో రాజేంద్ర కిషన్ రాసిన ‘‘సునో సునో యే దునియా వాలో బాపూజీకి అమర్ కహానీ’’ అని రఫీ పాడిన పాట ప్రజల్నే కాదు, ప్రధానమంత్రి నెహ్రూని కూడా ఏడిపించిందంట. ఆయన రఫీని వాళ్ళింటికి పిలిపించి పాడించుకుని బహుమతిగా ఇచ్చిన సిల్వర్ మెడల్ని జీవితాంతం ఇష్టంగా దాచుకున్నాడంట రఫీ. చదూతుంటే బాలూగారి కోదండ పాణి ఆడియోలేబ్ మెయిన్ డోర్ ఎడంపక్కనుండే ఫొటోలో నవ్వుతున్న ఆ రఫీగారే ప్రాణమొచ్చి పలకరిస్తున్నట్టనిపించింది. నిజంగా కారణజన్ముడైన ఆ మహమ్మద్ రఫీగారి గురించీ భార్గవిగారిలా భావయుక్తంగా రాస్తుంటే బాధ కలగలసిన ఇష్టంతో చదూకుంటా పోతున్నాను.
                                                       

ఎన్నో కర్ణాటిక్, హిందూస్థానీ రాగాల గురించీ, గాయకుల గురించీ ఆనందంగానూ, అద్భుతంగానూ విశ్లేషించుకుంటా పోయిన డాక్టర్ భార్గవిగారికి గాయని గీతాదత్ గొంతంటే అలాంటిలాంటి ఇష్టంకాదంట. ఆమె పాటలు వింటుంటే పిచ్చెక్కి పోతుందంటీ రచయిత్రి గారికి. అలాంటి గీతాదత్ బాజీ సిన్మాల్లో తడ్ బీర్ సే బిగిడీ హుయీ తక్ దీర్ బనాలే’ పాట పాడేటపుడు, ఆమె తక్‌దీర్ మారిందంట. ఆ సిన్మా డైరెక్టరైన గురుదత్ ని ప్రేమించి పెళ్లాడిన కొన్నాళ్ళకి సంసారంలో గొడవలు, మధ్యలో రాజమండ్రీ మున్సిపల్ కమీషనర్ ఖాన్ గారి అమ్మాయి వహిదా రెహమాన్ ఎంట్రీతో రాజుకున్న మంటలూ గురుదత్ మరణంతో క్రుంగిపోయిన గీత  లివర్ సమస్యతో మరణించినా ఆమె పాటలు ఇప్పటికీ ఆకుపచ్చని జ్కాపకాలేనంట.     
                                                          
చివరగా చెప్పేదేంటంటే వెండి తెర విషాదరాణి అంటా మీనాకూమారి గురించి..............మీనా కుమారి రవీంద్రనాథ్ టాగూర్‌కి దూరపు బంధువు.  జీవిత కాలంలో నాలుగంటే నాలుగే సినిమాలకి దర్శకత్వం వహించిన కమాల్ అమ్రోహి ప్రేమలో పడి అతన్ని చందన్ అని ముద్దుగా పిలిస్తే అతను మంజూ అని ఇంకా ముద్దుగా  పిల్చేవాడంట మీనాకుమారిని. అర్థరాత్రి మొదలైన ఫోన్లో మాటలు తెల్లారేదాకా ముగిసేవి కావంట. అదంతా చూసిన మధుబాల “నిన్ను ఎప్పట్నుంచో ప్రేమిస్తున్నాను. నా దగ్గర కొచ్చేయ్ మూడు లక్షలిస్తాను “అంటే నవ్వేసి నిరాకరించాడంటా కమాల్ అమ్రోహి. 1952 సంవత్సరం ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజే కాదు. వాళ్ళ పెళ్లిరోజు కూడా నంట. 1953లో వేసిన ‘‘దాయిరా’’ సినిమా బొంబాయిలో రెండు రోజులు మాత్రమే ఆడి అటకెక్కింది. తర్వాత సిన్మాలు లేవు కమాల్ అమ్రోహికి. దాంతో మీనా కుమారి డేట్స్ చూసే మేనేజర్లాగయిపోయేడు. ఇంత గొప్ప కమాల్ అమ్రోహిని “మీనాకుమారి మొగుడు” అని పిలవడం మొదలెట్టేరంట జనం.  సంసారంలో పొరపొచ్చాలు మొదలయ్యాయి.  మీనాకుమారికి గుల్జార్ పరిచయమయ్యాక గొడవలు  ఇంకా బాగా పెరిగినియ్యి. గతంలో నిద్రలేని ఫోన్ సంభాషణలు కారణంగా  “నిద్రలేమి” అనే వ్యాది రావడంతో  డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఒక పెగ్ బ్రాందీ ఆమె జీవితాన్ని కబళించడం మొదలెట్టింది. ఆ అలవాటు ధారుణంగా పెరిగిపోయింది. రాత్రి పగలూ తేడా లేకుండా రోజుకి రెండు మూడు ఫుల్ బాటిల్స్ దాకా పోడంతో లివర్ సిర్రోసిస్ అనే వ్యాధికి గురయ్యిందా మీనాకుమారి. భర్త తీసిన ‘పాకీజా’ సినిమా రిలీజయ్యింది కానీ, వసూళ్ళ పరంగా ఏమాత్రం బాగోలేదు.తీవ్ర అనారోగ్యంతో మలబార్ హిల్‌లో వున్న సెంట్ ఎలిజబెత్ నర్సింగ్ హోమ్ లో చేరిన మీనాకుమారి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తూ ‘‘నాకింకా బతకాలనుంది’’ అంటా చంటి పిల్లలాగేడుస్తా అదే మాట సమాధి మీద రాయమని కోరింది. విరగిన వాయులీనంతో,తెగిన పాటతో, పగిలిన గుండెతో, ఈ లోకం నించి శాశ్వితంగా శలవు తీసుకుందా అబల. ఆమె చనిపోయిందన్న వార్త విన్న ప్రజలు ఆమెని చూడ్డానికి తండోపతండాలుగా థియేటర్ల మీద పడ్డంతో సూపర్ హిట్టయిపోయిందా ‘పాకీజా’ సినిమా.


Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము