మా మద్రాసు తాతయ్య

అయిన వాళ్లూ,దగ్గర బంధువులూ ఆయన్ని పిలిచే పేరు ఆనంద్ . పరివారమూ , పరిజనమూ పెదనాయన అంటారు. స్నేహితులూ, దగ్గరగా తెలిసిన వాళ్లూ"చిక్కీ "అంటుంటారు. పాఠకులకీ, పై వాళ్లకీ తెలిసిన పేరు వే.ఆ.కృ.రంగారావు లేక వి.ఎ.కె .రంగారావు. కానీ దగ్గర పరిచయస్తులకీ ,తను అభిమానించే వాళ్లకీ, తనను అభిమానించే వాళ్లకీ---ఆయనే కోరి పిలిపించుకునే పేరు తీరు "మద్రాస్ తాతయ్య" చిన్నతనం నుండీ పత్రికలలో ఆయన వ్యాసాలు,(ముఖ్యంగా విజయచిత్రలో) చదివి చాలా ఆశ్చర్య పడుతూ వుండే దానిని. ఆయన నిర్మొహమాటం ,ఆయన విషయ పరిజ్ఞానం, ఆయన రాసే తెలుగు భాషా, ఆయన ఇతరుల కంటే విభిన్నం సుమా అని చెబుతున్నట్టుండేది.

నాకాయన పరిచయమవుతారనీ, ఆయనతో మాట్లాడతాననీ, ఆయన పుస్తకం ప్రచురించిన మొట్ట మొదటి ప్రచురణ కర్తని నేనే అవుతాననీ(రెండో ప్రచురణ కర్త నా స్నేహితురాలు డా"శశికళ కోలా ) ఆయన మా ఇంటి సభ్యులలో ఒకరిలా అవుతారనీ పదహారేళ్లక్రితం ఊహామాత్రంగా కూడా అనుకోలేదు .అంతా "కృష్ణమాయ "అనిపించేట్టే జరిగింది. ఈ జన్మలో నాకు పట్టిన అదృష్టాలలో అదొకటి.

2002లో "వార్త" లో వస్తున్న కాలమ్ "ఆలాపన "అభిమానిగా ఆయనతో పరిచయం అయ్యాక,గత నలభైయేళ్లుగా వివిధ పత్రికలలో వ్యాసాలు రాస్తున్న ఆయన పేరు మీద ఒక్క పుస్తకం కూడా లేదని తెలిసి 2004 జనవరిలో ఆయన వ్యాసాలు ఒక వంద "ఆలాపన "పుస్తకంగా వేశాము. ఇందులో నా స్నేహితుడు డా"గురవారెడ్డి సాయం కూడా వుంది, దానికి అనుబంధంగా ఒక 70పేజీల ఇంటర్వ్యూ ఎవరూ చేయడానికి ముందుకు రాకపోతే నేనే చేశాను. దానితో ఎక్కడో మారుమూల నా మానాన నేను యేవో పుస్తకాలు చదువుకుంటూ బతుకుతున్న దానిని హఠాత్తుగా సాహితీ లోకం గుర్తించింది. బాపూ,రమణ ల్లాంటి మహానుభావులు మెచ్చుకుని ప్రోత్సహించారంటే అదృష్టం కాక మరేమిటీ. కొంతమంది పరిచయం,జీవితంలో అనూహ్యమయిన మలుపుకి కారణమవుతుందనే దానికి ఇదే పెద్ద ఉదాహరణ,ఈ విషయంలో ఆయనకు నేను తీర్చలేని ఋణగ్రస్తురాలను.

ఆయన తెలుగూ, హిందీ సినిమాల గురించీ, కర్ణాటక సంగీతమూ, నృత్యమూ మొదలయిన విషయాల గురించీ, ఇంగ్లీషు లోనూ, తెలుగులోనూ పత్రికలలో రాసిన వ్యాసాలు ,ఎంత ప్రామాణికమైనవో, ఎంత విషయ పరిజ్ఞానాన్నందిస్తాయో పాఠకులలో ఎంత ఉత్తమాభిరుచిని పెంపొందిస్తాయో జగమెరిగిన సత్యం. అయితే వ్యక్తిగా కూడా ఆయన ఎంత విభిన్నమయిన వాడో, విశిష్టమయిన వాడో కొంతవరకూ గమనించే అవకాశం కలిగింది. అందరినీ అంత విమర్శిస్తారే గానీ, తననెవరైనా చిన్న విమర్శ చేసినా తట్టుకోలేనంత సున్నిత హృదయం. తన తప్పేదయినా వుందని అనిపిస్తే తలవంచి వినమ్రంగా ఒప్పుకునే స్వభావం. ఇతరుల గురించి తనకేదైనా అభ్యంతర కరంగా తోస్తే వాళ్ల మొహం మీదే చెబుతారు కానీ వాళ్ల వెనక వ్యాఖ్యానించరు,ఇది నాకు చాలా నచ్చిన గుణం, అందరూ అలావుండలేరు కష్టం.

చతురంగా సంభాషించడమంటే ఇష్టం,ఎంత సేపయినా తనతో సమానంగా మాట్లాడగలిగే వారుంటే మాట్లాడగలరు.ఆ సంభాషణ వినే వారికి కూడా ఉల్లాసాన్ని కలిగిస్తుంది.ప్రాక్టికల్ జోక్స్ ఇష్టం----ఎవరయినా దేన్నయినా చూసి భయపడుతారని తెలిసిందా! ఇక వాళ్లు దొరికిపోయినట్టే. ఉదాహరణకి వాళ్ల వదిన గారికి (లీలా బీడీప్రియ --బీడీప్రియ ఆయన పెట్టిన పేరే).పాకే పురుగులంటే అసహ్యమనీ  భయమనీ తెలిసి ఆవిడని ఏడిపించడానికి, వాటిని పట్టుకుని హఠాత్తుగా ఆమె ఆదమరిచి వుండగా ఒక ఆకులో చుట్టి తాంబూలంగా ఇవ్వడమో, దగ్గరగా తీసికెళ్లడమో చేసి ఆవిడ భయపడితే చూసి సంతోషిస్తూ వుంటారు, పైకి మళ్లీ యే భావమూ కనిపించనివ్వరు పరమ సీరియస్ .

ఒకసారి మద్రాసులో ఆయనింటో యేదో విషయం గురించి చర్చిస్తూ వుంటే,వెనకనుండీ యెవర్నోభయంకరమైన మాస్క్ వేసుకుని హఠాత్తుగా పెద్ద కేక వేసి భయపెట్టేట్టుగా నియమించారు,నాకాయన ప్రాంక్స్ తెలుసు కాబట్టి నిర్భయంగా కూచున్నా. ఆయన దగ్గరున్న బ్రీఫ్కేసులో రకరకాల జంతువులూ, కప్పలూ,పాములూ, బల్లులూ వుంటాయి ప్లాస్టిక్ బొమ్మల రూపంలో, ఎవరైనా పెట్టె పట్టుకోబోతుంటే పెద్దగా భయపడేటట్టుగా "ముట్టుకోవద్దు "అని అరుస్తారు, అంతా వుత్తదే.

కుక్కలంటే అంతులేని ప్రేమ, పక్షులూ, జంతువులన్నా అంతే ఇష్టం. ప్రయాణాలన్నా, కొత్త ప్రదేశాలన్నా, కొండలూ గుట్టలూఎక్కడమన్నా, ప్రాచీన ఆలయాలను సందర్శించడమన్నా,శాసనాలూ మొదలయిన చరిత్ర తెలుసుకోవడమన్నా అంతులేని ఆసక్తి. ఒక్క చూపులోనే ఒక వ్యక్తిని అంచనా వేసి, అభిమానించడమో , దూరం పెట్టడమో చేయగల సూక్ష్మ గ్రాహ్యత. అలా ఆయన చూడంగానే అభిమానించింది, మా అమ్మనీ, నా స్నేహితురాలు శాంతకుమారినీ నన్ను కాదు. మా అమ్మ గురించి ప్రసక్తి వస్తే ఈ రోజుకీ ఆయననే మాట "నన్నావిడ మీ ఇంటో కుక్కని చూసినంత ప్రేమగా చూసే వారు" అని. విలక్షణమైన ఆహారపు అలవాట్లు ఐస్ క్రీములన్నా ,చాక్లెట్లన్నా ఇష్టం , కొన్ని కలగలుపు కూరలు కోరి వండించుకుంటారు యేదైనా చాలా మితంగానే.

ఒకసారి ఆయన్ను కలవడానికి విజయవాడ వెళుతూ "ఏంకావాలి "అంటే "మొక్కజొన్న పొత్తులు,పచ్చివి కావాలి,యెలా వుండాలంటే జి.వరలక్ష్మి బుగ్గలంత మెత్తగా వుండాలన్నారు".నేనేమన్నా తక్కువ తిన్నానా ?మొక్క జొన్న పొత్తులు తీసుకుని ఆ తెల్లని రేకుల మీద "జి.వరలక్ష్మి బుగ్గలు "అని రాసి ఇచ్చాను. "చూడండి ఎలా రాసిందో ?"అని పక్కవాళ్లకి చూపెట్టారు. తనకిష్టమైన,తనారాధించే మల్లాది రామకృష్ణ శాస్త్రి లాంటి మహానుభావుల ప్రసక్తి వస్తే నోట మాటరాదు,డగ్గుత్తిక పడిపోతుంది,కన్నీటి ప్రవాహానికయితే అంతే వుండదు.వారి కుటుంబానికి చెందిన యెవరిపట్లయినా అదే అభిమానం.

"రజనీ"గారంటే అత్యంత భక్తి భావం,ఆయన శతజయంతి సభలో ఈయన చేసిన సాష్టాంగ దండ ప్రణామానికి స్టేజీ చాల్లేదు. అన్నమయ్య అంటే అలవిమాలిన భక్తి, అభిమానం. ఆయన పదాలలో "లేనిది లేదు రానిది రాదు"అని రాశారొక చోట."అన్నమయ్య పద సేవకుడు "అని చెప్పుకోవడం కూడా విన్నాను అలాగే సారంగపాణి, క్షేత్రయ్యల మీద కూడా అంతే భక్తి భావం. ఇంక ఆయన పట్టుదల గురించి చెప్పేదేముంది, ఎవరూ ఆయన చేత యే పనీ చెప్పి చేయించలేరు, ఆయనంతట ఆయనకి తోచి చేయాలే తప్ప. ఇంకా యెన్నో విశేషాలూ,విశిష్టతలూ కలబోసిన అపర కృష్ణ భక్తుడయిన మా మద్రాస్ తాతయ్య ఆరోగ్యంతో ,ఆనందంగా,తనకిష్టమయిన పనులు చేస్తూ ,ఆ నల్లని వాని చల్లని కనుచూపులో కలకాలం నిలవాలని మనస్ఫూర్తిగా కోరుతూజన్మదిన శుభాకాంక్షలతో -ఈ"త"సీగాన ఉరఫ్ డా"రొం"భా ఉరఫ్ భార్గవి

Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము