ఒంటరి------ప్రకృతి లోకి ఒక ప్రయాణం


సమస్త ప్రాణికోటితో నిండిన ,అనేక రకాలయిన జంతువులున్న ఈ చరాచర ప్రపంచంలో మనిషి కూడా ఒక రకమయిన జంతువే.భాషనేర్చిన జంతువు మనిషి అంటారు కొందరు.ఇక్కడ కూడా నాదొక పేచీ---జంతువులకు కూడా వాటి భాష వాటికుందేమో మనకేం తెలుసు?


ఆది కాలంలో ప్రకృతికి దగ్గరగా దానిలో ఒక భాగమై,అందులోని ప్రాణికోటితో సావాసం చేస్తూ,ఒక సమతౌల్యం సాధించి జీవనం సాగించేవాడు మనిషి.జంతువులతో పాటు మందలు మందలుగా జీవించడానికి అలవాటు పడిన అతను నెమ్మదిగా నాగరికతను అలవరచుకుని,నగరాలు నిర్మించుకుని ప్రకృతికి దూరమయ్యాడు.శారీరక శ్రమ చేసి ఆహారం సంపాదించడం కంటే,శరీరాన్నేక్కువ కష్టపెట్టకుండా సులువుగా ఆహారాన్ని సంపాదించడమే కాక ,ప్రకృతి భీభత్సాలకు తట్టుకుని ,భద్రతగా భద్రతగా జీవించడానికి అనేక ఉపాయాలు నేర్చాడు.

ఈ పరిణామ క్రమంలో తనను తను కోల్పోతున్నాడు.సహజాతంగా తనకు సంక్రమించిన ఇన్ స్టింక్ట్స్ ని కోల్పోవడంతోబాటు ,ప్రకృతి ప్రసాదించే అలౌకికానందాన్ని జారవిడుచుకుంటున్నాడు.శారీరకంగా,మానసికంగా బలహీనుడయ్యి వింత,వింత వ్యాధుల బారిన పడుతున్నాడు ఇలాంటి భావజాలంతో,ఈ విషయాలన్నీ ఈ తరం వారికి చెబుతూ-----ప్రకృతిని కాపాడుకుంటే మనను మనం కాపాడుకున్నట్టే అని చెప్పడం ఈ రచన ఉద్దేశం అనిపించింది.

నాకు ఈ నవల చదివేటపుడు బిభూతిభూషణ్ బెనర్జీ "వనవాసి" గుర్తొచ్చి భలే సంతోషమేసింది.ప్రకృతి వర్ణనలూ, కథ చెప్పే పధ్ధతీ మనను అలాగ్గా చేయి పట్టుకుని లాక్కెళ్లి ఆ పచ్చటి పొలాల్లో,పక్షుల కూతల మధ్యా,మిట్టపల్లాలలో విహరింప జేస్తాయి.

ఇది ప్రధానంగా ఇద్దరు మనుషుల కథ.ఒకరు షుగర్ వ్యాధిగ్రస్తుడయిన డాక్టర్ రాఘవ.అంతులేని సంపద ఒకపక్క, అంతుపట్టని రోగమొక పక్క.అతనే కథ చెబుతూ వుంటాడు.అలా రోగాలతో సతమతమవుతున్న ఆయనకు అరికల బువ్వతోనూ,పచ్చని చెట్ల సావాసంతోనూ,మట్టి స్పర్శతోనూ,ఆయాకాలాల్లో దొరికే పళ్లతోనూ జబ్బు కుదురుకుంటుందని ఇద్దరు సాధువులు చెబుతారు.

ఆవిధంగా "అరికల "అన్వేషణలో ఎంతో ప్రయాస పడితే కనపడిన వాడే రెండవ వ్యక్తి నరసయ్య.అతను మట్టిలో మట్టిగా,పుట్టలో పుట్టగా,పక్షిలో పక్షిగా ,పురుగులో పురుగుగా జీవిస్తున్న ఒకరైతు.

అసలు కథంతా అతనిదే.అతనికి ఒక భార్య,మంచంలో పడిన తల్లీ,భర్త వదిలేసిన కూతురూ,దూరంగా ఊరిలో బతికే కొడుకూ వున్నారు.

అడుగడుగునా అతని జీవన విధానం చూసి డాక్టర్ ఆశ్చర్య పోతుంటాడు.అతను ఊరికి దూరంగా ఒక చిన్న అడవి లాంటి ప్రదేశంలో తనకున్న కొద్దిపాటి భూమినీ సాగు చేసుకుంటూ జీవిస్తూ వుంటాడు.

అరికె ధాన్యం అంతర్థానమయ్యే అపాయకరమైన పరిస్థితి వచ్చిందని డాక్టర్ ద్వారా విని తెలుసుకున్న నర్సయ్య,కేవలం డాక్టర్ జబ్బు గురించే కాక తను మూడేళ్ల కిందట దాచిన రెండు శేర్ల అరికె విత్తనాలు నాటి,పంట పండించి దాని వంశాన్ని నిలపాలనుకుంటాడు. ఈ ప్రయత్నంలో అతను యెదుర్కొన్న కష్టనష్టాలూ,అయినా మొక్కవోని ధర్యమూ,కోల్పోని ఆశా ఒక యెత్తయితే----అతని జీవన విధానమూ,ఆలోచనలూ,ధర్మం తప్పని ప్రవర్తనా అతన్నొక ప్రత్యేక వ్యక్తిగా నిలబెడతాయి.ఖాళీ సమయాలలో "రంగనాధ రామాయణాన్ని చదువుతూ,కవి చౌడప్ప పద్యాలను ఉదహరిస్తూ అతను చెప్పే మాటలు డాక్టర్లో ఆలోచనలను రేకెత్తిస్తాయి.

ఒక సందర్భంలో మనిషికి వచ్చే రోగాలకూ,కష్టాలకూ కారణం అతనిలోని దుర్మార్గమయిన ఆలోచనలూ,చేసిన అన్యాయాలూఅని చెబుతూ ప్రతి మనిషీ తన జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటే తన సమస్యలకి మూలకారణం తెలుస్తుంది అంటాడు అతనూ,అతని ఇంటిలోని వారందరూ కూడా ఆ విధంగా వారి వారి గత జీవితాన్ని నెమరు వేసుకుని వారి వారి ప్రవర్తనలోని లోపాలను చెప్పుకోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలగ జేస్తుంది.

ఆ విధంగా ఆంతరంగిక మయిన విషయాలు పరస్పరం చెప్పుకోవడం వలన డాక్టరూ,భర్తలేని నర్సయ్య కూతురూ మానసికంగా దగ్గరతనం ఫీలవుతారు.ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తీసుకుందీ అవాంతరాలు తట్టుకుని అరికలు పండాయా?,అవితీసుకుని వెళ్లిపోవాలనుకున్న డాక్టర్ వెళ్లిపోయాడా?అక్కడే వుండిపోయాడా? వాళ్లిద్దరి అనుబంధం ఎలాంటి రూ పు తీసుకుందీ?అక్కడి పర్యావరణాన్ని రక్షించడానికి డాక్టర్ ఏ విధమైన చర్యలు తీసుకున్నాడు ?.ఇవన్నీ నవల చదివి తెలుసుకుంటే బాగుంటుంది.

ఒక రకంగా ఈ నవలలో రచయిత స్పృశించని అంశం లేదుదాదాపు.మానవ స్వభావమూ,పరిసరాలవల్లా,పరిస్థితుల ప్రభావం వల్లా దగ్గరయిన మనుషుల మధ్య ఏర్పడే అనుబంధాన్ని సున్నితంగా యెత్తి చూపారు. చక్కగా చదివించే శైలీ,సరిపోయిన వాక్యాలూ. కొన్ని చిన్న,చిన్న వాక్యాలు వివరించాలంటే కొన్ని పేరాలు రాయాల్సొస్తుందేమో అనిపించింది.ఉదాహరణకి "ప్రతిపనికీ నేను డబ్బిస్తాను,నా కోసం ఈ పంట పండించండి .మీరు నష్టపోవద్దు,నా దగ్గర చాలా డబ్బుంది "అన్న డాక్టర్ మాటలకి సమాధానమిస్తూ నర్సయ్య "డబ్బుతో డబ్బు పండుతుంది కానీ పంటలు పండవులే సారూ" అంటాడు.ఎంతో అర్థముందీ వాక్యంలో.ఎంత డబ్బున్నా ప్రకృతి సహకరించందే పంట పండించడం అసాధ్యమనే విషయం రైతైన ప్రతి వాడికీ తెలుసు.

ఇంకో చోటఒంటరితనం గురించి మాటాడుతూ "ప్రతి మనిషీ ఒంటరే ఈ సృష్టిలో,చివరికి భార్యా భర్తా కలిసి సుఖాన్ని పంచుకున్నా యెవరి సుఖానుభూతి వారిదే " అంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పచ్చటి ప్రకృతికి దగ్గరగా జీవించమనీ,దూరం చేసుకోవద్దనీ చెప్పడమే రచయిత ధ్యేయం అనిపించింది.

అంతా బాగుంది కానీ నవల చివరలో రచయిత కథలోంచి బయటకు వచ్చి పాఠకులతో "ఈ రోజునుండీ మీరేం చేయబోతున్నారు ,ఏ విధంగా మీ జీవితాన్ని మార్చుకోబోతున్నారు? అని అడగడంతో స్వర్గంలో విహరిస్తున్న వారిని ఒక్కసారిగా ఢామ్మని భూమ్మీదకు తోసేసినట్టయింది.

అన్నట్టు పుస్తకానికి ముందుమాట రాసిన తల్లావఝ్ఝల పతంజలి శాస్త్రి గారు కూడా ఇదే విషయం ప్రస్తావించారు. ఆయన రాసిన ముందుమాట ఈ పుస్తకానికి తలమానికం. ప్రకృతి ప్రేమికులూ,చక్కటి ఆలోచనాత్మకమయిన నవల చదవాలనుకునే వాళ్లూ,తప్పకుండా చదవాల్సిన పుస్తకం.

ఈ పుస్తకానికి బహుమతినిచ్చి ప్రోత్సహించిన తానా వారు అభినందనీయులు.రచయితకి అభినందనలు

Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము