ఐదుకాళ్ల మనిషి...


మా చిన్నప్పుడు మా ఊరి నిండా చెరువులే. రాళ్లభండి వారి చెరువూ, గంగానమ్మ గుడి చెరువూ, నడిచెరువూ, కోటిరెడ్డి చెరువూ, వీరభద్రయ్య చెరువూ ,చాకలి చెరువూ, చెక్కోడి చెరువూ, మంగలి గుంట ,ఒడ్డోడి గుంట ఇన్నోటి చెరువులుండేవి. మంచినీళ్లకయినా ,బట్టలుతుక్కోడానికయినా ,పశువులని కడగడానికయినా ,ఇతరత్రా యే పనికయినా చెరువునీళ్లే

ఎన్ని చెరువులున్నా తాగడానికి మాత్రం నడిచెరువు నీళ్లే ఆధారం.అందుకనే ఆ చెరువు కట్ట చుట్టూ కాపలా వుండేది .ఈ రేవులో బట్టలు ఉతక రాదు,పశువులను కడగ రాదు అనే బోర్డులు కూడా వుండేవి.
పొద్దున్నే మొదలయి పగలు పది గంటల వరకూ చెరువు రేవు దగ్గర సందడిగా ,ఉత్సవంలా వుండేది ,నీళ్లబిందెలతో వచ్చే ఆడవాళ్లతో,కావిళ్లతో వచ్చే మొగవాళ్లతోనూ. ఆడవాళ్లు కొంతమంది బిందెలను భుజం మీద మోస్తే ,ఇంకొంతమంది నడుంమీద పెట్టుకుని ఒకచెయ్యి బిందెని చుట్టి ఇంకోచెయ్యి జాడిస్తూ వయ్యారంగా నడిచే వారు.మొగవాళ్లయితే కావడి ఒక భుజం మీద గానీ ,రెండు భుజాల మీద కానీ మోస్తూ ఒక ఊపుతో నడిచే వాళ్లు ,వాళ్ల బిందెల నుండీ తుళ్లి పడిన నీళ్ల జాలు కూడా రోడ్డుమీద ఒక తిన్నని గీత గీసినట్టు పడటం మా బోటి పిల్లకాయల కెంతో ఆశ్చర్యం గొలిపేది

ఆ తర్వాత కాలంలోనే ,పంచాయితీ పంపులు రావడం,పంపుల దగ్గర తగాదాలూ.ఆ పైన డబ్బులు కట్టీ పలుకుబడి వుపయోగించీ ఇంట్లో టాప్ కనెక్షన్ తెచ్చుకుని గొప్ప భాగ్యవంతులుగా భావించుకోవడమూనూ. కాలక్రమేణా కొన్ని చెరువులు పూడ్చివేశారు,కలువలూ ,తామరల స్థానంలో ఇళ్లు పూచాయి,మిగతా చెరువులన్నీ చేపల చెరువులయ్యాయి.గంగానమ్మ చెరువు మాత్రం ఊరంతటికీ నీటి దాహం తీరుస్తూ పంపుల చెరువయ్యింది.

ఆ రోజుల్లో ఎవరింటి కెళ్లినా ముందు కాళ్లకి నీళ్లిచ్చి ,దాహానికి కూడా నీళ్లో మజ్జిగో ఇచ్చేవారు. రాబోయే కాలంలో నీళ్లు సీసాల్లో నూ,పాకెట్లలోనూ అమ్ముతారనీ ,అదే పెద్ద వ్యాపారమవుతుందనీ ,నీళ్లకు కూడా టాక్స్ కట్టాలిసి వస్తుందనీ ఊహ గా కూడా లేదు బహుశా యెవరైనా చెప్పినా నమ్మకుండా నవ్వులాటకు దిగే వాళ్లమేమో.

ఒక్క నీళ్ల టాక్సేనా యెన్నెన్ని టాక్సులు కడుతున్నాం,చెత్త తీసుకుపోయే వాళ్లకు నెల నెలా కట్టే టాక్స్ కాక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కి సంవత్సరానికొక సారి రిన్యూవల్ ఛార్జొకటీ,ఇంటి పన్ను ,వృత్తి పన్ను,ఇంకా యెన్నో ,ఇంక భవిష్యత్తులో ఇంకెన్ని పన్నులొస్తాయో!

"ఐదుకాళ్ల మనిషి" పుస్తకంలో "గురుత్వాకర్షణ సుంకం" కథ చదివాక నాలో రేగిన ఆలోచనలివి ఈ కథలో ఒకాయనకి గురుత్వాకర్షణ సుంకం కట్టమని నోటీసుల మీద నోటీసులు వస్తూ వుంటాయి . ఆయనకి ఈ సుంకం మరీ అన్యాయంగా తోస్తుంది ,ఆది నుండీ వున్న ఈ శక్తికి బిల్లు యెందుకు కట్టాలనీ,కట్టకపోతే యేంచేస్తారనీ ఆ శాఖ వారిని ఆయన నిలదీస్తాడు. దానికి వాళ్లు చెప్పే సమాధానాలు వింతగానూ ,భయం గొలిపేవి గానూ వుంటాయి ప్రతి ఇంటిలోనూ నివసించే వారి సంఖ్యను బట్టీ,వారు పెరిగిన బరువును బట్టీ ఈ సుంకం పెరుగుతూ వుంటుందట ఈ సుంకాన్ని 8 నెలలపాటుచెల్లించని ఒకతనికి యెలాంటి శిక్ష విధించారు అంటే వాళ్లు చెప్పిన సమాధానం ఒక సారి చూడండి " అతణ్ణి స్పేస్ షిప్ లో తీసికెళ్లి భూగురుత్వాకర్షణకి బయట దింపేశాము. ఒక సారి అతను భూప్రదక్షిణం చేశాడు.ఈ లోపు మనసు మార్చుకుని కట్టేస్తానని ఒప్పుకున్నాడు.మళ్లీ భూమ్మీదకు తీసుకు వచ్చేశాము"

"నిజంగానా?!"

"దెబ్బకి మొత్తం బాకీ,వడ్డీ,పెనాల్టీతో సహా చెల్లించేశాడు.అయితే ఒక చిక్కు..."

"ఏంటది"

"స్పేస్ షిప్ లో తీసుకెళ్లిన ఖర్చు,స్పేస్ సూట్ ఖరీదు,ఇతర ఖర్చులన్నింటికీ ఇప్పుడు నెలనెలా ఇన్ స్టాల్మెంట్స్ లో కడుతున్నాడు.2196 నెలలు కట్టాలి."

"2196నెలలా?"

"అవును మొత్తం కట్టడానికి 183 యేళ్లు పడుతుంది"

"అన్నేళ్లు బతగ్గలడా?"

"అవన్నీ మాకు తెలీదు. అతని పిల్లలు కడతామని హామీ ఇచ్చారు"

"మేడమ్ ,నేను ఇప్పుడే మీ బాకీ మొత్తం నయాపైసా తో సహా చెల్లించేస్తాను"

అలా ఆయన రాజీ పడి పోయి, ఈ శాఖ బిల్లులు కట్టేస్తుండగానే భూప్రయాణ శాఖ అని ఒక కొత్త శాఖ నుండీ బిల్లులు వస్తాయి, అవేంటంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగే దూరాన్ని లెక్క వేసి దానికయ్యే ఖర్చు సుంకంగా కట్టమంటారు.!

అయ్యా అదీ సంగతి ఈ కథలో వున్న వ్యంగ్యానికీ,హాస్యానికీ వెనక అంతులేని ఒక విషాదముంది.

ఈ పుస్తకంలో పదిహేను కథలున్నాయి ,పదిహేనూ పదిహేను ఆణిముత్యాలు. శ్రీలంక శరణార్థుల కథలున్నాయి,పాకిస్తాను నేపథ్యంలో కథలున్నాయి ,కెనడా వలసపోయిన వారి కథలున్నాయి.అయితే అక్కడ వారు పడే వెతల మధ్యలో ఒక రకమైన జీవన లాలసా,జీవిత సూత్రమూ,మానవ మనస్తత్వమూ వుంటాయని తెలియజెబుతున్న ఈ కథలలో అంతర్లీనంగా ఒక ఆశావహ దృక్పథం వుండడం నాకు చాలా నచ్చింది. మంచికథల పట్ల అభిరుచీ, ఆసక్తీ కలిగిన ప్రతిఒక్కరూ చద వలసిన పుస్తకం.

ఇంతమంచి కథలను రాసిన ఎ.ముత్తులింగం గారినీ,వాటిని తమిళం నుండీ వాటి ఫ్లేవర్ పోకుండా తెలుగులోకి అనువదించి మనకు అందించిన అవినేని భాస్కర్ గారినీ తప్పకుండా అభినందించ వలసిందే.

R.Bhargavi- 09-Dec-2021

Comments

  1. Tq భార్గవి గారు. మీ కామెంట్ ద్వారా ఇది చదవగలిగాము

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము