వేణుగానం వీనులవిందుగా వినిపించిన మాస్టర్ వేణు!


d

వేణుగానమ్ము వినిపించెనే చిన్నికృష్ణయ్య కనిపించడే "వేణు "

దోరవయసున్న కన్నియల హృదయాలనూ

దోచుకున్నాడని విన్నాను చాడీలనూ

అంతమొనగాడటే

వట్టి కథలేనటే

ఏది కనపడితే నిలవేసి అడగాలి వానినే "వేణు 
"
మన్ను తిన్నాడని యశోదమ్మ అడిగిందటా

లేదు లేదంటూ లోకాలె చూపాడట

అంత మొనగాడటే

వింత కథలేనటే

ఏది కనపడితే చూడాలి కనులారా వానినే "వేణు "

దుడుకు కృష్ణయ్య మడుగు లోన దూకాడట జడిసి వ్రేపల్లె ప్రజలంతా మూగారట

ఘల్లు ఘల్ ఘల్లన వొళ్లు ఝల్ ఝల్లన

తాను ఫణిరాజు పడగ పై తారంగ మాడేనట "వేణు "

గత పది రోజులుగా యీ పాట నన్ను వెంటాడి వేటాడి వేధించుకు తింటోందంటే నమ్మండి
యీ పాట రచన ఆత్రేయ పాడినది సుశీల ,జిక్కి, జానకి నటించినది సావిత్రి,వాసంతి బిఏ(ఆవిడ పేరు అలాగే వేసుకునే వారు ) గిరిజ ముగ్గురూ నవ లావణ్యంతో మెరిసి పోతుంటారు ముఖ్యంగా గిరిజ యెంత ముద్దుగా వుందో! చిత్రం "సిరి సంపదలు " పద్మశ్రీ పిక్చర్స్ పతాకం కింద పీపులయ్య,అని పిలవబడే పి. పుల్లయ్యనిర్మంచి దర్శకత్వం వహించారు.

సంగీతం నిర్వహించిన మాస్టర్ వేణు ప్రతిభ గురించి వేరే చెప్పక్కరలేదు . ప్రతి చరణం చివరి వాక్యం లో పలికించిన సంగతులు వింటే చాలు .ఉదాహరణకి మొదటి చరణం చివర "ఏది కనపడితే నిలవేసి అడగాలి వానినే "అనే చోట అనుకోని మలుపు తిప్పి మళ్లీ పల్లవికి తీసుకురావడం అద్భుతంగా అనిపిస్తుంది

అలాగే మిగతా చరణాలలో కూడా మాస్టర్ వేణు చేసిన పాటలు వొకసారి తలుచుకుంటే తల తిరిగి పోతుంది .

ఎంత పాప్యులర్ పాటలు చేశారనీ!

ఆయన విజయ యాత్ర"రోజులు మారాయి" చిత్రంలోని "ఏరు వాక సాగారో " నుండీ మొదలయి 1980 లో ఆయన చివరి చిత్రం "మా యింటి దేవత "వరకూ కొనసాగింది మచ్చుకు ఆయన చేసిన పాటలలో మంచి హిట్లు వొకసారి చూద్దాం .

"రోజులు మారాయి "లో ఏరువాక సాగారో "పాట గురించి తెలిసిందే గదా !

హిందీ లో కూడా యెస్ .డి .బర్మన్ యీ ట్యూన్ ని యెంతో ముచ్చటపడి వాడుకున్నారని తెలుసుకదా ,అలాగే తమిళ్ లో కూడా . ఆయన ప్రస్థానం "వాల్మీకి "తో ప్రారంభ మయినా యీ పాటతోనే మంచి గుర్తింపూ అవకాశాలూ తెచ్చుకున్నారు. తర్వాత "తోడికోడళ్లు "లో యెంత మంచి పాటలు "ఆడుతు పాడుతు పనిచేస్తుంటే" "కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడి చాన" నాకుబాగాయిష్టం .

అందులో "టౌను పక్క కెళ్లొద్దురా " అనేపాట

అలాగే మాంగల్యబలం లో "హాయిగా ఆలూమగలై " "ఆకాశ వీథిలో " ఇంక "రాజమకుటం "లో పాటలు యెంతబాగుంటాయో !"సడి సేయకోగాలి " "ఊరేది పేరేది " వగైరా,అయితే అందులో ఆయన వొక "జయజయ మనోజ మంగళమూర్తి "అనే వాక్యం తీసుకుని అదే తిరిగి తిరిగి వస్తూండగా మధ్యమధ్య వాయిద్య సంగీతం వినిపించి వొక వింత ప్రయోగం చేశారు.

"పెళ్లికాని పిల్లలు" అనే సున్నితమయిన హాస్య చిత్రంలో ఆయన చేసిన పాటలు "చల్లని గాలి చక్కని తోట ",ప్రియతమా రాధికా "వగైరా చెప్పుకో దగిన పాటలు.

"కులదైవం "లో "పయనించే ఓ చిలుకా "పాట తలుచుకుంటేనే నాకు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి .

అదే పాట హిందీలో నాఅభిమాన గాయకుడు "రఫీ "పాడినప్పటికీ తెలుగు లో ఘంటసాల పాడిన పాటే యిష్టం .

భానుమతి గారి -"బాటసారి"లో యెంత చక్కని పాటలు చేశారో గుర్తుందిగా .

ఒకరకంగా భగ్నప్రేమికుల హృదయాలను కొల్లగొట్టిన పాట "మురళీకృష్ణ "లోని "నీ సుఖమే నే కోరుతున్నా " అనేది .

"ప్రతిజ్ఞా పాలన "అన్న జానపద సినిమాలో "రామచిలుక తెలుపవే ప్రేమ యేమిటో "అనే పాటంటే నాకు చెప్పలేని వ్యామోహం .యిలా చెప్పుకుంటూ పోతే చాలా పాటలు గుర్తొస్తున్నాయి కానీ అధిక ప్రసంగం అవుతుందేమో నని భయం.

ఇంత ప్రతిభకు కారణమయిన ఆయన కృషిని గురించీ ,ఆయన జీవిత విశేషాల గురించీ కొంచెం చెప్పి ముగిస్తాను.

ఆయన చిన్నతనమంతా బందరులో గడిచింది .మేనమామ దగ్గర హార్మోనియమ్, తల్లితో పాటు గాత్రం నేర్చుకుని పదేళ్లకే పదిమంది కంట్లోనూ పడ్డారు . డాక్టర్ గిరి గారి ప్రోత్సాహంతో మద్రాస్ చేరి బి.యన్ .ఆర్ .అనే భీమవరపు నరసింహారావు వద్ద అసిస్టెంట్ గా మూడు చిత్రాలకు పనిచెసి మంచి అనుభవం గడించారు . ఆ చిత్రాలు "మాలపిల్ల,రైతుబిడ్డ, మీరాబాయ్".
ఆ తర్వాత హెచ్ యమ్ వీ లో చేరి పుష్పవిలాపం రికార్డింగ్ లో ఘంటసాలకు సహకరించి చెరువయ్యారు ,తద్వారా విజయాసంస్థలో అడుగు పెట్టారు . తాను HMV లో వున్నపుడు నటి "వైజయంతీ మాల "చేత రెండు పాటలు పాడించారు ఆవిడ చక్కని గాయని ఆవిడ తన 80వ యేట చేసిన కచేరీకి వి ఏ కే రంగారావు గారు నన్ను తీసికెళ్లారు.
 
విజయా వారి చిత్రాలలో మాత్రమే వినబడే అరుదైన వాయిద్యం "హేమండ్ ఆర్గన్ " వేణు గారొక్కరే వాయించగలిగే వారట! ఆయనకు పదిహేనుకు పైగా వాయిద్యాలను వాయించే ప్రతిభ వుండేదట. ఆయన బొంబాయిలో కొంతకాలం వసంతదేశాయ్ శిష్యరికం చేశారు .
నౌషాద్ అంటే చాలాయిష్టం ,వీరిద్దరితో సన్నిహితంగా మెలిగేవారు . అక్కడ వున్నపుడే మన్ హర్ బార్వే మ్యూజిక్ స్కూల్ లో చేరి ఆర్నెల్లలో మాస్టర్స్ పరీక్ష పాసయి "మాస్టర్ వేణు అయ్యారు. నటుడు భానుచందర్ ఆయన రెండవ కొడుకు.

తెలుగు చిత్రసీమలో వీనుల విందైన సంగీతం వినిపించిన మాస్టర్ వేణు గురించిన విశేషాలు టూకీగా యివి .ఇంకా వివరంగా కావాలంటే "స్వర్ణయుగ సంగీత దర్శకులు "పుస్తకం చదివి తెలుసు కోవచ్చు
--భార్గవి -25 August-2022
t

Shared with Fr


Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము