వి. ఎ. కె. అంటే?


 అసలు వి. ఎ. కె. అంటే ఏమిటండీ?’ ఇది నేను చేసిన ఇంటర్‌వ్యూలో రంగారావుగారిని అడిగిన మొదటి ప్రశ్న. దానికాయన ‘వేంకట ఆనంద కుమార కృష్ణరంగారావు, అందులో ఆనంద్ అనేదే నా పేరు. మిగతావన్నీ ఏవో దేవుళ్ల పేర్లు. రంగారావు షేర్‌ఖాన్ మా పెద్దల కిచ్చిన బిరుదు’ అన్నారు. నేనేదో తమాషా చేయబోయి ‘మేం అలా అనుకోవట్లేదే’ అన్నాను. ‘మీరెలా అనుకున్నా సరే అదే నిజం, అదే నిలుస్తుంది’ అన్నారు.

అసలు నా దృష్టిలో వి. ఎ. కె. రంగారావంటే వివిధ విషయాలపై విశేషమైన వగాహన లవారు అని. రంగారావుగారిది బహుముఖీనమైన ప్రజ్ఞ. ఆయనలో ఒక రచయిత, కాలమిస్ట్, రికార్డ్ కలెక్టర్, డాన్సర్, జంతు ప్రేమికుడు, సినీ సంగీత సాహిత్య విశ్లేషకుడు, చతుర సంభాషణా దురంధరుడు, పదాలూ జావళీలూ మీద పట్టున్నవాడు – ఇంతమంది కొలువుదీరి వున్నారు.

ఆయనొక విజ్ఞాన ఖని:

అనేక అంశాలపైన అభిరుచీ అభినివేశం వున్నది. కొన్ని అంశాలలో విశేషమైన ప్రతిభ, లోతైన అవగాహనా వున్నాయి. పాత తెలుగు, హిందీ సినిమాల గురించి, పాటల గురించీ సాధికారంగా చెప్పగలిగిన వ్యక్తి రంగారావుగారొక్కరే. ఈ విషయంలో ఆయన మాట ప్రామాణికం, శిలాశాసనం. రాజముద్ర పడిపోయినట్టే. నండూరి రామ్మోహనరావుగారి లాంటి ప్రముఖుడు కూడా యేదో వ్యాసంలో సినిమా విషయాల గురించి ప్రస్తావిస్తూ బ్రాకెట్లో వి. ఎ. కె. గారి సవరణలకు లోబడి అని రాయడం నేను చదివాను. అంతే కాదు పాటల పుట్టుపూర్వోత్తరాలు పట్టుకోవాలన్నా, నేపథ్య గాయకుల సమాచారం తెలుసుకోవాలన్నా రంగారావుగారే దిక్కు.

తొలి నేపథ్య గాయని నేనేనని చెప్పుకునే వాళ్లను నిలువరిస్తూ తొలి నేపథ్య గాయని ఎవరో ఆధారాలతో సహా నిగ్గు తేల్చగలరు. అలాగే ‘స్వర్గసీమ’లో భానుమతి పాడిన ‘ఓహోహో పావురమా’కి మాతృక ఏమిటో మహాద్భుతంగా కళ్లముందుంచగలరు. ‘మాయాబజార్’లోని జనరంజకమైన ‘వివాహ భోజనంబు’కి ఆధారమైన ఇంగ్లీషు ట్యూన్ ఏదో కనిపెట్టగలరు, అది మన దేశంలోకి ఎలా వచ్చిందో కూడా ఊహించగలరు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంగతులుంటాయి.

1935 నుంచి 1975 దాకా వచ్చిన సినిమా పాటలను తాను విని పరిశీలించినంత శ్రద్ధగా మరెవ్వరూ పరిశీలించలేరు అంటారు రంగారావు.

అయితే రంగారావుగారికంటే ముందు ఇలాంటి విశ్లేషకులు లేరా? ఇకముందు రారా? ఏమిటీ ఆయన గొప్పతనం? అంటే – ఆయనకు ముందు ఇలాంటి వారున్నారేమో తెలీదు కాని, ఆయనంత నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, నిస్పక్షపాతంగా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేవారు మాత్రం లేరు. ఇకముందు వస్తారని కూడా ఊహించలేం. అదీ ఆయన ప్రత్యేకత.

రంగారావుగారు సినీ సంగీత సాహిత్య విశ్లేషకులుగా రంగప్రవేశం చేసేనాటికి (1962) సినిమాలన్నా, సినిమాపాటలన్నా మర్యాదస్తులకో చిన్నచూపుండేది. సినిమా పాట కూడా ఒకపాటేనా? అందులో సాహిత్య విలువలు ఏముంటాయి? అనే అభిప్రాయం ప్రబలంగా వుండేది. అయితే ఆయన సినిమాపాటల్లో కూడా ఎలాంటి సాహిత్య విలువలున్నాయో, ఏ పదాన్ని ఎలా వాడారో, ఏ పాటలో ఏ సంగతి గొప్పగా వుందో, ఏ కంఠం ఎంత అందంగా పలుకుతోందో, ఏ కంఠంలో ఏ ప్రత్యేకత వుందో, ఏ సంగీత దర్శకుడు ఎంత ప్రతిభ గలవాడో తెలుగు పాఠకులకీ శ్రోతలకీ విడమరిచి చెప్పారు. అలా ప్రజలలో అభిరుచిని పెంపొందించారు.

అంతే కాదు, ఆయన సినిమా పాటల గురించి, సినిమాల గురించీ రాసిన సంగతులు ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో సంవత్సరాల వారీగా రాయడం వలన, ఒక రకంగా చరిత్రని దాఖలా పరిచినట్టయింది. ఇది ముందు తరాల వారికి, సినిమాల గురించి స్టడీ చేయాలనుకునే వారికీ ఉపయోగపడే ఒక పెన్నిధి. ఇక రికార్డ్ కలెక్టర్‌గా ఆయన చేసిన కృషి సామాన్యమైనది కాదు. ఆయన 78 ఆర్‌పిఎమ్ గ్రామ్‌ఫోన్ రికార్డులు సుమారు 52వేలు సేకరించి వుంచారు. వీటి సేకరణ ఆయన సుమారు 1975 ప్రాంతంలో 78 ఆర్‌పిఎమ్ రికార్డుల విడుదల ఆపేశాక మొదలు పెట్టానని చెబుతారు. రికార్డ్ కలెక్టర్స్ చాలామంది వున్నారు కానీ ఇలా ఇన్ని వేల రికార్డులు సేకరించింది ప్రపంచంలో తానొక్కణ్ణే అని చెబుతారు రంగారావు. వీటిలో దేశ, విదేశ భాషల రికార్డులున్నాయి. ఆయన దగ్గర సుమారు లక్షా పాతికవేల ట్రాక్స్ అరవైకి పైగా భాషలలో వున్నాయని చెబుతారాయన. ఇందులో కొన్ని భాషలకి లిపి కూడా లేదని చెబుతారు. అలా ఆయన రికార్డ్ కలెక్టర్‌గా రికార్డ్ బ్రేక్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ లోకి కూడా ఎక్కారు.

అయితే ఆయన కలెక్షన్లో కేవలం సినిమా పాటలే కాదు అన్ని రకాల పాటలూ వున్నాయి. 1904లో గ్రామఫోన్ కంపెనీ మొట్టమొదట విడుదల చేసిన రికార్డు దగ్గర నుండి, వివిధ భాషలలో వచ్చిన ప్రయివేట్ రికార్డులు, ప్రముఖుల ప్రసంగాలు, జానపద గీతాలు, కామిక్ రికార్డులు, నాటకాలు, కర్ణాటక సంగీతం, హిందూస్థానీ సంగీతం, గ్రీకూ లాటిన్ సంగీతమూ వున్నాయి. వీటన్నిటినీ పరిశీలించడం వలన కాలక్రమంలో సంగీతంలో వచ్చిన మార్పులు, వాయిద్యగోష్ఠిలో వచ్చిన మార్పులూ ఇవన్నీ తెలుసుకోవడానికి వీలవుతుంది. ఇది రిసర్చ్‌ స్టడీకి ఉపయోగపడే మెటీరియల్ అనడంలో సందేహం లేదు. ఈ నిధి యెవరైనా సరైన వ్యక్తులు వారి ఆధ్వర్యంలోకి తీసుకుని ముందు తరాల వారికి ఉపయోగపడేటట్టుగా తీర్చిదిద్దితే ఎంతో గొప్పపని చేసినవారవుతారు.

ఆయన కాలమిస్ట్‌గా వివిధ ఇంగ్లీషూ తెలుగూ పత్రికలలో సినిమా సంగీతం గురించి, సంగీత దర్శకుల గురించి, సినిమాల గురించీ చాలా విలువైన వ్యాసాలు రాశారు. మొట్టమొదట సినీప్రభ అనే పత్రికలో ‘రికార్డ్ రివ్యూ’ శీర్షికతో వ్యాసాలు రాసేవారు. ఆంధ్ర పత్రికలో 1962 ప్రాంతాలలో ‘సరాగమాల’ శీర్షికతో అప్పుడు మార్కెట్‌లో విడుదలయ్యే గ్రామఫోన్ రికార్డుల సమాచారం గురించి రంగారావుగారు రాసిన కాలమ్ బాగా పాప్యులర్ అయ్యింది. చాలామంది ఆయన్ని ‘సరాగమాల రంగారావు’ అంటారు ఈనాటికీ.

ఈ కాలమ్‌కి స్ఫూర్తి బాబూరావ్ పటేల్ ఫిల్మిండియా పత్రికలో రాసిన ‘రికార్డ్స్ టు బయ్’ కాలమ్ అని చెబుతారు రంగారావు. ఈ కాలమ్‌కి సరాగమాల అనే పేరు పెట్టింది వారు గురువుగా పరిగణించే మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు. వారిని రంగారావుగారికి పరిచయం చేసింది ప్రముఖ చిత్రకారుడు బాపు, ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకటరమణ.

ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ, ప్రజామత, ఆంధ్రజ్యోతి, జ్యోతి, విజయచిత్ర, సినిమా రంగం, వార్త మొదలైన పత్రికలలో సరాగమాల, మానసోల్లాసం, చిత్రరథుని చైత్రయాత్ర, హంసధ్వని, ఆలాపన అనే శీర్షికలతో వ్యాసాలు రాశారు. తెలుగులో రాసిన వ్యాసాలకి శీర్షికగా పెట్టిన పేర్లు కొన్ని వారి గురువుగారు మల్లాది పెట్టినవి. ఆయన పోయాక రాసిన వాటికి ఆయన రాసిన కథల పేర్లు పెట్టుకున్నారు రంగారావు.

ఇంగ్లీషులో స్క్రీన్ పత్రికలో ‘ది సౌండ్స్ ఆఫ్ మ్యూజిక్’ శీర్షికతో హిందీ సినిమాల గురించి రాసిన వ్యాసాలు రాయడానికి చాలా కష్టపడేవాడినని, అవి తనకు దేశవ్యాప్తంగా చాలా గుర్తింపు తెచ్చిపెట్టాయనీ చెబుతారాయన. ఇంకా ఆయన హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, మూవీలాండ్, శృతి, మద్రాస్ మెయిల్ మొదలైన పత్రికలలో ఇంగ్లీషులో వ్యాసాలు రాశారు.

పబ్లిషర్‌గా రంగారావుగారు ‘ఆనందమోహన కావ్యమాల’ పేరిట ప్రచురించిన పుస్తకాలు:

  • కందుకూరి రుద్రకవి రాసిన జనార్దనాష్టకం. ఇది ఆరుద్ర ముందుమాటతో, బాపు అద్భుతంగా వేసిన అష్టవిధ నాయికలతో సర్వాంగ సుందరంగా, అతి నాణ్యంగా ముద్రించబడింది.
  • ఘంటసాల విదేశ పర్యటన సందర్భంగా వేసిన పుస్తకం – భువన విజయం.
  • ఆరుద్ర రాసిన సినీ పాటల సంకలనం కొండగాలి తిరిగింది. ఇందులో పాటని పల్లవిని బట్టి లొకేట్ చేయవచ్చు, సినిమా పేరుని బట్టి లొకేట్ చేయవచ్చు, సంవత్సరాన్ని బట్టి లొకేట్ చేయవచ్చు. అలా రూపొందించారు రంగారావు.
  • రంగారావుగారే ఇంగ్లీషులో రాసి ప్రచురించారు – ఆరుద్ర బయోగ్రఫీ.

ఆయన వార్త పత్రికలో రాసిన ‘ఆలాపన’ కాలమ్ నుండి వంద వ్యాసాలను తీసుకుని పుస్తకంగా బదరీ పబ్లికేషన్స్ తరఫున నేను ప్రచురించాను. ఈ పుస్తక ప్రచురణలో సాయం చేసినవారు డాక్టర్ గురవారెడ్డి, నవోదయ రామ్మోహనరావుగార్లు. పుస్తకానికి అనుబంధంగా ఒక 60 పేజీల ఇంటర్‌వ్యూ ఎవరూ చేయడానికి ముందుకి రాకపోతే నేనే చేశాను. దానికి చాలా మంచి పేరొచ్చింది. బాపూ రమణలు కూడా మెచ్చారు. అప్పటిదాకా ఏదో ఒకమూల కూర్చుని నా మానాన నేను ఏదో పుస్తకాలు చదువుకునేదానిని, నన్ను సాహితీ లోకం గుర్తించింది. కొంతమంది పరిచయం జీవితంలో అనూహ్యమైన మలుపుకి కారణమవుతుందనే దానికి నేనే ఉదాహరణ.

ఈ విషయంలో రంగారావు గారికి నేను తీర్చలేని ఋణగ్రస్తురాలిని.

నా స్నేహితురాలు డాక్టర్ శశికళ నేను వేయగా మిగిలిన వందవ్యాసాలూ మరో ఆలాపన అనే పుస్తకంగా వేసింది. ఆ తర్వాత, మోహిని పత్రికలోను, విజయచిత్రలోనూ వచ్చిన వ్యాసాలూ కలిపి రాగమాలిక అనే పుస్తకంగా వేసింది. రంగారావు నన్ను ప్రథమ పబ్లిషరిణి అనీ ఆమెను ద్వితీయ పబ్లిషరిణి అనీ పిలుస్తారు.

ఇంక ఆయన చేసిన కాసెట్లూ ఎల్.పి.ల గురించి చెప్పాలంటే చాలా ఉంది.

ఆయన కొన్ని సంక్షిప్త శబ్దచిత్రాలు రూపొందించారు. అంటే మూడుగంటల సినిమాని గంటకి కుదించి కాసెట్లుగా, ఎల్. పి.లుగా విడుదల చేశారన్న మాట. అవి వింటుంటే చక్కగా మొత్తం సినిమా విన్నట్టుంటుంది. మరి ఎలా ఎడిట్ చేశారో తెలియదు. సినిమా ఎక్కడా కుదించినట్టు అనిపించదు. మొత్తం సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది, అదీ విశేషం.

ఇంతకీ ఆ చిత్రాలు ఏవంటే – మిస్సమ్మ; మల్లీశ్వరి; విప్రనారాయణ; శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం; షావుకారు; శ్రీకృష్ణపాండవీయం; శారద (హిందీ); సత్య హరిశ్చంద్ర (కన్నడ).

శారద (హిందీ) ఎల్. పి. చూసి ఎల్. వి. ప్రసాద్, షావుకారు ఎల్. పి. చూసి బి. నాగిరెడ్డి, హరిశ్చంద్ర ఎల్. పి. చూసి కన్నడ రాజ్ కుమార్ మెచ్చుకున్నారని చెబుతూ ‘ఇంక నాకు వేరే అవార్డ్ లెందుకూ?’ అంటారు రంగారావు.

పాటలు పాడగల పాతతరం నటీనటులను యెన్నుకుని ‘అలనాటి అందాలు’గా ఎల్. పి.లు రిలీజ్ చేశారు. బాలసరస్వతి, టంగుటూరి సూర్యకుమారి, భానుమతి, కన్నాంబ, నాగయ్య – వీరందరి పాటలూ ‘అలనాటి అందాలు’లో వినడం ఒక అనుభవం.

ఇవికాక మరికొన్ని ఎల్. పి.లు చేశారు అవి – శ్రీకృష్ణ శరణం మమ; శ్రీరామనామం శ్రీకృష్ణగానం; చిటారు కొమ్మన మిఠాయి పొట్లం-హాస్యగీతాలు; నాపేరు సెలయేరు -ఎల్లారీశ్వరి పాటలు.

2000వ సంవత్సరంలో తెలుగు ఫిల్మ్ మిలీనియం పేరిట ఆయన పొందుపరిచిన మూడుగంటల సినీ సంగీతం అత్యంత అపురూపమైనది, అరుదైనదీ. ఆ మూడుగంటల వ్యవధిలో ఆయన 45 అరుదైనవి, వైవిధ్యమైనవీ అయిన కంఠాలు వినిపించడం విశేషం.

డాన్సర్‌గా రంగారావుగారు:

డాన్సర్‌గా రంగారావుగారి గురించి చెప్పాలంటే – చిన్ననాడు ఆయనలో నృత్యం పట్ల అనురక్తి కలిగించింది బొబ్బిలి రాజాస్థాన నర్తకి గడ్డిభుక్త సీతారామ్ అని చెబుతారు. అంతేకాదు, దేశాది మధ్యాది తాళాల గురించి వివరించిన ‘కళావర్ రింగ్’ అని పిలవబడే సరిదె లక్ష్మీనరసమ్మనీ మరిచిపోరు.

ఆయన వళ్లూరు రామయ్య పిళ్లై, కళానిధి నారాయణన్ మొదలైన వారి వద్ద నాట్యంలో శిక్షణ పొందారు. గత యాభైరెండు సంవత్సరాల నుండీ కృష్ణ జయంతికి కార్వేటి నగరంలోను, ఆషాఢ శుధ్ధ సప్తమికి శ్రీనివాస మంగాపురంలోనూ నృత్య నివేదన చేస్తూ వస్తున్నారు.

ఆయనకి అన్నమయ్య పదాలు, క్షేత్రయ్య పదాలు, సారంగపాణి పదాలు, జావళీల మీద మక్కువ ఎక్కువ. ఆయన తనని తాను ‘అన్నమయ్య పద సేవకుడిని’ అని చెప్పుకుంటారు. అన్నమయ్య పదాలలో లేనిది లేదు రానిది రాదు అంటారు. ఎంతోమంది నర్తకీమణులు రంగారావుగారి దగ్గర పదములు, జావళీల అభినయం గురించి సలహాలు తీసుకోవడం, సందేహాలు తీర్చుకోవడం ద్వారా తమ నృత్యాన్ని మెరుగుపరుచుకోవడం చేస్తూ వుంటారు.

రంగారావుగారి వ్యక్తిత్వం:

ఇన్ని కళలు తెలిసిన వి. ఎ. కె.గారి వ్యక్తిత్వాన్ని గురించి కూడా నాకున్న పరిచయంతో నేను గమనించిన విషయాలు చెబుతాను. మాట కఠినమే గానీ మనసు సున్నితం. అందరినీ విమర్శిస్తారే గాని, తననెవరైనా చిన్న విమర్శ చేసినా తట్టుకోలేనంత సున్నిత హృదయం ఆయనది. తన తప్పేదయినా వుందని తెలిస్తే తలవంచి వినమ్రంగా ఒప్పుకునే స్వభావం. ఇతరుల గురించి తనకేదైనా అభ్యంతరకరంగా తోస్తే వాళ్ల మొహం మీదే చెబుతారు కానీ వాళ్ల వెనక వ్యాఖ్యానించరు. ఇది నాకు చాలా నచ్చిన గుణం. అందరూ అలా వుండలేరు, కష్టం.

ఒక్క చూపులోనే ఒకవ్యక్తిని అంచనా వేసి అభిమానించడమో, దూరం పెట్టడమో చేయగల సూక్ష్మగ్రాహ్యత. అలా ఆయన చూడంగానే అభిమానించింది మా అమ్మగారిని, నన్ను కాదు. చతురంగా సంభాషించడం ఇష్టం. ఎంత సేపయినా తనతో సమానంగా మాట్లాడగలిగే వారుంటే మాట్లాడగలరు. ఆ సంభాషణ వినేవారికి కూడా ఉల్లాసం కలిగిస్తుంది.

ప్రాక్టికల్ జోక్సంటే ఇష్టం. ఎవరైనా దేన్నయినా చూసి భయపడతారని తెలిసిందా ఇక వాళ్లు దొరికిపోయినట్టే. ఉదాహరణకి వాళ్ల వదినగారు లీలా బీడీప్రియకు (బీడీప్రియ ఆయన పెట్టిన పేరే! పాపం బీడీలకీ ఆమెకీ ఏ సంబంధమూ లేదు) పాకే పురుగులంటే అసహ్యమని, భయమనీ తెలిసి, ఆవిడని ఏడిపించడానికి వాటిని పట్టుకుని ఆవిడ ఆదమరిచి వుండగా ఒక ఆకులో చుట్టి తాంబూలంగా ఇవ్వడమో, దగ్గరగా తీసికెళ్లడమో చేసి ఆవిడ భయపడితే చూసి సంతోషిస్తారు. పైకి మళ్లీ ఏ భావమూ కనిపించనివ్వరు. పరమ సీరియస్.

ఒకసారి మద్రాస్‌లో ఆయనింట్లో ఏదో విషయం గురించి చర్చిస్తుంటే, ఎవర్నో భయంకరమైన మాస్క్ వేసుకుని వెనకనుండి హఠాత్తుగా పెద్దకేక వేసి భయపెట్టేట్టుగా నియమించారు. నాకు ఆయన ప్రాంక్స్ తెలుసు కాబట్టి నిర్భయంగా కూచున్నా.

ఆయన దగ్గరున్న బ్రీఫ్‌కేసులో రకరకాల జంతువులు – కప్పలు, బల్లులు, పాములు వుంటాయి ప్లాస్టిక్ బొమ్మల రూపంలో. ఎవరైనా పెట్టె పట్టుకోబోతుంటే పెద్దగా భయపడేటట్టుగా అరుస్తారు ‘ముట్టుకోవద్దు’ అని. అంతా వుత్తదే!

విలక్షణమైన ఆహారపు అలవాట్లు ఆయనవి. ఐస్ క్రీములన్నా, చాక్లెట్లన్నా ఇష్టం. కొన్ని కలగలుపు కూరలు కోరి వండించుకుంటారు. ఏదైనా చాలా మితంగానే తింటారు. ఒకసారి ఆయన్ను కలవడానికి విజయవాడ వెళుతూ ‘ఏం కావాలి’ అని అడిగితే ‘పచ్చి మొక్కజొన్న పొత్తులు కావాలి. ఎలా వుండాలంటే జి. వరలక్ష్మి బుగ్గలంత మెత్తగా’ వుండాలన్నారు. నేను మాత్రం తక్కువ తిన్నానా? మొక్కజొన్న పొత్తులు తీసుకుని, ఆ తెల్లని రేకుల మీద జి. వరలక్ష్మి బుగ్గలు అని రాసి తీసికెళ్లాను. ‘చూడండి ఎలా రాసిందో’ అని పక్కవాళ్లకి చూపెట్టారు.

ఆయనొక డాగ్ లవర్. కుక్కలంటే అంతులేని ప్రేమ. పక్షులన్నా, జంతువులన్నా కూడా. ఆయన కుక్కలకి పెట్టే పేర్లు కూడా విచిత్రంగా వుంటాయి: పదమూడు, కొండమేక, దొంగ, మీగడ ఇలా.

ప్రయాణాలన్నా, కొత్తప్రదేశాలన్నా, కొండలూ గుట్టలూ ఎక్కడమన్నా, ప్రాచీన ఆలయాలను సందర్శించడమన్నా, శాసనాలూ శిల్పాలూ మొదలైన వాటిని పరిశీలించడమన్నా అంతులేని ఆసక్తి.

మల్లాది రామకృష్ణ శాస్త్రి ఆయన గురువు, ఆరుద్ర ఆయన మార్గదర్శి. తనకిష్టమైన, తానారాధించే మల్లాది రామకృష్ణ శాస్త్రిలాంటి మహానుభావుల ప్రసక్తి వస్తే నోటమాట రాదు. డగ్గుత్తిక పడిపోతుంది, కన్నీటిప్రవాహానికయితే అంతే వుండదు. వారి కుటుంబానికి చెందిన ఎవరి పట్లయినా అదే అభిమానం. బాలాంత్రపు రజనీకాంతరావుగారంటే అత్యంత భక్తి భావం. ఆయన శతజయంతి సభలో ఈయన చేసిన సాష్టాంగ దండప్రణామానికి స్టేజీ చాల్లేదు. ఇక ఆయన పట్టుదల గురించి చెప్పేదేముంది, ఎవరూ ఆయన చేత ఏ పనీ చెప్పి చేయించలేరు, ఆయనంతట ఆయనకి తోచి చేయాలే తప్ప.

ఇన్ని విశేషాలూ విశిష్టతలూ కలబోసిన అపర కృష్ణభక్తుడయిన ఆయనను తూచే తులసి దళాలు రెండే – ప్రేమా భక్తీ.

అయితే నాదొక విన్నపం. ఆయనలాంటి విజ్ఞాన భాండాగారాన్ని మనం సరిగా సద్వినియోగం చేసుకుంటున్నామా? ఆయన కాలమ్స్ రాయడం 2005లో ఆపేశారు. ఆయన దగ్గరున్న సమాచారమంతా ప్రజలకు చేరే దారేది? ఇప్పుడు ఒక వేళ కాలమ్స్ రాసినా వేసుకునే పత్రికలేవీ? వేసినా చదివే నాథుడేడీ? ప్రస్తుతం వున్న డిజిటల్ యుగంలో ఆయన వీలైనన్ని వీడియోలు, ఆడియో బుక్స్ చేసి తన దగ్గరున్న సమాచారాన్ని నిక్షిప్తం చేస్తే, కావలసిన వారికి ఎంతో ఉపయోగపడుతుందని నా ఊహ. విజ్ఞులు ఆలోచించ వలసిందని నా మనవి.

ఈ సన్మానం చేసేది ఆయనకే అయినా మా బోటి అభిమానులందరికీ ఇది చాలా సంతోషకరమైన విషయం. కొండని అద్దంలో చూపే సాహసం చేశాను. ఎంతవరకూ కృతకృత్యురాలినయ్యానో తెలియదు.

నాకీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తప్పులేమన్నా వుంటే మా మద్రాస్ తాతయ్య క్షమించాలి.

(ఆగస్టు 3, 2022న గుంటూరు పట్టణంలో వి ఏ కే రంగారావుగారిని బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి విశిష్ట సేవా పురస్కారముతో గౌరవించిన సందర్భంలో చేసిన ప్రసంగానికి వ్యాస రూపం.)


(అంతర్జాల పత్రిక ఈ మాటలో ప్రచురితం- 

https://eemaata.com/em/issues/202209/29474.html)

Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము