విలక్షణ స్వరం---పిఠాపురం


 "అయ్యోయ్యో చేతిలో డబ్బులు పోయెనే జేబులు ఖాళీ ఆయెనే"-----కులగోత్రాలు

"మా ఊళ్లో ఒక పడుచుంది దయ్యమంటే భయమన్నది
ఆ ఊళ్లో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు."----అవేకళ్లు
"సోడా సోడా ఆంధ్రా సోడా గోలీ సోడా జిల్ జిల్ సోడా
సోడా తాగు తెలుగోడా చల్లని సోడా,దీని మహిమ చెప్ప లేడు దేవుడు కూడా"-----లక్ష్మీనివాసం
"సైకిల్ పై వన్నెలాడి పోతున్నదీ రయ్యిమని పిట్టలాగ పోతున్నది"----పిన్ని
"పొరుగింటి మీనాక్షమ్మను చూశారా వాళ్ల ఆయన చేసే ముద్దుముచ్చట విన్నారా"---సంబరాల రాంబాబు
"మాయా సంసారం తమ్ముడూ నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడూ"---ఉమా సుందరి
"అరె నిసగమపా ఈ లోకం మోసం పమగరిసా"----జయసింహ
ఈ పాటలన్నిటిలో వినపడే ఒక ప్రత్యేకమైన గొంతుని గుర్తుపట్టారా?అది పిఠాపురం నాగేశ్వరరావుది.
మనకున్న నేపథ్య గాయకులలో విలక్షణమైన, ప్రత్యేకమైన స్వరం పాతర్ల గడ్డ నాగేశ్వరరావుది,ఇలా అంటే యెవ్వరికీ తెలియదు,పిఠాపురం అంటేనే తెలుస్తుంది.ఊరి పేరునే ఇంటి పేరు చేసుకున్న గాయకుడు. నిజానికి యే గొంతు కా గొంతు ప్రత్యేకమైనదే,యే గొంతులో వుండే అందం ఆ గొంతులో వుంటుంది. అయితేఇంతకీ యేమిటా విలక్షణత?యేమిటా ప్రత్యేకత అంటే,స్థిరమైన ,మంచి రేంజ్ వున్న గొంతు,కంచు లాగా ఖంగున మోగదు,అలా అని మెత్తగా ధ్వనించదు.హీరో పాటలకు కూడా సూటయ్యే గొంతయినా యెందుకో హుషారు పాటలూ,చలాకీ పాటలూ,కమెడియన్ పాటలకే పరిమితం చేసింది చిత్రసీమ
ఈ చిత్రసీమ బహు విచిత్రమైనది,ఒక్కొక్కరికీ ఒకోముద్ర వేస్తుంది, హిట్టయిన పాటలని బట్టి,హీరోలకి ఇతనే పాడాలంటుంది,కమెడియన్లకి ఇతనే పాడాలంటుంది.ఏం హీరోలకి పాడే వాడు కామెడీ పాటలు పాడలేడా?మహ్మద్ రఫీ ప్యాసాలో గురుదత్ కి "హమ్ ఆప్ కె ఆంఖోంమే "అని పాడి ,అదే సినిమాలో జానీవాకర్ కి "సర్ జో తెరా చకరాయే " పాడి యెంత రక్తి కట్టించాడు,మన ఘంటసాల గారు మాత్రం "మాయా బజార్ "లో "నీవేనా నను తలచినది" అని పాడి,అదే సినిమాలో రేలంగి కి "సుందరి నీ వంటి దివ్య స్వరూపము "అని పాడితే యెంత హిట్టయ్యింది,అలాగే కామెడీ పాటలు పాడేవాడు హీరో పాటలూ పాడగలడు,మొదట్లో పిఠాపురం హీరోకి ప్లేబాక్ సింగర్ గానే పరిశ్రమలో ప్రవేశించాడు ,కానీ అతను పాడిన చలాకీ పాటలూ,కామెడీ పాటలూ హిట్టవ్వడం వలన అతనికి కామెడీ సింగర్ ముద్ర పడిపోయింది
ఇందులో కూడా కొంతమంది నటులకి కొన్ని గొంతులు సూటవుతాయని ప్రేక్షకులూ,దర్శక నిర్మాతలూ కూడా భావిస్తారు ,అలా అతను ఎక్కువ పద్మనాభానికి తన గొంతు ఎరువిచ్చే వాడు,ఆ తర్వాత రేలంగికీ,రాజబాబుకీ,రమణా రెడ్డికీ ,చలానికీకూడా పాడాడు.మాధవపెద్ది సత్యంతో కలిసి హాస్య యుగళాలు ఎక్కువ పాడాడు.బయట కూడా ఇద్దరూ స్నేహంగా,జంటగా కలిసి తిరిగే వారు కలిసి కచేరీలు చేసేవారు. ఆ కచేరీల్లో భాగంగా 1970ప్రాంతాల్లో పామర్రులో మా హైస్కూల్ కి వచ్చి పాట కచేరీ చేయడం నాకింకా గుర్తే,నేనప్పుడు యెనిమిదో క్లాసో తొమ్మిదో క్లాసో చదువుతున్నాను.
పిల్లలందరం వాళ్ల పాటలు చాలా యెంజాయ్ చేశాం,మాధవపెద్ది పద్యాలూ,పిఠాపురం పాటలూ ఇంకా మర్చిపోలేదు ,ముఖ్యంగా పిఠాపురం పాడిన "పెళ్లీ ఆహాహా పెళ్లీ "అప్పటి వరకూ వినలేదు నేను ,ఈ పాట గురించి తర్వాత చెబుతా.
అసలు పిఠాపురంలో వుండే పదహారేళ్ల పిల్లవాడికి,ఈ సినిమా చీమ యెలా కుట్టిందీ,?గాయకుడవ్వాలని యెందుకనుకున్నాడు,?అందుకు యెలాంటి ప్రయత్నాలు చేశాడు?ఈ ప్రశ్న లన్నింటికీ సమాధానాలు వెతుకుతూ అతని జీవన ప్రయాణం గురించి తెలుసుకుంటే చాలా విచిత్రంగానూ ,ఆశ్చర్యంగానూ అనిపిస్తుంది.
అతను 1930 మే 5 న పిఠాపురంలో జన్మించాడు ,తల్లిదండ్రులు పాతర్లగడ్డ విశ్వనాథం,అప్పాయమ్మ. తండ్రి టైలర్ గా పనిచేస్తూ,నాటకాలలో నటిస్తూ వుండేవాడు,పిఠాపురం మహారాజా వారు కూడా ఈ నాటకాలలో పాల్గొంటూ వుండేవారట.పాటలు పాడటం మీద ప్రేమ తండ్రివల్లనే కలిగింది,తానుకూడా చిన్నతనం నుండీ చెలికాని భావనారాయణ గారి సారథ్యంలో నడుస్తున్న "నవ్య కళాసమితి" లో చేరి ,నాటకాలలో వేషాలు వేస్తూ,సొంతగా పాడుకోలేని వారికి ప్లేబాక్ పాడుతూవుండేవాడు.
ఎక్కువగా బాలాంత్రపు రజనీకాంతరావు గారు రచించి,ట్యూన్ చేసిన "దేవదాస్ " నాటకంలో పాటలు పాడుతుండే వాడు ."నీటితో ఆరేది కాదే ఈదప్పి"అనే పాటా,"మరునిముసమే మనదో కాదో మధువానవో మధుపా"అనే పాట ,ఎవరడిగినా తడుముకోకుండా పాడే పాటలు.అవే కాకుండా హిందీలో పంకజ్ మల్లిక్ ,కె.ఎల్ సైగల్ పాటలూ,తెలుగులో నాగయ్య గారి పాటలు దంచి పారేస్తున్న నాగేశ్వరావుని చూసి అతని స్నేహితులు "నీ స్థానం ఇక్కడ కాదు సినిమాల్లో"అని నూరి పోశారు.
ఆ ప్రోత్సాహంతో స్కూలు ఫీజ్ కోసం ఇచ్చిన పదిరూపాయలూ జేబులో వేసుకుని,ఇంట్లో బిక్కవోలులో స్నేహితులని కలిసి రెండురోజుల్లో వస్తానని అబధ్ధం చెప్పి మద్రాసు మెయిలెక్కేశాడు ,అప్పటికి తొమ్మిదో క్లాస్ చదువుతున్న పాతర్లగడ్డ నాగేశ్వరరావు.
రైలుటిక్కెట్టు ఆరు రూపాయలు పోను ,చేతిలో నాలుగు రూపాయలతో చెన్నపట్నం చేరుకున్నాడు,అయితే దాదాపు నలభై యేళ్లు అక్కడే నిలబడేట్టు చేశాయా నాలుగు రూపాయలు.
తేనాంపేటలో బంధువుల ఇంటచేరి సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు.అప్పుడే కోనప్రభాకరరావు,లక్ష్మీరాజ్యం హీరో హీరోయిన్లుగా "మంగళ సూత్రం -- ఎక్స్ క్యూజ్ మీ --ఇది మాకథ"(ఈ మూడుపేర్లూ ఒకసినిమావే)అనే సినిమా(1946) తయారవుతోంది.దానికి హీరో,నిర్మాత,దర్శకుడూ మూడూ కోనప్రభాకరరావే,(ఆయన తర్వాత రాజకీయాలలో ప్రవేశించి గవర్నర్ గా కూడా పనిచేశారు),మ్యూజిక్ డైరెక్టర్ మునుస్వామి.ఆ సినిమాలో గాయకుల కోసం వెతుకుతుంటే వాళ్లకి నాగేశ్వరరావు తగిలాడు.అతన్ని స్టుడియోకి పిలిచి యేవైనా రెండు పాటలు పాడమన్నారు,అతను వెంటనే ఖయ్యిమని పంకజ్ మల్లిక్ ది"చలే పవన్ కీ చాల్ "అనేపాట,రజనీకాంతరావు గారిది "నీటితో ఆరేది కాదే ఈ దప్పి "అనే పాట పాడి వూరుకున్నాడు.వాళ్లు చాలా సంతోషించి అతనికి వాళ్ల కంపెనీ గాయకుడుగా నెలకి యాభై రూపాయల జీతమిచ్చి ,ఆ సినిమాలో హీరోకి అతని చేత పాటలు పాడించారు.అప్పుడే అతని పేరు పిఠాపురం నాగేశ్వరరావు గా మార్చారు.
అతను మొదటి సారిగా పాడిన పాట "హాయిగా పాడవే కోయిల" అనే పాట,అదికాక జిక్కితో "మామయ్యొచ్చాడే"అనే యుగళ గీతం కూడా పాడాడు.
ఈ పాట కార్మన్ మిరిండా పాడిన "మ్మా మ్మా యు కేరో "అనే లాటిన్ అమెరికన్ పాట ట్యూన్ ఆధారంగా చేసింది,ఈ విషయం వి.ఎ.కె రంగారావు గారు "ఆలాపన" పుస్తకం కోసం నాకిచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు.
ఆ తర్వాత వరసగా అవకాశాలు రాసాగాయి,ఇతని పాట విన్న గూడవల్లి రామబ్రహ్మం గారు "పల్నాటి యుధ్ధం"లో అవకాశం ఇచ్చారు.
కె.యస్ .ప్రకాశరావు గారి "ద్రోహి" లో--"నవ్వనైన నవ్వరాదే ,నాతో మాటలైన ఆడరాదె బుల్ బుల్ "అనే పాట పెండ్యాల దర్శకత్వంలో పాడారు.
అంజలీ పిక్చర్స్ లో ఆది నారాయణరావు గారి దర్శకత్వంలో "పరదేశి"లో అక్కినేని కి ప్లేబాక్ పాడారు,"నేనెందుకు రావాలి ఎవరిని చూచుటకు"అనే డ్యూయట్ లో జిక్కితో గొంతు కలిపారు.అలాగే "దాసి"లో యన్ .టి. ఆర్ .కి కూడా ప్లేబాక్ పాడే అవకాశం వచ్చింది.
తర్వాత "ధర్మాంగద,మాయలమారి,మంత్రదండం,వయ్యారి భామ "మొదలైన చిత్రాలలో పాటలు పాడారు,"మాయల మారి "లో యస్ .వరలక్ష్మితో కలిసి పాడారు,రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో .అయితే ఆయనకి మంచి బ్రేక్ ఇచ్చిన పాట ,చలాకీ పాటలు మంచి హుషారుగా పాడగలడని నిరూపించిన పాట "సంఘం "చిత్రంలో(1954) "పెళ్లీ ఆహాహా పెళ్లీ" అనే పాట
ఈ చిత్రాన్ని ఎ.వి. యమ్ .సంస్థ తెలుగు,తమిళ,హిందీ భాషల్లో నిర్మించింది.తెలుగులో పిఠాపురం "పెళ్లీ పెళ్లీ" అని పాడితే,తమిళంలో చంద్రబాబు" కల్యాణమ్ కల్యాణమ్ " అని పాడారు.హిందీలో అదే పాట "షాదీషాదీ" అని పాడటమే కాక నటించారు కూడా కిషోర్ కుమార్ .ఇక్కడ ఇంకో విశేషమేమంటే తెలుగు,తమిళాల్లో ఈ పాటలో నటించింది ప్రఖ్యాత వైణికుడు యస్ .బాలచందర్ .
అలా1950 ప్రాంతాలనుండీ హీరో పాటలకి ఘంటసాల,కామెడీ పాటలకి పిఠాపురం,మాధవపెద్ది స్థిరపడిపోయారు.
దాదాపు సంగీత దర్శకులందరి దగ్గరా పాడినా
తనని ఎక్కువ అవకాశాలిచ్చి ప్రోత్సహించిన వారిలో
మొదటగా సి.ఆర్ .సుబ్బరామన్ పేరు చెబుతారు పిఠాపురం.
సుబ్బరామన్ దర్శకత్వంలో "రూపవతి ,ప్రేమ,స్త్రీ సాహసం,వరుడు కావాలి "సినిమాలలో పాడారు
"రూపవతి"లో హీరోకి ప్లేబాక్ పాడితే "ప్రేమలో " సి.యస్ .ఆర్ .కి "ప్రపంచమంతా ఝూటా "అనే పాట పాడారు."వరుడు కావాలి"లో భానుమతి,ఘంటసాల లతో కలిసి "అందచందాల ఓ జాబిలి "అనే పాట పాడారు.
సుబ్బరామన్ తర్వాత తనని బాగా ప్రోత్సహించిన వారు ఘంటసాల అని చెప్పారు ఒక ఇంటర్వ్యూ లో.
తాను సంగీత దర్శకత్వం వహించే సినిమాలలో నిర్మాతా,దర్శకులని ఒప్పించి తనని పాడమన్నా సరే పాడకుండా ఈ పాట పిఠాపురం పాడితేనే బాగుంటుందని చెప్పి,"తమ్ముడూ పాట బాగా పాడు నాయనా ,నేను వాళ్లని నువ్వు పాడితేనే బాగుంటుందని చెప్పి ఒప్పించాను"అని చెప్పేవారనీ,అందరికీ వారి వారి గొంతులకి తగ్గట్టుగా తలోపాట ఇచ్చేవారనీ చెప్పారు.ఆయన దర్శకత్వంలో
"పాతాళభైరవి"-----"నేను రానంటే రానే రాను"అనే పాట పి.వి.సరస్వతి అనే ఆమె తో కలిసి పాడారు,తెరమీద నర్తించింది---పసుమర్తి కృష్ణమూర్తి,సావిత్రి(తొలి పరిచయం)
"చంద్రహారం"----మనం యేంచేస్తే అది ఘనకార్యం--పిఠాపురం,జోగారావు
"మాయాబజార్ "----రక్షలు రక్షలు పాదరక్షలు(బృందగానం)
""సుందరి నీవంటి దివ్యస్వరూపము"---ఈ పాట కూడా పిఠాపురమే పాడారు అయితే దర్శకుడు కె.వి.రెడ్డికి నచ్చలేదు ,అందువలన తనకి ఇష్టం లేక పోయినా దానిని తొలగించి మళ్లీ తానే స్వయంగా పాడారు ఆ చిత్ర సంగీత దర్శకుడు ఘంటసాల .
"-శాంతినివాసం"-----"చక్కనిదానా చిక్కని దానా ఇంకా అలకేనా "( దిల్ దేకె దేఖో అనే హిందీ పాటకి కాపీ)
పరమానందయ్య శిష్యుల కథ----పరమగురుడు చెప్పిన వాడు పెద్దమనిషి కాదురా (బృందగానం)
శభాష్ రాముడు------"హల్లో డార్లింగ్ మాట్లాడవా "---జమునా రాణి తో కలిసి(ఈ పాట యే దిల్ హై ముష్కిల్ జీనా యహా అనే హిందీ పాటకి కాపీ.హిందీలో రఫీ ,లతా పాడారు .సినిమా పేరు సిఐడి,ఓపి నయ్యర్ సంగీత దర్శకుడు)
మిగతా సంగీత దర్శకుల గురించి కూడా మచ్చుకు ఒకటో ,రెండో పాటలు చెప్పుకుందాం బాగా పేరొచ్చినవి
అశ్వత్థామ దర్శకత్వంలో ---"మాయా సంసారం తమ్ముడూ"(ఉమాసుందరి)
రాజేశ్వరరావు ---"బదిలీ అయిపోయింది భామామణి ప్రియ భామామణి"(చరణదాసి).ఈయన దర్శకత్వంలో ప్రయివేట్ పాటలు కూడా పాడారు"ప్రభూ మరల పలకవేలా "అనేది అందులో ఒకటి.
పెండ్యాల నాగేశ్వరరావు----"పదవే పోదాము గౌరీ"(వెంకటేశ్వర మహాత్యం)
యం.యస్ .విశ్వనాథన్ "మాగోపి "సినిమాలో మంచి హిందూస్థానీ పోకడలున్న పాట "లేదోయి ముక్తి "అని పాడించారు చాలా బాగుంటుంది.
టి.వి.రాజు "జయసింహ"లో రెండు మంచి పాటలు పాడించారు ,"నిసగమపా ఈ లోకం మోసం పమగరిసా", "నడియేటి పై నడుచు పడవలా నా పడుచు గుడికాడ బావికే నీటికొస్తాది"
మాధవపెద్ది సత్యం ,పిఠాపురం తర్వాతే చిత్ర సీమ కొచ్చినప్పటికీ "కులగోత్రాలు "లో ఇద్దరూ కలిసి "అయ్యోయ్యో చేతిలో డబ్బులు పోయెనే "పాట పాడినప్పటినుండీ వాళ్లిద్దరూ స్నేహంగా వుండేవారు ,అసలు ఆపాట రికార్డింగ్ కి వెళ్లేటపుడు కారుకి పెద్ద యాక్సిడెంటయ్యి ,ఇద్దరూ క్షేమంగా బయటపడి రికార్డింగ్ కి వచ్చారట,చూడూ ఈ పాట పెద్ద హిట్టవుతుంది అన్నారట సత్యం ,ఆయనమాటే సత్యమయింది.
ఆ తర్వాత ఇద్దరూ "అసాధ్యుడు "లో పాడిన "చవటాయను నేను "కూడా పెద్ద హిట్టు,ఈ పాటలో వీరితో కలిసి యస్ .జానకి పాడింది
ఘంటసాల తో కలిసి,వేదా దర్శకత్వంలో "అవే కళ్లు "చిత్రంలో పాడిన "మా ఊళ్లో ఒక పడుచుంది దయ్యమంటె భయమన్నది "కూడా బాగా హిట్టయ్యింది --ఈ పాటని వేరెవరి చేతో పాడిస్తామంటే ,ఘంటసాల పిఠాపురం అయితేనే బాగుంటుందని చెప్పారట.
గాయనుల్లో ఆయనెక్కువ డ్యూయట్లు స్వర్ణలతతో కలిసి పాడారు----"మాయదారి కీచులాట మామధ్య వచ్చింది రాయబారం చెయ్యవే తడికో తడిక"--చిత్రం "అత్తా ఒకింటి కోడలే"
దాగుడు మూతలు---"--డివ్విడివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిష్టం"---పిఠాపురం,స్వర్ణలత---కె.వి.మహదేవన్ .
జమునారాణి తో--టక్కరి దానా టెక్కుల దానా---విమల-----యస్ .యమ్ సుబ్బయ్య నాయుడు
జిక్కితో "ఇండియాకి రాజధాని ఢిల్లీ నా గుండెల్లో ప్రేమరాణి లిల్లీ"----అక్కాచెల్లెళ్లు సినిమా.
సుశీల----పొరుగింటి మీనాక్షమ్మను చూశారా---సంబరాల రాంబాబు
పి.లీల---పెళ్లిచేసి చూడు --ఎక్కడోయీ ప్రియా ప్రియా
బి.వసంత "మా కిట్టయ్య పుట్టిన దినము"----వాగ్దానం
ఎల్ .ఆర్ .ఈశ్వరి తో కూడా మంచి పాటలున్నాయి---
"కొప్పు చూడు కొప్పందం చూడు"---మానవుడు దానవుడు---అశ్వత్థామ
రచయితల్లో సదాశివ బ్రహ్మం,సముద్రాల ,ఆరుద్ర ఇంకా యెంతోమంది రాసిన పాటలు పాడినా కొసరాజు గారు రాసినవి చాలా ఎక్కువ పాటలు పాడారు
ఆయన తెలుగులోనే కాకుండా కన్నడం,తమిళం ,మళయాళం లోకూడా పాడారు ,హిందీ "చంద్రలేఖ"లో పాడారు.కానీ కాలమహిమ 1970 ప్రాంతాల కొచ్చేటప్పటికి చిత్ర పరిశ్రమలో మార్పులొచ్చాయి,పాటలు తగ్గిపోసాగాయి.
కొన్నాళ్లు మాధవపెద్దితో కలిసి పాటకచేరీలు చెయ్యడం,నాటకాలెయ్యడం కూడా చేశారు.
విధి చిన్న చూపు చూసింది1975లో ఆయన భార్య ,చిన్న కుమారుడు ఇద్దరూ కాలంచేశారు .ఇక మద్రాసులో వుండలేకపోయారు.ఆయన పాడిన చివరి పాట "బొమ్మరిల్లు "సినిమాలో(విజయ బాపినీడుసినిమా )"చల్లని రామయ్య చక్కని సీతమ్మ"
తన సొంత ఊరైన పిఠాపురం చేరుకుని భార్యకట్టించిన సొంత ఇంట్లో వుంటూ అడపాదడపా యెవరైనా టీ.వీ.కీ రేడియోకీ పిలిస్తే వెళ్లి మాట్లాడే వారు,ఇంకా అవకాశ మొస్తే పాడాలని వుందనే వారు,పెద్దకొడుకూ కోడలూ దగ్గరే చూసుకుంటూ వుండేవారు.1996 మార్చ్ అయిదున ఆ పాడే గొంతు మూగపోయింది పిఠాపురం చిన్నబోయింది .
అయితేనేం
"నమ్మకురా ఇల్లాలు పిల్లలూ బొమ్మలురా జీవా
కీలు బొమ్మలురా జీవా" అని పాడుతూ దివికేగిన ఆయన పాటలు విన్నప్పుడల్లా పిఠాపురం అనే పేరు అందరూ మళ్లీ తలుస్తారు కదా
---------భార్గవి

Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము