జై యన్ .టి.ఆర్


ఏ కోణం నుండీ చూసినా,యే ఫీచర్ చూసినా అందంగానే వుండి ఆకట్టుకునే దివ్యమంగళ విగ్రహం.అలాంటి తీరైన ,ఆకర్షణీయమైన రూపం తెలుగుతెర మీద అంతకు ముందు రాలేదు,ఇకముందు వస్తుందనే ఆశ లేదు.తన కుటుంబంలో కూడా ముందు తరాలలోనూ,ఇప్పటికి వరకూ వచ్చిన వారిలోనూ అంత అందం,ఠీవీ,రాజసం కనరాదు.

ఈ పాటికి ఈ ఉపోద్ఘాతమంతా యెవరి గురించో ఊహించే ఉంటారుగా ,ఇంకెవరూ ఈనాడు జన్మించి తెలుగుతెర కథానాయకుడు గానే కాదు,తెలుగుదేశం నాయకుడిగా కూడా వెలిగిన నందమూరి తారకరామారావు గారి గురించే.
వీరు మా ఊరికి పది కిలోమీటర్ల దూరంలో వున్న నిమ్మకూరు లో జన్మించడం వలన ,చిన్నప్పటి నుండీ వీరి కబుర్లు యెవరో ఒకరు చెబుతూ వుండేవారు,పామర్రులో కొన్నాళ్లు నివాసం వున్నారని చెప్పేవారు నిజమెంతో నాకు తెలియదు
ఊహ తెలిశాక ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం,అందుకే ఆయన గొప్పతనం కాస్త ఆలస్యంగా తెలిసిందేమో అనుకుంటా.
నా జీవితంలో ఆయనను రెండు సార్లు చూసే అవకాశం కలిగింది.
నేనప్పుడు యేడో క్లాసు చదువుతున్నాను 1969వ సంవత్సరమనుకుంటా,నేను మా దొడ్లో వున్న జామ చెట్టెక్కి కాయలు కోసుకుంటున్నా యథాప్రకారం(ఇంటి దగ్గర వున్నప్పుడు నా కేరాఫ్ అడ్రస్ అదే ),ఇంతలో యెవరో యం.టీ .రామారావొచ్చాడు మనూరికి అన్నారు,అంతే చెట్టుమీదనుండీ ఒఖ్ఖ దూకు దూకి పట్టూ పరుగు.అలా వెళ్లి వెళ్లి "కమలా థియేటర్ " శంకుస్థాపనకు వచ్చిన ఆయన ముందుకు నా ప్రమేయం లేకుండా తోసివేయబడ్డాను ఆ గుంపులో.
.
పాల మీగడ లాంటి తెల్లని పంచె,తెల్లని లాల్చీలో పచ్చని పసిడి రంగులో వున్న దివ్య సుందర రూపం నా మనసులో ముద్ర పడిపోయింది.మళ్లీ అంత అందమైన రూపాన్ని చూడలేదు
ఆ తర్వాత గుంటూరులో మెడిసిన్ కంప్లీట్ చేసి హౌస్ సర్జన్సీ లో సర్జికల్ వార్డులో డ్యూటీ చేస్తున్నాను,నీరు కొండ -పాదిరికుప్పం సంఘటనలలో గాయపడిన రోగులను చూడటానికి రాజకీయ నాయకుని హోదాలో అన్నగారు యన్ టి ఆర్ గారు వచ్చారు .అప్పటికి దేహం కొంత స్థూలమైంది,అయితేనేం ఆ రాజసం ,ఠీవీ యేమీ తగ్గలేదు,ఆయన నడుస్తూ వస్తుంటే ఆ చుట్టూ ఒక "ఆరా". ఆ రోగి మాత్ర తన మొహం ఒక పక్కకు తిప్పుకున్నాడు ,ఆయన డ్యూటీలో వున్న నన్ను చూసి "ఎనీ బోనీ ఇంజురీ?" అని అడిగారు ,నేను లేదన్నాను ,అంతే.
ఆ తర్వాత ఆయన అమెరికా లో ఆపరేషన్ చేయించుకుని వచ్చాక,అవిశ్వాస తీర్మానంతో ఆయనను పదవి నుండీ దించాక ,ఆంధ్ర దేశ మంతా చైతన్య రథం టాపు మీద ఊరేగేటప్పుడు ఇంకోసారి చూశాను.
ఒక నటునిగా,దర్శకునిగా ఆయనలో చాలా అభిమానించాలిసిన విషయాలున్నాయి. ఆయన నటించి దర్శకత్వం వహించిన "సీతారామ కల్యాణం" నాదృష్టిలో అత్యద్భుతమైన చిత్రం ,అందులో రాముని పాత్రకు వేరే ఇంకో చక్కని నటుని ఎన్నుకోవడం ,సీత పాత్రకు కూడా ముగ్థ లాంటి గీతాంజలిని ఎన్ను కోవడం,తాను కోరి ప్రతినాయకుడైన రావణాబ్రహ్మ పాత్రను వేసి దానిని నభూతో నభవిష్యతి అన్న రీతిలో పోషించడం ఆయన అవుచిత్యాన్నీ,ఆయన ప్రతిభనూ మనకు విశద పరిచే విషయాలు.
ఆయన నటించిన "శ్రీకృష్ణ పాండవీయం,పాండవ వనవాసం,నర్తనశాల" చిత్రాలు కూడా "సీతారామ కల్యాణం" తో పాటు మన పౌరాణిక గాథలనూ,మన వాళ్ల సినీప్రతిభనూ తెలిపే చిత్రాలుగా అంతర్జాతీయ ఆర్కయివ్స్ లో భద్ర పరచవలసిన చిత్రాలు అని నాకనిపిస్తుంది.
కొన్ని సాంఘిక ,జానపద చిత్రాలలో కూడా ఆయన వేసిన కొన్ని పాత్రలు చాలా ఇష్టం నాకు ఉదా---"మిస్సమ్మ,షావుకారు,గుండమ్మ కథ,జగదేకవీరుని కథ".మిస్సమ్మ సినిమా అయితే నేను కావాలని కథంతా మరిచిపోయి మళ్లీ కొత్తగా చూడాలని ప్రయత్నిస్తా అంత ఇష్టం నాకా సినిమా.
అయితే ఆయన చరమాంకం లో నటించిన "వేటగాడు" తదితర సినిమాల గురించి నన్నడగ వద్దు నేను మాట్లాడను.
రాజకీయ విషయాల గురించి కూడా నాకే పరిజ్ఞానమూ లేదు కాబట్టి రాజకీయ నాయకుడిగా ఆయన గురించి నేనేమీ చెప్పలేను.
ఈ మే 28వ తేదీ ఆయన పుట్టిన రోజు సందర్భంగా నాకిష్టమైన ఆయన పాటలు చూస్తూ ఆనందంగా గడిపి,మళ్లీ అలాంటి దివ్య సుందర విగ్రహం తెలుగుతెర మీద చూస్తానేమో భవిష్యత్తులో అనే ఆశాభావంతో-----జై యన్ .టి.ఆర్
------భార్గవి

Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము