మధుర స్వరలక్ష్మి MS --జీవన సంగీతం


 సంగీతాభిమానులందరూ MS అని పిలుచుకునే మదురై షణ్ముగ వడివు సుబ్బలక్ష్మి కి సొంత బిడ్డలు లేకపోయినా, దేశమంతా మళ్లీ మాటాడితే ప్రపంచమంతా ఆమెని చూడంగానే "అమ్మా "అని పిలవాలనిపించే మూర్తిమత్వంఆవిడది. పవిత్రంగా,ప్రశాంతంగా ,చిరునవ్వుతో వెలిగే వదనం.భారతీయ సంప్రదాయం ఉట్టిపడే కట్టూ,బొట్టూ ఎవరు చూసినా దేశీయులు గానీ,విదేశీయులు గానీ చేయెత్తి నమస్కరించాలనే గానీ వేరే వూహ రానీయని స్వరూపం.ఇక కంఠం విప్పిందా కట్టలు తెంచుకుని లయబధ్ధంగా నర్తించే స్వరాల జలపాతం ఆమె సొంతం.

ఆమె సంగీత ప్రతిభ గురించి చర్చించటం ఈ వ్యాసం వుద్దేశం కాకపోయినా నాకా స్థాయి లేకపోయినా చిన్నతనం నుంచీ ఆమె పాటలు వింటూ పెరిగిన దానిగా వొక విషయం చెప్పగలను.ఆమెను పరోక్షంగా కెసెట్లలో ,సిడీలలో వినడం వేరూ ప్రత్యక్షంగా కచేరీలో చూస్తూ వినడం వేరూ.అది వొకఅనుభవం, వొక అదృష్టం. ఆ కచేరీ ఆవరణంతా వొక పవిత్రమయిన "ఆరా" కమ్ముకుంటుంది.పాడుతున్నపుడు ఆమె మొహంలో మెరుపుతో కూడిన ఆత్మానందం కనపడుతుంటే, ఆమె పాట ప్రేక్షకుల హృదయాలను సూటిగా తాకి వేరే లోకాలకు తీసుకెళుతుంది. ఈ అనుభూతి వేరే యే విద్వాంసుని కచేరీలోనూ నేను పొందలేదు.జీవితంలో వొక్క సారయినా ఆ అదృష్టం పట్టినందుకు నన్ను నేను అభినందించుకుంటూ వుంటాను.

అలాంటి MS పట్లా ,ఆమె జీవితం పట్లా యెవరికయినా కుతూహలం వుండటం సహజం.అయితే అసలు జీవిత చరిత్ర అంటే యెలా వుండాలీ నిజాయితీగా అన్ని విషయాలూ చెప్పాలా? దాపరికంగా వుండాలా?ఒకవేళ నిజాయితీగా వుంటే వారి జీవితంతో సంబంధం వుండేవారికి ఇబ్బంది కలిగితే? పేరు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లితే? వీటికి సమాధానం చెప్పడం కొంచెం కష్టం.

జీవితచరిత్రలు రెండురకాలు 

1. ఆటో బయోగ్రఫీలు(స్వీయచరిత్రలు)--ఎవరికి వారే రాసుకునేవి.

2.బయోగ్రఫీలు(జీవిత చరిత్రలు)--ఒకరి జీవితాన్ని వేరొకరు రాయడం.

మొదటి రకంలో స్వయంగా యెవరికి వారే రాసుకుంటారు కాబట్టి యెంతవరకూ నిజాయితీగా వుండాలో వారే నిర్ణయించుకునే సౌకర్యం వుంటుంది కాబట్టి సమస్య కొంతవరకూ పరిష్కారమవుతుంది. రెండో రకం వాటితోనే వస్తుంది చిక్కంతా రాసినవారు యేం చెప్పాలో యేంచెప్పకూడదో సరిగా నిర్ణయించుకోక పోతే పాఠకులో,వొకవేళ సదరు వ్యక్తో (బతికివుంటే) విమర్శించడానికి అవకాశంవుంది.దానికి వుదాహరణ నటుడు ఓంపురి జీవిత చరిత్ర. అతను బతికి వుండగానే అతని భార్య రాసిన జీవితచరిత్ర బయటకు ప్రజలలోనికి విడుదలయ్యాక అందులోని విషయాలతో అతను తీవ్రంగా విభేదించి చివరకు భార్యతో విడాకులు తీసుకున్నాడు.

అసలు నాకేమనిపిస్తుందంటే జీవితచరిత్ర రాసే రచయితకి రాయబోయే వ్యక్తి పట్ల ఆపేక్ష, అభిమానం (దురభిమానంకాదు) వొక సానుకూల దృక్పథం,నిస్పక్ష పాతంగా ఆలోచించ గల శక్తీ,ధైర్యంగా,నిజాయితీగా,న్యాయంగా,తీర్పు చెప్పినట్టు కాకుండా సమతూకంగా విషయాలను వెల్లడి చేయగల నేర్పూ వుంటే మంచి పుస్తకం వస్తుందని.

MS జీవితం మీద ఇంగ్లీషులో మూడు పుస్తకాలు వచ్చాయి

1.గౌరీ రామనారాయణ్ రాసింది,2.లక్ష్మీ విశ్వనాథన్ రాసింది,3.TJSజార్జ్ రాసింది.

వీటిలో జార్జ్ రాసిన పుస్తకం పైన చెప్పిన పార్శ్వాలన్నిటినీ స్పృశిస్తూ నిర్వికారంగా MSజీవితంలోని దాదాపు అన్ని కోణాలనూ చూపించింది. ఆ పుస్తకం ఆవిడ వుండగానే వెలుగు చూసింది(2004)అందులో ఆవిడ ప్రేమ వృత్తాంతం గురించి వుందనే విషయం ఆమె కేర్ టేకర్ ఆత్మనాధన్ ఆమెదృష్టికి తీసుకు వచ్చి"జార్జ్ ఇలా రాయొచ్చా? యేం చేద్దాం "అని ఆవిడని అడిగితే "నిజమే గదా మరి, నిజమే రాశాడు "అందట.ఇంతకన్నా సర్టిఫికెట్ కావాలా ఆపుస్తకానికి? ఆ పుస్తకంలో ఆమె జి.యన్ .బి. కి రాసిన ప్రేమలేఖల ప్రసక్తి కూడా తీసుకు వచ్చాడు జార్జి.

ఇక ఈ మధ్య వెలువడిన తెలుగు పుస్తకం "సుస్వరాల లక్ష్శి MSసుబ్బలక్ష్శి విషయానికి వస్తే దీని రచయిత శ్రీమతి పల్లవి ఆమెకు ఇదివరకు సినీ నటి సావిత్రి గురించి పుస్తకం రాసిన అనుభవం వుంది. మదురై పట్టణంలో దేవదాసీ కులంలో జన్మించిన మదురై షణ్ముగ వడివు కూతురు సుబ్బలక్ష్మి దేశం గర్వించే కళా కారిణిగా యెలా యెదిగిందీ యెన్ని వొడుదుడుకులను యెదుర్కొందీ ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది.

ఈ పుస్తకంలో ఆమె సుబ్బలక్ష్మి బాల్యంతో మొదలు పెట్టి ఆమె మదురైలో అమ్మ ఒడిలో "కుంజమ్మ" గా యెంత అపురూపంగా పెరిగిందీ,ఆమె తన బిడ్డను తన శక్తి మేరకు వొక చక్కని గాయనిగా తీర్చి దిద్దడానికి యెలా కృషి చేసిందీ ఆమె యెదుగుదలకు మద్రాసే సరి అయిన చోటని యెంచి ఆమెను మద్రాసు యెలా తీసుకు వచ్చిందీ రాస్తూ అక్కడ ఆమెచేత ప్రతిష్ఠాత్మకమయిన మ్యూజిక్ అకాడెమీలో కచేరీ చేయించడానికి అష్టకష్టాలూ పడటం కుంజమ్మ తన పదిహేడవ యేట విజయవంతంగా కచేరీ చేయడం వివరంగా కళ్లకు కట్టినట్టు రాసింది. తదుపరి వొక పత్రిక కోసం ఇంటర్వ్యూ చేయడానికి జర్నలిస్టుగా ఇంటికి వచ్చిన సదాశివం ,తరచుగా రాకపోకలు సాగిస్తూ ఆమెను ఆకర్షించడానికి ప్రయత్నించడం,అతని ధోరణి గమనించిన తల్లి మరల మదురైకి మకాం మార్చడం. తమ కులాచారం ప్రకారం అన్ని విధాలా ఉన్నతుడయిన వొక పోషకుడికి అప్పగించడానికి తల్లి చేసే ప్రయత్నాలను ఇష్ట పడకుండా పెళ్లిలోని భద్రతనూ,రక్షణనూ కోరుకున్న కుంజమ్మ తిరిగి తల్లికి తెలీకుండా మద్రాసు చేరడం. అక్కడ సదాశివం రక్షణలోకి రావడానికి దారి తీసిన పరి స్థితులూ అప్పటికే పెళ్లయి ఇద్దరు బిడ్డల తండ్రయిన అతను ఆమెకు ఆశ్రయమిచ్చి మొదటి భార్య మరణం తర్వాత ఈమెను పెళ్లాడడం.

కుంజమ్మ వెళ్లినపుడు తల్లి పడిన బాధా తిరిగి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలూ ఆ సందర్భంగా సదాశివానికీ ఆమెకూ సహజంగానే యేర్పడిన వైరభావం. సదాశివం స్వభావం,సుబ్బలక్ష్శి స్వభావం వారిద్దరి అనుబంధం ఇవన్నీ రచయిత్రి కొన్ని సన్ని వేశాలు కల్పించి వొక కథగా అల్లిన తీరు నిజంగా మెచ్చుకో దగినది. అలా అని ఆ సన్నివేశాలు కృతకంగా వుండవు. అవి అలా కల్పించడం వలన ఆయా వ్యక్తుల ప్రవర్తన అలా యెందుకుందో మనకు సమాధానం చెప్పకుండానే దొరికినట్టవుతుంది.

ఇక్కడ MSఅత్యున్నత గాయనిగా యెదగడానికి ఎవరు కారణం అని ఆలోచిస్తే ఇద్దరు వ్యక్తులు కనపడతారు వొకరు ఆమె తల్లీ రెండు ఆమె భర్తా. ఆమె తల్లి కూతురి భవిష్యత్తుని కొంత దూరం వరకే ఊహించింది గాత్ర సంగీతంలో ఆమె ప్రతిభను గుర్తించి తగిన శిక్షణఇప్పించింది, గ్రాంఫోన్ రికార్డులలో పాడేట్టు చేసింది మ్యూజిక్ అకాడెమీలో కచేరీలు చేయించిందీ ఇంతవరకే. అంతకు మించి ఆమెకు దేశమంతా గుర్తించే కళా కారిణిగా యెదగ గల సత్తా వుందని గ్రహించిన వాడు సదాశివం.ఆయనకు రాజాజీతో,మహాత్మా గాంధీతో, జవహర్లాల్ నెహ్రూ తో వున్నపరిచయాలతో ఆమె భవిష్యత్తుకు అతను సోపానాలు వేశాడన్నది తిరుగులేని నిజం. అతని తోడ్పాటుకు ఆమె విద్వత్తు తోడై అంతర్జాతీయ గాయనిగా కూడా యెదిగింది బహుశా ఇది అతను కూడా వూహించి వుండడు.

ఈ పుస్తకంలో పల్లవి సుబ్బలక్ష్మి గాయనిగా సాధించిన విజయాలూ,సన్మానాలూ ,సత్కారాలతో పాటు యవ్వనంలో ఆమెలో కలిగిన ప్రేమ భావనల ప్రస్తావన కూడా చేసింది అయితే ఈ విషయాలన్నీ చెప్పేటపుడు వొక హుందాతనంతోనే వ్యవహరించింది లేకితనం కనపడలేదు జార్జ్ పుస్తకంలో పోయినంత లోతుగా కూడా పోలేదు ప్రేమలేఖల గురించి మాట్లాడ లేదు.

అయినా విమర్శించే వారుపుస్తకం చదివకుండా ఎందుకు విమర్శిస్తారో,దినపత్రికలో వచ్చిన ఖండికలని చూసి ఆఖండనలెందుకో,ఆవేశమెందుకో అర్థంకాదు జార్జ్ పుస్తకం విడుదలయినపుడు ఈ ఆవేశం యేమయిందో? ఇకపోతే ఆమె జీవిత చరిత్ర చదివాక సదాశివం ,సుబ్బలక్ష్మి ఇద్దరూ మనని వెంటాడుతారు తలచుకుంటే ఇద్దరివీ బలమయిన వ్యక్తిత్వాలే అనిపిస్తాయి. సదాశివం MSని విపరీతంగా ఇష్టపడ్డాడు ఆమెను పూర్తిగా తనకనుకూలంగా మార్చుకోవాలనుకున్నాడు.ఆమెకంటూ ఏదీ మిగలకూడదు.ఆమె కట్టూ, బొట్టూ,యేం పాడాలి,యెలా నడుచుకోవాలి,యెవరితో మాటాడాలి ,యెవరితో మాటాడకూడదు అన్నీ ఆయన ఇష్టప్రకారమే జరగాలి. ఆమె వొక దేవదాసీ అనే ఆలోచనే ఆయన భరించలేడు ఇంకెవరయినా అన్నా భరించలేడుఅందుకే ఆమెను అచ్చమయిన బ్రాహ్మణస్త్రీగా సంస్కరించాలనుకున్నాడు.

అయితే ఆశ్చర్యకరంగా ఆయన ఆమె నుండీ సంపాదనను ఆశించలేదు అన్నీ ఛారిటీ ప్రోగ్రామ్సే యేర్పాటు చేసేవాడు ఆయనే కనక ఆమె సంపాదన ఆశిస్తే చాలా కూడగట్టుకుని వుండేవాడు బహుశా ఇక్కడకూడా ఆయన ఆభిజాత్యమే చూపినట్టున్నాడు.

ఆమె విషయానికొస్తే ఆమెకు వొక భద్రత,రక్షణ కల్పించే భర్త కావాలి అవి కల్పించిన ఆ వ్యక్తిని ఆమె అతని లక్షణాలన్నిటితోనూ స్వీకరించింది. అతనికి తనని ఇష్ట పూర్వకంగా అర్పించుకుంది అతని పిల్లలని తన స్వంత పిల్లలుగా భావించి పెంచింది.తన ద్వారా పిల్లలు కలగకుండా ఆపరేషన్ చేయించుకుంటే కిమ్మనకుండా సహించింది. తల్లి చనిపోయినపుడూ,అన్న చనిపోయినపుడూ చూడాలని యెంత వున్నా అతని ఆజ్ఞ జవదాటలేదు అతను యేం పాడమని కళ్లతో ఆజ్ఞాపిస్తే అదే పాడింది.అతని కళ్లముందే రాలి పోవాలనుకుంది అతను పోయాక కచేరీలు మానుకుంది.

తనకు విధించిన పరిమితులలో,ప్రతిబంధకాలలో ఆమె వ్యక్తిత్వం వికసించిన తీరూ, గాయనిగా ఆమె ఉన్నత శిఖరాలు అధిరోహించటం నిజంగా కొనియాడదగిన విషయాలు. సదాశివం మరణించిన తర్వాత జీవించిన చివరి యేడు సంవత్సరాల కాలం వృధ్ధాప్యంతో,అనారోగ్యంతో,ఒంటరి తనంతో,వెంటాడే జ్ఞాపకాలతో పోరాడి కన్ను మూసింది. పుస్తకం పూర్తి చేసేటప్పటికి తెలియకుండానే రెండు వెచ్చటి కన్నీటి బొట్లు బుగ్గలమీదకు జారతాయి .అవి చాలవా పల్లవి రాసిన పుస్తకం గురించి అభిప్రాయం చెప్పడానికి.

ఆవిడ గొప్ప విదుషీమణి ఆవిడ గొప్పతనమే చూపెట్టాలి గానీ ఇవన్నీ రాయాలా? అనే వారికి నాదొక సూటి ప్రశ్న అసలుజీవిత చరిత్రలు చదవడమెందుకు?సన్మాన పత్రం చదువుకుంటే పోలా? నేనెందుకు చదువుతానంటే యే జీవిత చరిత్రలో నయినానేర్చుకోవలసిందీ,తెలుసుకోవలసిందీ యేదో వొకటి వుంటుంది.గొప్ప వ్యక్తులు ఆకాశం నుండీ ఊడిపడరు వారూ మనలాంటి వారే.మనిషి ప్రవర్తనను పరిస్థితులు శాసిస్తాయి,యే పరిస్థితులలోవారెలా ప్రవర్తించారోతెలుస్తుంది.

ప్రతి అనుబంధంలోనూ రాగం ,ద్వేషం, కోపం,ప్రేమ,అభిమానం అన్నీ వుంటాయి.జీవితం యెప్పుడూసంక్లిష్టంగానూ,అనూహ్యంగా,చిక్కుముడి లాగే వుంటుంది సరళరేఖలా వుండదు.నాణానికి రెండు వేపులా చూపించడమే మంచి పుస్తకం చేయవలసిన పనిఆ పనిని విజయవంతంగా చేసిన పల్లవికీ ఇంత మంచి పుస్తకాన్నందించిన ప్రచురణ కర్తలకూ అభినందనలు.దయచేసి పుస్తకం చదివి మీ అభిప్రాయాలేర్పరుచుకోండి ఈ లోకంలో వున్నన్నాళ్లూ తన దివ్య గానంతో మనలని మైమరిపించిన MS అమ్మ ఆలోకంలో వారిని తన అమర గానంతో అలరిస్తూ ప్రశాంతంగా ఆనందం గా వుంటుందని గాఢంగా నమ్ముతూ ఓం శాంతి.

Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము