మా తాతయ్య

ఫోటోలో ఉన్నాయన పేరు రొంపిచర్ల చిన శేషాచార్యులు,ఈయన మా నాన్నకు నాన్న అంటే నాకు తాత,ఈ మధ్య ప్రముఖ ఆర్టిస్ట్ బి.ఏ. రెడ్డి గారు ఈయన ఫోటో ఫేస్ బుక్ లో పెట్టమని అడిగారు ,అప్పుడు మా తాతయ్య గురించి నాకు తెలిసిందీ,మా పెదనాన్న చెప్పగా విన్నదీ కాక నాకు ఇప్పుడున్న ఒకే ఒక సోర్సు మా ఆఖరి బాబాయి ప్రభాకర నారాయణా చార్యుల నడిగి తెలుసుకుని ఇది రాస్తున్నాను.

మా తాత యేమన్నా మహాత్మా గాంధీ లాగా  దేశాన్ని ఉధ్ధరించే పనులు చేశాడా?సంఘ సంస్కర్త వీరేశ లింగం లాగానో ,మరెవరి లాగానో యేమైనా సంస్కరణలు తీసుకొచ్చాడా అంటే అదేమీ లేదు గానీ,చిన్నతనం లోనే ,ఆరుగురు బిడ్డలనీ ,భార్యనీ ఒంటరి వాళ్లను చేసి తండ్రి చనిపోతే ఇంటికి పెద్ద కొడుకుగా ఆ కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకుని పేదరికంలో మగ్గుతున్న కుటుంబాన్ని ఒక దోవకు తీసుకువచ్చి ,ఇల్లూ ,వాకిళ్లూ ,పొలాలూ యేర్పరుచుకుని,తోబుట్టువులకు కూడా యేలోటూ లేకుండా చేసి,ఊళ్లో ప్రజలకు ఆయుర్వేద వైద్యుడిగా సేవలందిస్తూ తలలో నాలుకలా మెలిగిన వ్యక్తి.అసలు ఇవన్నీ లేకపోయినప్పటికీ మన మూలాల గురించి మనం తెలుసు కోవలసిన అవసరం వుంది.మన వేరుల గురించి మనం సిగ్గు పడాల్సింది లేదు,కాయకష్టం చేసే వాళ్ల దగ్గరనుండీ,సిరి సంపదలతో తుల తూగే వారి వరకూ  వారి వారి మూలాల గురించి వారు తెలుసు కోవడం వలన,మన ఉనికికి ముందు మన వారు పడిన కష్టాలూ ,చేసిన కృషీ తెలుస్తుంది,మానవ విలువలు అవగాహన కొస్తాయి.

ఒక కూలివాడు తన తండ్రి ఎవరూ యెత్తలేని ఒక పెద్ద బండరాయిని ఎత్తగలిగాడని గర్వపడితే,ఇంకొక ధనవంతుడు తన తండ్రి పెద్ద కారులో తిరిగే వాడని గర్వపడొచ్చు ,ఇరువురి జ్ఞాపకాల విలువా ఒకటే,ఒకటి గొప్పదీ ఇంకొకటి తక్కువదీ కాదు,అందుకే నేనీ రోజు మా తాత గురించి తలుచుకుంటున్నాను.

మా తాతయ్య చాలా చిన్నవాడుగా వుండగానే ఆయన తండ్రి బుచ్చయ్యా చార్యులు ,జీర్ణకోశానికి సంబంధించిన వ్యాథితో మరణించాడు.మా తాతమ్మ చాలా తెలివిగలదీ,ధైర్యస్తురాలూ,కష్టజీవి (ఈవిడంటే మా పెదనాన్నకి చాలా ఇష్టం ,ఆయన ఆవిడ ప్రతిభా విశేషాలు కథలు కథలు గా కళ్లకు కట్టినట్టు చెప్పేవాడు).ఆవిడ తన ఆరుగురు పిల్లలనీ,ఇద్దరు మగపిల్లలూ,నలుగురు ఆడపిల్లలనీ ,చాలా కష్ట పడి పెంచింది,అందరిలోకీ మా తాతయ్య పెద్దవాడు.కష్ట పడటమంటే ,పొలాల్లో పరిగె యేరుకు తీసుకు వచ్చి(పొలాల్లో రాలిపడిన వడ్ల కంకులు ,వీటిని రైతులు వదిలి వేస్తారు ,కావాలసిన వాళ్లు యేరుకు తెచ్చుకుంటారు),అవి బాగుచేసి ,ధాన్యం యేరి ,వాటిని దంచి ,ఆ బియ్యం వండి బిడ్డలకు పెట్టేది.అప్పుడప్పుడూ పుట్టింటి నుండీ కొన్ని బియ్యమూ,సహాయమూ తెచ్చుకునేది.ఇన్ని కష్టాలలో పెరిగిన ,ఇంటికి పెద్ద బిడ్డయిన మా తాతయ్యకి పెద్దగా చదువంటలేదు కానీ,నాటకాలలో వేషాలేసే ఉత్సాహం వుండేది.ఒక సారి సురభి నాటక కంపెనీ మా ఊరొస్తే ,అందులో "ఉషా పరిణయం" లో అనిరుధ్ధుడి వేషం కట్టి పద్యాలవీ దంచి పాడుతుంటే,మంచి కనుముక్కు తీరుతో కూడా వున్న ఈయన్ని,వాళ్లు తమతో కూడా రమ్మని ఆహ్వానించారు.

ఇంకేం ఈయన రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు భావించి వాళ్లతో కూడా వెళ్లడానికి తయారయి పోయాడు,ఈ సంగతి తెలిసిన తల్లి గుండెలు బాదుకుంటూ "నాయనా ఇంటికి పెద్ద బిడ్డవు ,ఇది నీకు న్యాయం కాదు ,ఇంత సంసారం నేనీద లేను "అంటే మొదట్లో మొరాయించినా ,యేమనుకున్నాడో వెనక్కి తిరిగి వచ్చాడు.

ఆమె ఇంక ఉపేక్షిస్తే లాభం లేదని ,ప్రముఖ ఆయుర్వేద వైద్యుడుగా పేరు తెచ్చుకున్న తన అన్న గారితో మొరపెట్టుకుంది"అన్నయ్యా ఈ పిల్లవాణ్ణి దగ్గరపెట్టుకుని నువ్వే యేదో ఒక దారిచెయ్యి"అని, ఆయన కొన్ని సంవత్సరాలు తన దగ్గర పెట్టుకుని ,ఆయుర్వేద వైద్యం నేర్పి,తగినంత అనుభవం సంపాదించాడని నమ్మకం కలిగాక,ఒక పాత్ర నిండా వెండి రూపాయలతో,ఒక బుట్టెడు మందులతో పాటు తన కూతుర్ని కూడా ఇచ్చి వివాహం చేసి సాగనంపాడు.

అలా ఊరికి తిరిగి వచ్చిన మా తాతయ్య తన వైద్య ప్రతిభతో పాటు,వాక్చాతుర్యంతో,నలుగురినీ కలుపుకుపోయే స్వభావంతో కొద్దికాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆయన ఊళ్లోనే కాకుండా చుట్టుపక్కల చిన్న ఊళ్లకీ ,గూడేలకీ కూడా కాలి నడకన వెళ్లి వైద్యం చేసేవాడు.మొన్నీ మధ్య వరకూ నా దగ్గరకు వచ్చిన రోగులలో చాలా మంది ,మా తాతయ్య దగ్గర వైద్యం చేయించుకున్నామని చెప్పే వాళ్లుండే వాళ్లు.ఊళ్లో వాళ్లందరూ ఆయనని మామయ్య గారూఅనో,బాబాయి గారూ అనో,పెదనాన్న గారూ అనో పిలవడమే గానీ ఆయన పేరుతో పిలిచే వారుకాదు,దానిని బట్టే ఆయన పిల్లలయిన మా పెదనాన్న,నాన్న లను "పెద్దన్నయ్య,చిన్నన్నయ్య" అనేవారు.

ఆయన తన నలుగురు తోబుట్టువుల పెళ్లిళ్లు చేశాడు ,పూర్వీకులు ఇచ్చిన ఇల్లు కాక తాను సొంతంగా ఒక డాబా ఇల్లు యేర్పాటు చేసుకున్నాడు,పొలాలు దొడ్లూ కొన్నాడు.వైద్యమూ,వ్యవసాయమూ రెండూ సాగుతూ వుండేవి,తన తమ్ముణ్ణి కూడా ప్రయోజకుణ్ణి చేశాడు. అయితే ఆయన జీవితంలో అనుకోని విషాదం ,ఆయన యెంతో ఇష్టపడి చేసుకున్న ఆయన మేనమామ కూతురు ,రెండవ కానుపులో బాలింత జబ్బుతో చనిపోవడం.చాలా కాలం పాటు ఆయన మళ్లీ పెళ్లి చేసుకోలేదు,ముఫ్ఫయ్యేళ్ళొచ్చాక ఊరి పెద్దలు చెప్పగా,మా బామ్మను పెళ్లి చేసుకున్నాడు.అప్పుడావిడకి తొమ్మిదేళ్లూ ,ఆయనకి ముఫ్ఫయ్యేళ్లూ.ఆవిడకి యెనిమిది మంది మగపిల్లలూ,ముగ్గురాడ పిల్లలూ.

ఆయన చనిపోయే నాటికి నలుగురు మగ పిల్లలకీ,ముగ్గురు ఆడపిల్లలకీ పెళ్లిళ్లయ్యాయి.మా తాతయ్య చాలా అభ్యుదయ వాది ఆరోజుల్లోనే తన ముగ్గురు ఆడ పిల్లలకీ తలో యెకరం పొలం రాసిచ్చి ఆస్తిలో హక్కు కలిపించాడు. ఆయన నాకు ఊహ తెలిసే టప్పటికి మంచంలో పడుకునో,కూర్చొనో వుండే వాడు ,పెద్దగా నడిచే వాడు కాదు,వెన్ను పూసకి సంబంధించిన రుగ్మత యేదో వుండేదని చెప్పేవారు.నేను ఇంటికి పెద్ద మనవరాలిని, నా తర్వాత మా తమ్ముడు. ఆయనకి మా తమ్ముడంటేనే యెక్కువ ప్రేమగా వుండేది వంశోధ్ధారకుడని,అందుకే వాడికి ,నారాయణా చార్యులు అని పేరు పెట్టుకున్నాడు,ఆ పేరు పదే స్మరిస్తే మంచిది అని అనుకుంటా.

ఆయన పిల్లలని ముద్దు చేసే విధానం భలే తమాషాగా వుండేది,ముద్దొచ్చిన పిల్లనో పిల్లవాణ్ణో దగ్గరకు రమ్మని "యేదీ చేయికొక్కొ"అని ఆ పిల్లలలి మో చేతి దగ్గర సున్నితంగా కొరికినట్టు చేసి వదిలేసే వాడు,ఆయన కొచ్చిన ఇంగ్లీషు సామెత"మనీ మేక్స్ మెనీ థింగ్స్". తన దగ్గరకి వైద్యానికొచ్చిన వాళ్లకి పథ్యం కూరలూ ,పచ్చళ్లూ యేం తినాలో చెప్పి ,ఇంట్లోకి ఒక పెద్దకేక వేసి ఆయా పథ్యాలు ఆ వచ్చిన రోగికి ఇచ్చి పంపమనే వారు,ఇంకా పెళ్లిళ్లయితే ఇంటికి వచ్చిన బంధువులని,పెళ్లి జరిగి మూణ్ణెలయి పోయినా సరే వాళ్ల ఇళ్లకి వెళ్లనిచ్చేవారు కాదు ఇంకా వుండమని ఒకటే పోరు,అంత బంధు ప్రీతి. మా చేను చేసే జీతగాడు అప్పుడప్పుడూ ఇంటిముందుకొచ్చి ,చేపాటి కర్రమీద గడ్డం ఆన్చి నిలబడే వాడు ,అప్పుడు మా తాతయ్య చూసి "ఇదుగో పెద్దాడొచ్చాడు చూడు,యేమన్నా పెట్టు" అనే వాడు,ఇద్దరూ చాలా సేపు యేవేవో పొలం సంగతులు మాట్లాడుకునే వాళ్లు,వాళ్లిద్దరి మధ్యాయేదో అనిర్వచనీయమైన అనుబంధం వున్నట్టుండేది,అన్నట్టు మా తాతయ్య పోయిన పదిహేను రోజులకు "పెద్దాడు" కూడా వెళ్లి పోయాడు.

ఈనాడు మా తాతయ్య జీన్స్ పంచుకున్న మనుమలు,ముని మనుమలలో డాక్టర్లున్నారు,ఇంజనీర్లున్నారు,కొంతమంది విదేశాలలో వున్నారు,ఇలా తన చలవతో తన ఇంటిని పది ఇళ్లు చేసి,తామర తంపరగా తన సంతానాన్ని వృధ్ధి చేసి,ఊరి వారికీ,తన వారికీ తరతరాలు తలుచుకునే పేరుగా మిగిలిన మా తాతయ్య ఫోటో అందుకే నా హాస్పిటల్ లోనే కాదు మా బాబాయిలందరి క్లినిక్స్ లోనూ అడుగు పెట్టగానే దర్శనమిచ్చేట్టుగా అమరి వుంటుంది.

-భార్గవి


Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము