సమున్నతురాలు శ్రీమతి పి.సత్యవతి


రచయిత్రి గానే కాక వ్యక్తిగా కూడా సమున్నతురాలు శ్రీమతి పి.సత్యవతి. సత్యవతి గారితో నా పరిచయం వయసు సుమారు పదేళ్ల పై మాటేననుకుంటా.అడపా దడపా "రజనీ"(బాలాంత్రపు రాజనీకాంత రావు) గారింట్లో జరిగే సంగీత,సాహిత్య సమావేశాల్లోనూ,ఇంకా ఇతర కామన్ స్నేహితుల ఇళ్లల్లో జరిగే ప్రయివేట్ సమావేశా ల్లోనూ అప్పుడప్పుడూ కనిపిస్తూ వుండేవారు. అప్పటికి ఆవిడ రాసిన "ఇల్లలకగానే" ,"సూపర్ మామ్ సిండ్రోమ్ "లాంటి కథలు చదివే వున్నాను కానీ నిజం చెప్పొద్దూ పెద్దగా పట్టించుకోలేదు. నెమ్మదిగా ఆవిడతో పరిచయం బలపడటమూ,ఈలోగా "దమయంతి కూతురు, సప్తవర్ణ సమ్మిశ్రితం,చీపురు "లాంటి ఆలోచనలు రేకెత్తించే ఆణి ముత్యాల్లాంటి ఆవిడ కథలు చదవడమూ జరిగింది ,దానితో వ్యక్తిగా ఆవిడ మంచితనమూ స్నేహశీలతా,రచయిత్రిగా ఆవిడ విశ్వరూపమూ కొంతవరకూ అవగాహనకు వచ్చాయి.

ఇక్కడ ఆవిడ వ్యక్తిత్వం గురించి నాలుగు మాటలు----సాధారణంగా చాలామంది రచయితల రచనలను అభిమానించగలమే గానీ,వారిని నిజజీవితంలో భరించలేము.వారి తల చుట్టూ చక్రాలుంటాయి,వారికి దగ్గరగా కూడా వెళ్లలేం,కానీ సత్యవతి గారితో అలా కాదు,సామాన్యులనుండీ మహా రచయితల దాకా ఆవిడతో కంఫర్టబుల్ గా హాయిగా వుండొచ్చు. ఆవిడ యెవరినైనా కల్లా కపటం లేకుండా ఒకేరకంగా ఆదరించగలరు.అసలు నిజం చెప్పాలంటే ఆవిడతో వున్నప్పుడు నాకు ఆవిడ రచయిత్రి అనే మాటే గుర్తుకు రాదు! అదీ ఆవిడ గొప్పతనం.

ఇక రచయిత్రిగా ఆవిడ గురించి  చెప్పాలంటే ----

కథలు రాయడానికి ఆవిడేపాటి కష్టపడతారో నాకు తెలీదు గానీ పాఠకుణ్ణి అలాగ్గా నీటిలో చేపపిల్లను వదిలినట్టు వదులుతుంది,ఇక అందులో పడి ఈతకొట్టటమే మనపని ,ఏ ఒడ్డుకు చేరతామో తర్వాత సంగతి!ఆవిడ వాక్యం,ఆవిడంత నిరాడంబరం,ఆవిడ శైలి ఆవిడ ప్రవర్తనంత సున్నితం.సెటైర్ రాసినా ,యే విషయం గురించయినా ప్రశ్నించినా మెత్తని చెప్పుతో సుతారంగా కొట్టినట్టుంటుంది. మార్పు అనేది మనిషి అంతరంగం నుండీ రావాలనీ,యే విప్లవమైనా మొదట ఇంటినుండే మొదలవ్వాలనీ యెరిగిన మనిషి ,అందుకే ఆవిడ కథలు లోతైన అవగాహనా,సూక్ష్మ పరిశీలనా,సున్నితమైన భావప్రకటనతో కూడి వుంటాయి.

కథలలో ఆవిడ స్పృశించని సబ్జెక్ట్ లేదు,ఆడవాళ్లు తమ దైనందిన జీవితాలలో ఎటువంటి హింస సహిస్తున్నారో,భరిస్తున్నారో,ఆవిడ చెబుతుంటే కళ్లు తెరుచుకున్నట్టవుతుంది.కొన్ని కొన్ని హింసల గురించి ఆవిడ రాసిన కథలు చదువుతుంటే  ,నిజమే కదా ఇదంతా ఎలా భరిస్తున్నాం అనే తెలివిడి కలుగుతుంది. ఉదాహరణకి "పతిభక్తి" అనే కథలో అయ్యప్ప దీక్ష లేదా భవానీ మాల వేసుకునే వాళ్ల భార్యలు పడే కష్టాల గురించి సత్యవతి గారు చెబుతుంటే నిజమే కదా!ఈ కోణం లో ఇదివరకెవరూ కథలెందుకు రాయలేదు?అనిపిస్తుంది.

ఇలా దీక్షలు తీసుకునే మగవాళ్ల కోసం,రోజువారీ ఇంట్లో తాము చేసే చాకిరీకి అదనంగా భక్తితో భార్యలు చేసే చాకిరీ,చివరికి దీక్ష ముగిసిన తర్వాత మళ్లీ యథాప్రకారం అతను జల్సా గా ఇంటికి తాగి వస్తే తమకి ఇష్టం వున్నా లేకపోయినా తమ ఒళ్లప్పగించాలిసి రావడం,ఇదంతా సూక్ష్మంగా పరిశీలిస్తూ ఆవిడ రాసిన కథ చాలా బాగుంటుంది.

ఉన్నతస్థాయి మహిళ నుండీ,పనిపాటలు చేసుకునే సామాన్య గృహిణి వరకూ ఎవరూ ఈ హింసకి అతీతులు కారు అని తేలుస్తూ,"ఇట్లా చెప్పా పెట్టకుండా ఆడవాళ్లు కూడా యేవైనా దీక్షలు తీసుకుంటే మగవాళ్లు సహకరిస్తారా?"అనే ప్రశ్న లేవనెత్తుతారు,చివరికి "అంతేలే అనుభవం వాళ్లదీ,ఆయాసం మనదీ" అని వ్యంగ్యమైన చెణుకు విసిరి ముగిస్తారు కథని.

ఆవిడని అందరూ స్త్రీవాది అంటారు కానీ నాకావిడలో మానవతా వాది కనిపిస్తుంది,ఎందుకంటే ఆవిడ తీర్చి దిద్దిన బలమైనపురుష పాత్రలు,పురుషుల వేపునుండీ వారెదుర్కునే సమస్యల గురించి రాయడం నాకా అభిప్రాయాన్ని కలిగించాయి ,దీనికి ఉదాహరణగా "దమయంతి కూతురు "కథ గురించి చెప్పుకోవచ్చు. అసలు ఈ కథ గురించి వివరంగా రాయడం చాలా కష్టం,ఇందులో చాలా పొరలున్నాయి.చాలా మంది ఈ సబ్జెక్ట్ గురించి రాశారు,చలం ,బుచ్చిబాబుల నుండీ వర్థమాన రచయితల దాకా. మర్యాదస్తురాలయిన ఒక గృహిణి భర్తనూ,పిల్లలనూ విడిచి తన కిష్టమయిన వాడితో వెళ్లిపోతే ,ఈ పురుషాధిక్య సమాజం ఆమెను "లేచిపోయిన మనిషి" అంటుంది,ఆమెను వెంటాడుతుంది,ఆమె కుటుంబాన్నీ ,పిల్లనీ కూడా వదలదు వేధిస్తుంది.. ఇటువంటి పరిస్థితులలో  ఆమె కోణం లోనుండీ కొంతమంది కథ చెబితే,పిల్లలు అనుభవించే వేదన  గురించి కొంతమంది కథ చెప్పారు,అయితే సత్యవతి గారి గొప్పతన మేమిటంటే ఒక వైపు తల్లికి దూరమైన ఆడపిల్ల చిన్నతనం నుండీ పడిన వేదనను మనకు చూపిస్తూనే , తల్లి చేసిన పనికి తీర్పు చెప్పడాని మనమెవరం ?అని ఆమె కొడుకు ద్వారా ఆ ఆడపిల్లను సమాధాన పరచడం,దమయంతి భర్త కూడా ఆమెను గురించి నీచంగా మాట్లాడకుండా "ఆమె ఒక ఊర్థ్వ లోకానికి చెందిన మనిషి "అని చెప్పడం ,ఆ రెండు పాత్రలనీ ఉన్నతంగా నిలపడమే కాక  నాణానికి రెండో వైపు కూడా చూడమని చెప్పినట్టనిపించింది.

ఇక్కడ దమయంతి కొడుకు అన్న మాటలు యథాతథంగా చెప్పడం వలన మనం సత్యవతి గారి భావాలని ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు అనిపించి రాస్తున్నా  "అమ్మ మనని మర్చిపోయిందని ఎందుకనుకుంటావు?మనలాగే తనూ గుర్తు చేసుకుంటూ వుండొచ్చు కదూ?తన జీవితాన్ని మలుచుకునే హక్కు,ఆవిడకుంది కదా అమ్మడూ.మనకోసం ఆమెకి  అలవి మాలిన త్యాగాలు అంటగట్ట గూడదు కదా!ఆమె ఎందుకు ఏ పరిస్థితుల్లో మనని వదిలి వెళ్లిందీ మన కెప్పటికీ  తెలీదు,ఆమె చెబితే తప్ప.వదిలెయ్ ఎక్కడున్నా ఆమె బాగుండాలనుకో..."

"మరి నేను అనుభవించిన క్షోభ మాటేమిటీ?" అంటుంది దమయంతి కూతురు.

"బహుశా మన దగ్గరే వుండి వుంటే ఆమె అనుభవించి వుండవలసిన క్షోభ మాటేమిటీ?" అని చెబుతాడు దమయంతి కొడుకు -----అదీ సత్యవతి గారంటే.

ఇంకా ఇలాంటి కథలెన్నో రాసిన సత్యవతి గారు ఈ మధ్య తన పంథా మార్చుకుని అంటే మధ్య తరగతి సమస్యలు కాకుండా,దిగువ తరగతి కి చెందిన,టీనేజ్ పిల్లలు అదీ ముఖ్యంగా చిన్న చిన్న ఉద్యోగాలు (సేల్స్ గాల్స్ ,హౌస్ మెయిడ్స్ )చేసుకునే వారి సమస్యల గురించి కథలు రాశారు ఇంకా జీవన సాయంసమయంలో మంచంపట్టిన మహిళల సమస్యల గురించీ,వారిని అంటిపెట్టుకుని ,జీతానికి సేవచేసే టీనేజ్ పిల్లలకీ ,వారికీ మధ్య వుండే అనుబంధాల గురించి కూడా రాశారు (సప్తవర్ణ సమ్మిశ్రితం ).

ఆవిడ కథలు చదివాక,ఆవిడని దగ్గరగా చూశాక నాకేమనిపించిందంటే --రచనల్లోనూ,జీవితంలోనూ శాంతిని పూయించే మంత్రమేదో ఆవిడకు తెలుసని,ఇదంతా ఆవిడ ఎలా సాధించిందో నాకు ఆశ్చర్యంగా వుంటుంది ఎందుకంటే గాలిబ్ చెప్పాడుగా "ప్రతీదీ సులభముగ సాధ్య పడదు లెమ్ము నరుడు నరుడౌట దుష్కరము సుమ్ము" అని. ఇలా తన రచనల్లోనూ,జీవితం లోనూ ప్రేమతత్త్వాన్ని జీవన సూత్రంగా మలుచుకుని  జీవితం సాగిస్తున్న ఒక మంచి మానవి సత్యవతి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆవిడ జన్మదినం ఆవిడకే కాదు ఆవిడ చుట్టూ వున్న మావంటి వారందరికీ శుభదినం.

జయహో------ భార్గవి

Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము