నా అభిమాన సంగీత దర్శకుడు--రోషన్ లాల్ నాగరథ్



హిందీ చిత్రసీమంతా "రోషన్ "అని పిలుచుకునే రోషన్లాల్ నాగరథ్ యెవరని ఇప్పటితరం వాళ్లడిగితే నటుడు రాకేష్ రోషన్ కీ సంగీత దర్శకుడు రాజేష్ రోషన్ కీ తండ్రీ,యువతరం అంతా వెర్రెక్కి పోయే నటుడు హృతిక్ రోషన్ కి తాతా అని చెప్పవలసి వస్తుంది.1960దశకంలో హిందీ చిత్ర సీమలో ప్రామాణిక మయిన సంగీతానికి చిరునామాగా నిలిచిన దర్శకుడు.

అయితే నాకీయన పేరుకూడా తెలీని అజ్ఞానంలో వున్నాను చాలాకాలం.ఉన్నట్టుండి వొకరోజు హఠాత్తుగా నాకీయనే అభిమాన సంగీత దర్శకుడు అనే జ్ఞానం కలిగింది అదెలా అంటే నాకిష్టమయిన హిందీ పాటలన్నీ వరసగా వింటూ సంగీతదర్శకుడెవరా అని చూస్తే ఆ పాటలన్నీ రోషన్ చేసినవే అంతే అమాంతం నేనాయన అభిమానినయిపోయాను మరి అవి యెలాంటి పాటలో మచ్చుకి వొక అరడజను చెపుతా చూడండి.

"మన్ రే తూ కాహెన ధీర్ ధరే"--చిత్రలేఖ

"అబ్ క్యా మిసాల్ దూ మై తుమారే షబాబ్ కీ"--ఆరతి

"దిల్ జోన కహ్ సకా వొహీ రాజ్ దిల్ "--భీగీరాత్

"జిందగీ భర్ నహీ భూలేగీ వో బర్సాత్ కీ రాత్ " -బర్సాత్ కీ రాత్

"ఒహరే తాల్ మిలే నదీకె జల్ మే"--అనోఖీ రాత్

"జోబాత్ తుఝ్ మే హై తెరీ తస్వీర్ మే నహీ "--తాజ్ మహల్ (ఇందులో వన్నీ ఆణిముత్యాలే వొక దాన్ని మించి వొకటుంటాయి)
చూశారా యేం పాటలు అవి ప్రాణం తీసే స్లో పాయిజన్లు కావూ!

సరే ఈయన సంగీత ప్రస్థానం వొకసారి పరిశీలిస్తే ఆయన ఇప్పటి పాకిస్థాన్ కి చెందిన పంజాబ్ లో"గుజ్రన్ వాలా "అనే వూళ్లో జన్మించాడు చిన్నప్పటినుండీ సంగీతం మీద మక్కువ వుండేది.కొంచెం పెద్దయ్యాక లక్నో లోని మారిస్ కాలేజ్ లో(ఇప్పటి భాత్ఖండే మ్యూజిక్ ఇన్ స్టిట్యూట్ ) చేరి పండిట్ యస్ . యన్ .రతన్ ఝంకార్ వద్ద శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆలిండియా రేడియో ఢిల్లీ కేంద్రంలో వాద్యకళాకారుడుగా "యస్ రాజ్ "అనే సంగీత పరికరాన్ని వాయించేవాడు
1948 ప్రాంతాలలో బొంబాయి చేరుకుని సంగీత దర్శకునిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలను కున్నాడు.ఖ్వాజా కుర్షిద్అన్వర్ కి అసిస్టెంట్ గా చేరి "శింగార్ "అనే సినిమాకు పనిచేశాడు. కేదార్ శర్మ ఇచ్చిన అకాశంతో పూర్తి స్థాయి సంగీత దర్శకుడు కాగలిగినా ఆ సినిమా ఫెయిలవ్వడంతో మళ్లీ సంగీత వాద్యకారుడుగా కొన్నాళ్లు గడపాలిసి వచ్చింది .చివరకు "బావరే నయన్ "అనే సినిమాతో తన బావుటా యెగరవేశాడు"సారే సారే రాత్ తెరీ యాద్ సతాయే "అనే పాట "అజీ బస్ షుక్రియా" లోది చాలా పేరు తెచ్చిన పాట.

1960 వ దశకంలో రోషన్ చాలా మంచి సినిమాలు చేశారు
*ఆరతీ *బర్సాత్ కీ రాత్ *తాజ్ మహల్ *చిత్రలేఖ *అనోఖీ రాత్ *మమత *దేవర్
ఇలా ఇవి మచ్చుకి కొన్ని .ఆయన ప్రత్యేకత యేమంటే జానపద సంగీతాన్నీ,హిందుస్థానీ క్లాసికల్ సంగీతంతో మేళవించి చక్కటి బాణీలు కట్టడం ఖవ్వాలీలు చెయ్యడంలో కూడా అతనికి మంచి ప్రావీణ్యం వుందంటారు.

ప్రఖ్యాత సంగీతదర్శకుడు అనిల్ బిశ్వాస్ యేమంటారంటే "రోషన్ సంగీతం హృదయానికీ బుధ్ధికీ సాంత్వన నిస్తుంది" అని ఆయన తన నేతృత్వంలో తలత్ ,రఫీ, మన్నాడే ,ముఖేష్ ,హేమంత్ కుమార్ ,లతా ,ఆశా వీరందరి ప్రతిభకూ తగిన బాణీలు చేశారు.

ముఖ్యంగా రఫీ చాలా మంచి పాటలు పాడారు"చిత్రలేఖ, తాజ్ మహల్ " లోవి యెలాంటి పాటలు
"మన్ రే" పాటంటే నాకు పిచ్చి యెన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది "కోయిన సంగ్ మరే" అన్నచోట గుండె అలాగ్గా ఆగి మళ్లీ కొట్టుకుంటుంది.

హిందీ చిత్ర గీతాల గురించి జరిపిన వొక సర్వేలో పది అత్యున్నతమయిన పాటలలో వొకటిగా నిలిచిందీ పాట. అలాగే "ఒహరే తాల్ మిలే నదీకె జల్ మే" అనే పాటలో ముఖేష్ గొంతు యెంత వింతగా ఒదిగి పోయిందో భావానికి తగ్గట్టు ఇలాంటి పాటలకు పెట్టింది పేరయిన యస్ .డి .బర్మన్ స్థాయిలో వుంటుంది అన్నట్టు మన తెలుగులో"యెవరికెవరు యీ లోకంలో యెవరికి యెరుక" పాట దాదాపు ఇదే ట్యూన్ లో వుంటుంది.

తాజ్ మహల్ పాటల గురించి చెప్పాలంటే వొకో పాట గురించి రాయాలంటే వొకటపా అవుతుంది అన్నీ తేనె సోనలే యేదని చెప్పేది. ఇలాగ హృదయాలని తాకే బాణీలను చేసిన రోషన్ హృదయ సంబంధమయిన వ్యాధితో 20సం"రాలు పోరాడి యాభయి సం"రాలకే 1972లో చనిపోవడం జీవితంలో ఐరనీ కాక మరేమిటీ.

ఇది హిందీ చిత్రసీమకి నిజంగా తీరని లోటు "సాగర్ మిలే కోన్ స జలెమే కోయీ జానేనా" అనుకుంటూ ఆయన పాటలు వింటూ ఆయన్ని తలుచుకోవడంకంటే ఇంకేం చేయగలం.
-భార్గవి


Comments

  1. Jo baat tujhme hain.. Terre tasveer me naheen, (SAD version)

    Paaoon choole..

    1989 లో ఈ పాటల మాధుర్యాన్ని మా నాన్న చెప్తూ ఉంటే వినే వాడిని. అప్పుడు నేను బహుశా 8వ తరగతి. అ వయసులో ఆటలే తప్ప నేను ఎప్పుడూ వీటి గురించి పట్టించుకునే వాడిని కాదు. తర్వాత తెలిసింది లే కానీవండి.. ఎంత గొప్పగా ఉండేదో మా నాన్న music sense. Saleem Chowdary, Ravi గారు (ఈయన విషయంలో మా నాన్న ఒక మాట అనేవారు అది ఏంటంటే మొత్తం సినిమాలో అన్నీ పాటలు బాగుండకపోయినా ఒక్క పాట మాత్రం సూపర్ హిట్ అవుద్ది) నౌషాద్ గారి పాటలు ముఖ్యంగా Baiju Bawraa, Mughal e azam లాంటివి వినేవాడిని కానీ ఆ మాధుర్యం అప్పట్లో అర్థం అయ్యేది కాదు చిన్న వయసు కదా అండీ..

    ఇప్పుడు అర్థం అవుతుంది ఆ మాధుర్యం కానీ ఎంత గొప్పగా ఉండేది నీ సెలెక్షన్ నాన్నా అని చెప్పడానికి మా నాన్న లేరు. నా చిన్న తనంలోనే పరమపడించారు..

    మంచి పాటను గుర్తు చేసినందులకు మీకు ��

    ReplyDelete
  2. థాంక్యూ అండీ రోషన్ సంగీత దర్శకత్వం అంటే పిచ్చి నాకు

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము