"సిటిజన్ కేన్ "


 గత వారంరోజులుగా ఈ ప్రభంజనంలో పడికొట్టుకు పోతున్నాను నేను.ఈ సినిమా 1941లో అమెరికాలో విడుదలయిన దగ్గరనుండీ యీ నాటివరకూ సంచలనాలు సృష్టిస్తూనే వుంది.ఇది చలన చిత్ర ప్రియులూ,శాస్త్ర సాంకేతిక నిపుణులూ ప్రామాణిక పాఠ్యగ్రంథంగా నేటికీ పరిగణిస్తున్న సినిమా. 

ఈ సినిమాను నిర్మించి దర్శకత్వంవహించీ,స్క్రీన్ ప్లేలో కూడా భాగస్వామ్యం వహించి,హీరోగా కూడా నటించిన వాడు ఆర్సన్ వెల్స్ .ఇది అతని మొట్టమొదటి సినిమా అప్పటికి అతని వయసు సుమారు 25సం"లు రేడియో కళాకారునిగానూ,రంగస్థల కళాకారునిగానూ వున్న అనుభవమే కానీ సినిమా రంగం లో అనుభవమేమీ లేదు.అతను రేడియో లో హెచ్ .జి.వెల్స్ "వార్ ఆఫ్ ది వరల్డ్స్ " ప్రసారం చేస్తున్నపుడు అందులోని ఆడియో యెఫెక్ట్స్ కి ప్రజలు భయభ్రాంతులయి వీధుల్లోకి పరిగెత్తుకొచ్చే వారట.ఇక యీ సినిమా విడుదలయిన సం"లో 9విభాగాలలో అకాడమీ అవార్డులకు యెన్నికయ్యి "స్క్రీన్ ప్లే" విభాగంలో అవార్డ్ గెలుచుకుంది .వెల్స్ తో పాటు జె.మాకీలింక్స్  ఈ అవార్డ్ పంచుకున్నాడు.చాలామంది సినీ విశ్లేషకులూ ,అభిమానులూ,చలన చిత్ర చరిత్రకారులూ ఇప్పటి వరకూ ఇలాంటి సినిమా రాలేదంటారు.అమెరికన్ ఫిల్మ్  ఇన్ స్టిట్యూట్   వంద సం"రాలలో వచ్చిన వంద అత్యున్నత సినిమాల లిస్ట్ వేస్తే అందులో వకటవ స్థానంలో నిలిచివుంది ఈనాటికీ.ఇందులోని ప్రతి ఫ్రేమునీ అధ్యయనం చేసేవారున్నారు ముఖ్యంగా సినిమటోగ్రఫీ,మ్యూజిక్ , నేరేషన్ అధ్భుతంగా వున్నాయంటారు.ఫోటోగ్రఫీలో వుపయోగించిన "డీప్ ఫోకసింగ్ " గురించి వినూత్నంగా వుందని చెప్పుకుంటారు.ఈ వొక్క సినిమాతో గొప్ప దర్శకుల జాబితాకెక్కిన ఆర్సన్ వెల్స్ ని ఈ అద్భుతం యెలా సాధించారంటే "నాకేమీ తెలియదు నేనెలా తియ్యాలనుకున్నానో రాజీ పడకుండా అలా తీశాను పరిణామాలు నేనాలోచించలేదు" అంటాడు.

ఈ చిత్రకథ ని ఆర్సన్ వెల్స్ విలియం రాండాల్ఫ్ హెర్స్ట్ అనే అమెరికన్ జీవితం ఆధారంగా నూ,తన   సొంత జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా నూ మలిచాడట. అందుకనే ఆ పేపర్ టైకూన్ ఈ సినిమా ప్రచారం లోకి రాకుండా కొంత అడ్డు తగిలాడట.అందువలననే రిలీజయిన తర్వాత కొన్నేళ్లు మరుగున పడిపోయి తర్వాత ఫ్రెంచ్ క్రిటిక్ "ఆండ్రీ బాజ్ " మెచ్చుకున్నాక 1956 నుండీ మళ్లీ వెలుగులోకి వచ్చి జైత్రయాత్ర సాగిస్తోంది.

ఇక కథ విషయానికొస్తే కథానాయకుడి పేరు "ఛార్లెస్ ఫాస్టర్ కేన్ " పెద్ద పేపర్ టైకూన్ 36న్యూస్ పేపర్ల తో పాటు అనేక వ్యాపారాలుంటాయి షిప్పింగ్ వ్యాపారం,నిర్మాణరంగంలో వాటాలూ చివరికి బంగారు గనులలో కూడా వాటా లుంటాయి

అతను "గ్జానడూ" అనే 49వేల యకరాలలో విస్తరించిన మానవ నిర్మితమయిన మహా సామ్రాజ్యంలో వొంటరిగా నివసిస్తూ వుంటాడు .అందులో లేనిది లేదు ప్రకృతిలో అరుదుగా కనపడే జీవజాలం దగ్గరనుండీ  అపురూపమయిన కళాఖండాలూ,శిల్పాలూ,వింతలూ ,విశేషాలూ వొకటేమిటీ ఆ సంపదను మానవమాత్రుడెవరూ విలువకట్టలేనిదట.ఆమహా సామ్రాజ్యంలో కేన్ ముసలితనంలో వొంటరిగా యెవరికీ కనపడకుండా తన పరివారంతో జీవిస్తూ వుంటాడు .అతని గురించిన ప్రతీదీ వింత వార్తగా ప్రజలు చెప్పుకుంటూ వుంటారు.ఇంతలో ఒకరోజు అతను "రోజ్ బడ్ "అని కలవరిస్తూ చనిపోతాడు.

అతని గురించిన న్యూస్ కవరేజ్ చేసిన న్యూస్ రీల్ రిపోర్టర్ చివరగా అతను పలికిన "రోజ్ బడ్ "కి అర్థం యేమిటో తెలుసుకోడానికి బయలుదేరతాడు.ఆక్రమంలో కేన్ కి పరిచయం వున్నవారినీ ,స్నేహితులనీ,అందరినీ ఇంటర్వ్యూ చేస్తూవుంటాడు.అప్పుడు కేన్ జీవిత విశేషాలు వొక్కొక్కరి దృక్కోణం నుండీ ఫ్లాష్ బాక్ గా వస్తూ వుంటాయి.

 ఛార్లెస్ ఫాస్టర్ కేన్ బీదరికంలో తల్లిదండ్రుల వద్ద పెరుగుతూ మంచులో స్లెడ్జ్ బండితో ఆడుకుంటూ వుండగా హఠాత్తుగా ఒకరోజు అతని తల్లికి కొలరాడో బంగారు గనులలో అదృష్టం కలిసి వచ్చిందని తెలుస్తుంది.అప్పుడామె కేన్ ని అతని ఇష్టానికి వ్యతిరేకంగా దూరంగా బోర్డింగ్ స్కూలికి పంపి అతనినొక గార్డియన్ సంరక్షణలో వుంచుతుంది.అతనికి 25సం"రాలవయసు వచ్చాక అతని ఆస్థి మీద అతనికి అధికారం వచ్చేటట్టుగా యేర్పాటు చేస్తారు.

తర్వాత అతను ఆ ఆస్థితో అతని గార్డియన్ ఇష్టానికి వ్యతిరేకంగా న్యూస్ పేపర్ వ్యాపారంలోకి దిగుతాడు.అందులో అతని శక్తి సామర్థ్యాలూ,అంచెలంచెలుగా యెదిగిన విధానం,యల్లో జర్నలిజాన్ని ప్రోత్సహించడానికి కూడా వెనకాడక పోవడం క్రమంగా 36న్యూస్ పేపర్లకు అధిపతి కావడం.అధికారం కోసం పన్నే పన్నాగాలూ ఫ్లాష్ బాక్ లలో వస్తూ వుంటాయి .అతనొక పెద్ద బిజినెస్ మాగ్నెట్ అయ్యాక ప్రెసిడెంట్ మేనకోడలిని పెళ్లిచేసుకుని వొక పిల్లవాడికి తండ్రయ్యాక రాజకీయాలలో కూడా ప్రవేశించి గవర్నర్ సీట్ కి పోటీ చేసే సమయంలో అతనికి వొక సింగర్ తో సంబంధం వుందని తెలుస్తుంది.అతని ప్రత్యర్థీ, అతని భార్యా కలిసి యీ రహస్యాన్ని ఛేదించి అతని ప్రతిష్ఠని దిగజారుస్తారు.తర్వాత అతను భార్యతో విడాకులు తీసుకుని ఆ సింగర్ ని పెళ్లాడిన కొంతకాలానికి మొదటి భార్య, పిల్లవాడూ వొక ప్రమాదంలో మరణిస్తారు.ఆ సింగర్ అయిన రెండో భార్యకోసం వొకపెద్ద ఒపెరా హౌస్ నిర్మించి ఆమె ప్రతిభావంతురాలని రివ్యూలు రాయమని జర్నలిస్ట్ లమీద ఒత్తిడి తెస్తాడు.కానీ ఆమెకు ఒపెరా గాయనిగా రాణించే ప్రతిభకానీ ఇంట్రస్ట్ గానీ వుండవు ఇతని ఒత్తిడి తట్టుకోలేక ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది.అంతటితో ఆ విషయం వదిలేసినా ఆమెకోసం "గ్జానడూ" అనే విశాల సామ్రాజ్యం నిర్మించి అందులో ఆమెను పంజరంలో చిలకలా సర్వ సౌకర్యాలతో వుంచుతాడు.కొంతకాలం ఆ బందిఖానాలో వున్న ఆమె వొకరోజు తానక్కడ వుండలేనని అతను యెంత బతిమాలుతున్నా వినకుండా బయట ప్రపంచంలోకి వెళ్లిపోతుంది.ఆమె వెళ్లి పోయాక అతను వొక నిర్వేదంలో,ఆమె గదిలోని సామాగ్రినంతా ధ్వంసం చేస్తూ చివరికి వొక మంచుతో నిండిన గాజు బంతిని పట్టుకుని "రోజ్ బడ్ "అని కలవరిస్తూ చనిపోతాడు.ఈ కథంతా అతని సన్నిహితులు న్యూస్ రీలు రిపోర్టర్ కి చెప్పే ఫ్లాష్ బాక్ ముక్కల ద్వారా మనకి అర్థం అవుతుంది. ఇంతాచేసి "రోజ్ బడ్ "అంటే యెవరూ చెప్పలేక పోతారు.చివరికా రిపోర్టర్ నేనా రహస్యాన్ని ఛేదించలేకపోయాను అని చెప్పడానికి కేన్ సామ్రాజ్యానికి తిరిగి వచ్చేటప్పటికి అతని వస్తువులన్నీ వేలం వేస్తూ వుంటారు పనికి రాని వస్తువులను తగలబెడుతూ వుంటారు అందులో కేన్ చిన్నప్పుడు ఆడుకున్న స్లెడ్జి బండి వేసినపుడు దాని మీదున్న పెయింట్ కరిగిపోయి "రోజ్ బడ్ "అనే అక్షరాలు కనపడుతాయి కానీ యెవరూ గమనించరు.అదీ సినిమా.

ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పదలచుకుంది యేమిటీ? యెంతోమంది యెన్నో వూహాగానాలు చేశారు.ఎంత సంపాదించినా యెంత అధికారం చేజిక్కించుకున్నా చివరకు మనిషి కి మిగిలేది చిన్ననాటి జ్ఞాపకాలేనా.ఎన్ని వున్నా మనిషి తనని ప్రేమించే ,భద్రత కలిగించే వారికోసం పరితపించి పోతాడా? 

నిర్వచించలేనిది మానవ జీవితం "రోజ్ బడ్ "అనేది భద్రతకూ,ఆశకూ,అమాయకత్వానికీ వొక ప్రతీక అనిపిస్తుంది.దానిని పొందడానికి చేసే ప్రయత్నమే జీవితం బహుశా "రోజ్ బడ్ " అతను పొందలేని దానికీ ,కోల్పోయిన దానికీ వొక గుర్తుగా మిగిలిన జ్ఞాపకం. ఇందులో కేన్ గా ఆర్సన్ వెల్స్ యాక్షన్ ,అతని మేకప్ వయసులో వున్నప్పుడూ, వయసు మళ్లాకా  చూస్తే ఆశ్చర్యంగా వుంటుంది .ఇది 75యేళ్ల క్రితం తీసిన సిన్మా అంటే నమ్మ బుధ్ధి కాదు .చలన చిత్ర ప్రేమికులు ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా "సిటిజన్ కేన్ "

Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము