నిష్కారణంగా మనుషులిని ప్రేమించే మనిషి


 సి.పి. అంటే తెలీదు .చలసాని ప్రసాద్ కీ,చలసాని ప్రసాద రావుకీ భేదం బొత్తిగా తెలీదు ఇలాంటి అయోమయంలో కాలం గడుపుతూ చలసాని ప్రసాదరావు అంటే ఆర్టిస్టనీ, చలసాని ప్రసాదంటే మార్క్సిస్టనీ తెలుసుకున్న కొద్దిరోజులకే చలసాని ప్రసాదరావు గారు కాలం చేశారు ఇక మిగిలింది కన్ ఫ్యూజన్ లేని వొకే వక్క చలసాని ప్రసాద్ కానీ నాకాయన గురించి తెలిసింది చాలా తక్కువ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త,శ్రీశ్రీ అంటే అభిమానం ఇంతే తెలుసు.

ఇలాంటి నేపథ్యంలో సుమారు అయిదారు సంవత్సరాలక్రితం వొకరోజు మనసు ఫౌండేషన్ రాయుడు గారు ఫోన్ చేసి శ్రీశ్రీ సినిమా పాటలు కావాలనీ శ్రీశ్రీ రచనలన్నీ సంకలనాలుగా వేస్తున్నామనీ చెప్పారు  నేను అలాగే నా వద్ద వున్నవి ఇస్తాను అని చెప్పి నా ఫోన్ నంబర్ యెవరిచ్చారని అడిగాను చలసాని ప్రసాద్ గారు యిచ్చారని చెప్పారు ఆయనకు నా ఫోన్ నం"యెలా తెలిసిందో ఈ రోజుకీ నాకు తెలియదు అప్పటికి నేను వి.ఏ.కె. రంగారావు గారి "ఆలాపన " ప్రచురించి వున్నాను కాబట్టి యెవరో యిచ్చి వుంటారనుకున్నాను.

తర్వాత కొద్ది కాలానికి చలసాని ప్రసాద్ గారే ఫోన్ చేసి మా యింటికి వస్తున్నానన్నారు యే పార్టీలకూ యే ఇజాలకూ చెందని నాకు ఆయన వస్తున్నారంటే కించిత్తు భయం కలిగిన మాట నిజం. సరే వొక సాయంత్రం సింపుల్ గా ఇస్త్రీలేని గళ్లచొక్కా,పాంట్ తో చిన్న సంచీతో పాటు మల్లెపువ్వులాంటి చల్లని నలగని చిరునవ్వుతో ఆయన ప్రత్యక్షం.

అరవై,డభ్భై మధ్య వున్నట్టు కనపడుతున్న ఆయన్ను చూసి "క్షమించాలి మేముండేది మూడో అంతస్థులో మెట్లు చాలా ఎక్కాలి" అంటుండగానే ఆయన చకచకా మెట్లెక్కేయడం నేనింకా చివరి మెట్టు మీద ఆపసోపాలు పడుతుండగానే లోపలికెళ్లి మా అమ్మతో మాటాడటం జరిగి పోయాయి "అమ్మాయ్ నాకెన్నేళ్లు అనుకుంటున్నావ్ " అన్నారు నేను అయోమయంగా చూస్తూ 60,70మధ్యలో అంటుంటే 83 అన్నారు ఈయనతో యేం మాట్టాడాలా అనుకుంటుండగానే "శ్రీశ్రీ ని చూశావా అమ్మాయ్ "అన్నారు "చూశానండీ వొక సారి కాలేజ్ లో ప్రయిజ్ డిస్ట్రిబ్యూషన్ కి వచ్చారు ఆయేడు నాకు పాటల పోటీలో వచ్చిన ఫస్ట్ ప్రయిజ్ ఆయన చేతులమీదుగా అందుకున్నాను" అన్నాను గర్వంగా "పసిపిల్లాడు లాంటి వాడమ్మాయ్ (తను కానట్టు ) నువ్వు యెక్కడ వుండమంటే అక్కడ వుంటాడు  మా పిల్లలిద్దరికీ పేర్లు పెట్టింది ఆయనే తెలుసా? .ఉయ్యాల తొట్లోకి చూసి "నవత" అన్నారు అంతే అదే ఖాయం ,తర్వాత అమ్మాయి మమత. నన్ను శ్రీశ్రీ మూడో భార్యంటారు తెలుసా? శ్రీశ్రీ స్వయంగా నన్ను నా యేకైక కైక  అనేవారు" ఇలా సాగి పోతుండేది ఆయన  ప్రవాహం.

రావి శాస్త్రి గురించి కూడా అడిగి మరీ చెప్పించుకునే దాన్ని ఆయన పాడే "నరుడో భాస్కరుడా "పాడమంటే పాడి "యేదీ నువ్వుకూడా వొకపాట పాడమ్మాయ్ "అంటే పాడగానే "నీది పాటమ్మాయ్, నాది గానం " అన్నారు. మధ్య మధ్యలో "అమ్మాయ్ నీకేమన్నా పనుంటే చూసుకో అమ్మా ,నీకేం యిబ్బంది లేదు గదా" అంటూ వుండేవారు.

 ఏదయినా పుస్తకం యిస్తే ఆనందంగా తీసుకుని"ఇది అచ్చంగా నాకేనా, నీకు మళ్లీ తిరిగి యివ్వఖ్ఖర్లేదు కదా "అని వొకటికి పది సార్లు అడిగే వారు(నాకు నిజంగా ఆయన పోయే వరకూ తెలీదు ఆయనకంత పెద్ద లైబ్రరీ వుందని)

ఇంటికి తిరిగి వెళ్లాక తప్పని సరిగా ఫోన్ చేసే వారు. హఠాత్తుగా లాండ్ లైనుకి ఫోన్ చేసి అప్పుడప్పుడూ "అమ్మాయ్ భార్గవీ బాగున్నావా అమ్మా? అంతా కులాసాయే కదా? వుంటానమ్మా " అనేవారుఅదొకవిధి లాగా "యెందుకండీ సెల్ కి చెయ్యొచ్చుగా "అంటే"నాకు లాండ్ లైనే ఇష్టం అదే చేస్తాను తక్కువ ఖర్చవుతుంది కూడా అనేవారు.

ఒకసారి శ్రీశ్రీ రాసిన సినిమా పాటలూ,ఆకలి రాజ్యం సినిమా సీడీ కావాలన్నారు అవేమంత అరుదైనవి కావు  సరే పంపాను అవి చేరగానే ఫోన్ చేసి ఆయన చెప్పిన మాటలకి సిగ్గుతో చచ్చిపోయానంటే నమ్మండీ లేకపోతే ఆయనంతటి వాడు"నీకు నా చర్మంతో చెప్పులు కుట్టిస్తానమ్మా"అనడ మేమిటీ నేను సరిగా వినలేదేమో నని "యేమిటండీ"అని మళ్లీ అడిగాను మళ్లీ అదే మాట చెప్పారు ఇది ఆయన గొప్పతనానికి నిదర్శనం .ఆయనకు శ్రీశ్రీ అంటే యెంత అభిమానమో చిన్నసహాయానికి కూడా యెంత కరిగి నీరవుతారో అప్పుడు నాకర్థమయింది.

చలసాని ప్రసాద్ గారంటే వొక ఉద్యమ కార్యకర్త గానూ,నిబధ్ధతత వ్యక్తి గానూ అనుకున్నానే గానీ ఆయన చక్కటి సాహిత్యాభిలాషి అనీ ,మంచి వాక్యం రాస్తారనీ అంతకు మించిన చదువరి అనీ తెలుసుకుని ఆశ్చర్య పోయాను . ఆయన నాకు రెండు పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు తను రాసినవి. వాటిలో వొకదాని మీద "అమ్మలాంటి అమ్మాయి భార్గవికి" అనీ రెండో దాని మీద "ఆప్యాయతాభిమానాలతో "అనీ రాసిచ్చారు, యెంత సంతోషించానో!

ఆయనకూ నాకూ యే బంధుత్వమూ లేకపోయినా మా అబ్బాయి పెళ్లిగురించి దిగులు పడుతున్నానని గమనించి  తనకు తెలిసిన మారేజ్ లైన్స్ ఫోన్ నంబర్లిచ్చీ స్వయంగా ఫోన్ చేసీ  యెంత ఆదుర్దా పడ్డారో, నేనయితే ఆ విషయం కొన్నాళ్లకి మర్చిపోయాను గానీ ఆయన మధ్యమధ్యలో గుర్తు చేసి ఆ మారేజ్ లైన్స్ వాళ్లు ఫోన్ చేశారా? అని అడిగేవారు  ఆయన అంత అక్కరగా కనుక్కోవడం తన సిధ్ధాంతాలకి విరుధ్ధమయిన విషయమైనా వుపన్యాసాలివ్వకుండా నాకెలా సహాయం చేయాలా అని ఆదుర్దా పడటం తలుచుకుంటే కృతజ్ఞతగా వుంటుంది.

 ఇంకో ఆశ్చర్యం నేను "గీతాంజలి" అనువాదం చేశానని తెలుసుకుని ఫోన్ చేసి అడిగారు "మీరు చదువుతారా?"అని అనుమానంగా అడిగాను యెందుకంటే శ్రీశ్రీకి టాగోర్ అంటే పడదనీ ఆయన గీతాంజలికంటేపాంచ్ కడీదేవ్ రాసిన "వాడేవీడు"అపరాథ పరిశోధక నవల బెటర్ అన్నారనీ తెలుసు శ్రీశ్రీని అభిమానించే ఈయనకూడా అదే అభిప్రాయంలో వుంటారనుకున్నాను.

 "నేను చాలా గీతాంజలి అను వాదాలు చదివానమ్మా -పంపించు "అన్నారు .పంపి వూరుకున్నాను ఫోన్ చేయలేదు.ఆయనే చేసి చాలా అనువాదాలకన్నా బాగుందన్నారు.దాని గురించి యెక్కడయినా రాస్తానని కూడా అన్నారు ఆ అదృష్టం నాకు లేక పోయింది. 

మద్రాసులో కాన్ఫరెన్సులో వుండగా ఆయన మరణ వార్త తెలిసింది చాలా దిగులుగా అయి పోయింది మనసు . ఎంతో మంది ప్రముఖులకు ఆయన తో సాన్నిహిత్యం వుండి వుండొచ్చు. ఎంతో మంది ఆయన గురించి రాసి వుండవచ్చు 

నాకున్న కొద్దిపాటి పరిచయంతో నేనిది రాయ సాహసించడానికి  కారణం చెప్పా పెట్టకుండా వచ్చే చిరుజల్లులాంటి ఆయనరాకకు ఇక నోచుకోనని తెలిసినపుడు కలిగిన సన్నని బాధా,మనుషులిని ఆయన నిష్కారణంగా ప్రేమిస్తారని చెప్పడానికి నేనే వొక ఉదాహరణగా అనిపించడం ఇంతే!

----భార్గవి

Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము