ఔను నిజం ప్రణయ రథం


ఆ రోజు సాయంత్రం ఇంట్లో అందరం కూచుని కబుర్లు చెప్పుకుంటున్నాం,హఠాత్తుగా టాపిక్ సినిమాల మీదకు మళ్లింది,ఉన్నట్టుండి మా నాలుగో బాబాయి అడిగాడు "మీలో ఎవరైనా జింబో సినిమా చూశారా?" అనిమేమందరం లేదంటే లేదన్నాం.
ఇదంతా ఎప్పుడంటే అబ్బో 1972-73 లో మాట,అప్పుడు నేను బెజవాడ KBN కాలేజ్ లో ఇంటర్మీడియట్ చదువుతూ వన్ టౌన్ లో మా మూడో బాబాయి గారింట్లో వుంటూ మధ్యలో ఏదో శెలవు రోజున గట్టు వెనక వుంటున్న (బెజవాడలో కనక దుర్గ కొండ వెనక ప్రాంతం) మా నాలుగో బాబాయి గారింటి కొస్తే,అక్కడ జరిగిన ముచ్చట ఇది.
ఏవిటీ మూడో బాబాయి,నాలుగో బాబాయి అంటున్నావు?అసలెంతమందీ ఏంకథా ?అనుకుంటున్నారా?చెబుతా నాకు మొత్తం ఆరు బాబాయిలుండేవిలే ,మానాన్న ,పెదనాన్నకాక,ఇప్పుడు మాత్రం ఒక్కటే వుందనుకో! మా ఐదో బాబాయిది అదో తరహా,ఆయన మాటల ధోరణికి మా పిల్లలందరం పడీ,పడీ నవ్వుతూ వుండేవాళ్లం.గులాబీ పువ్వుని"గుల్పాతీ పువ్వు "అనేవాడు," సినిమాలలో వచ్చే సంభాషణలనయితే తమాషాగా నవ్వొచ్చేట్టు మార్చి చెప్పేవాడు"జై పాతాళ భైరవి"అనే దాన్ని "జై తపేళా భైరవి"అనే వాడు,ఇంకా మాయా బజార్లో పద్యాన్ని మార్చి "అటు ఇద్దరు ఇటు ఇద్దరు అభిమన్యుని బాబాయిలు. అటు ముగ్గురు,ఇటు ముగ్గురు మన ఇంట్లో బాబాయిలు ఎటు చూసిన బాబో బాబాయిల సేన మనది బ్రహ్మాండముగా"అని పాడేవాడు.
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, మేము "జింబో "అనే సినిమా ఇంతవరకూ చూడకుండా అజ్ఞానాంధకారంలో పడి కొట్టుకు పోతున్నామని గ్రహించిన మా నాలుగో బాబాయి, అప్పటికప్పుడు నడుంబిగించి "పదండి అందరూ "అని ఇంట్లో వున్న పిల్లా మేకా అందర్నీ రిక్షాల మీద బయలు దేరదీసి,అప్పుడు జైహింద్ టాకీసులో ఆడుతున్న "జింబో "సినిమా చూపించేదాకా ఒంటి కాలుమీదున్నాడు. హాలులో కెళ్లేముందు "ఈ సినిమాలో ఔను నిజం ప్రణయరథం అనే పాట వస్తుంది చూడూ,అలాంటి పాట ఇంకోటి ఈ భూప్రపంచం లో లేదనుకో!" అని చెవిలో ఊదాడు.
సినిమా మొదలయింది ,ఇక మా ఒళ్లు మాకు తెలియదు.బ్రహ్మాండమైన టార్జాన్ మూవీ.ఒక సైంటిస్ట్ ఫామిలీ అడవికి దగ్గరగా నివసిస్తూ వుంటారు,ఒకానొక దురదృష్ట సంఘటన వలన జూకి తరలించ బడుతున్న పులులూ,సింహాలూ తప్పించుకుని సైంటిస్ట్ ఫామిలీ నివసించే ఇంట్లో జొరబడతాయి,వాటినుండీ తన భార్యనూ,బిడ్డనూ తప్పించే ప్రయత్నంలో సైంటిస్ట్ క్రూరజంతువుల బారినపడి మరణిస్తాడు,అది చూసిన భార్యకి మతి చలిస్తుంది,ఇక అతని నాలుగేళ్ల కొడుకు హాట్ ఎయిర్ బెలూన్లో వుంచబడిన వాడు,ఆకాశంలో దాన్లో కొంతదూరం ప్రయాణించి,హఠాత్తుగా అది పేలిపోగా అరణ్యమధ్యంలో చిక్కుబడి ఒక చింపంజీ చేత రక్షింపబడి,దాని సంరక్షణలో పెరిగి పెద్దవుతాడు.
అతనికి మన మాటకూడా తెలీదు కానీ అడవిలో జంతువులన్నీ అతని మాట వింటుంటాయి.

ఈ లోగా అతని మేనమామ,మేనమామ కూతురూ ,ఒక బృదంతో కలిసిఅతన్ని వెదకడానికి బయలుదేరతారు.చివరికి అతన్ని కనుక్కోవడం,అతనికీ మేనమామ కూతురికీ ప్రణయం ,మధ్యలో ఒకళ్లిద్దరు విలన్లూ అబ్బో సినిమా మంచి థ్రిల్లింగ్ గా వుంటుంది.ఇందులో హీరో పేరు అజాద్ ,హీరోయిన్ పేరు చిత్ర,తల్లి పాత్రలో నటించింది అచలా సచ్ దేవ్ .అయితే ఆ హీరో టార్జాన్ గా బాగా సూటయ్యాడు, నేనతనితో అమాంతంగా ప్రేమలో పడిపోయా,ఆ తర్వాత వెతుక్కుని అతనిదే వేరే సినిమా చూసేసరికి ఆ ప్రేమ కాస్తా దెబ్బకి వదిలిపోయింది.
ఇంతకీ ఆ సినిమా హోమీ వాడియా అనే ఆయన "బసంత్ పిక్చర్స్ "పేరిట హిందీలో ఒరిజినల్ గా తీసి ,తెలుగు,తమిళ్ లో డబ్ చేశాడు.అసలాయన "తూఫానీ టార్జాన్ "అని 1937లోనే దాదాపు ఇదే కథతో మొట్టమొదట తీశాడు,మళ్లీ 1958 లో ఈ సినిమా తీశాడు.పాటలు మజ్రూహ్ సుల్తాన్ పురీ,సంగీతం చిత్రగుప్త ,కెమెరా మరియూ స్పెషల్ ఎఫెక్ట్స్ బాబూభాయ్ మిస్త్రీ ,హిందీ సినిమాకి,,తెలుగు డబ్బింగ్ లో మాటలూ,పాటలూ శ్రీశ్రీ సమకూరిస్తే ,అవే ట్యూన్లకి సంగీతం సమకూర్చింది విజయభాస్కర్ .నేపథ్య గానం విషయానికొస్థే హిందీలో ఆశా,గీతాదత్ ,రఫీ పాడితే తెలుగులో సుశీల,జమునా రాణీ ,పిఠాపురం పాడారు.తెలుగు వర్షన్లో డైలాగులు చాలా కొత్తగా అనిపించాయి,హీరోయిన్ ,హీరో తో ఒకచోట "మండినట్టే వుంది నీ తెలివి "అంటుంది.ఇలాంటి డైలాగ్ తెలుగు సినిమాల్లో ఇంతవరకూ విన్నట్టు గుర్తులేదు.

పాటలు తెలుగులో "ఔను నిజం ప్రణయరథం","ఈ కథ ఇది కలకాదు","నా ఆట,నాపాట",రేరాణియే ముస్తాబయి రమ్మందీ ఈ వేళ","సోగ్గాడయ్యా అందాలయ్యా " ఇవన్నీ బాగుంటాయి,సినిమా చూసి నలభై యేళ్లయినా ఇంకా నా నోట్లో ఆడుతూనే వుంటాయి.సినిమా చూసినాక పామర్రు వచ్చి సంభ్రమంగా సినిమా గురించీ పాటల గురించీ చెబుతుంటే ,మా ఇంట్లో వాళ్లన్నారు "నువ్వు చిన్నప్పుడు,ఈ కలకాదు అని పాడుతూ తిరిగే దానివే ,ఎవరొచ్చినా ఇంటికి వాళ్లను కూడాఈ కలకాదు పాడు అని అడిగే దానివి" అన్నారు.అన్నట్టు హోమీ వాడియా "జింబో "హిట్టయ్యాక అదే పేరుతో సీరీస్ తీశాడు,అందులో "జింబో నగర ప్రవేశం" ఒకటి ,ఇంకోటి కూడా వుండాలి.
నిన్ననే ఈ పోస్ట్ రాస్తూ యూ ట్యూబ్ లో వెదికితే "జింబో"తెలుగు వర్షన్ లేదు కానీ హిందీ వర్షన్ దొరికింది,చిన్నప్పుడు నచ్చింది కానీ ఇప్పుడు నచ్చుతుందో లేదో అనుకున్నా ,కానీ చూస్తున్నంతసేపూ హాయిగా వుంది.
ఔను నిజం ప్రణయరథం సాగెను నేడే
కోరిన కోరిక పారట లాడే"ఔనునిజం"
ఇంపారె పూల నిండారె సుధల్
కైదోడై చేరి దాగుండే జతల్
హాయి జనించె ఆశ రగించె
కోయిలకోయని కమ్మగ పాడె"ఔను నిజం"
ప్రేమ కళాధాముడే తారే నిజం
మన్మథుడే బాసటై ఎత్తే ధ్వజం
బాణమె తీసె గారడి చేసె
హా సఖా నా సఖా నేమ్మది లేదే "ఔను నిజం"
కెరటాలే లీనమై సరసాలాడున్
తీయని గానమె యెద నూగాడున్
మనమె హసించున్ వనమె సుమించున్
దేహమె డెందమె తేలిక సాగె "ఔను నిజం "
చూశారా శ్రీశ్రీ సాహిత్యం,ఇలా నకారాంతాలతో ఇంకేదైనా సినిమా పాటుందా ?ఏమో మరి తెలీదు.
తెలుగు ,హిందీ పాటల లింకులిస్తున్నాను ఇక మీదే ఆలస్యం....

Comments

  1. "ఈ కథ ఇది కలకాదు... ఈ ప్రణయం విడరాదు ..."
    నమస్తే.. ఆండీ ఈ పాత పాట నన్ను చాలా కాలం వేటాడింది. కొన్నాళ్ళ క్రితం సెట్ లో సర్చ్ చేసి మరీ ఆ పాట ని విని ఆనందించాను. మళ్ళీ శ్రీదర్ పోస్ట్ పట్టుకుని మీ బ్లాగ్ ని దొరక పుచ్చుకుని ఈ పోస్ట్ చదివి ఆనందించాను.

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ అండీ నమస్కారం

      Delete

Post a Comment

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము