సుస్వర రాణి----జమునారాణి




నాగమల్లి కోన లోన నక్కింది లేడి కూన" అని పాడుతుంటే నరాలు జివ్వున లాగినట్టుంటుంది."మామా మామా మామా "అని పాడుతుంటే ఈ భామను వదిలి పెట్టటం అసాధ్యం అనిపిస్తుంది" ఎంత టక్కరి వాడు నారాజు ఏ మూలనో నక్కినాడు"అంటుంటే ఆ టక్కరి వాణ్ణి పట్టేసిన గజదొంగ సుమా అనిపిస్తుంది. "హైలో హైలేసా హంసకదా నా పడవ"అని పాడుతుంటే ఆ వయ్యారంలో మనం కూడా ఉయ్యాల లూగుతాం. "అందానికి అందం నేనే "అని పాడుతుంటే ఆ కోయిల గళమాధుర్యానికి మనం కూడా పరవశమౌతాం.

ఇన్ని అనుభూతులూ కలగజేసేది ఒకే గొంతు ,అదే కె.జమునారాణి గొంతు. జమునా రాణి నా అభిమాన గాయని అని చెప్పాలంటే మొదట్లో కొంచెం ఆలోచించేదాన్ని,ఎందుకంటే సుశీలంటే,జానకంటే,జిక్కీ అంటే,లీల అంటే ,లతా అంటే అభిమానం అని చెప్పేవారుండేవారు,జమునా రాణీ,యల్లారీశ్వరి లని అభిమాన గాయనులుగా చెప్పుకునే వాళ్లు తక్కువ.ఇలా అంటున్నానని వారంటే అభిమానం లేదని కాదు,వారు పాడిన ఎన్నో పాటలని ఇష్టపడతాను నేను,అయితే జమునా రాణి గొంతులో వుండే మిర్చిమసాలా ఘాటూ,తనకే ప్రత్యేకమైన నేసల్ టోన్ తోఆవిడ పాటకి అద్దే అందమూ,ఆమె గొంతులోని కవ్వింపూ , పాడే ప్రతి పాటా అనుభవిస్తూ ఆవిడ పాడే తీరూ ,నన్నావిడ అభిమానిని చేశాయి.అసలు హిందీలో పాడే గాయని గీతాదత్ కీ,(నేనావిడకి కూడా వీరాభిమానిని),ఈవిడకీ పోలికలున్నాయని అనుకుంటూ వుండేదాన్ని,చెప్పొద్దూ ఇదేదో నాకే ఇలా అనిపిస్తోందేమో అని సైలెంట్ గా కూచున్న నాకు మొన్నామధ్య చూసిన ఇంటర్వ్యూలో ఆవిడ తనని అందరూ ఆరోజుల్లో హిందీ గాయని గీతారాయ్ లాగా పాడుతోంది అనుకునే వారని చెబుతుంటే భలే ఆశ్చర్యమేసింది.

ఆవిడ తెలుగులో కంటే  తమిళ్  భాషలోనే ఎక్కువగా పాడారు.అక్కడే ఆవిడకి ఎక్కువ అవకాశాలు లభించాయనీ,తమిళ పరిశ్రమే ఎక్కువ ఆదరించిందనీ చెప్పారు. ఇంకోసంగతేమంటే ఆవిడకి అన్నిరకాల పాటలూ పాడగల సత్తావున్నా ,ఎక్కువగా జానపదఛాయలున్న పాటలకీ హాస్యగీతాలకీ పరిమితం చేశారెందుకో బహుశా ఆమె కంఠంలో వుండే హుషారూ,పలికించే స్పెషల్ యెఫెక్ట్సూ, యే పదం యెక్కడ విరవాలో తెలిసి పాడటం కారణం అనుకుంటా,"నాగమల్లికోనలోన నక్కింది లేడికూన(బంగారు తిమ్మరాజు),మామా మామామామా(మంచిమనసులు),ముక్కుమీద కోపం (మూగమనసులు)ఈ పాటలు వింటుంటే ఆ సంగతి అర్థమవడంతో పాటు,ఆమె పాటకుయెంత జీవం పోస్తుందో అర్థమవుతుంది.

ఆమె సినీ గీత ప్రస్థానం చాలా చిన్న నాడే అంటే సుమారు ఆరేడేళ్ల వయసులోనే మొదలయ్యింది.పుట్టింది మే 17 ,1938 మద్రాసు లో తెలుగు కుటుంబంలో ఆమె తల్లిదండ్రులు ద్రౌపది,వరదరాజులు నాయుడు.తల్లి ద్రౌపది ప్రొఫెసర్ సాంబమూర్తి ఆర్కెస్ట్రాలో వీణ వాయించడంతో పాటు,రేడియోలో కూడా పాడుతుండేవారు.

ఆమె తల్లిదగ్గరే సంగీతం నేర్చుకున్నారు,తల్లితోకూడా రేడియో స్టేషన్ కి వెళ్లినపుడు ఆమె యెలా పాడుతున్నారో గమనించడం కూడా అలవాటయ్యింది.చిన్నప్పటినుండీ వుత్సాహంగా పాడుతున్న జమునారాణిని సినీ గాయనిగా చూడాలని భావించిన తల్లి ఎక్కువ ప్రోత్సహించారు
మొట్టమొదటగా .పాడినదిహెచ్ .ఆర్ .పద్మనాభ శాస్త్రి సంగీత దర్శకత్వంలో నటి లక్ష్మి తండ్రి వై.వి రావు నిర్మించిన "తాసిల్దారు "(1944)సినిమాలో "అహ ఏమందునే చినవదిన"అనే పాట.పద్మనాభ శాస్త్రికి వారి కుటుంబంతో వున్న పరిచయం వలన చిన్నపిల్ల బాగా పాడుతోందని పాడించారు,ఇందులో భానుమతి హీరోయిన్ .

భానుమతి భర్త రామకృష్ణా రావు గారికీ,జమునారాణి తల్లికి మేనమామ అయిన రామానుజులు రావు నాయుడు గారికీ వున్న పరిచయం కారణంగా,జమునారాణి పాట వినడం తటస్థించింది.అప్పట్లో ఆయన "త్యాగయ్య" (1946)సినిమాకు నాగయ్య గారికి అసిస్టెంటు గా పనిచేసేవారు,నాగయ్య గారు పాటలు పాడే చిన్నపిల్లల కోసం వెదుకుతుంటే జమునారాణి పేరు రికమెండ్ చేశారు ,తర్వాత్తర్వాత "భరణీ రామకృష్ణ "గా పేరుబడ్డ పాలువాయి రామకృష్ణ గారు.

అలా" త్యాగయ్య" లో "మధురానగరిలో చల్లనమ్మ బోదు"అనే పాట ,ఎ.పి .కోమలతో కలిసి చిన్న పిల్లల నాట్యానికి ప్లేబాక్ గా పాడింది.భరణీ వారి ప్రోత్సాహంతోనే వారి సొంత సినిమా "రత్నమాల" లో(1947) రెండు పాటలు ,ఒకటి అంపకాల పాట,రెండోది నాట్యగీతం(వగలాడి నిను చేరురా) పాడటమే కాక అంపకాల పాటలో భానుమతి చెలికత్తెగా తెరమీద కనిపించింది.

ఆతర్వాత 1947,48 లలో "శివగంగ,ద్రోహి" మొదలైన సినిమాలలో పాడినా రావలసిన గుర్తింపు రాలేదు ,మొదటి చిత్రం(నటుడు సి యస్ ఆర్ సొంత చిత్రం) విడుదలకు కూడా నోచుకోలేదు.1953 వినోదా వారి "దేవదాసు" లో ఉడత సరోజినితో కలిసి చిన్నపిల్లలు పాడే "ఓదేవదా" పాడినా రికార్డుల మీద పేరైనా లేదు.కొన్నాళ్లు మోడర్న్ థియేటర్స్ వారి ఆర్టిస్టుగా కేవలం తమిళ పాటలే పాడింది తమిళులు బాగా ఆదరించారు,ఆచిత్రాలు తెలుగులో డబ్ అయినపుడు కొన్ని పాటలు మళ్లీ తనే పాడుకుంది తెలుగులో కూడా.

ఈలోగా 1955లో వచ్చిన "సంతానం" లో యస్ పి కోదండపాణి తో కలిసి పాడిన "సంతోషమేలా సంగీతమేలా "(సుసర్ల దక్షిణామూర్తి సంగీత సారథ్యం)మంచి గుర్తింపు తెచ్చింది,అయితే దీని మాతృక హిందీలో వి.శాంతారామ్ నిర్మించిన (1954)"సుబాహ్ కా తారా " లోని "గయా అంధేరా హువా ఉజాలా చమ్క చమ్క సుబహ్ కా తారా ",దీని సగీత దర్శకుడు సి.రామచంద్ర హిందీలో పాడిన వారు తలత్ ,లత.

అయితే ఆమె జీవితాన్ని మలుపు తిప్పి,ఆమెకో బ్రేక్ ఇచ్చిన పాట కె.వి.మహదేవన్ దర్శకత్వంలో "కుముదం "చిత్రం లో పాడిన "మామ మామ "పాట అది తమిళనాట సూపర్ హిట్టయ్యింది,మహదేవన్ ని కూడా అందరూ "మామ మహదేవన్ "అని పిలవ సాగారు.అదే సినిమా తెలుగులో "మంచిమనసులు"గా(1962) తీసినప్పుడు తమిళంలో సౌందరరాజన్ తో పాడిన జమునా రాణీనే తెలుగులో ఘంటసాల తో కలిసి పాడారు. ఆ పాట లో ఆమె "మామ "అనే పదాన్ని యెన్ని రకాలుగా విరుస్తూ భావ యుక్తంగా పాడారో వింటే తెలుస్తుంది ,అందులోనే "ఎంత టక్కరి వాడు"పాట కూడా చాలా బాగుంటుంది.

ఇక 1962 నుండీ 1970 వరకూ ఆమె జానపద థోరణిలోని పాటలకూ,హాస్యగీతాలకూ చిరునామా గా మారారు.మహదేవన్ దర్శకత్వం లోనే "మూగమనసులు "లో జమునకు పాడిన "ముక్కుమీద కోపం "యెంత మజాగా వుంటుందో,"ఉషా పరిణయం "సినిమాలో జమున తన పాటలు జమునా రాణీనే పాడాలని పట్టుబట్టి పాడించు కున్నారట,అందులో "జయజయ శ్రీ రాజరాజేశ్వరి" మంచిపాట.హాస్యగీతాలు కానివ్వండీ,మామూలు పాటలు కానివ్వండీ గిరిజకు దాదాపు అన్ని పాటలూ ఈమే ప్లేబాక్ పాడేవారు.

సంగీత దర్శకులందరి దగ్గరా పాడినా ,కొంతమందిని ఇష్టంగా తలుచుకుంటారు వారిలో ఘంటసాల గారొకరు,అబ్దుల్ కరీంఖాన్ ఠుమ్రీ ఆధారంగా "దీపావళి" లో చేసిన "ఓరిమి గొనుమా ఓ రాజ శేఖరా "లాంటి శాస్త్రీయత ధ్వనించే కష్టమైన పాట నాకెందుకిచ్చారు మాష్టారూ అంటే "నీకంఠం మీదుండే నమ్మకమమ్మా "అన్నారట.ఆయన దర్శకత్వంలోనే ఆమె పాడిన "ఓ వన్నెల వయారి ,చూసేవు ఎవరి దారి" నాకు చాలా ఇష్టం.

 యస్ .పి.కోదండ పాణి దర్శకత్వంలో కూడా చాలా స్వేఛ్ఛ వుండేదట "నాగమల్లికోనలోన "పాడేటప్పుడు తాను స్వతంత్రంగా కొన్ని సంగతులు వేసి పాడితే బాగుంది అలాగే పాడు అని ప్రోత్సహించారట. యస్ .రాజేశ్వరరావు దర్శకత్వంలో "భీష్మ "లో పాడిన "హైలో హైలెస్సా హంసకదా నా పడవ",అశ్వత్థామ దర్శకత్వలో "చివరికి మిగిలేది "లో పాడిన "అందానికి అందం నేనే " పాటలు ఆమె గొంతు హీరోయిన్ కి కూడా సూటవ్వగలదని నిరూపించే పాటలు.

ఆమె ఘంటసాలతో పాడిన "పదపదవే వయ్యారి గాలిపటమా,రావాలి రావాలి రమ్మంటె రావాలి"పాటలు ఆ మాటకు మరింత బలం చేకూరుస్తాయి.ఇంక ఆమె పాడిన హాస్యగీతాల విషయానికొస్తే పిఠాపురం,మాధవపెద్ది,పి.బి. శ్రీనివాస్ వీరందరితో కలిసి పాడారు.అన్నీ చెప్పుకోలేం కానీ మచ్చుకు కొన్ని...

సరదా సరదా సిగిరెట్టు --మాధవపెద్ది ---రాముడు భీముడు

హల్లో డార్లింగ్ మాటాడవా----పిఠాపురం---శభాష్ రాముడు.

దక్కెనులే నాకు నీ సొగసు--పి.బి.శ్రీనివాస్ ---ఆత్మ బంధువు నాకీపాటంటే పిచ్చి

రావే బాలా రావే బాలా హలో మైడియర్ లీలా----పి.బి.శ్రీనివాస్ ----కులగోత్రాలు.

ఇంతకు మునుపు చెప్పుకున్నట్టు 1970 ప్రాంతాలకి ఆమెకు పాటలు చాలాతగ్గిపోయాయి యేవో "వరకట్నం "లో పిఠాపురంతో రెండు డ్యూయట్లూ,"కలెక్టర్ జానకి "లో "నీవన్నది నేననుకున్నది" ఇలాంటి పాటలూ అంతే .కారణాలేమైనా అయ్యుండొచ్చు యల్లారీశ్వరి లాంటి ప్రభంజనమో,హీరోయిన్లకు పాడేవారే జానపద గీతాలూ,హాస్యగీతాలూ,క్లబ్ సాంగ్సూ పాడటమో ,కాల ప్రవాహానికి తలవంచక తప్పదెవరైనా.

ఈ విరామ సమయంలో ఆమె తన ప్రాణ స్నేహితురాలు జిక్కితో కలిసి దేశ ,విదేశాలలో సంగీత కచేరీలు చేస్తుండేవారు.ఇక వ్యక్తిగత జీవితం విషయానికొస్తే ,ఆమె పెళ్లి చేసుకోలేదు,సోదరుని కుటుంబమే తన కుటుంబం అనుకున్నారు.విచిత్రమేమంటే చలన చిత్ర పరిశ్రమ తనను మర్చిపోయిందనుకున్న ఇరవయ్యేళ్ల తర్వాత ఇళయరాజా నుండీ కబురు "నాయకన్ "సినిమాకు పాడమని అదే "నాన్ సిరుత్తల్ దీపావళి" పాట,తెలుగులో కూడా "నా నవ్వే దీపావళి "ఆమే పాడారు చక్కటి హిట్ ,అదో వింత పరిమళంతో రిలీఫ్ గా అనిపిస్తుందీ పాట.

అడపాదడపా టి.వీ .ఇంటర్వ్యూల్లో అక్కడా కనిపిస్తూ వుంటారు,"గొంతులో వయసు తెచ్చే మార్పులని ఎవరైనా అంగీకరించక తప్పదు,వయసులో గొంతుపట్టగలిగే దమ్ము ఇప్పుడు పట్టలేం కదా " అని చెబుతూ వుంటారు శ్రోతలు నిరుత్సాహ పడతారేమో పాత పాటలని తలుచుకుని అని నిజమే కదా.

ఇప్పుడు విశ్రాంత జీవితం గడుపుతూ ప్రశాంతంగా బెంగుళూరులో వుంటున్నారని విన్నాను ,ఆమె జీవితం ఆరోగ్యంగా ఆనందంగా పాటలాగా సాగిపోవాలి వున్నన్నాళ్లూ అని కోరుకుంటూ 'జై జమునారాణి'

-భార్గవి

Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము