కొకైన్ కింగ్ --పాబ్లో ఎస్కొబార్


మనిషి ఆశాజీవి,భవిష్యత్తు మీద ఆశే అతన్ని ముందుకు నడిపే ఇంధనం.అంతేకాదు  జీవితంలో యెన్నో సాధించాలనే కలలు కనడం,ఆ కలలని నిజం చేసుకోవడానికి యెంతో శ్రమించడం ,యెత్తులకి పై యెత్తులు వెయ్యడం, జిత్తులుచెయ్యడం ఇదంతా మనిషి జీవితంలో  ఒక భాగం.కానీ ఆ ఆశ దురాశ కాకూడదు,ఉన్నతంగా జీవించాలని కలలు కనడం తప్పుకాదు కానీ ,ఆ కలలు తీర్చుకోడానికి యెన్నుకునే మార్గాలు సరైనవి కాకపోతే అవే అతని వినాశనానికి కారణమవుతాయి. అందుకే "యెంత విభవము గలిగిన అంతయును ఆపద"అనీ,"దురాశ దుఃఖమునకు చేటు" అనీ పెద్దలు చెప్పిన మాటలు  మరిచి పోగూడదు.

అవినూటికి నూరుపాళ్లూ నిజాలని మనకి నిరూపించే ఉదాహరణలుగా కొంత మంది జీవితాలుండటంకూడా ఆశ్చర్యంగా వుంటుంది. అలాంటి జీవితమే కొకైన్ కింగ్  గా పిలవబడే పాబ్లో ఎస్కొబార్ ది.అతను 1980-90సంవత్సరాల మధ్యలో మాదక ద్రవ్యాల మహాసామ్రాజ్యానికి మకుటం లేని రారాజుగా వెలిగిపోయాడు.అమెరికాకు  అక్రమంగా రవాణా అయ్యే  కొకైన్ లో యనభై శాతం ఎస్కోబార్ ద్వారానే సరఫరా అయ్యేది.రోజుకి సుమారు పదిహేను టన్నుల కొకైన్ రవాణా అయ్యేది.ఇలా రవాణా చెయ్యడానికి అతను  142 విమానాలను,20హెలికాప్టర్లను,32యాక్ట్ లు,141ఆఫీసులను,ఇళ్లను ఉపయోగించే  వాడంటేనే ఊహించ వచ్చు అతనెంతగా సామ్రాజ్యాన్ని విస్తరించాడో.అతని సంపాదనకు కూడా అంతుండేది కాదు,డబ్బును దాచడానికి గోడౌన్లూ, రహస్య లాకర్లూ ,కూడా చాలక కొన్నిచోట్ల భూమిలో గోతులు తవ్వి పాతిపెడుతూ వుండేవారు.డబ్బును కట్టలు కట్టడానికి వాడే రబ్బరు బాండ్లు కొనడానికి వారానికి వెయ్యిడాలర్లు ఖర్చయ్యేవి , అలా దాచిన డబ్బులో పదిశాతం ఎలుకలు కొట్టెయ్యడం తో నాశనమయ్యేది,ఇంకా కొంతభాగం చెదలు తినెయ్యడంవల్లో,నీళ్లలో తడిసిపోవడం వల్లో పాడయ్యేది.అయినా 1993 నాటికి ఎస్కోబార్ సంపాదించిన ఆస్తి విలువ సుమారు ముఫ్ఫయి బిలియన్ డాలర్లుంటుందని అంచనా. ఫోర్బ్స్ మేగజీన్ లెఖ్ఖ ప్రకారం  ప్రపంచంలో అత్యధిక ధనవంతులలో అతనిది యేడవ స్థానం.

సెంట్రల్ కొలంబియా లో సుమారు 7000యెకరాలలో అతనొక విలాసవంతమైన ఎస్టేట్  యేర్పాటు చేసుకున్నాడు ,దానికి Hacienda Napoles అని ఇటలీలోని నేపుల్స్ ని తలపించే పేరు పెట్టుకున్నాడు.అందులో లేనిది లేదు ,ప్రపంచంలో  వుండే అన్ని వింత జంతువులూ జీబ్రాలూ,జిరాఫీలూ,యేనుగులూ,చివరికి ఆఫ్రికాలో కనపడే హిప్పోపొటామస్ లతో సహా తన జూ కి రప్పించాడు ఎస్కొబార్(1993 తరువాత  ఈ హిప్పపోటమస్  లసంఖ్య విపరీతంగా పెరిగి పోయి కొలంబియా ప్రభుత్వాని కొక తలనొప్పిగా పరిణమించడం  ఒక విచిత్రం)బుల్ రింగ్ , ఏర్ పోర్ట్ ,రకరకాల కార్లతో నిండిన ఈ ఎస్టేట్ భూతల స్వర్గాన్ని తలపిస్తూ వుండేది.దీనితో బాటు అతని వివిధ దేశాలలో సుమారు 800ఇళ్లు వుండేవట!

అతని నేరచరిత్ర కూడా సామాన్యమైనది కాదు ఇతర మాదకద్రవ్య మాఫియా గ్రూపుల తో జరిపిన పోరాటలలో చంపబడ్డ వారు కానీ,అతనిని యెదుర్కొని హతమైన పోలీసు ఆఫీసర్లు కానీ,న్యాయాధికారులు కానీ,బాంబ్ బ్లాస్టింగ్ లవల్ల చనిపోయిన సామాన్య ప్రజలు కానీ మొత్తం మీద సుమారు నాలుగువేల మంది వుంటారని ఒక అంచనా.  

రోలర్ కోస్టర్ రైడ్ లాంటి  ఉద్విగ్న భరిత జీవితం గడిపి,ప్రపంచం లోనే అత్యంత ధనవంతుడుగానూ, శక్తివంతుడుగానూ పరిగణింపబడిన ఎస్కొబార్ పుట్టుపూర్వోత్తరాల గురించీ ,అతని ఉత్థాన పతనాల గురించీ పరిశీలించడం వలన మానవ జీవిత విలువలు తెలియడమే కాదు మనుషులు యెలా జీవించ కూడదో కూడా తెలుస్తుంది అనిపించింది. 

దక్షిణ అమెరికా లో కొలంబియా లోని,మెడిలిన్ ప్రాంతానికి చెందిన  వాడు పాబ్లో ఎమీలియో ఎస్కొబార్ గవేరియా .అతని తండ్రి సాధారణ రైతూ,పశువుల కాపరి,అతని తల్లి యెలిమెంటరీ స్కూల్లో టీచర్ ,ఏడుగురు సంతానంలో మూడవ వాడు పాబ్లో ఎస్కొబార్ అతని చిన్నతనంలోనే నేర చరిత్రకు బీజాలు పడ్డాయి.

స్కూల్లో చదువుతున్నప్పుడే నకిలీ స్కూల్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లుతయారు చెయ్యడం,సమాథుల మీద అంటించిన ఫలకాలను దొంగిలించి వాటిమీద పేర్లు చెరిపేసి విక్రయించడం,సైకిళ్లూ ,స్కూటర్లూ,కార్లూ యెత్తుకుపోయి అమ్మేయడం లాంటి చిన్నచిన్న నేరాలు చేస్తూ వుండేవాడు. ఒకసారి కారు దొంగతనం కేసులో పట్టుబడి జైలు శిక్ష కూడా అనుభవించాడు,అయితే అతనీ డ్రగ్ రాకెట్ లోకి యెలా వచ్చాడు? అదంతా మళ్లీ మాట్లాడుకుందాం.

పాబ్లో ఎస్కొబార్ జన్మించిన కొలంబియా, లాటిన్ అమెరికన్ దేశాలుగా పరిగణించే ఇరవై దేశాలలో ఒకటి.ఈ లాటిన్ అమెరికన్ దేశాల భాషా,సంస్కృతి ప్రత్యేకంగా వుంటాయి .చాలామంది స్పానిష్ భాష మాట్లాడతారు.

లాటిన్ అమెరికన్ మ్యూజిక్ కి,సంగీత ప్రపంచంలో ప్రత్యేక స్థానముంది,లాటిన్ అమెరికన్ ట్యూన్లు ప్రేరణ గా తీసుకుని మన సినీ సంగీత దర్శకులు అద్భుతమైన పాటలు చేశారు .రెండు,మూడు ఉదాహరణలు చెప్పాలంటే "పాతాళభైరవి" లో జిక్కి పాడిన "వగలోయ్ వగలూ" పాటకి "లవ్స్ ఆఫ్ కార్మన్ "లో రీటా హేవర్త్ పాడిన "లలలూ లలలూ "అనే లాటిన్ అమెరికన్ ట్యూనే ఆధారం,ఇంకా తమిళ్ లో "కాదలిక్క నేరమిల్లై" సినిమా లో యం.యస్ .విశ్వ నాథన్ చేసిన ట్యూన్ తెలుగులో యథాతథంగా కాపీ చేసిన పాట "అది ఒక ఇది లే ",దీనికి "బేసుమే మోఛో" అనే లాటిన్ అమెరికన్ ట్యూన్ ఆధారం,"అందాలె తొంగి చూసె "అనేది కూడా లాటిన్ అమెరికన్ ట్యూన్ లాగే అనిపిస్తుంది.

అలాగే సాహిత్య ప్రపంచంలో కూడా మాజిక్ రియలిజం అనే ప్రక్రియకొక ప్రత్యేక స్థానముంది.అసలు మాజిక్ రియలిజంలో చెయ్యితిరిగిన రచయిత మార్క్వెజ్ కొలంబియాకి చెందిన వాడే.అలాంటి ఘన చరిత్ర కలిగిన లాటిన్ అమెరికన్ దేశమైన కొలంబియా లో మాదకద్రవ్యాల ఉత్పత్తీ ,వాడకమూ కూడా యెక్కువే ,కొలంబియా చుట్టుపక్కల వుండే చిలీ,పెరూ ,బొలీవియా లలో కొకా విపరీతంగా సాగుచేస్తారు(.కొలంబియా కాఫీ తోటలకు కూడా ప్రసిధ్ధి)

ఈ కొకా మొక్క ఆకుల నుండీ తయారు చేసే కొకైన్ ప్రమాదకరమైన మత్తుపదార్థం,దీనిని కొంతమంది కొలంబియా నుండీ ఇతర దేశాలకి సరఫరా చేసి డబ్బు సంపాదిస్తూ వుండేవారు.

అప్పటి దాకా చిన్నా చితకా దొంగతనాలూ,కిడ్నాపులూ, హత్యలూ చేస్తున్న ఎస్కొబార్ చూపు కొకైన్ మాదక ద్రవ్య రవాణా వేపు పడింది. అతను నెమ్మదగా మత్తుమందులు సరఫరా చేసే వారితో చేతులు కలిపి , ఆ వ్యాపారంలో అపరిమితమైన ధన సంపాదనకు అవకాశముందని గ్రహించాడు,అయితే ఆ వ్యాపారంలో వున్న గ్రూపుల మధ్య తగాదాలూ ,హత్యలూ కూడా సర్వ సాధారణం.ఎస్కొబార్  ఈ విషయంలో అప్పటికే ఆరితేరిపోయి వున్నాడు

అతడు ఒక ప్రణాళిక ప్రకారం రిఫైన్డ్  కొకైన్ ను తయారు చేసి వివిధ మార్గాల ద్వారా అమెరికాకు సరఫరా చేయడం మొదలు పెట్టాడు.అతను "మెడిలిన్ కార్టెల్ "అనే సంస్థను (మెడిలిన్ అనే ప్రాంతంలో)ఏర్పాటు చేసుకున్నాడు,దానికి అతనే అధిపతి ,అతనితో పాటు  ముగ్గురు నలుగురు భాగస్వాములుండేవారు ochoa brothers,జువాన్ డేవిడ్ ,జార్జి లూయీ,ఫాబియో ,కానీ కొకైన్ పండించి శుధ్ధిచేసి,మార్కెట్లోకి పంపి,కాష్ తీసుకునేదాకా అతనిదే పెత్తనమంతా.

,అమెరికాకు దిగుమతి అయ్యే కొకైన్  లో 80% ఎస్కొబార్ నుండీ యెగుమతి అయ్యిందే .1980-90మధ్యలో అతను  సుమారు నెలకి80-90టన్నుల కొకైన్ సరఫరా చేసేవాడు.ఈ పనికోసం అతను  పదిహేను పెద్ద ఏరో ప్లేన్లనీ,ఆరు హెలికాప్టర్లనీ,ఒక LEAR JET ప్లేన్ నీ(కేవలం డబ్బు దాచి తీసుకురావడానికి ఉపయోగించే వారు)కొనుగోలు చేశాడు.

ఈ వ్యాపారంలో అవరోధంగా వున్న పోలీస్ ఆఫీసర్లనీ,న్యాయాధికారులనీ వీలయితే అత్యధిక మొత్తంలో లంచాలతో , లేదంటే తుపాకీ తూటాతో  నోరుమూయించే వాడు,ఈ విధానానికి అతను పెట్టిన పేరు "సిల్వర్ ఆర్ లెడ్ ".సిల్వర్ అంటే లంచం లెడ్ అంటే తుపాకీ తూటా.అంతే కాదు ఇతర మాఫియా గ్రూపులను బాంబ్ బ్లాస్టింగ్ లతో కూడా రూపుమాపే వాడు.

ఇలా 1975 లో అతని ప్రస్థానం మొదలైంది ,1979 ప్రాంతాలలో అపరిమితంగా వచ్చిపడే డబ్బుతో ఎస్కొబార్ పేద ప్రజలను ఆదరించడం మొదలు పెట్టాడు,వారికోసం ఇళ్లు నిర్మించడం,ఫుట్ బాల్ సాకర్ స్టేడియంలు నిర్మించడం,ఫుట్ బాల్ మాచెస్ ని స్పాన్సర్ చేయడం,స్కూళ్లూ,చర్చ్ లూ నిర్మించడం ఇలాంటి పనులతో వారిని ఆకట్టుకున్నాడు.కొలంబియా ప్రజలు అతన్ని "పేద ప్రజల రాబిన్ హుడ్ "లాగా భావించారు,దైవంలాగా కొలవ సాగారు.దానితో 1980 ప్రాంతాలలో ఎస్కొబార్ కి ఒక  దురాలోచన కలిగింది,తాను రాజకీయాలలో ప్రవేశించి వెలిగి పోవాలనీ,వీలయితే కొలంబియా ప్రసిడెంట్ పదవిని వరించాలనీ.

అదే అతని పతనానికి దారితీసిందని విశ్లేషకుల అభిప్రాయం ,అతని సొంత కొడుకు కూడా  అదే మాట చెప్పాడు. 1982 వ సంవత్సరంలో అతను రాజకీయాలలోకి ప్రవేశించాడు కొలంబియా ఛాంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కి ఆల్టర్నేట్ మెంబర్ గా యెన్నికయ్యాడు,అయితే అతని నేరజీవితం గురించి అభ్యంతరం లేవనెత్తి అతనిని పార్లమెంట్ లో అడుగు పెట్టనివ్వలేదు కొలంబియా రాజకీయ ప్రపంచం.అతని మీద వున్న కేసులన్నీ తిరగ దోడేందుకు సిధ్ధమయ్యారు.అమెరికా  కూడా తమ దేశంలోకి మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ఎస్కొబార్ ని పట్టి తమకు అప్పజెప్పమని కొలంబియా గవర్నమెంట్ ని కోరసాగింది.కొలంబియా గవర్నమెంట్ ఇరవైమంది డ్రగ్ ట్రాఫికర్లని పట్టి అమెరికాకు అప్పజెప్పింది.అమెరికా జైళ్లలో వాళ్లు పడే అవస్థల గురించి విన్న ఎస్కొబార్ ప్రాణం పోయినా అమెరికా కు చిక్కకూడదను కునే వాడు"అమెరికా జైల్లో శిక్ష అనుభవించే కంటే కొలంబియాలో చావడం మేలు" అనేవాడు

రాజకీయంగా తనకు జరిగిన అవమానం సహించలేని ఎస్కొబార్  తన ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించాడు,సుప్రీంకోర్టు భవనాన్ని M19 గెరిల్లాలకు (లెఫ్ట్ వింగ్ కమాండర్స్ )సపోర్ట్ గా వుండి బాంబ్ బ్లాస్ట్ చేయించాడు ,అనేక మంది జడ్జిలు చనిపోయారు ,అతని నేరాలకి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి,ఇంకొంత మంది జడ్జీలను విడిగా చంపించాడు.

అంతే కాక 1989లో జరిగిన విమాన ప్రమాదంలో(Avianca 203flight) కూడా ఎస్కోబార్ హస్తముందనీ అతని ప్రమేయంతోనే బాంబునమర్చారనీ ,అందువల్ల వందకుపైగా ప్రాణ నష్టం జరిగిందనీ తెలిసింది,అంతేకాదు  ప్లేన్ ప్రమాదం సంభవించిన తొమ్మిది రోజుల తర్వాత DAS building మీద బాంబుదాడి జరిగింది,ఆ దాడిలో అరవైమూడు మంది చనిపోగా ,రెండువేల మంది పైగా గాయపడ్డారు.ఎస్కొబార్ జరిపే దారుణ మారణ కాండలతో గానీ,ఇతర డ్రగ్ ట్రాఫికర్స్ వలనజరిగే దారుణాలతో  గానీ ప్రతి రోజూ కొలంబియాలో సగటున రోజుకు 79మంది మరణిస్తూ వుండేవారు,ప్రపంచం మొత్తానికీ కొలంబియా "హత్యల రాజధాని" Murder capital గా మారిందనుకునేవారు. ఈ సంఘటనలన్నీ కొలంబియన్ గవర్న మెంట్ చాలా తీవ్రంగా  పరిగణించింది .

ఎస్కొబార్ కోసం వేట ప్రారంభమైంది,ఒకపక్క నుండీ కొలంబియన్ గవర్న మెంటూ,ఇంకో పక్కనుండీ అమెరికన్ గవర్న మెంటూ తీవ్రమైన ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టారు. అతని శత్రు వర్గంలోని(ఇతర డ్రగ్ ట్రాఫికర్స్ )  వారు  కూడా అతని కుటుంబాన్ని టార్గెట్ చేసి బాంబుదాడులు జరుపుతుండడంతో ఎస్కొబారు గవర్నమెంట్ తో సంధి ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

ఇక్కడ అతని కుటుంబం గురించి కొంచెం చెప్పాలి.

అతను తన ఇరవయి ఆరవయేట 1976లో తన కంటే పదకొండేళ్ల చిన్నదైన మేరియా విక్టోరియా హనావూ ని ప్రేమించి పెళ్లాడాడు.వారికి ఇద్దరు పిల్లలు జువాన్ పాబ్లో అనే అబ్బాయి, మనూలాఅనే అమ్మాయి. .ఎస్కోబార్ తన ఫామిలీని చాలా ప్రేమించే వాడు ,వారికోసం యేదైనా చేసేవాడు ఒక సారి అడవిలో ఒక ఇంట్లో కుటుంబం మొత్తం తలదాచుకోవాలసి వచ్చినప్పుడు చలికి తట్టుకోలేకపోతున్న తన కుమార్తె నువెచ్చగా వుంచటం కోసం రెండు గోతాలలో వున్న రెండు మిలియన్ డాలర్ల నోట్లతో చలిమంట వేశాడట! అతని కి యెన్నో వివాహేతర సంబంధాలున్నప్పటికీ భార్యాభర్తల అనురాగబంధం చెక్కుచెదరకుండా వుండేది.

ఎస్కొబార్ గవర్నమెంట్ తో చర్చలకు దిగి వచ్చాడు ,అతనికి అయిదు సంవత్సరాల జైలు శిక్ష విధించారు ,అయితే దానికి అతను కొన్ని షరతులు విధించాడు ,తనను వేరే జైలుకు పంప కూడదనీ, తన జైలు తానే నిర్మించుకుంటాననీ,పోలీసు పహరా ,ప్రభుత్వ అధికారులూ ఆ జైలుకి మూడుకిలో మీటర్ల దూరంలో వుండాలనీ,తాను హింసను విడనాడు తాననీ ,శాంతియుత జీవనం గడుపుతాననీ.

 కొలంబియా ప్రధానమంత్రి సీజర్ గవేరియా ఈ షరతులన్నింటికీ అంగీకరించాడుఎస్కొబార్ ఒక సుందర ప్రదేశంలో  La catadrel పేరుతో తన జైలు తానే నిర్మించుకుని తన పరివారంతో 1991 లో ఆ జైలులో ప్రవేశించాడు.పేరుకే అది జైలు గానీ,అందులో లేని సౌకర్యాలు లేవు .ఒక జలపాతం,ఒక ఫుట్ బాల్ ఫీల్డ్ ,ఒక కాసినో,ఒకjacuzzi,ఒక డాల్ హౌస్ ఇలా అన్నీ వున్నాయి.

అతన్ని కలుసుకునే వాళ్లు కలుస్తూనే వున్నారు,డ్రగ్ ట్రాఫికింగ్ జరుగుతూనే వుంది .అలా ఒక సంవత్సరం గడిచే లోపు ఇద్దరు బడా బాబులని డ్రగ్ మాఫియాకి చెందిన వాళ్లని  వ్యాపార లావాదేవీలలో వచ్చిన తగాదాలో ఎస్కొబార్ ఆ జైలు లొనే చంపి  తగలబెట్టి సాక్ష్యం లేకుండా చేశాడనే విషయం బయటకు పొక్కింది.

ఇవన్నీ గమనించిన ప్రభుత్వం పోలీసు బలగాలని పంపి ఆ జైలు నుండీ ఎస్కొబార్ ని వేరే జైలుకి తరలించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇది తెలుసుకున్న ఎస్కొబార్ పోలీసులు చుట్టుముడుతుండగానే ఎవరికీ కనిపించకుండా మాయమయ్యాడు.ఇది జరిగింది.

పాబ్లో ఎస్కొబార్ తన సహచరులతోనూ ,కుటుంబంతోనూ ,తనను చుట్టుముట్టిన పోలీసుల కన్నుగప్పి యెలా జైలు La catadrel నుండీ తప్పించుకున్నాడన్నది పెద్ద మిస్టరీ.

అతనున్న జైలు పరిసరాలు Andes పర్వతాల పాదాల వద్ద వుండటంతో ఆరాత్రిపూట యేర్పడిన మంచు తెరల మధ్యలోనుండీ పర్వతాల మీదకు పారిపోయి వుంటారని ఒక భావన .ఈ పర్వత శ్రేణి లాటిన్ అమెరికన్ దేశాలకు పశ్చిమంగా చుట్టుకుని వుంటుంది.అంతే కాదు  నిగూఢమైన అనేక లోయలతోనూ ,అగ్నిపర్వతాలతోనూ నిండి వుండి ,అనేక ఎడారులను కూడా చుట్టి సాగుతుంది.

కొలంబియాలోని ఈ పర్వతాల ఆనుపానులు ఎస్కొబార్ కి కొట్టినపిండి.ఇంకా కొంతమంది అతను రహస్య సొరంగ మార్గం ద్వారా బయటకు వెళ్లి , అడవులలోకి వెళ్లి వుంటాడని ఊహించారు. ఏది యేమైతేనేం అలా జూలై 1992లో తప్పించుకున్న ఎస్కొబార్ దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు అతని జాడ కూడా తెలియకుండా రహస్య జీవితం గడిపాడు

అయితే కొలంబియా అధ్యక్షుడు సీజర్ గవేరియా, అమెరికా ప్రభుత్వమూ ఎస్కోబార్ షరతులను ఉల్లంఘించి తప్పించుకు పోవడాన్ని చాలా తీవ్రంగా పరిగణించాయి ,అతనిని ప్రాణాలతో పట్టుకో గలిగితే సరే లేదంటే మట్టుపెట్టడానికయినా సిధ్ధమయ్యాయి.కొలంబియా టాస్క్ ఫోర్స్ "సెర్చ్ బ్లాక్ search bloc"అనే గ్రూపును తయారు చేసింది,అమెరికన్ ప్రభుత్వం( "సెంట్రా స్పైక్ "అనే దళాన్ని యేర్పాటు చేసింది ,ఈ రెండింటికీ తోడు పాబ్లో ఎస్కొబార్ వలన చనిపోయిన కుటుంబాల వారూ,బాధితులూ కలిసిLos pepes అనే పేరుతో ఎస్కొబార్ ను వేటాడ సాగింది ,ఈ దళానికి ఆర్థిక సహాయం ఎస్కొబార్ ప్రత్యర్థి  (డ్రగ్ ట్రాఫికర్ )ముఠాల నుండీ అందుతూ వుండేది.

ఇలా మూడురకాల దళాలు ఎస్కొబార్ ని మట్టుపెట్టడానికి కంకణం కట్టుకున్నాయి,అయితే అతనికి పేద ప్రజలలో వున్న రాబిన్ హుడ్ ఇమేజ్ వలన చాలాకాలం ప్రజలు అతనిని కాపాడుతూ వచ్చారు ,చివరికి వచ్చేసరికి ఈ బాంబ్ బ్లాస్టులూ ,మారణ హోమాలతో వారుకూడా విసిగిపోయారు.

లా పెపీస్ అనే గ్రూపు ముఖ్యంగా చాలా భీభత్సం సృష్టించింది,అతని రహస్య స్థావరాలను,మందు గోడౌన్లనూ ధ్వంసం చేసింది,అతని బంధువులను హింసించింది,అతని లాయర్నీ కుటుంబంతో సహా మట్టుబెట్టింది, ఇంకాఅతనికిదగ్గరగా మసిలే  అంగరక్షకులు మూడువందల మందినీ వెంటాడి వేటాడి చంపింది.

 తన బంధువులకీ,తన కుటుంబానికీ రక్షణ కొరవడుతోందని భావించిన ఎస్కొబార్ తన భార్యా బిడ్డలని వేరే దేశానికి పంపించి వాళ్లను కాపాడుకుని,తానొక్కడే పోరాడదామనుకున్నాడు.ఈ సందర్భంలో ఎస్కొబార్ భార్యా ,కొడుకూ అతనిని యెంతో బతిమిలాడేవారు హింసాప్రవృత్తి వీడమనీ,ప్రభుత్వానికి లొంగిపొమ్మనీ .అతను ససేమిరా ఒప్పుకునే వాడు కాడు.

సరే భార్యా బిడ్డలు నవంబర్ 1993 లో జర్మనీకి బయలుదేరారు,ఈ విషయం తెలుసుకున్న కొలంబియా ప్రెసిడెంట్ ,జర్మనీ లో వాళ్లకు ఆవాసం ఇవ్వద్దని జర్మన్ ప్రభుత్వాన్ని కోరాడు, జర్మనీ ఏర్ పోర్ట్ నుండీ వాళ్లు మళ్లీ తిరుగు విమానంలో కొలంబియా వచ్చి ప్రభుత్వ కస్టడీలో ఒక భవనంలో వుంచబడ్డారు,వాళ్ల మీద యే నేరారోపణా లేకపోయినప్పటికీ

ఇదంతా ఎస్కొబార్ ని చాలా బాధించింది,అతను అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు .అతని బలం,బలగం అంతా తగ్గిపోయింది,అతని అనుచరులలో చాలామంది చనిపోయారు,కొంతమంది ప్రభుత్వానికి పట్టుబడ్డారు ,ఇంకొంతమంది ఇన్ ఫార్మర్లుగా మారిపోయారు. ఈ పరిస్థితులలో అతను ప్రభుత్వాన్ని తన కుటుంబానికి యేదో ఒక దేశంలో ఆశ్రయం కల్పించమనీ,లేకపోతే మారణ హోమం సృష్టిస్తాననీ బెదిరించ సాగాడు.

1993 డిసెంబర్ ఒకటవ తేదీ తన 44వ పుట్టిన రోజు జరుపుకున్నాడు పాబ్లో ఎస్కొబార్, ఆ సందర్భంగా ఒక రహస్య స్థావరం నుండీ భార్యా బిడ్డలతో ఫోన్లో మాట్లాడాడు,అతని ఫోన్ ను ఆధునిక మైన టెక్నాలజీ తో  కొలంబియన్ ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్  టీమ్ టాప్ చేసి అతనెక్కడున్నాడో కనిపెట్టే ప్రయత్నాలు చేస్తోంది,కానీ కనిపెట్టలేక పోయింది ,కొద్దిలో తప్పించుకుంటున్నాడు ప్రతి సారీ.

1993 డిసెంబర్ 2 వ మళ్లీ అతను తన కొడుకుకి ఫోన్ చేస్తున్నప్పుడు ,అతనున్న ప్రదేశం కనిపెట్టారు.మెడిలిన్ లో ఒక మధ్య తరగతి అపార్ట్ మెంట్లో ఫోన్ లో మాట్లాడుతూ కిటికీలోనుండీ అస్పష్టంగా కనపడ్డాడు. కొలంబియన్ సెర్చ్ బ్లాక్ టీమ్  కి చెందిన యెనిమింది మంది సాయుధులైన యోధులు తలుపులు విరగగొట్టి లోపలకు చొరబడ్డారు. ఎస్కోబార్ అతనితో వున్న ఒకే ఒక్క అనుచరుడూ వాళ్ల శక్తి వంచన లేకుండా పోరాడారు, చివరికి వాళ్లిద్దరూ ఇళ్ల మిద్దెల మీదకెక్కి అవతల వీధిలోకి దూకి పారిపోదామని ప్రయత్నిస్తుండగా తుపాకి తూటాలకి బలిఅయి చనిపోయారు. ఎస్కొబార్ కు ,కుడికణత నుండీ దూసుకుపోయిన తూటా తో ప్రాణం పోయిందని నిర్థారించారు.అతని భార్యా పిల్లలూ,బంధువులూ  "ప్రాణాలతో పట్టుబడను,ఒక వేళ పట్టుబడవలసి వస్తే ,కణత దగ్గర కాల్చుకుని చనిపోతాను" అని అతను  చెప్పేమాటలు గుర్తు చేసుకుని, అది హత్య కాదు ఆత్మహత్యే అంటారు.

అతన్ని అభిమానించే ప్రజలు సుమారు పాతికవేలమంది అతని అంత్యక్రియలలో పాల్గొన్నారు ,అలా ఎస్కొబార్ కథ ముగిసింది.మెడిలిన్ కార్టెల్ రూపు మాసిపోయింది.

అతని కథను ఎంతో మంది పుస్తకాలుగా రాశారు ,సినిమాలుగా ,డాక్యుమెంటరీలుగా చిత్రీకరించారు.Netflix లో Narcos అనే సీరియల్ రెండు సీజన్స్ లో ఇరవై ఎపిసోడ్స్ అతని కథే ,అది చాలా పాప్యులర్ అయ్యింది.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పరిగణించబడి,విలాసవంతమైన జీవితం గడిపిన అతను చివరకు యేమి సాధించాడు ,అతని ధనమే అతనికి శత్రువయింది,అతని హత్యా రాజకీయాలే అతన్ని మట్టుపెట్టాయి ,బతికినంత కాలమూ గోరంత సుఖమూ,రవ్వంత శాంతీ లేకుండా పరుగులు తీసిన అతనికి దక్కిందేవిటీ?

వీటన్నిటికీ సమాధానంగా అతని కొడుకు ఇంటర్వ్యూల్లో చెప్పిన మాటలు చాలా నచ్చాయి నాకు

ఎస్కొబార్ మరణం తర్వాత పరిణామాలు.---

ఎస్కొబార్ మరణించే నాటికి అతని భార్య వయసు 32,కొడుకు వయసు 16,కూతురు వయసు 9. అతని కుటుంబానికి కొలంబియా లో నిలవ నీడ లేకుండా పోయింది.సాధారణంగా తండ్రి చనిపోతే కొడుకు అతని వారసత్వాన్ని అందిపుచ్చుకుని అతను చేసిన పనులన్నీ మళ్లీ తాను చేసి ఆస్తులను కాపాడుకోవడానికీ,తండ్రి పేరు నిలపడానికీ తయారవడం చూస్తూ వుంటాం.

అయితే ఇక్కడ ఎస్కొబార్ కొడుకు దానికి భిన్నంగా ఒక మనిషి లాగా ఆలోచించి తాను హింసకి పాల్పడననీ,శాంతి కోసం పాటుపడటమే తన లక్ష్యమనీ ప్రకటించడమే కాదు,ఎస్కొబార్ ప్రత్యర్థి గ్రూపు అయిన కాలీకార్టెల్ వారి దగ్గరకు వెళ్లి,తామే నేరప్రవృత్తికీ పాల్పడమనీ ,తాము ఈ దేశమే వదిలి పోతామనీ ప్రాథేయ పడ్డాడు,ఈ విషయంలో తల్లి ప్రోత్సాహం కూడా వుంది .వాళ్లు వున్న సంపదనంతా తమకు వదిలి కట్టుబట్టలతో వెళ్లేందుకు అనుమతించారు.

ఎస్కొబార్ ఆస్తులన్నీ ప్రభుత్వమూ,ప్రత్యర్థి వర్గాలూ ఆక్రమించాయి ,కొన్ని ఆస్తులు పాడుపడి పోయాయి.

ఎస్కొబార్ కుటుంబానికి, వారి సొంత పేర్లతో ,ఐడెంటిటీతో ప్రపంచంలోని యే దేశమూ  ఆశ్రయం కల్పించడానికి ఇష్టపడలేదు

అప్పుడు వాళ్లు ముగ్గురూ పేర్లు మార్చుకున్నారు . 1995లో దేశం వదిలి,అనేక దేశాలు తిరిగి(మొజాంబిక్ ,బ్రెజిల్ ,పెరూ,బొలీవియా) చివరకు అర్జంటీనా లో స్థిరపడ్డారు .తల్లి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తోంది,కొడుకు ఆర్కిటెక్ట్ గానూ,మోటివేషనల్ స్పీకర్ గానూ స్థిరపడ్డాడు ,కూతురు హోమ్ మేకర్. 

ఇక్కడ కూతురి గురించి కొంచెం చెప్పాలి అల్లారు ముద్దుగానూ,తండ్రితో గాఢమైన అనుబంధంతో పెరిగిన ఆమె ,ఈ పరిణామాలు చూసి,మానసికంగా చాలా దెబ్బతింది ,ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది,తర్వాత కోలుకుంది ,ఇప్పుడు తండ్రి పేరు చెప్పడానికి కూడా ఇష్ట పడదు,కుటుంబంతో సంబంధ బాంధవ్యాలన్నీ తెంచుకుంది కూడా.

ఎస్కొబార్ కొడుకు జువాన్ పాబ్లో ఎస్కొబార్ నేడు సెబాస్టియన్  మారోక్విన్ గా పేరు మార్చుకున్నాడు, తండ్రి జీవిత చరిత్ర "పాబ్లో ఎస్కొబార్ మై ఫాదర్ "అనే పుస్తకంగా రాశాడు,ఒక డాక్యుమెంటరీ కూడా తీశాడు అందులో ,తన తండ్రి వలన మరణించిన కుటుంబాలన్నింటికీ పేరు పేరునా క్షమాపణలు చెప్పుకున్నాడు,వారి ని క్షమించమని అడుగుతూ ఉత్తరాలు రాశాడు,తర్వాత కొన్నేళ్లకు కొలంబియా వెళ్లినప్పుడు వారి సమాధులను దర్శించి పుష్పగుఛ్ఛాలుంచాడు.

ఇంకా నెట్ ఫ్లిక్స్ సీరీస్ చూసీ,ఎస్కొబార్ ని గురించి తెలుసుకుని అతన్ని ఆరాధించే వారికి అతనేం చెబుతాడంటే "మా నాన్నని హీరోగా చూడకండి,అది చాలా పెద్ద పొరపాటు  ,అతన్ని అనుసరించాలను కోకండి,అతనొక విధ్వంసకారి,అతని జీవితంలో యెంత అభద్రత,యెంత ఆందోళన,యెంత వత్తిడి వుందో నేనెరుగుదును.ఎంత డబ్బు వుంటేనేం అది ఎందుకు పనికి వచ్చింది,చివరకు అది అతని ప్రాణమే తీసింది.మనిషికి జీవితంలో కావలసింది శాంతి హింసకాదు,ఇదే నేను మానవాళికి చెప్ప దలుచు కున్నది"

ఎవరైనా ఎస్కొబార్ జీవితం గురించి తెలుసుకున్నాక బోధపడే జీవిత సత్యం అదే.

-భార్గవి


Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము