అంతర్జాతీయ తార - కబీర్ బేడీ.

బీర్ బేడీ రాసిన స్వీయచరిత్ర "Stories i must tell" ఇప్పుడే పూర్తి చేశాను.అతను హిందీ చిత్రాలలో నటించాడు,అప్పుడప్పుడూ కొన్ని విదేశీ చిత్రాలలో(జేమ్స్ బాండ్ సినిమా ఆక్టోపస్సీ) నటించాడు,సంచలన మోడల్ ,మరియూ ఒడిస్సీ నృత్య కళాకారిణి ప్రొతిమా బేడీ మాజీ భర్త ,నటి పూజాబేడీ తండ్రీ అనే గానీ పెద్దగా వివరాలు తెలియవు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ప్రొతిమా బేడీ ఆత్మకథ "టైమ్ పాస్ " చదివి చాలా కదిలిపోయాను ,మొహం బద్దలయ్యే నిజాలున్నాయందులో. అందుకే ఇతని ఆటోబయోగ్రఫీ కోరి తెప్పించుకున్నాను అమెజాన్ నుండీ.

కబీర్ బేడీ జీవితం రోలర్ కోస్టర్ రైడ్ ను తలపిస్తుంది.అతని తండ్రి బాబాబేడీ పంజాబీ, తల్లి  ఫ్రీదా బ్రిటీష్ వనిత ,ఇద్దరూ ఆక్స్ ఫర్డ్ లో చదువుకునేటప్పుడు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.ఇద్దరివీ బలమైన వ్యక్తిత్వాలే అయినా తల్లిది మరింత బలమైన పర్సనాలిటీ అనిపించింది.వారి పెళ్లి నాటికి స్వతంత్ర సమరం మంచి ఊపులో వుంది, అతని తండ్రి కమ్యూనిస్ట్ భావాలతో దేశం కోసం పోరాడి జైలు పాలయితే తల్లి గాంధీ గారి ఆజ్ఞమేరకు సత్యాగ్రహోద్యమంలో పాలు పంచుకుని జైలు పాలయింది.ఆ తర్వాత వాళ్లిద్దరూ ఆధ్యాత్మిక మార్గంలో పడ్డారు తండ్రి తత్త్వవేత్తగానూ ,హీలర్ గానూ ఇటలీలో స్థిరపడితే,తల్లి బుధ్ధిజాన్ని అనుసరిస్తూ బౌధ్ధ సన్యాసినిగా జీవితాన్ని గడిపి అలాగే తనువు చాలించింది.

కబీర్ బేడీ బాల్యమంతా ఢిల్లీ,లాహోర్ ,కాశ్మీర్ లలోనూ,హిమాలయ పర్వత పాదాల దగ్గరా ప్రశాంత మైన ప్రకృతి ఒడిలో గడవడమూ,ప్రతిభా వంతులైన  తల్లిదండ్రుల ప్రభావమూ అతని బుధ్ధి వికసించడానికీ,వివిధమైన అభిరుచులతో కూడిన వ్యక్తిత్వాన్ని యేర్పరుచుకోవడానికి దోహదం చేయడమే కాక ఒక ఓపన్ మైండ్ తో ఆలోచించే స్వభావం అలవడటానికి దోహదం చేశాయనిపిస్తుంది. అతని చదువు ఢిల్లీ,నైనిటాల్ ,శాంతినికేతన్ లలో సాగింది.ఢిల్లీలో చదువుకునేటపుడు రాజీవ్ గాంధీ,సంజయ్ గాంధీ ఇతని సహాధ్యాయులు,వారి కుటుంబంతో ఇతని తల్లిదండ్రులకు కూడా సన్నిహిత సంబంధాలుండేవి.

యుక్త వయసులో రేడియో లోనూ,టీవీలోనూ చేసిన ఉద్యోగాలూ,కాలేజ్ లో వేసిన నాటకాలూ ఇతనికి కళ పట్ల ఆసక్తిని రగిల్చాయి.ఆలిండియా రేడియోలో పని చేసేటపుడు ఇతను "బీటిల్స్ గ్రూపు" ను చేసిన ఇంటర్వ్యూ సంచలనాత్మకమైనది. ఢిల్లీ నుండీ అతను సినిమా అవకాశాలు వెతుక్కుంటూ బొంబాయి చేరాడు,బొంబాయిలో కొంతకాలం మోడలింగూ,అడ్వర్టయిజింగ్ రంగాలలో పనిచేస్తూ ,నాటకాలలో కూడా నటించాడు.

అలేక్ పదమ్ సీ నేతృత్వంలో గిరీష్ కార్నాడ్ రచించిన "తుగ్లక్ "నాటకంలో  నటించిన పాత్ర ఇతనికి చాలా పేరు తీసుకువచ్చింది. మోడలింగ్ రంగంలో పనిచేస్తున్న ప్రొతిమా బేడీ పరిచయం,గాఢంగా పరిణమించడం,ఇద్దరి సహజీవనం అప్పట్లో సంచలనం రేకెత్తించింది.ఇద్దరూ పెళ్లిచేసుకుని ఇద్దరు పిల్లలకి పూజా ,సిధ్ధార్థ్ లకి జన్మనిచ్చారు.

ప్రొతిమా ఒడిస్సీ నృత్యం వేపు ఆకర్షితురాలై ,ఆ దిశగా  ప్రయాణించడం ,కబీర్ బేడీకి పర్వీన్ బాబీతో ఇంకా ఇతరులతో ప్రణయాలూ ఇవన్నీ వారి జీవితాన్ని యెలా అతలా కుతలం చేశాయో ఇద్దరూ యెలా విడిపోయారో  అతని వేపునుండీ వివరించాడు.

ఇంకా అతనికి బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు కానీ,ఇటలీ లో అతనికొక స్టార్ ఇమేజ్ వచ్చింది,అలా రావడానికి అతను అక్కడి టి.వీ .సీరీస్ లో నటించిన "సాందోకన్ "అనే సిరియల్ .అది యెంత సూపర్ డూపర్ హిట్టంటే దాన్ని ఈనాటికీ యూరోపియన్ దేశాలన్నీ ఇష్టంగా చూస్తాయి.ఇటాలియన్స్ కబీర్ బేడీని నెత్తిన పెట్టుకుని దేవుడిలాగ పూజిస్తారు,అతనికి అనేక అవార్డులిచ్చారు,ఆ తర్వాత కూడా అతను అనేక ఇటాలియన్ పిక్చర్స్ లోనూ,టి.వీ సీరియల్స్ లోనూ నటిస్తూ రోమ్ లో చాలాకాలం వుండి పోయాడు.

కొన్నాళ్లు అతను హాలీవుడ్ చిత్రాలలో నటిస్తూ లాస్ యాంజలిస్ లోనూ వుండి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.అప్పుడే "ఆక్టోపస్సీ"లో విలన్ గోబిందా గా నటించాడు. అయితే అతనికిహాలీవుడ్ లో తన కెరీర్ అంత సంతృప్తికరంగా అనిపించలేదు,ఆర్థికంగా కూడా కొన్ని పెట్టుబడులు నష్టాన్ని తీసుకు వచ్చాయి. అప్పుడు ఇంగ్లండ్ చేరుకుని అక్కడ థియేటర్ లలో నాటకాలో నటించడం మొదలు పెట్టాడు.మళ్లీ బాలీవుడ్ నుండీ ,ఇటలీ నుండీ కూడా అవకాశాలు రాసాగాయి.ఇప్పుడు తన జీవిత చరమాంకంలో రిటైర్మెంట్ అనేది లేకుండా బాలీవుడ్ కీ, ఇటలీకి, ఇంగ్లండ్ కీ మధ్య తిరుగుతూ కళాకారుడుగా  జీవనప్రస్థానాన్ని సాగిస్తున్న కబీర్ బేడీ----ఈ పుస్తకంలో తన సినిమా విశేషాలే కాదు,తన నాలుగు వివాహాల గురించీ,తన పరిచయాల గురించీ,తన తల్లిదండ్రుల వ్యక్తిత్వాల గురించీ,తన కొడుచు సిధ్ధార్థ్ హఠాన్మరణానికి దారి తీసిన పరిస్థితులగురించీ,తాను నటించిన సినిమాల గురించీ,తనకి పరిచయమైన జాతీయ అంతర్జాతీయ సినీ ప్రముఖుల గురించీ,ఆసక్తికరంగా రాసిన విశేషాలున్నాయి. సినీ ప్రియులు,జీవిత చరిత్రలంటే ఆసక్తి వున్నవారూ తప్పక చదవ వలసిన పుస్తకం.

-భార్గవి - 26 july 2021.

 

Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము