భగ్నమయిన వొక సుందర స్వప్నం

 

హిందీ సినిమా పాటల ప్రియుల పాలిట భగ్నమయిన వొకసుందర స్వప్నం గీతాదత్. మొట్టమొదటి సారి ఆమెగొంతువిన్నపుడు వొక వుద్వేగానికి గురయ్యాను నేను, యేవిటీ యీ గొంతు యింత లాగేస్తోంది, యేముందీ గొంతులో అని గిలగిలా కొట్టుకున్నాను  వరసగా ఆమె పాటలువింటుంటే పిచ్చెక్కి పోతుంది నాకు ఆరేంజ్ చూసి .నిర్వచనాలకి అందని యిమిటేషన్ కి లొంగనీ గొంతు ఆమెది . ఆమె పాటలోని ప్రత్యేకతయేమిటంటే పాడే పాటకి జవం,జీవం,మార్దవం ,మాధుర్యం అద్ది తన సొంతంచేసుకోవడం అందుకనే అదే పాట వేరెవరి నోటయినా వింటే చప్పగా వుంటుంది.

ఒక లాలి పాట గానీ ప్రేమగీతం గానీ,క్లబ్ సాంగ్ గానీ,భజన్ గానీ విషాద గీతిగానీ ,హాస్యగీతం గానీ యే పాట నయినా తన గొంతులో అవలీలగా పలికించడమే కాక దానికి నూటికి నూరుపాళ్లూ న్యాయం చేయడం ఆమెను అత్యున్నత నేపథ్య గాయనిగా నిలబెట్టాయి.

గులాబీ రేకులోని సౌకుమార్యం,మొగలిరేకులోనిమెత్తగా గుచ్చుకునే గుణం ,పచ్చకర్పూరంలోనిచల్లదనంతో కూడిన పరిమళపు ఘాటూ ఇవన్నీ గుర్తొస్తాయి నాకు ఆమె పాట విన్నపుడు .ఒక్క మాటలో చెప్పాలంటే వొక లతా, వొక ఆశా ,వొక షంషాద్ బేగం కలిస్తేవొక గీతా దత్ అనిపిస్తుంది నా మటుకు నాకు. ఆమె గాన ప్రయాణం పరిశీలించితే ఆమె కెరీర్ లో యెలా యెదిగిందో యెలా క్షీణ దశకు చేరుకుందో అవగత మవుతుంది.

ఆమె అసలుపేరు గీతా ఘోష్ రాయ్ చౌధురీ ఫరీద్ పూర్లో (నేటి బంగ్లాదేశ్ )1930నవంబర్ 23న జమీందార్ల కుటుంబంలో పదిమంది సంతానంలో వొకతెగా జన్మించింది .ఆ తర్వాత కొంతకాలానికి ఆకుటుంబం ఆస్తులనూ భూములనూ వదులుకుని కలకత్తా చేరుకుంది. అటు పిమ్మట బొంబాయి మకాం మార్చారు.అప్పటికి గీతా హైస్కూల్ లో చదువుతోంది. 

ఇంట్లో కూనిరాగాలు తీస్తూ అటూ ఇటూ తిరుగుతుంటే ఆమెగొంతు విని ముచ్చటపడి కె.హనుమాన్ ప్రసాద్ అనే సంగీతదర్శకుడు ఆమె తల్లి దండ్రుల అనుమతి తీసుకుని ఆమెచేత "భక్త ప్రహ్లాద "అనే సినిమాలో 1946లో రెండులైన్లు పాడించాడు. పాడింది రెండు లైన్లయినా అది యస్ డి బర్మన్ చెవిని పడటం ఆయన ఆమెలోని ప్రతిభ గుర్తించి తన చిత్రంలో "దోభాయీ "లో అవకాశం యివ్వడం జరిగింది. 

"మెరా సుందర్ సప్నా బీత్ గయా "అన్న ఆపాట ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది కొంత మంది ఆమెను "బెంగాలీ మాజిక్ " అని పిలవ సాగారు. ఆతర్వాత ఆమె వెనుదిరిగి చూడలేదు"మహల్ "లో "ఆయెగా ఆనే వాలా "తో హిట్ కొట్టిన లతా అప్పటిదాకా పాప్యులర్ సింగర్ గా వున్న షంషాద్ బేగం ఆమెకు పోటీ కాలేక పోయారు.

 ఆమెను గుర్తించినది హనుమాన్ ప్రసాద్ అయినా ప్రతిభకు తగిన అవకాశాలిచ్చి ప్రోత్సహించినది యస్ డి బర్మన్ ,ఓపి నయ్యర్ తర్వాత హేమంత్ కుమార్ . ఇంతలో ఆమెజీవితం మలుపు తిరిగింది బర్మన్ దా దర్శకత్వంలో దేవానంద్ సొంత సినిమా"బాజీ "లో "తడ్ బీర్ సే బిగిడీ హుయీ తక్ దీర్ బనాలే "పాట పాడేటపుడు ఆమె తకదీర్ కూడా మారుతుందని ఆమెకూడా వూహించి వుండదు అప్పుడు పరిచయమైన ఆచిత్ర దర్శకుడు గురుదత్ తో గాఢమయిన ప్రేమలోపడి రెండేళ్ల తర్వాత అతనినే పెళ్లాడింది ఆ సమయానికి అతను అప్పుడప్పుడే పైకి రావడానికి యిబ్బందులు పడుతున్న దర్శకుడు ఆమె అప్పటికే గాయనిగా లబ్ద ప్రతిష్ఠురాలు.

అవేమీ ప్రేమకు అడ్డురాలేదుకానీ అతను ఆమెను సంపాదనకోసం పెళ్లి చేసుకున్నాడని వాళ్లూ వీళ్లూ చెవులు కొరుక్కోవడం గురుదత్ చెవినపడి ఆమె బయట చిత్రాలలో పాడకూడదనే ఆంక్ష విధించాడంటారు వొకరకంగా అది ఆమె కెరీర్ ని దెబ్బ తీయడానికి వొక కారణమయ్యిందంటారు.అయితే వారి సొంతచిత్రాలలో బర్మన్ ,నయ్యర్ ,హేమంత్ ల సంగీత సారథ్యంలో పాడినవి యెటువంటి పాటలూ ,సిఐడీ,ఆర్ పార్ ,మిస్టర్ అండ్ మిసెస్ 55,ప్యాసా,సాహెబ్ బీబీ అవుర్ గులామ్ వీటిలోవి పాటలా రసగుళికలు కాదూ!

 ఆమే ,రఫీ కలిసీ విడిగానూ ఆపాటల్లో వొలికించింది మాధుర్యం కాదు అమృతం.ఆ తర్వాత వారి వైవాహిక జీవితం లో వచ్చిన వడుదుడుకులు(కారణం వహీదానో గురుదత్ మానసికస్థతో) ఆమె కెరీర్ మీదకూడా ప్రభావంచూపించడం మొదలయింది1958ప్రాంతాలలో బర్మన్ దాకి లతాతో వచ్చిన విభేదాల కారణంగా గీతానే ప్రధాన గాయకి గా ప్రోత్సహిద్దా మనుకుంటే ఈమె తగినంత సాధన చేసి ఆయనకు కావలసిన స్థాయిలో పాడలేక పోయింది తన వ్యక్తిగత సమస్యలతో దానితో అప్పటిదాకా గొంతు పచ్చిగా వుందని పక్కన పెట్టిన ఆశాకి అవకాశాలన్నీ దక్కాయి నయ్యర్ దగ్గరా అదే పరిస్థితి.

1964లో గురుదత్ ఆకస్మిక మరణం ఆమెను కుంగ దీసింది ఆర్నెల్లు దాటాక కానీ మనిషి కాలేక పోయింది వొక్కసారిగా చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలూ కోల్పోయిన కెరీర్ ,భర్త పోయిన దిగులూ ఆమెను మద్యానికి బానిసను చేశాయి దుర్గాపూజల్లో పాడినా స్టేజ్ షోలిచ్చినా అడపా దడపా సినిమాలలో పాడినా అన్నీ విఫల ప్రయత్నాలే అయ్యాయి చివరగా 1971లో "అనుభవ్ "కానూరాయ్ దర్శకత్వంలో పాడిన పాటల్లో కూడా గొంతు మనలిని నిరాశ పరచదు 1972 లో లివర్ సమస్యతో శాశ్వతం గా ప్రపంచం నుండీ శెలవు తీసుకుంది ట్రిజెడీ క్వీన్ గీత అయితే మాత్రం ఆమెలేదు ఆమె మధురమయిన పాట వుంది "కోయి దూర్ సే ఆవాజ్ దే చలే ఆవో " అని వినంగానే మనసు మధురంగా కరిగి పోదూ లాంగ్ లివ్ గీతా.

https://www.youtube.com/watch?v=cQjXKdyp_wM&feature=share

-భార్గవి


Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము