పర్వీన్ బాబీ - ఓ విషాద నిషాదం


ఆమె జీవితం గురించి చెప్పాలంటే ,వ్యథాభరిత జీవితమనీ,పగిలిన అద్దం అనీ,విరిగిన శిల్పమనీ,రంగు వెలిసిన చిత్రమనీ ఇలా  తేలిగ్గా నాలుగు మాటల్లో చెప్పేయచ్చేమో కానీ , ఒక మనిషి గా ఆమె జీవించిన జీవితం కదా అది, ఆ జీవితంలో ఆమె మోసిన అభద్రతలనీ,తట్టుకున్నయెడబాటులనీ,భగ్నమయిన కలలనీ ,తుంచుకున్న ఆశలనీ,యెదుర్కొన్న ఒంటరి తనాన్నీ, బతికి వున్నంత కాలం ఒక్క నిమిషం నిలవనీకుండా చేసి  సముద్రపు అలలవలే ముంచెత్తి పిచ్చెక్కించిన ఆలోచనలనీ వ్యక్తీకరించడానికి అక్షరాలు సరిపోతాయా అనిపించింది,ఆమె జీవిత చరిత్ర చదివాక.

పర్వీన్ బాబీ హిందీ చలన చిత్ర సీమలో ఒకప్పటి గ్లామర్ క్వీన్ .కొంచెం వెస్టర్న్ లుక్ తో జీనత్ అమన్ లాగే సినీ ప్రియులను అలరించిన బ్యూటీ. దాదాపు యాభై,అరవై హిందీ సినిమాలలో నటించింది.అందులో  యెనిమిది సినిమాలు అమితాబ్ తో నటించినవి హిట్లూ,సూపర్ హిట్లూ.ఆమె నటించిన సినిమాలలో కొన్ని ముఖ్యమైన వాటి పేర్లు "దీవార్ ,అమర్ అక్బర్ ఆంథోనీ,కాలా పత్థర్ ,షాన్ ,ది బర్నింగ్ ట్రైన్ ,నమక్ హలాల్ " ఆమె వేసే పాత్రలలాగే ఆమె  ప్రవర్తన కూడా డేరింగ్ గా ,డాషింగ్ గా వుండేది.

కానీ నిజం చెప్పాలంటే ఆమె  ఒక ఇంట్రోవర్ట్ ,తెలివైనది,స్నేహితుల పట్లా ,సన్నిహితుల పట్లా విశ్వాస పాత్రంగా వుండేది,వారి నుండీ కూడా అలాంటి విశ్వాసాన్నే ఆశించేది.అక్కడే వచ్చేది చిక్కంతా, ఆ సన్నిహితంగా వుండే మగవాడికి అవతల భార్యా పిల్లలు వుండటమో,లేదా ఇతర ఆకర్షణలు వుండటమో అనివార్యం కదా,అదీమెకు ప్రాణకంటకంగానూ,అతనికి ప్రాణ సంకటం గానూ పరిణమించేది.

కలలతో వ్యాపారం చేసే సినీ మాయా ప్రపంచం తో ఆకర్షించబడి ,అందులో ప్రవేశించిన కళాకారులలో చాలామంది ,దీపం చుట్టూ తిరిగే పురుగుల్లాగా ఆహుతి అవడం చూస్తూ వుంటాం. పరిశ్రమలోనివత్తిడినీ,పోటీనీతట్టుకోలేకఆత్మహత్యల పాలవడమో,మతిపోగొట్టుకోవడమో,మద్యానికి దాసులవ్వడమో సర్వ సాధారణంగా మారిపోయిన ప్రపంచమది.(చాలాకొద్దిమంది వహీదా రెహమాన్ ,ఆశాపారేఖ్ లలాంటి వాళ్లు మాత్రం వృత్తి పరమైన ఒత్తిడులు తమ వ్యక్తిగతమైన జీవితం మీద పడకుండా ఒక సమతౌల్యం సాధించినట్టు కనపడుతుంది) అలాంటిఒక కన్నీటి కథే పర్వీన్ బాబీది కూడా.

ఆమె సినిమాలలోకి 1973లో ప్రవేశించింది ,ఆమె చివరి చిత్రం 1992లో రిలీజయింది ,అయితే మధ్యలో రెండు సార్లు ఆమె యెవరికీ చెప్పకుండా నటిస్తున్న సినిమాలని మధ్యలో వదిలేసి అదృశ్యమైంది,మొదటి సారి కొద్ది గాప్ తో తిరిగి వచ్చి చిత్రాలు పూర్తి చేసింది ,కానీ రెండవ సారి( 1983--1989)సుమారు ఆరు సంవత్సరాల పెద్ద గాప్ తీసుకుని1989లో తిరిగి వచ్చేసరికి సహజంగానే ఆమె చేతిలో ఒక్క చిత్రమూ లేదు.1983 నుండీ  1992 వరకూ రిలీజయిన చిత్రాలలో ఆమె పాత్రలను కుదించి తీయడమో వేరే డూప్ లతో మేనేజ్ చెయ్యడమో చేసి విడుదల చేశారు, కొన్ని చిత్రాలలో ఆమె స్థానంలో వేరేవారిని తీసుకున్నారు కూడా,ఎందుకంటే ఆమె 1983 లో అమెరికా వెళ్లిపోయి 1989నవంబర్ లో   బొంబాయి తిరిగి వచ్చింది.

ఇలా  కెరీర్ ఉఛ్ఛస్థితిలో వున్న సమయంలో ఆమె అదృశ్యమవ్వడానికి కారణం ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడమే అనీ,ఆమె "పారనాయిడ్ స్కిజోఫ్రినియా"అనే వ్యాథితో బాధపడుతోందనీ అనేక మంది చెవులు కొరుక్కున్నారు,అనేక పత్రికలలో అనేక కథనాలు షికారు చేశాయి. ఆమెను సన్నిహితంగా యెరిగిన వారు ఇదంతా నమ్మలేక పోయారు ,అంత అందమైన,తెలివైన ,చదువుకున్న ,చక్కటి ప్రవర్తన కలిగిన పర్వీన్ బాబీకి మతి స్థిమితం కోల్పోవడం జీర్ణించుకోవడం కష్టమైంది.ఆమె మానసిక పరిస్థితికి,ఆమెకు వారసత్వంగా వచ్చిన జీన్సూ , చిన్ననాటి పరిస్థితుల ప్రభావమూ,సినీ పరిశ్రమలోని వత్తిడీ,పదే పదే భగ్నమైన ఆమె ప్రేమ సంబంధాలూ ఇవన్నీ కారణమయ్యుంటాయేమో అని   కరిష్మా ఉపాధ్యాయ్  రాసిన "పర్వీన్ బాబీ" జీవిత చరిత్ర చదివితే అనిపించింది.

అయితే ఆమె చిన్నతనం యెలా గడిచిందో ,యవ్వనం లో ఆమె యెదుర్కొన్న వత్తిడులూ ,అభద్రతలూ యేమిటో ఒకసారి చూద్దాం. పర్వీన్ బాబీ గుజరాత్ లోని జునాగడ్ లో జునాగఢ్ రాజవంశానికి చెందిన వలీ మహ్మద్ ఖాన్ బాబీకీ,జమాల్ భక్తే కీ ,పెళ్లయిన పధ్నాలుగేళ్లకి లేక లేక జన్మించిన యేకైక సంతానం. ఆమె దురదృష్టం ,ఆమె తండ్రి ప్రేమకు నోచుకోలేదు,ఆయన పర్వీన్ కి అయిదారేళ్ల వయసొచ్చేటప్పటికి ,నోటి కాన్సర్ తో మరణించాడు.ఆయన హాస్పటల్ లో జబ్బుతో వుండటం చూసిన పర్వీన్ కి మనసులో హాస్పటల్ అన్నా వైద్యులన్నా విముఖత యేర్పడింది అంటారు,అందువలనే ఆమె జీవితాంతం వైద్యం చేయించుకోవడానికి  ఇష్టపడలేదు,అదే ఆమె జబ్బును తీవ్రతరం చేసిందని చాలామంది అభిప్రాయం.

అలా తండ్రి ప్రేమకు దూరమైన పర్వీన్ తల్లి జమాల్ పర్యవేక్షణలో 54గదుల హవేలీలో ,జునాగఢ్ లో నౌకర్లూ,చాకర్లూ బంధుజనం మధ్య ఒక రకమైన ఒంటరితనంలో పెరిగింది. ఆమె హైస్కూల్ చదువు మౌంట్ కారమెల్ హై స్కూల్ అహ్మదా బాద్ లోనూ,కాలేజ్ చదువు సెంట్ జేవియర్స్ కాలేజ్ లోనూ సాగింది..ఆమె కాలేజ్ లో బి.ఏ. ఇంగ్లీష్ లిటరేచర్ చదివింది,పట్టుబట్టి ఇంగ్లీషులో పట్టు సాధించింది.కాలేజ్ లో మౌనంగా వుండేదివున్న స్నేహితులు ఇద్దరు ముగ్గురు జీవితాంతం కొనసాగారు.

ఇక్కడొక సంఘటన గురించి చెప్పాలి. హాస్టల్లో చదువుకునే రోజుల్లో అహ్మదాబాద్ లో చెలరేగిన అల్లర్లలో హాస్టల్ మేట్రన్ కొంతమంది ఆడపిల్లలను,పర్వీన్ తో పాటు ఒక బండిలో పరుపులూ,దుప్పట్ల కింద దాచి సురక్షిత ప్రదేశానికి తరలించింది అప్పటికి ఆ గండం గడిచినా,పర్వీన్ మనస్సులో అదొక పీడకలగా నిలిచిపోయి జీవితాంతం వెన్నాడుతూ వుండేది.

కాలేజ్ లో చదివే రోజుల్లోనే ఆమె తల్లి జమాల్ పర్వీన్ కి తమ దగ్గర బంధువైన ,పాకిస్థాన్ ఏర్ ఫోర్స్ లో పనిచేసే జమీల్ ఖాన్ తో 1970ప్రాంతాలలో యెంగేజ్ మెంట్ జరిపించింది.పర్వీన్ అతన్ని చాలా ఇష్ట పడింది,అతని పేరు చేతి మీద పిన్నుతో చెక్కుకుంది కూడా.ఇద్దరిమధ్యా ఉత్తర ,ప్రత్యుత్తరాలు నడిచేవి. అయితే 1971-72లో ఇండియా,పాకిస్థాన్ల మధ్య బంగ్లాదేశ్ కోసం జరిగిన యుధ్ధం ,పర్వీన్ తల్లి జమాల్ ని ఆలోచనలో పడవేసింది,ఆమె ఈ ఎంగేజ్ మెంట్ ని బ్రేక్ చేసింది,అలా పర్వీన్ తొలిప్రేమ ముక్కలయి ముగిసింది . నెమ్మదిగా ఆమె తేరుకుని మళ్లీ హృదయాన్ని కూడగట్టుకుంది,ఒకటి ,రెండు ప్రేమ బంధాలలో ఇరుక్కుంది కానీ ఆమె దృష్టి ఇప్పుడు మోడలింగ్ రంగం మీదకీ,నటన మీదకీ మళ్లింది.

ఆ రంగంలో వచ్చే డబ్బూ ,కీర్తీ ,గుర్తింపూ,స్వేఛ్ఛా ఆమెను అమితంగా ఆకర్షించాయి .ఆమె తల్లి మాటలను లెక్కచేయకుండా కోటి ఆశలతో,కలలతో బొంబాయి సినీరంగంలో 1973లో కాలుపెట్టింది  మొట్ట మొదట ఆమెను హిందీ సినీ రంగానికి పరిచయం చేయాలనుకున్న వ్యక్తి బి.ఆర్ ఇషారా.ఆయన ఒక ప్రముఖ దర్శకుడు,అహ్మదాబాద్  లో "ఏక్ నావ్ దో కినారా "సిన్మా షూటింగ్ లో పర్వీన్ బాబీ ని చూసి,ఆమె కొంచెం విభిన్నంగా కనిపించి "సిన్మాలలో నటిస్తావా?" అని అడిగాడు,ఆమె వెంటనే "కథ నచ్చితే నటిస్తా" అంది.అక్కడే వెంటనే అగ్రిమెంట్ రాయించుకున్నాడు,కానీ ఆ విషయం ఆయన బొంబాయి చేరుకున్నాక మరిచిపోయాడు.

ఎదురుతెన్నులు చూస్తున్న పర్వీన్ బాబీని అదృష్టం ఇంకో రూపంలో తలుపుతట్టింది."కాలికో" అడ్వర్టయిజ్ మెంట్ కి మోడల్ గా పనిచేస్తున్నప్పుడు పరిచయమైన మమత అనే మోడల్ ,కొత్తమొహాల కోసం వెదుకుతున్న ప్రముఖ దర్శకుడైన తన తండ్రి కిశోర్ సాహుకి ,పర్వీన్ బాబీ గురించి చెప్పింది. ఆయన పర్వీన్ బాబీని బొంబాయికి పిలిపించి,తన ఇంట్లోనే పేయింగ్ గెస్ట్ గా వుంచుకోవడమే కాక ,రోషన్ తనేజా దగ్గర నటనలో శిక్షణ ఇప్పించాడు. ఆయన తీస్తున్న సినిమా పేరు "ధువే కీ లకీర్ ",అందులో నటించే హీరో కూడా కొత్తవాడే పేరు రమేష్ అరోరా.ఆ సినిమా షూటింగ్ జరుగుతూ వుండగా ,ఈ కొత్త మొహాల గురించి పత్రికలలో వచ్చిన సమాచారం చూసిన బి.ఆర్ ఇషారా ఆనటిని తానే ముందు బుక్ చేసుకున్నానని ఆరోపించాడు.విషయం తెలుసుకున్న కిశోర్ సాహూ ఇషారాని కలిసి పర్వీన్ బాబీ ముందుగా తమ చిత్రంలో నటించేటట్లు, ఆ తర్వాత ఇషారా సినిమాలో నటించేటట్టూ ఒప్పందం కుదుర్చుకున్నాడు.

అలా "ధువేకీ లకీర్" షూటింగ్ పూర్తయ్యాక పర్వీన్ బాబీ హీరోయిన్ గా ,బి.ఆర్ .ఇషారా "చరిత్ర" సినిమా షూటింగ్  మొదలయ్యింది.అయితే ఇషారా సినిమానే ముందుగా విడుదల అయ్యింది,పర్వీన్ బాబీ నటించిన "చరిత్ర","ధువే కీ లకీర్ " రెండు సినిమాలూ పెద్దగా ఆడలేదు,కానీ నటిగా పర్వీన్ బాబీకి మంచి గుర్తింపు వచ్చింది.గ్లామరస్ గా వెస్టృన్ లుక్ తో వుంటుందనీ,డైలాగ్స్ బాగా గుర్తు పెట్టుకుంటుందనీ,సరిగ్గా సమయానికి సెట్ మీదకు వస్తుందనీ,అందరితోనూ మర్యాదగా మెలుగుతుందనీ పేరొచ్చింది.ఒక్కవిషయంలో మాత్రం అందరూ చెవులు కొరుక్కునే వారు,అది ఆమె బహిరంగంగా స్మోక్ చేయడం,ఈ అలవాటు ఆమె కు కాలేజ్ రోజులనుండీ మొదలయి చివర వరకూ కొనసాగింది.

క్రమంగా మంచి పిక్చర్స్ లో వేషాలు రాసాగాయి,"దీవార్ "లో అమితాబ్ సరసన నటించిన పాత్ర మంచి పేరు తెచ్చి పెట్టింది.ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు వరసగా సంజయ్ ఖాన్ ,శత్రుఘన్ సిన్హా,శశికపూర్ ,షమ్మీకపూర్ ,కబీర్ బేడీ,అమితాబ్ బచ్చన్ వీరందరితోనూ నటించ సాగింది.కిశోర్ సాహూ దగ్గర వుండగా పరిచయమైన వేద్ శర్మ  ఆమె పర్సనల్ సెక్రటరీ గా వుండి,ఆమె డేట్స్ అవీ చూస్తూ వుండేవాడు.

ఇక్కడ వేద్ శర్మ గురించి కొంచెం చెప్పాలి ,అతను పర్వీన్ బాబీ మొదటి సిన్మా నుండీ ఆమె చివరి సినిమా వరకూ ఆమె తోనే విశ్వాస పాత్రం గా వున్నాడు,మధ్యలో ఆమె రెండు మూడుసార్లు ఉన్నట్టుండి హఠాత్తు గా పిక్చర్లు వదిలేసి మాయమైనా ఆ నిర్మాతలని బాగా కన్విన్స్ చేసి ,వాళ్లని వెయిట్ చేయించడం,ఆమెని తొలగించిన సినిమాలలోకూడా ఆమె తిరిగి వచ్చాక తిరిగి తీసుకునేటట్టుగా మాట్లాడటం,ఆమెకు జబ్బుగా వున్న సంగతి బయటకు తెలియకుండా కాపాడటం,డబ్బు వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించడం చేసేవాడు,ఒక్కమాటలో చెప్పాలంటే అత్యంత నమ్మకమైన విధేయుడైన వ్యక్తి,అలాంటి అతనిని కూడా పర్వీన్ తనకున్న వ్యాధివలన ,నిందారోపణలు చేసి దూరం చేసుకోవడం దురదృష్టం.

మళ్లీ ఆమె కెరీర్ గురించి మాట్లాడుకుందాం 1973లో మొదలైన ఆమె ప్రస్థానం 1980కి వచ్చేసరికి బాగా ఉఛ్ఛస్థితికి చేరింది.అత్యధికంగా పారితోషికం తీసుకునే వాళ్లలో ఆమె రెండవ స్థానంలో వుండేది.1976 జులైలో ప్రతిష్టాత్మకమైన "టైమ్ " మాగజీన్ ముఖచిత్రంగా ఆమె ఫోటో ప్రచురించడం పెద్ద సంచలనాన్ని సృష్టించింది.అంతర్జాతీయంగా కూడా ఆమె పేరు  చాలా మందికి తెలిసిందిఆమె వ్యక్తి గత జీవితం గురించి చెప్పాలంటే  ,ముఖ్యంగా ముగ్గురితో ఆమె పేరు ముడిపడింది .వాళ్లు డానీ డెంజొంగ్పా,కబీర్ బేడీ,మహేష్ భట్ .

బి.ఆర్ .ఇషారా సినిమాలో నటించేటపుడు పరిచయమైన డానీతో ఆమె అనుబంధం సుమారు నాలుగేళ్ల పాటు కొనసాగి తర్వాత విడిపోయినా డానీ చివరవరకూ మంచి స్నేహితుడుగానే మెలిగాడు.ఆమె అంతిమయాత్రలో కూడా పాల్గొన్నాడు.డానీ పరిచయం వలన ఆమెకు అంతర్జాతీయ సినిమా అవగాహనకు వచ్చింది,పెయింటింగ్ ,మ్యూజిక్ కి సంబంధించిన విషయాలు ఇద్దరూ పంచుకునేవారు.ఇద్దరూ జుహూ ప్రాంతం లోని ఒకే బిల్డింగ్ లో వేర్వేరు అంతస్తుల లో వుండేవారు.ఇద్దరి మధ్యా విడదీయరాని చక్కని అనుబంధం వుండేది.ఇద్దరూ కలిసి పార్టీలకు వెళ్లే వారు,అక్కడే "జుహూ గాంగ్ "తో సాన్నిహిత్యం యేర్పడింది.వీళ్లందరూ "బొహీమియన్ "స్టైల్ జీవితం గడిపే వారు. ఈ గాంగ్ లో కబీర్ బేడీ,ప్రోతిమా బేడీ,కేతన్ ఆనంద్ ,అంజు మహేంద్రు,మహేష్ భట్ ,పరీక్షత్ సాహ్నీ వీళ్లందరూ యాక్టివ్ గా వుండే వాళ్లు.

ఆమె కు ఈ జీవితం చాలా నచ్చినట్టుగా కనపడినా అంతరాంతరాలలో ఆమె ఆలోచనలు వేరుగా వుండేవి.ఆమె ఒక్కరితోనే విశ్వాస పాత్రంగా వుండేది.డానీతో స్నేహం చేసేటప్పుడు డానీనే ఇంకెవరినీ దగ్గరకు రానిచ్చేది కాదు ,చాలా పొసెసివ్ గా వుండేది. నాలుగు సంవత్సరాల తర్వాత వారిద్దరి అనుబంధం వీగి పోయింది,కారణాలు ఇద్దరూ చెప్పలేదు.డానీ ,కిమ్ అనే గర్ల్ ఫ్రెండ్ తో సన్నిహితంగా గడపసాగాడు. 1977ప్రాంతంలో  పర్వీన్ జీవితంలోకి కబీర్ బేడీ ప్రవేశించాడు,అంతకు ముందే "జుహూ గాంగ్ "లో ప్రోతిమా ,కబీర్ ఇద్దరూ పరిచయమే అని చెప్పుకున్నాం కదా, పర్వీన్ కి .ప్రోతిమా అంటే నూ,వాళ్ల పిల్లలంటేనూ చాలా ఇష్టంగా వుండేది .ప్రోతిమా ఒడిస్సీ నృత్యం నేర్చుకోవడానికీ,నృత్య ప్రదర్శనలు ఇవ్వడానికీ కొన్ని నెలలు ఊళ్లెడితే పర్వీనే పిల్లలను ప్రేమగా చూసుకునేది. అయితే ఇలాంటి సందర్భాలలోనే కబీర్ కీ పర్వీన్ కీ అనుబంధం యేర్పడింది. కబీర్ ప్రోతిమానీ,పిల్లలనీ వదిలేసి పర్వీన్ తో వుండటం మొదలు పెట్టాడు,అయినా పర్వీన్ కి ఇంకా అభద్రతగానే వుండేది తనని వదిలేసి పిల్లలకోసమూ భార్య కోసమూ వెళ్లిపోతాడేమో నని.అతనిని విడాకులు తీసుకోమనీ ,తనని పెళ్లాడమనీ వత్తిడి తీసుకు వచ్చింది,కానీ ప్రోతిమా అంత తొందరగా విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు.

ఈ లోగా కబీర్ బేడీకి,ఇటలీనుండీ,హాలీవుడ్ నుండీ మంచి అవకాశాలు రాసాగాయి.అతనికి అంతర్జాతీయంగా మంచి ఫాన్ ఫాలోయింగ్ రావడమే కాక అతనంటే ఒక రకమైన క్రేజ్ యేర్పడింది ,ఇదంతా అతను నటించిన "సాందోకన్ "అనే టి.వీ సీరియల్ వలన. దానితో అతను విదేశాలలో స్థిరపడాలని అనుకున్నాడు ,తనతో పాటే పర్వీన్ బాబీని కూడా తీసుకు వెళ్లాడు.

ఆమె కూడా తను చేస్తున్న సినిమాలు మధ్యలో వదిలేసి,అతనితో జీవితమే ముఖ్యమని భావించి వెళ్లిపోయింది,కానీ అతనికి  అక్కడ వున్న పాప్యులారిటీ,పెద్ద పెద్ద నటీనటులూ,దర్శకులూ అతని కిచ్చే ప్రాముఖ్యతా ఆమెలోని అభద్రతని మరింత యెక్కువ చేశాయి,ఇండియాలో తాను ఒక పెద్ద నటి అయివుండి కూడా,అతనికి నీడలాగా యే ప్రత్యేకతా లేకుండా వుండటమేమిటీ అనిపించి వుండవచ్చు బహుశా.అంత వరకూ ఆమెలో నిద్రాణంగా వున్న భయాలన్నీ పైకి లేచాయి,ఉన్నట్టుండి పెద్దగా అరిచి గొడవపడటం,జీనాలోలో బ్రిగెడా లాంటి పెద్ద నటి ఇచ్చే పార్టీనుండీ కబీర్ ని అర్థాంతరంగా బయటకు లాక్కువెళ్లడం ఇవన్నీ కబీర్ నికలవరపాటుకు గురిచేశాయి.అతనెంత సర్దుకుపోదామన్నా ఆమె ధోరణి విపరీతంగా పరిణమించింది,ఒక రోజామె హఠాత్తుగా టికెట్ బుక్ చేసుకుని కబీర్ బేడీని లండన్ లో వదిలేసి  ఇండియాకి వచ్చేసింది .అంతటితో ఆమె జీవితంలో రెండూ రెండున్నర సంవత్సరాలుగా సాగుతున్న కబీర్ బేడీ అధ్యాయం ముగిసింది.

అలా 1979-80ప్రాంతాలలో తిరిగి వచ్చిన పర్వీన్ బాబీని రిసీవ్ చేసుకున్నాడు పర్సనల్ సెక్రటరీ వేద్ శర్మ ,మధ్యలో వదిలేసిన సినిమాలు పూర్తి చేయడం మొదలెట్టింది. ఆమె జీవితంలో కూడా మహేష్ భట్ తోమళ్లీ ఒక కొత్త అధ్యాయం మొదలయిందిఅలా 1977 ప్రాంతాలలో కబీర్ బేడీని వదిలి యూరప్ నుండీ బొంబాయి చేరిన పర్వీన్ కి సాదర స్వాగతం చెప్పాడు వేద్ శర్మ.కబీర్ తో యూరప్ వెళ్లేటప్పుడు తను అసంపూర్తిగా వదిలి వెళ్లిన చిత్రాలలో చాలా వరకూ తిరిగి తనకు చేరాయి,అప్పుడే రిలీజయిన "అమర్ -అక్బర్ -ఆంథోనీ" సూపర్ హిట్టవడం ఆమె కెరీర్ కి యెంతో ఉపకరించింది.

చిత్రాల షూటింగ్ ల్లో తిరిగి పాల్గొనడంతో పాటు పాత స్నేహాలని పునరుధ్ధరించుకునే క్రమంలో,ఇదివరకు "జుహూ గాంగ్ "లో పరిచయమున్న మహేష్ భట్ కి చేసిన ఒక్క ఫోన్ కాల్ ఆమె జీవితాన్ని ఇంకో మలుపు తిప్పింది. మహేష్ భట్ అంటే అప్పుడప్పుడే పైకి వస్తున్న బడ్డింగ్ ఫిల్మ్ డైరెక్టర్ .అతని తండ్రి బ్రాహ్మణుడు,తల్లి ముస్లిమ్ స్త్రీ .అతనుచిన్నతనం నుండీ స్కూల్ శెలవుల్లో క్రికెట్ ఆడుతూ,ఖాళీ సమయాల్లో చిన్న చిన్న వస్తువులు అమ్ముతూ  కాలం గడిపే వాడు.ఆ తర్వాత  డాల్డా కంపెనీలకీ,లైఫ్ బోయ్ సబ్బుల కీ మోడల్ గా కూడా చేశాడు.అతను స్కూల్లో చదువుకునే టప్పుడే స్కాటిష్ ఆర్ఫనేజ్ స్టూడెంటయిన లోరేన్ బ్రయిట్ అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.ఇరవై యేళ్లొచ్చే సరికే ఆమెను పెళ్లిచేసుకున్నాడు,ఆమె తన పేరు కిరణ్ భట్ అని మార్చుకుంది.ఒక సంవత్సరానికల్లా వాళ్లిద్దరకీ నటి పూజాభట్ జన్మించింది.

మహేష్ భట్  సినిమాల మీద మోజుతో దర్శకుడు  రాజ్ ఖోస్లా దగ్గర అసిస్టెంట్ గా కొన్నాళ్లు పనిచేసి ,సొంతంగా రెండు మూడు చిత్రాలకు దర్శకత్వం వహించాడు కానీ క్లిక్ అవలా మంచి బ్రేక్ కోసం యెదురు చూస్తున్నాడు. సరిగ్గా అలాంటి సమయంలో పర్వీన్ నుండీ ఫోన్ కాల్ వచ్చింది,అంతకు మునుపే జుహూ గాంగ్ లో పరిచయముందీ,కబీర్ బేడీ ప్రియురాలుగా తెలుసు,గ్లామరస్ నటీ.ఈ నేపథ్యంతో అతను ఆమె ఆహ్వానాన్ని మన్నించి ఆమె అపార్ట్ మెంట్ కి వెళ్లాడు.

రెండు మూడు సమావేశాలు మామూలుగానే జరిగాయి,ఆ తర్వాత వారిద్దరూ అనేక విషయాలు పంచుకున్నారు.మహేష్ భట్ ఆమె చుట్టూ గూడుకట్టుకున్న నైరాశ్యాన్నీ,ఒంటరితనాన్నీ గమనించాడు. అందమైన డబ్బున్నఒంటరి ఆడదాని వేపు ఆకర్షింప బడని మొగవాడుంటాడా లోకంలో?దానికి సినీ గ్లామర్ తోడైతే ఇంక చెప్పాలా?

ఆరునెలల కల్లా అతి  సహజంగా మహేష్ భట్ ప్రేమించి చేసుకున్న పెళ్లాం బిడ్డలని వదిలి పర్వీన్ తోనే కలిసి జీవించ సాగాడు. వారిద్దరూ కలిసి ఒక సంవత్సరం పాటు అన్యోన్యంగా గడిపారు,అతని ఆర్థికావసరాలన్నీ కూడా  పర్వీనే చూసేది.అయినా అప్పుడప్పుడూ అతను భార్యా బిడ్డల దగ్గరకు వెళ్లి వచ్చాడేమోనని అనుమానిస్తూ వుండేది,చివరికి అతని బట్టలు కూడా వాసన చూసేదట.

వారిద్దరూ మాట్లాడుకునే కామన్ టాపిక్స్ లో ఆధ్యాత్మికతకి సంబంధించిన విషయాలు కూడా వుండేవి.ఇద్దరికీ యు.జి.కృష్ణమూర్తి అనే ఆధ్యాత్మిక గురువుతో పరిచయముండేది.ఇద్దరికీ ఆయనంటే చాలా అభిమానం.

ఇక్కడ యు.జి. కృష్ణ మూర్తి యెవరో కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం ,ఎందుకంటే పర్వీన్ బాబీ జీవితంలో ఆయన పాత్ర కూడా కొంత వుంది. యు.జి.కృష్ణ మూర్తి అంటే ఉప్పులూరి .గోపాల కృష్ణమూర్తి,కృష్ణాజిల్లా  బందరులో పుట్టారు,గుడివాడలో పెరిగారు,రచయిత చలం గారికి దూరపు బంధువు.చలంగారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి.ఆయనొక నిరీశ్వర వాది,మొదట్లో థియోసాఫికల్ సొసైటీతోనూ,జిడ్డుకృష్ణమూర్తితోనూ సన్నిహితంగా మెలిగినప్పటికీ తర్వాత విభేదించి బయటకు వచ్చారు.ప్రపంచమంతా పర్యటిస్తూ,ఉపన్యాసాలిస్తూ వుంటారు ఆయన ప్రత్యేకించి యేదీ బోధించరు,యే విషయమైనా నీ అంతట నువ్వే నిర్ణయించుకో,నీ అంతట నీవే తెలుసుకో జీవితానికేమీ అర్థమూ ,పరమార్థమూ లేదు ,నీ జీవితానికీ ,నీ నిర్ణయాలకూ నీవే కర్తవు ,యే విషయానికైనా కేంద్ర బిందువు"నువ్వే" ,ఇలా వుంటాయి ఆయన బోధనలు.ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా శిష్యులున్నారు,స్విట్జర్లాండ్ కి చెందిన వాలెంటైన్ అన్న పెద్దావిడ ఆయనకు కేర్ టేకర్, సదా ఆయన వెన్నంటే వుంటూ ఆయనకు యే లోటూ రాకుండా చూసుకునే వారు.

పర్వీన్ బాబీ ,మహేష్ భట్ ఇద్దరూ ఆయన బొంబాయి వచ్చినప్పుడు కలిసి గడుపుతూ వుండేవారు. మళ్లీ పర్వీన్ ఫిల్మ్ కెరీర్ గురించి మాట్లాడుకుందాం, 1978-79 వచ్చేసరికి ఆమె చేతిలో  ఇరవై పిక్చర్ల వరకూ వున్నాయి,దాదాపు ముఫ్ఫైఅయిదు సినిమాల వరకూ సంతకాలు పెట్టింది అంటాడు వేద్ శర్మ,వాటిలో ముఖ్యమైన పేర్లు "సుహాగ్ ,దేశ్ ప్రేమి ,ఖుద్దార్ ,కాలాపత్థర్ ,రజియా సుల్తాన్ ,క్రాంతి,జ్వాలాముఖి,లావారిస్ ,నమక్ హలాల్ ,బర్నింగ్ ట్రెయిన్ ."

పని మీద కాన్సంట్రేషన్ ,వత్తిడి,సన్నగా కనపడాలని చేసే డైటింగ్ (కేవలం నిమ్మరసం,పళ్లూ మాత్రమే తీసుకునేది),మహేష్ భట్ గురించిన అభద్రతా ఆమె మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపసాగాయి.ఉన్నట్టుండి తననెవరైనా యేమైనా చేస్తారేమోననే భయంతో వణికి పోవడం,తినే ఆహారం లోనూ,తాగే పానీయాల్లోనూ యేమైనా కలిపారేమోననే అనుమానమూ ,చెవుల్లో యేవో మాటలు వినపడటమూ ఇవన్నీ మొదలయినాయి.ఎక్కువ సినిమాలలో కలిసి నటించిన అమితాబ్ బచ్చన్ తనని చంపాలని ప్రయత్నిస్తున్నాడనేది. తన సెక్రటరీ వేద్ శర్మ,మహేష్ భట్ ఇద్దరూ దానికి సహకరిస్తున్నారని ఆరోపించేది.చివరికి కన్నతల్లిని కూడా అనుమానించేది.

ఇదంతా చూసిన తల్లి జమాల్ ఆమె కున్న పరిజ్ఞానంతో తన కూతురికి దయ్యం పట్టిందనుకుంది,అయితే మహేష్ భట్ కొంత అవగాహనతో సైకియాట్రిస్ట్ ని కలిసి ,మాట్లాడి ,ఆమెను బలవంతంగా తీసికెళ్లి చూపిస్తే "పారనాయిడ్ షిజోఫ్రినియాతో "బాధపడుతోందనీ,ఆమె క్రమం తప్పకుండా మందులు తీసుకోవాలనీ,విశ్రాంతి కూడా అవసరమనీ,వ్యాథి తీవ్రమైతే ఎలక్ట్రిక్ షాక్ థెరపీ కూడా ఇవ్వాలిసి రావచ్చు అని చెప్పారు.

అయితే ఆమె  యెవరెన్ని చెప్పినా మందులు తీసుకునేది కాదు,చివరికి ఆహారంలో కలిపి ఇచ్చేవారు,అది కూడా యెవరైనా కొంచెం తింటేనే తినేది.అట్లా మహేష్ భట్ కూడా ఆమందు కలిపిన ఆహారం తినవలసి వచ్చేది. అయినా ఆమె పరిస్థితిలో యే మార్పూ లేదు ఆమె ను కంట్రోల్ చెయ్యడం కష్టమయింది,షూటింగ్ లన్నీ ఆగిపోయాయి ,నిర్మాతలకి అసలు పరిస్థితి తెలీకుండా జాగ్రత్త పడటంతో వారంతా గోలెత్తుతూ వుండేవారు.

ఆమె సెక్రటరీ వేద్ శర్మ ఇదంతా చూసి ఆమెను కవర్ చేయడానికి ఆమెకు పచ్చ కామెర్ల జబ్బు వచ్చిందని వాళ్లను కొంతకాలం మభ్యపెట్టాడు. ఎవరి మాటా వినేది కాదు,ఒక్కటే ఊరట యేమిటంటే యు.జి అంటే మాత్రం అపారమైన నమ్మకం ఆయన యేం చెప్పినా వినేది ,ఆయన తప్ప ఈ లోకంలో తన శ్రేయస్సు కోరే వారెవరూ లేదని నమ్మేది.

మూడు నెలలు గడిచినా ఆమె మానసిక పరిస్థితిలో మార్పేమీ లేకపోవడంతో ,ఆమెకు యెలక్ట్రిక్ షాక్ ఇవ్వడం తప్పదేమో అనే పరిస్థితిలో1979లో మహేష్ బెంగుళూరులో ఉన్న యూ.జీ సలహా తీసుకుని,యెలాగో ఆమెని బెంగుళూరు యూ.జి. వద్ద కు చేర్చాడు.యూ.జి మహేష్ తో "ఆమె మంచి కోరేటట్టయితే నీవామెకు దూరంగా వుండు "అని సలహా ఇచ్చాడు. పర్వీన్ బెంగుళూర్ లో బసవన గుడి దగ్గరున్న యూ.జి. స్నేహితుల ఇంట్లో సుమారు ఆరునెలలు గడిపింది.సరైన సమయానికి ఆహారం తీసుకోవడంతో,యు.జి పర్యవేక్షణలో నిమ్ హాన్స్ ఇన్స్టిట్యూట్  డాక్టర్ల మందులతో,ఆమె ఆరోగ్యం కుదుట పడటం ప్రారంభించింది.

ఈ లోగా నిర్మాతల ఒత్తిడి భరించలేక వేద్ శర్మ ,ఆమె తల్లి జమాల్ ని తీసుకుని బెంగుళూరు వచ్చాడు,ఆమె తల్లి  కూతుర్ని వెంటనే బొంబాయి రమ్మంది,తన మాట వినడం లేదని కూతురితో దెబ్బలాడి ,దీనికంతా యూ.జి నే కారణం అని నానా దుర్భాషలాడి వెళ్లిపోయింది. ఆ తర్వాత కొద్దికాలానికే పర్వీన్ బొంబాయి తిరిగి వెళ్లి ,అసంపూర్తిగా వదిలి వేసిన చిత్రాలు పూర్తి చేస్తానని యూ.జి అనుమతి తీసుకుంది.అయితే యూ.జి ఒక హెచ్చరిక చేశారు,ఆ సినిమా జీవితం తనకు సరిపడదనీ,అలాగే కంటిన్యూ చేస్తే ఆమె జబ్బుతిరగ బెట్టే ప్రమాదముందనీ.

చివరికి ఆర్నెల్ల తర్వాత 1979డిసెంబర్ లో బొంబాయిలో అడుగుపెట్టి,సినిమా షూటింగ్ లలో పాల్గొనడం ప్రారంభించింది. నిర్మాతలందరూ ఆమె షూటింగ్ లకి రావడం,క్రమశిక్షణగా వుండటం చూసి సంతోషిస్తున్నారు .అయితే మధ్యలో యూ.జి బొంబాయి వచ్చినప్పుడూ,బాలీ ఐలాండ్స్ కి వెళ్లినప్పుడూ,స్విట్జర్లాండ్ వెళ్లి కలిసినప్పుడూ యెప్పుడూ పర్వీన్ ని  రిలాప్స్ రావచ్చనీ జాగ్రత్తగా వుండమనీ,పిక్చర్స్ లో నటించ వద్దనీ హెచ్చరిస్తూనే వున్నాడు.

కానీ ఇదంతా పర్వీన్ కి ఒక రకంగా భయపడేట్టు చేసింది,తనకు వచ్చిన పని చేయకుండా ఖాళీగా కూర్చో లేకపోయింది,పని చేసుకుంటూ వుంటే ఒక పక్కనుండీ మళ్లీ రిలాప్స్  వస్తుందేమోననే భయం పీడించసాగింది. 

మహేష్ భట్ ని  పర్వీన్ కి దూరంగా వుండమని యూ.జి చెప్పినా అప్పుడప్పుడూ రహస్యంగా కలుస్తూనే వున్నారిద్దరూ.ఒక రోజు మహేష్ యూ.జి .చెప్పిన మాట వినమనీ,పిక్చర్స్ లో నటించవద్దనీ చెబుతుంటే "నేను కావాలా ,యూజీ కావాలా తేల్చుకో ?" అంది పర్వీన్.

అంతే యెంత పిలుస్తున్నా వినకుండా లేచి వెళ్లిపోయాడు మహేష్ మళ్లీ పర్వీన్ మొహం చూడలేదు.అలా మహేష్ భట్ ఆమె జీవితం నుంచీ నిష్క్రమించాక ,ఇంకెవరితోనూ గాఢమైన అనుబంధం యేర్పడ లేదు .రెండో మూడో పేర్లువినబడినా చాలా  తాత్కాలిక అనుబంధాలూ ,లోతు లేని సంబంధాలే. ఒంటరితనమే తోడుగా తనని తను ఓదార్చుకుంటూ ముందుకు సాగుతోంది. 1980 నుండీ షూటింగ్ లలో పాల్గొనడం ఆరంభించింది, 1981 సగం లోకి వచ్చేసరికి బాగా బిజీ అయ్యింది "బాబీ బూమ్ " ప్రారంభమైంది అనుకోసాగారు అందరూ.

నిర్మాతలు,సహనటీనటులూ అందరూ ఆమె కమిట్ మెంటునీ,సహకారాన్నీ పొగడసాగారు. అయితే మహేష్ భట్ ఆమె మానసిక స్థితి గురించి కొన్ని పత్రికలలో కామెంట్ చేయడం,ఆమెని బాధపెట్టింది,యూ.జి. కూడా పదే పదే మళ్లీ జబ్బు తిరగబెడుతుంది జాగ్రత్త పడమని చెప్పడం ఆమె లో ఒక రకమైన వత్తిడిని కలగ జేసినా తనను తను నిలదొక్కుకోవడానికే ప్రయత్నించింది "యూ.జీ యేం చెప్పినా నాజీవితం నేను జీవించాలిసిందే కదా ,ఆయనొచ్చి నా జీవితం జీవించడు ,నేనేళ్లి ఆయన జీవితం జీవించను" అనడం ఆమె ధృఢ నిర్ణయాన్నీ,పరిణతినీ కూడా సూచిస్తోంది 

1982 వ సంవత్సరం లోకి అడుగుపెట్టి సగం రోజులు గడిచేసరికి, మళ్లీ పరిస్థితి మారిపోయింది,ఆమె యెవర్నీ కలవడం లేదనీ,ఇంట్లోనే తాళం పెట్టుకుని కూచుంటోందనీ,సినిమా షూటింగ్ లన్నీ కాన్సిలవుతున్నాయనీ వదంతులు వ్యాపించ సాగాయి.

విశ్వాస పాత్రుడయిన వేద్ శర్మ వీటన్నిటినీ మాఫీ చేయాలని ప్రయత్నిస్తున్నాడు కానీ మహేష్ భట్ బాహాటంగాఆమె మానసిక స్థితి గురించి మాట్లాడ సాగాడు. 1982లో మహేష్ భట్ తీసిన "అర్థ్ "సినిమా లో స్మితా పాటిల్ పోషించిన పాత్ర పర్వీన్ ను దృష్టిలో పెట్టుకునే తీశాననీ ,బహుశా ఆమె అది  చూస్తే ,ఆమె ఆరోగ్యం మీద తీవ్రంగా ప్రభావం చూపవచ్చనీ కూడా చెప్పడం గమనార్హం. 1982 డిసెంబర్ లో రిలీజయిన "అర్థ్ " సినిమా ఆమె చూసిందనీ ,బాగా కలవర పాటుకి గురి అయిందనీ కొన్ని ఇంటర్వ్యూల ద్వారా తెలుస్తోంది. 1983 జులై నాటికి ఆమె పరిస్థితి మొదటికి వచ్చింది,భయాలూ,భ్రాంతులూ ఎక్కువయ్యాయి షూటింగ్ లు కాన్సిల్ అవుతున్నాయి.

ఇన్నాళ్లుగా మరిచిపోయిన యు.జి ఒక్కసారిగా గుర్తొచ్చాడు,ఆయనే తనని బయట పడేసే దిక్కు అని భావించింది.వెంటనే దేశం వదిలి స్విట్జర్లాండ్ బయలు దేరింది,అప్పటికామె చేతిలో పంతొమ్మిది సినిమాలు వివిధ స్థాయిలలో అసంపూర్తిగా వున్నాయి.ఇల్లు వదిలి పెట్టి వెళ్లొద్దని సెక్రటరీ వేద్ శర్మ,తల్లి జమాల్ బతిమాలారు. ఎవరి మాటా వినలేదు ,అర్థరాత్రి బయలుదేరి దేశం వదిలి స్విట్జర్లాండ్ లో కాలు పెట్టింది.

1983 జులై నుండీ ఒక సంవత్సర కాలం యు.జీ ,వాలెంటైన్ల తోనే  వుంటూ,వారితో పాటే మెక్సికో ,కాలిఫోర్నియాలు  తిరిగింది.ఆరోగ్యం కుదుట పడినట్టే అనిపించింది,బొంబాయి నుండీ ఫోన్లు వస్తూనే ఉన్నాయి.యూ.జీ "నీ జీవితం గురించి నిర్ణయాలు నువ్వే తీసుకోవాలి ,యెప్పటికీ ఇక్కడే వుండటం కుదరదు" అని స్పష్టంగా చెప్పడంతో ,1984ఏప్రిల్ నాలగవ తేదీ తన పుట్టిన రోజు నాడు,హఠాత్తుగా లేచి "నేను ఇండియా వెడుతున్నాను,మీకు భారంగా వుండటం ఇష్టం లేదు "అని బయలు దేరింది. టికెట్లకీ,ఖర్చులకీ కొంత డబ్బు తను ఇచ్చినట్టు యూ.జీ మహేష్ కి రాసిన లేఖలో రాశారు.అయితే ఆమె యెక్కడికి వెళ్లిందీ తెలియరాలేదు.

1984ఏప్రిల్ 7 వతారీఖున పర్వీన్ న్యూయర్క్ ఇంటర్నేషనల్ ఏర్ పోర్ట్ లో దిగింది,అక్కడి అధికారులు ఈమెను పాస్ పోర్టూ,ఇతర ధృవీకరణ పత్రాలడిగారు ,ఈమె చెప్పే సమాధానాలూ ,ప్రవర్తనా వాళ్లకు అనుమానం కలిగించాయి,కాళ్లకూ ,చేతులకూ సంకెళ్లు తగిలించి పబ్లిక్ హాస్పిటల్ కి తరలించారు. ఆ హాస్పిటల్ లో పర్వీన్ బాబీ ని గుర్తు పట్టిన ఒక ఇండియన్ డాక్టర్ యూ.జీ ఫోన్ నంబర్ ఆమె దగ్గర నుండీ తీసుకుని ఫోన్ చేశాడు.

యూ.జీ మహేష్ భట్ ని సంప్రదించాడు,మహేష్ యూ.జి ని న్యూయార్క్ వెళ్లి పర్వీన్ని కాపాడమని ఒప్పించాడు. యు.జీ న్యూయార్క్ చేరేటప్పటికి ముఫ్ఫయిమంది మానసిక రోగులమధ్య వుంది పర్వీన్ .యూ.జీ తో మామూలుగా నవ్వుతూ మాట్లాడింది,ఈ లోపు ఇండియన్ కాన్సులేట్ అధికారి కూడా వచ్చి చూశాడు, ఆమె కోలుకోవడానికి రెండు మూడు వారాలు పడుతుందన్నారు డాక్టర్లు. న్యూయార్క్ లోనే ఒక హోటల్లో రూమ్ తీసుకుని పర్వీన్ తో వుండసాగాడు యూ.జి. కానీ ఆమె హఠాత్తుగా ఒక రోజు యూ.జీ బయటకు వెళ్లి వచ్చేసరికి హోటల్ రూమ్ నుండీ మాయమయ్యింది.అది1984ఏప్రిల్ 25వ తేదీ,ఆతర్వాత రెండు మూడు రోజులు ఆమె వస్తుందేమోనని యెదురు చూసిన యూ.జీ ,ఆమె రాకపోయేటప్పటికి హోటల్ రూమ్ ఖాళీచేసి వెళ్లిపోయాడు.

అప్పటి నుండీ మరో మూడు సంవత్సరాల వరకూ ఆమె ఆచూకీ యెవరికీ తెలీదు.ఆమె తల్లి జమాల్,కూతురు పర్వీన్  1983లో బొంబాయి ని విడిచి పెట్టి వెళ్లాక ,తాము వుంటున్న అపార్ట్ మెంట్ శుభ్రం చేయించి తాళం వేసి,జునాగఢ్ వెళ్లిపోయి అక్కడ తన మేనల్లుడి సహాయంతో జీవించ సాగింది. బొంబాయి సినీ పరిశ్రమ లో ఆమె అసంపూర్తిగా వదిలి వేసిన పందొమ్మిది సినిమాలలో ,పది సినిమాలని యేదో విధంగా డూప్ లను పెట్టో ,కథలో మార్పులు చేసో పూర్తి చేసి రిలీజ్ చేశారు ,చివరగా రిలీజ్ అయిన సినిమా "ఇరాదా".

దాదాపు అందరూ పర్వీన్ బాబీ గురించి మరిచిపోయారు,ఆమె తల్లి తన కూతురెక్కడో మరణించి వుంటుందనుకుంది ,ఇలాంటి పరిస్థితుల్లో సుమారు నాలుగు సంవత్సరాలు గడిచాక 1987లో జమాల్ మేనల్లుడు జావేద్ కి హూస్టన్ నుండీ ఒక ఫోన్ కాల్ వచ్చింది.అక్కడ వుండే కల్పన అనే ఇండియన్ లాయర్ పర్వీన్ పోలీసు కస్టడీలో వుందనీ,ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదనీ చెప్పింది.

ఆ వార్త విన్నాక తల్లి జమాల్ అమెరికన్ కాన్స్ లేట్ కి వెళ్లి వీసా తెచ్చుకుని ఒక్కతే హూస్టన్ బయలు దేరింది.చదువు సంధ్యలు లేని ఆమె అష్టకష్టాలు పడి యెలాగో హూస్టన్ చేరి ,పోలీసులకి బెయిల్ చెల్లించి,లాయర్ కి ఫీజ్ కట్టి,కూతురుని విడిపించి నెలరోజులు అక్కడే వుండి ,కూతురిని ఇండియా రమ్మని బతిమలాడింది.పర్వీన్ ససేమిరా రాననడమే కాదు తల్లిని తక్షణమే దయచేయమంది. చివరికి చేసేది లేక వెనుదిరిగింది తల్లి జమాల్ .ఆ తర్వాత ఆమె గురించిన సమాచారమేదీ తెలియరాలేదు. పర్వీన్ బాబీ 1984నుండీ టూరిస్ట్  వీసా మీద అమెరికాలో వుంటోంది,ప్రతీ ఆర్నెల్లకు మెక్సికోనో,ఇతర కరేబియన్ ఐలాండ్స్ కో వెళ్లి వీసా రిన్యూ చేయించుకుంటొంది 1989వచ్చేసరికి ఆ వీసా కాలపరిమితి అయిపోవడంతో ఆమె ఇండియాకు రాక తప్పలేదు.

1989నవంబర్ లో పర్వీన్ సెక్రటరీ వేద్ శర్మకీ,ఆమె కజిన్ జావేద్ కీ ఆమె ఇండియా తిరిగి వస్తున్నట్టు ఫోన్ కాల్ వచ్చింది.చివరకు నవంబర్ పదిహేడున గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ,బాగా లావైపోయిన పర్వీన్ని రిసీవ్ చేసుకున్నారు వారిద్దరూ. ఇండియా రాంగానే ఆమె చేసిన మొదటి పని,తనకెంతో విశ్వాస పాత్రంగా వున్న వేద్ శర్మ ని సెక్రటరీ స్థానం నుండీ తొలగించడం ,అతను కూడా ఆమె తో విసిగి వేసారి పోయి వుండడంతో ఆనందంగా తప్పుకున్నాడు.

ఏడేళ్ల వనవాసం తర్వాత బొంబాయి చేరుకున్న పర్వీన్ని పలకరించిన వారు ఒకటీ అరా జర్నలిస్ట్ లు ,అదీ ఇంటర్వ్యూలకోసం.ఆమె వారి కిచ్చిన ఇంటర్వ్యూల నిండా తనమీద హత్యా యత్నాలు జరిగాయనీ,తనమీద కెమికల్ వెపన్స్ ప్రయోగించారనీ అభియోగాలు చేసింది. ఎవరా శత్రువులంటే అమితాబ్ బచ్చన్నీ,అమెరికా ప్రెసిడెంట్ నీ,ప్రిన్స్ ఛార్లెస్ నీ,ఫ్రెంచ్ గవర్నమెంట్ ని,ఇండియా గవర్న్ మెంట్ నీ ఇలా అందరి గురించీ చెప్పేది.


పేజీలకు పేజీలు కంప్లయింట్ లు రాసి బాంద్రా కోర్టులో కేస్ ఫైల్ చేయమని వేద్ శర్మ కొడుకుని కోరింది. ఇంటి కెవరొచ్చినా ,వారితో మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ చేసి పెట్టేది,తన చెవికి సర్జరీ చేసి చెవి వెనక ఒక చిప్ లాంటిది పెట్టి తన మీద నిఘా పెట్టారనేది, తన ఇంట్లో ఎ.సి లో బాంబులున్నాయని భయపడేది,వాటర్ టాంక్ పగిలి తన ఇంటి మీద పడుతుందేమోనని అనుమానించేది ఒకరకమైన భయంకాదు,ఒక రకమైన అనుమానం కాదు.

ఈ జబ్బు వున్న వాళ్లు మందులు వాడితే కొంత నయమయి మామూలు జీవనం గడపొచ్చని  తల్లి యెంత చెప్పినా వినేది కాదు,విసిగిపోయిన తల్లి కొంత కాలం బొంబాయిలోనూ,కొంత కాలం జునాగఢ్ లోనూ గడుపుతూ 2002లో శాశ్వతంగా ఈ లోకం వదిలిపెట్టి పోయింది. ఇప్పుడు పర్వీన్ మరింత ఒంటరి అయిపోయింది,ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తాననీ,పెయింటింగ్ చేస్తున్నాననీ చెప్పేది ,కానీ యెవ్వరూ ఆమెతో ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోలేదు,ఆమె చిత్రాలెక్కడా ప్రదర్శితమవ్వ లేదు,ఇంట్లో పనివాళ్లను కూడా నమ్మక పోవడం చేత ,ఆమె  విచిత్రమైన ప్రవర్తన వలనా పనివాళ్లు కూడా మానేశారు.ఒకప్పుడు యెంతో పరిశుభ్రంగా దివ్య భవనంలా వున్న ఇల్లు అపరిశుభ్రంగా పాడు పడ్డట్టు తయారయింది.

1997 లో మలబార్ హిల్ దగ్గరున్న చర్చ్ లో బాప్టిజమ్ తీసుకోవడంతో అప్పుడప్పుడూ ఆ చర్చ్ ఫాదర్లు వచ్చేవారు,ఆమె కూడా చర్చ్ కి వెళ్లేది.2004సం" ఏప్రిల్ లో ఆమె యాభయ్యవ పుట్టిన రోజు మాత్రం చక్కటి పార్టీ జరుపు కుంది వేద్ శర్మ కుటుంబాన్నీ ఇంకొంత మంది దగ్గర వాళ్లనీ మాత్రమే పిలిచింది.

ఆ తర్వాత 2004డిసెంబర్లో క్రిస్ మస్ పార్టీ జరుపుకుంది ,ఆ పార్టీలో ఆమె పన్ను ఒకటి విరిగి వుండటాన్నీ,కాలికి గాయమయి కుంటుతూ వుండటాన్నీ గమనించిన అతిథులు డాక్టర్ని సంప్రదించమన్నారు ఆమె నవ్వి తోసిపుచ్చింది.

2005జనవరి 22వ తేదీ పర్వీన్ నివాసం వుండే బిల్డింగ్ మానేజర్ పోలీసులకి ఫోన్ చేశాడు ఆమె అపార్ట్ మెంట్ ముందు రెండు రోజులనుండీ న్యూస్ పేపర్లూ ,పాలపాకెట్లూ పడివున్నాయనీ. డూప్లికేట్ తాళాలతో అపార్ట్ మెంట్ తలుపులు తెరిచారు,సగం చిత్రించిన చిత్రాల కాన్వాసుల తోనూ,న్యూస్ పేపర్ల గుట్టలతోనూ,అడ్డదిడ్డంగా పడి వున్న బట్టలతోనూ నిండివున్న గదిలో బెడ్ మీద అచేతనంగా పడివుంది పర్వీన్ బాబీ.ఆమె ప్రాణాలు  ఇరవై నాలుగు గంటల క్రితమే అనంత వాయువుల్లో లీనమయ్యాయని నిర్థారించారు డాక్టర్లు.ఆమె డయాబెటిస్ తో బాధపడుతోందని ఎడమ కాలు గాంగ్రీన్ తో పాడయిందనీ,అందుకే ఆమె వీల్ ఛైర్ వాడుతున్నట్టు వుందనీ,ఆమె ఆహారం తీసుకుని మూడురోజులపైన అయి వుంటుందని నిర్థారణ చేశారు.

ఆమె వ్యగ్ర జీవితం అలా ముగిసింది,ఎంతో మందిని తన గ్లామర్ తో మురిపించిన ఆమె చివరికి మాసిన బట్టలతో,తిండి లేకుండా ,ఒంటరిగా దయనీయంగా మరణించడం యెవరినైనా కదిలిస్తుంది. జీవితమంతా ఒంటరితనం తో పోరాడి,విశ్వసనీయమైన ఒక తోడు కోసం తపించిన ఆమె మృత్యువులో కూడా ఒంటరిగానే మిగిలింది. ఆమె పార్థివ దేహాన్ని ఎవరూ క్లెయిమ్ చేయక పోవడంతో  ఒక వారం రోజులు అన్ ఐడెంటిఫైడ్ బాడీగా మార్చురీలో వుండిపోయింది  , వారం రోజులకి ఆమె బంధువులూ,చర్చ్ ఫాదర్లూ కూడా క్రిమేషన్ జరపడానికి ముందుకొచ్చారు.

చివరికి దేహాన్ని ఆమె బంధువులకు అప్పజెప్పారు 30జనవరి 2005 శాంతాక్రజ్ లో వున్న జుహూ ముస్లిమ్ సిమెట్రీ లో ఆమె అంత్య క్రియలు జరిగాయి.ఆమె స్నేహితులు డానీ,కబీర్ బేడీ,మహేష్ భట్ లు అంత్య క్రియల్లో పాల్గొన్నారు.

ఆమె ఆస్తి డెభ్బై శాతం  జునా గఢ్ లో ఆమె కుటుంబానికి చెందిన దీనులైన బాలికలకీ,స్త్రీలకీ చెందేటట్టుగా వీలునామా రాసింది. మహేష్ భట్ ఆమె బతికుండగానే ఆమె కథ ఆథారంగా "అర్థ్ "తీశాడు, ఆతర్వాత "ఓ లమ్హే ","ఫిర్ తెరీ కహానీ యాద్ ఆయేగీ "అనే సినిమాలు తీసి ఆమె జ్ఞాపకాలు వాడుకున్నాడు. పర్వీన్ బాబీ  జీవితమంతా తనను వెంటాడిన అభద్రతనీ,భయాన్నీ,ఆందోళననీ అసంతృప్తినీ,ఒంటరితనాన్నీ మరిచి జుహూ సిమెట్రీలో నిద్ర పోతోంది


-భార్గవి

Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము