సీమచింత-నా చింత



చింత అంటే కేవలం పులుపనే కాదు,ఆలోచన,కష్టం అనే అర్థాలు కూడా వున్నాయి."మో" అని పిలువబడే వేగుంట మోహన ప్రసాద్ గారి మొట్టమొదటి కావ్యం "చితి--చింత" ప్రఖ్యాత నైరూప్య చిత్రకారులు యస్వీ.రామారావు గారి చిత్రం ,ముఖచిత్రంగా వెలువడింది,పూర్తిగా అర్థమయినా,కాకపోయినా కొనుక్కుని చదివి ,దాచుకున్నా,ఇంకా వుంది నా లైబ్రరీలో.

త్యాగరాజస్వామి "తెలిసి రామచింతనతో నామము చేయవే మనసా"----పూర్ణచంద్రిక రాగం "చింతా నాస్తికిలా " సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన,రెండూ బాలమురళీ గొంతులో బాగుంటాయి.

"ఆ చింత నీకేలరా స్వామీ నీచెంత నేనుండగా" అనే సినిమా పాట ఈ మధ్య పదే పదే గుర్తొస్తోంది ఎందుకో,ఏ సినిమా లోదా?అని వెదికితే "శుభోదయం"కె.విశ్వనాథ్ గారి సినిమాలో,అయితే కొన్ని పాటలు వింటేనే బాగుంటాయి ,చూసేకంటే ఇది ఆ కోవలోదే ,ఏ మాటకామాటే సుశీల గొంతు ఈ పాటలో  వింటుంటే పాలకోవా తిన్నట్టే వుంటుంది.

సరే ఆ చింత సంగతి అక్కడ బెడితే ఈ మధ్య నా నడక దారిలో కనపడే చెట్లను పరిశీలిస్తూ వుండగా,హఠాత్తుగా మా చిన్నప్పుడు కనపడిన కొన్ని చెట్లు ,ఇప్పుడు చాలా వరకూ కనపడటం మానేశాయని తోచింది,వాటిల్లో సీమచింత ఒకటి. చిన్నప్పుడు బడికి వేసవి శెలవులు మొదలవ గానే ,పెందలాడే యేదో తినేసి అయిదారు మంది పిల్లలు పోగయి,ఒక గడవాసం కొంకీ వున్నది సంపాయించి వేటకు బయలుదేరేవాళ్లం.మా వేటంతా   సీమచింత కాయలకోసం,ఎవరైనా కోసి వదిలేసిన ముంజికాయ గెలలకోసం,మామిడి పిందెలకోసం.మా ఊరి  చేల మధ్య నుండీ వేరే ఊళ్లకి పోయే డొంక దారి కిరు పక్కలా సీమ చింత చెట్లు విరగ కాసి వుండేవి.ఎర్రగా పండి పగిలి ,తెల్లని పప్పులతో వేలాడుతున్న ఆ కాయలను చూసి మేము తెగఊరి పోయే వాళ్లం.పరికిణీలలో ఒడిగట్టుకుని తెచ్చిన ఆ కాయలు తింటుంటే అమ్మలు కేకలేసే వారు ,ఎక్కువతింటే కడుపులో పసరు పెరుగుతుందని,ఎప్పుడన్నా ఒకసారి మా బడిబయట తట్టలలో అమ్మొచ్చేవి కూడా పదిపైసలకు బోలెడన్ని కాయలు,కానీ వాటిల్లో కొన్ని చేదుంటాయి తెలుసా?.ఆ కాయల్లో తెల్లని పప్పులు తిన్నాక వచ్చే నల్లటి గింజపై నుండే తొక్క నేర్పుగా ,బూడిద రంగు పొర మాత్రమే కనపడేట్టుగా వలవడం ఒక ఆర్ట్ ,ఆ పనికోసం పోటీ పడేవాళ్లం.ఈ కాయల లోని తెల్ల పప్పులు వలిచి కూరకూడా చేసుకోవచ్చని ఈ మధ్యే తెలిసింది.

సీమచింత గింజలతో కాదుగానీ,చింతకాయలు పచ్చడి పెట్టే సీజన్ లో దోరచింతకాయలు తిని నోరు కొట్టుకు పోవడం(అబ్బా ఇప్పుడుకూడా నోట్లో నీళ్లూరుతున్నాయి ),చింతగింజలు పోగు చేసి ఆటలాడు కోవడం మా తరం వారందరికీ తెలిసిన సరదాలు.చింతగింజలు పెద్ద ఆస్తిలాగా,డబ్బాలలో దాచి ,మధ్యాహ్నాలు ఎవరైనా ఆడుకోవడానికి రాంగానే డబ్బా బోర్లించి ఆటమొదలు పెట్టేయ్యడమే ,బోర్ అనే పదానికి అర్థమే తెలియని రోజులవి,అన్నట్టు చింతగింజలతో వామన గుంటలు కూడా ఆడేవాళ్లం.

ఇంతకీ పొలం గట్ల మీద కనపడే సీమచింత కనపడక పోవడానికి కారణమేంటో తెలిస్తే గానీ నాచింత తీరేలా లేదు.....

Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము