స్వరభాస్వరం-యల్లారీశ్వరం

భాస్వరానికి, సూరేకారం లాంటి జ్యోతిలక్ష్మి నృత్యమూ ,గంధకం లాంటి పాట రచనా తోడైందంటే ఇక వేరే చెప్పాలా మహాప్రభో!  సినిమా పాటల తూటాలు సీమటపాకాయల్లా పేలతాయి,మనుషులను వెర్రెక్కిస్తాయి. మ్మత్తయిన,గమ్మత్తయిన ,కైపెక్కే, అదోమాదిరిగా అనిపించే పాటలు పాడటంలో ఆరితేరిన గాయని యల్లారీశ్వరి,అయితే ఆమె ఇలాంటి మాదకత నిండిన పాటలేనా?మాధుర్యం ఒలికేవీ,ఇంకా మిగతా రకాల పాటలేవీ పాడలేదా ? అని అనుమానిస్తే మనం పప్పులో కాలేసినట్టే. ఆమె అన్ని రకాల పాటలూ పాడింది,అందులో మాధుర్య ప్రధానమైనవీ,యుగళ గీతాలూ,చిన్న పిల్లలికి పాడినవీ(బాలభారతం),భక్తి గీతాలు,కమెడియన్స్ కి పాడినవీ అన్నీ ఉన్నాయి.ఆవిడ పాడిన హిందూ,క్రిస్టియన్ భక్తి గీతాల ఆల్బమ్స్ తమిళనాట చాలా పాప్యులర్ అని విన్నాను.

మాధుర్య ప్రధానమైనపాటల విషయానికొస్తే సుశీల ఆమెలాగా పాడలేరేమో కానీ,ఆవిడ సుశీల లాగా పాడగలరు ,"గాలిలోన పైటచెంగు గంతులేసేనెందుకో" (ప్రతిజ్ఞాపాలన) పాట విని అది సుశీల పాడిందనుకునే దాన్ని చాలాకాలం,తర్వాత ఈమె పాడిందని తెలుసుకుని చాలా ఆశ్చర్య పోయాను. అయితే ఆమె గొంతులో వినపడే ప్రత్యేకమైన   వైబ్రేషన్స్ కి శృంగారగీతాలూ, క్లబ్ సాంగ్సూ ,జానపద గీతాలూ బాగా సూటవుతాయనిపిస్తుంది "మాయదారి సిన్నోడు" అని ఆమె గొంతు సవరించుకోంగానే ,ఒకతరం యువత అంతా చిత్తయిపోయేవారు. ఒక మనిషి తన గొంతుతో ఎంత మాయాజాలం చెయ్యవచ్చో ఆమె పాట వింటే అర్థమవుతుంది. అంతెందుకూ హిందీ చిత్ర సీమలో ఆశా గొంతులో వినిపించే పెప్ మరెవరూ సాధించలేరు అనుకునే దాన్ని నేను, అలాంటిది "ఓ కౌన్ థీ "లో మదన్ మోహన్ సారథ్యంలో ఆశా పాడిన "షౌక్ నజర్ కి బిజిలియా"  అనే పాట తెలుగు రీమేక్ లో పి.బి.శ్రీనివాస్ తో పాటు యల్లారీశ్వరి పాడగా విని ఆశ్చర్యపోయాను (నీవు చూసే చూపులో ఎన్నెన్ని అర్థాలు వున్నవో )ఎందుకంటే ఈమె ఆశాకంటే రెండాకులు యెక్కువ చదివి ఆ పాటకు సొగసులద్దింది.

అందరూ పాటలో లీనమయి ,అనుభూతి చెందుతూ పాడితే ,యల్లారీశ్వరి మాత్రం పాటకు తన ప్రాణమిస్తుంది అనిపిస్తుంది,అంత జీవముంటుందా పాటలో.ఒక్క సారి ఆమె పాడిన పాటలు పరిశీలించిన వారికెవరికయినా అది అర్థమవుతుంది

.మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల---దేముడు చేసిన మనుషులు 

.మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు----అమ్మమాట

.లేలేలే నారాజా---ప్రేమనగర్ 

నందామయా గురుడ నందామయా ----జీవనతరంగాలు

.నీవు నాకురాజా మరి నీకు నేను రోజా---రాజకోట రహస్యం

.పట్నంలో శాలిబండ పేరేనా గోలకొండ----అమాయకుడు

.సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్ ---సింహబలుడు

.తీస్కో కొకోకోలా-- రౌడీలకు రౌడీలు

ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ లిస్ట్ అలా సాగిపోతూనే వుంటుంది. ఇదంతా  ఎలా సాధించింది ఆమె? ఆమె పుట్టి పెరిగిన వాతావరణం యెలాంటిది? ఆమె సంగీతంలో యెలాంటి శిక్షణ తీసుకుంది?అని పరిశీలిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు తెలుస్తాయి. ఆమె తమిళనాడులో పరమకుడి అనే ఊరికి చెందినది,మద్రాసు లోనే పుట్టి పెరిగింది.తండ్రి ఆంథోనీ దేవరాజు, తల్లి మేరీ నిర్మల రోమన్ కేథలిక్కులు.తండ్రి ఈమె చిన్నదానిగా వుండగానే (సుమారు అయిదారేళ్ల వయసు )మరణించడంతో  ,తల్లి తన ముగ్గురు పిల్లలతో జీవిక కోసం రేడియోలో పాడటం,సినిమాల్లో కోరస్ పాడటం చేసేది.చిన్నప్పటి నుండీ  సినిమా స్టుడియోలకి తల్లిని అనుసరించి వెళుతూ వుండేది లూర్థు మేరీ రాజేశ్వరి . అదే ఆమె అసలు పేరు.అలా స్టుడియోలకి వెళుతూ వెళుతూ కొన్నాళ్లకి తను కూడా కోరస్ పాడటం మొదలు పెట్టింది."సువర్ణ సుందరి "సినిమాలో "పిలువకురా అలుగకురా "పాటలో వచ్చే కోరస్ పాడే గొంతులలో తన గొంతు కూడా వుంది.తమిళ సినిమా"మనోహర "లో జిక్కితో పాటు కోరస్ పాడింది.సంగీతంలో యెలాంటి శిక్షణా తీసుకోలేదనే చెప్పాలి,ఆ సరస్వతి ఆమెను అయాచితంగానే కరుణించినట్టుంది.

ఇలా వుంటూ వుండగా కోరస్ లో అందరి కంటే ముందే వుత్సాహంగా పాటందుకునే ఈమెను గమనించి ఎ.పి. నాగరాజన్ అనే తమిళ నిర్మాత తన సినిమా "నల్ల ఇడత్తు సంబందం "అనే సినిమాలో కె.వి.మహదేవన్ దర్శకత్వంలో సోలో పాడే అవకాశమిచ్చాడు(1958).ఆ తర్వాత ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టిన పాట "పాశమలర్ "లోని "వారాయొ తోళి వారాయో(https://www.youtube.com/watch?v=NQzGsG7Ru8w&feature=youtu.be) "అనే పాట పాడే అవకాశమిచ్చింది ఎం. ఎస్ విశ్వనాథన్ .ఈ సినిమానే తెలుగులో "రక్త సంబంధం "పేరుతో రీమేక్ చేసినప్పుడా పాట పి.సుశీల పాడింది ,అదే "బంగారు బొమ్మ రావేమే పందిట్లొ పెళ్లి జరిగేనే "అనే పాట. తెలుగు లో ఆమె మొదటి పాట "దొంగలున్నారు జాగ్రత్త" లో "చమురుంటేనే దీపాలోయి" అనేది అని విఎకె రంగారావు గారు "ఆలాపన "పుస్తకం కోసం నాకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు,అయితే ఈ సినిమాలో ఆమె పేరు డి.యల్ .రాజేశ్వరి అని వుంటుంది అనీ ఆ తర్వాత వచ్చిన "జగన్నాటకం "సినిమాలో యల్లారీశ్వరి అని వుంటుందనీ ఆమె ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది.ఆమె పేరు మార్చుకోవడానికి కారణం యం.యస్ .రాజేశ్వరి అనే పేరుతో వేరొక గాయనీ మణి వుండటం ,(ఆమె సంఘం,జీవితం సినిమాలలో పాడింది.) అలా ఆమె యల్లారీశ్వరిగా స్థిరపడింది. ఇంకా వి.ఎ.కె రంగారావు గారు ఆమె పాడిన పాటలతో "నా పేరు సెలయేరు "అనే యల్ .పి తయారు చేసి విడుదల చేశారు (HMV).

తమిళంలోనూ ,తెలుగులోనే కాక ఆమె మళయాళంలోనూ,కన్నడంలోనూ ఇంకా పధ్నాలుగు భాషల్లో కొన్ని వేల పాటలు పాడిందట ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అనేక మంది సంగీత దర్శకుల సారధ్యంలో  ఆమె గానప్రయాణం సాగింది,వారిలో  బాగా ప్రోత్సహించిన వారి పేర్లు కె.వి.మహదేవన్ ,ఎం.ఎస్ .విశ్వనాథన్ ,వేదా,రమేష్ నాయుడు,సత్యం ,చక్రవర్తి. వీరిలో ఆమె గొంతులోని ప్రత్యేకతని గుర్తించి ,దానిని పూర్తిగా వినియోగించుకున్నది ఎం.ఎస్ విశ్వనాథన్ .ఆయన ఆమెకు "పాశమలర్ "లో అవకాశం కల్పించినది మొదలు దాదాపు పాతిక సంవత్సరాలపాటు నిరాఘాటంగా ఆమెతో పాడిస్తూనే వున్నారు ,ఆయనకీ ఆమెకూ మధ్య ఒక ఆత్మీయానుబంధం వుండేదని కూడా విన్నాను.

అయితే ఆమె ఒక ఇంటర్వ్యూలో కె.ఎస్ .ఆర్ దాస్ ,రాజశ్రీ,సత్యం ల కాంబినేషన్లో చాలా మంచి పాటలు పాడాననీ,ముఖ్యంగా సంగీత దర్శకుడు సత్యం తనని చాలా ప్రోత్సహించే వారనీ,ఇంకా తన గొంతు లోని విలక్షణతను గుర్తించిన ఘంటసాల తగిన అవకాశాలిచ్చి తననెంతో ప్రోత్సహించే వారనీ చెప్పింది. అలా ఘంటసాల  దర్శకత్వంలో ఆమె  "పాండవ వనవాసం"లో "మొగలీ రేకుల చినదాన "అనే పాట,"https://www.youtube.com/watch?v=OD90V2sM-2Y (హేమ మాలిని మొదటి సారిగా ఈ సినిమాలో నృత్యం చేసింది,తర్వాత హిందీ తెరకు తరలి పోయింది )"  "పుణ్యవతి" లో "సుకు సుకు సుతారి గుమ్మ " లాంటి పాటలు పాడింది,మిగతా దర్శకుల చేసిన పాటల్లో కూడా వీళ్లిద్దరికీ యుగళ గీతాలున్నాయి. అసలు ఘంటసాలా,యల్లారీశ్వరీ పాడిన యుగళాలు భలే ప్రత్యేకంగా అనిపిస్తాయి నాకు,సాంప్రదాయ సిధ్ధమయిన ఆయన గొంతుకీ,మషాలా ఘాటు తో కూడిన ఈమె గొంతుకీ కుదిరిన జోడీలో ఒక వింత అందముందనిపిస్తుంది.

ఇంక మిగతా తోటి గాయనీ గాయకులతో  పాడిన పాటలలో కూడా ఈమె గొంతు ప్రత్యేకంగా వినిపించి ఆ పాటలు వింత అందంతో గుబాళిస్తాయి మచ్చుకి కొన్ని పాటలు చూద్దాం

.పి.సుశీల తో ---నాగులేటి వాగులోన కడవ ముంచబోతంటే ----మూగప్రేమ ---చక్రవర్తి

ఎస్ .జానకి తో -------గుడిలోన నాస్వామి కొలువై వున్నాడు-----ఇదా లోకం ----చక్రవర్తి.

ఘంటసాల తో -----లేలే లేలే నారాజ----ప్రేమనగర్ ---కె.వి.మహదేవన్

యస్ .పి బాలు తో------భలె భలె మగాడివోయ్ బంగారు నాసామివోయ్ ----మరోచరిత్ర ----ఎం.ఎస్ .విశ్వనాథన్ 

ఇంకా పి.బి.శ్రీనివాస్ ,పిఠాపురం,జయదేవ్ ఇలా చాలామందితో చాలా చక్కని పాటలు పాడారు తెలుగులో ,మిగతా భాషల వివరాలు నాకు తెలియదు. తమిళ ప్రభుత్వం ఆమెను "కలైమామణి "అనే అవార్డు తో సత్కరించుకుంది, మద్రాస్ తెలుగు ఫిలిం ఫాన్స్ అసోసియేషన్ ఉత్తమ తెలుగు గాయనిగా సన్మానించింది.ప్రజలు ఇచ్చిన రివార్డుల ముందు ఈ అవార్డులొక లెఖ్ఖ కాదు ఆమెకి అనిపిస్తుంది.

1984 తర్వాత ఆమె పాటలు తగ్గి పోయాయి ,అప్పుడప్పుడూ వినిపించేవి ఇప్పుడదీ లేదు.సినిమా రంగంలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి .మాధుర్యానికీ ,సాహిత్యానికీ ప్రాధాన్యత తగ్గిపోయి ,ఐటమ్ సాంగ్సూ ,బీట్ ప్రధానమైన పాటలూ వచ్చాయి.ఆ పాట యెవరు పాడుతున్నారో ,అందులోని మాటలేవిటో నాలాంటి ప్రజలకు బొత్తిగా అర్థం కాని రోజులొచ్చాయి , అప్పుడప్పుడూ సంగీతం ,సాహిత్యం వినపడే పాటలు వచ్చినా వాటి సంఖ్య చాలా తక్కువ,ఎవరో చెప్పినట్టు "విధి బలీయం" అని వూరుకోవాలి యేం చేస్తాం. ఏది యేమయినప్పటికీ తన పాటలతో ఒక తరం యువత కలలను కొల్లగొట్టి ,ఉర్రూతలూగించిన యల్లారీశ్వరి కలకాలం చల్లగా  వుండాలని  కోరుకుంటూ.
...  భార్గవి



Comments


  1. చాలా బాగా రాశారు!

    జీవితం సినిమాలో 'మాయ చేసి పోతివిరో నాగులూ' కూడా popular. రమేష్ నాయుడు సంగీతం!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము