పుస్తకాల మనిషి C/O గుంటూరు



ఈయన పేరు లంకా సూర్యనారాయణ.నాకీయన పరిచయం రవికృష్ణ ద్వారా జరిగింది.రవికృష్ణ పరిచయం వి.ఎ.కె. రంగారావు గారిని ఇంటర్వూ చేస్తున్నపుడు జరిగింది.ఇదేదో గొలుసుకట్టు కథలా వుంది కదూ, "ఆలాపన" పుస్తకం  ప్రచురిస్తున్న సందర్భంలో నేనొకసారి గుంటూరు వెళ్లినపుడు రవికృష్ణ కనపడి "మీరు లంకా గారిని వొకసారి కలవాలి కలవదగిన వ్యక్తి" అని తీసికెళ్లాడు.

అప్పుడాయన వుంటున్న ఇంటినిండా పుస్తకాలే.నిజం చెప్పాలంటే పుస్తకాల మధ్య యెలాగో చోటు చేసుకుని ఆయన జీవిస్తున్నట్టూ,వాటి మధ్య ఆయన ఇరుక్కు పోయినట్టూ కనపడింది.ఆయన సేకరించిన పుస్తకాలు సుమారు 50 వేలుంటాయి అని చెప్పారు.నేనా పరిస్థితి చూసి"ఏమండీ మీరీ పుస్తకాలన్నీ చదివారా?" అని  ఆశ్చర్యంగా అడిగితే ,ఆయనొక వైరాగ్యమైన నవ్వు నవ్వి"చూడండీ పుస్తకాలు సేకరించడం మొదలు పెడితే చదవటం తగ్గుతుంది" అన్నారు.పుస్తకాలు కొనడం యెంత వ్యసనమో చెబుతూ "బతుకు కల్లుపాక అయిపోతుంది అనుకోండి" అన్నారు.నాకప్పుడు అర్థం కాలా తర్వాత అర్థమయింది .కల్లు తాగడం అలవాటయిన వాడికి కల్లుపాక దగ్గరకి కాళ్లెలా లాగుతాయో పుస్తకాలు కొనడం అలవాటయిన వాడికి పుస్తకాల షాపులకేసి కాళ్లలా లాగుతాయన్న మాట.ఆయనింకా ఇలా అన్నారు"ఒకోసారి నా దగ్గరున్న పుస్తకమే కొత్త యెడిషన్ వచ్చిందని తెలిస్తే కొనకుండా ఆగలేను,ఒకోసారి నా దగ్గరా పుస్తకం వున్నట్టు మరిచిపోయి కూడా కొంటూ వుంటాను,యీ వ్యసనం పట్టుకుంటే వదలదండీ బాబూ".ఇంకోసారి వెళ్లినపుడుచెదలు తినేసిన పుస్తకాలొక పక్కన చిన్న గుట్టగా పోసి వున్నాయి.అవి చూపిస్తూ"వాటికి కూడా మంచి టేస్ట్ వుందండోయ్ మంచి మంచి ఆర్ట్ కి సంబంధించిన పుస్తకాలే ఆరగించాయి "అనడం నాకు విచిత్రంగా అనిపించింది. ఈ మధ్య కాలంలో "అన్నమయ్య గ్రంథాలయం" స్థాపించి తనదగ్గరున్న పుస్తకాలన్నీ అక్కడకు తరలించి వొక వరుసక్రమంలో అమర్చడం లాంటి పనులు చేశాక ఆయనకి ఇంటి దగ్గర కొంత వెసులుబాటు చిక్కినట్టుంది.

నేనెప్పుడు వెళ్లినా నాకేదైనా పుస్తకం కావాలంటే అది తీసివ్వడమే కాకుండా దానికి అనుబంధంగా వుపయోగపడే ఇంకో అయిదారు పుస్తకాలు యిస్తారు,ఇంకా దానికి సంబంధించినపుస్తకాలు యేవి చదవాలో సూచిస్తారు. ఒక రోజు లైబ్రరీ చూడటం అయిపోయాక ఆయన ధర్మకర్తగా వున్న బృందావన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వరస్వామి గుడీ,వారి ఆధ్వర్యంలోనే రూపుదిద్దుకున్న స్మశాన వాటికా వొకే విధమయిన నిర్వికారతతో చూపారు.ఆశ్చర్యం గుడీ,స్మశానంవొకేలా వున్నాయి.గుడిలో యెంతశుచీ,శుభ్రతా వున్నాయో స్మశానంలోనూ అంతశుచీ,శుభ్రతా వున్నాయి.నిజం చెప్పాలంటే చచ్చిపోయాక ఇలాంటి చోటుకి రావాలి సుమా అనిపించేట్టు వుందా స్మశానం. ఈ రెండూ చూపించేటపుడు ఆయన్ని గమనించినపుడు నాకేమనిపించిందంటే,ఆయనిది మూఢభక్తీ,పాపభీతీకాదు నలుగురికీ వుపయోగ పడేదీ నలుగురికీ మంచి చేసేదీ చెయ్యడమే ఆయన ధ్యేయమేమోనని. ఆయన మాటలధోరణి విచిత్రంగా వుంటుందని ఇదివరకు నేను ఆయన గురించి చెప్పిన మాటల వలన తెలిసే వుంటుంది ,ఇంకొక్క మాట చెప్పి ముగిస్తాను. ఏదో మాటల సందర్భంలో యేదో విషయం గురించి చెబుతూ "ఇది మీకు తెలుసనుకుంటాను" అంటే "ఎద్దల్లే వున్నావు తేలుమంత్రం తెలియదా?అంటే నేనేం చెప్పేది" అని వూరుకున్నారు. అది తలుచుకుని ఇప్పటికీ నవ్వుకుంటూ వుంటాను.

ఆయన పుస్తక సేకరణలో పడిపోయి తను పెద్దగా పుస్తకాలు చదవలేదని వినయంగా చెప్పినప్పటికీ ఆయన యెంతో కొంత చదవక పోతే ఈ పుస్తకంలో యీ విషయం వుందనీ ,ఇది చదివితే బాగుంటుందనీ ,దీనికి అనుబంధంగా ఆ పుస్తకం కూడా చదవాలనీ,ఫలానా ఫలానా పుస్తకాలు విలువైనవనీ సేకరించాలనీ యెలా తెలుస్తుంది చెప్పండీ!

అంతే కాదు,నేను ఆదిభట్ల నారాయణదాసు గారి గురించి ఆసక్తి చూపిస్తుంటే ఆయనకి సంబంధించిన తన దగ్గరున్న పుస్తకాలన్నీ యిచ్చారు.ఆయన స్వీయచరిత్ర "నా యెరుక"జిరాక్స్ కాపీ తీయించి యిచ్చారు(ప్పటికి రవికృష్ణ ఆ పుస్తకం ప్రచురించలేదు ).వారి వంశానికి చెందినకర్రా వెంకట్రావు గారింటికి నేను మొహమాట పడుతున్నా సరే లాక్కెళ్లారు,దానివల్ల నేను దాసు గారు చిన్నతనంలో బహుమతిగా పొందిన"భాగవతం" పుస్తకం కళ్లతో చూసీ,చేతితో తాకీ ధన్యురాలినయ్యాను.

వీటన్నిటినీ మించి యెన్నో పుస్తకాల పునర్ముద్రణకి తన దగ్గరున్న ప్రతులిచ్చి సహాయపడ్డారు.నేను ప్రచురించిన "ఆలాపన" పుస్తకానికి సంబంధించిన పుస్తకాలిచ్చి సహాయ పడ్డారు.నాకు తెలిసి దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారి స్వీయచరిత్రా,దాసు గారి "నా ఎరుక" వెలుగు చూశాయి నాకు తెలీనివెన్నో!,ఇదుగో యిప్పుడు మళ్లీ తిరుపతి దుర్గా ప్రసాద్ గారు "రాజాచంద్ర "ఫౌండేషన్ తరుఫున శ్రీ కేసరి గారి "నా చిన్ననాటిముచ్చట్లు" వీరిచ్చిన ప్రతి సహాయంతో ప్రచురించబోతున్నారని తెలిసిన సంతోషంలో లంకా గారి గురించి యీ నాలుగు మాటలు  పుస్తక ప్రపంచానికి యింత సేవ చేస్తున్న ఈయన్ని యెవరైనా పొగుడుతున్నట్టు అనిపిస్తే మొహం చిరాగ్గా  పెట్టుకుని అవతలకి  వెళ్లిపోతారు.అందుకే నేను పొగడ్తగా కాకుండా వున్న విషయమే చెప్పాను. ఆయన వలన మరిన్ని మంచి పుస్తకాలు వెలుగు చూడాలనీ,పుస్తకాలు చదివే వారి సంఖ్య పెరగాలనీ,ఆయన ఆరోగ్యంగా,ఆనందంగా తనకిష్టమయిన పుస్తక ప్రపంచంలో హాయిగా కాలం గడపాలనీ కోరుకుంటూ ...
                                                                                                                                                                                                                                              నమస్కారాలతో భార్గవి.

Comments

  1. ఒక మంచి వ్యకి యొక్క పుస్తక వ్యాననాన్ని చలగురించి బాగా చెప్పారు. నేటి సమాజానికి కావలసిన వ్యక్తి.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము