వెండితెర బంగారం-యస్వీ.రంగారావు


జార్జ్ ఇలియట్ రాసిన "సైలాస్ మార్నర్ "ఇంగ్లీషు నవల ఆధారంగా బి.యన్ .రెడ్డి తీసిన "బంగారు పాప" లో వేషం  లభించడం నటుడు గా యస్వీ.రంగారావుకి లభించిన బంగారు అవకాశం. ఆ బంగారు అవకాశాన్ని బంగారంగా ఉపయోగించుకుని, బంగారమైన నటన ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలు పొందాడు యస్వీ.ఆర్ . కేవలం  ’విమర్శకుల’ అని ఎందుకంటున్నానంటే మంచి పేరైతే వచ్చింది గానీ సినిమాకి, వసూళ్ల పరంగా నష్టమే మిగిల్చింది . రంగారావు పరంగా చూస్తే రొటీన్ రొడ్డకొట్టుడు వేషాలకు భిన్నమయినదీ వేషం. ఈ సినిమాలో అనేక షేడ్స్ వున్నాయి. ఇందులో నటించేటపుడు ఉద్వేగానికి గురయ్యే వాణ్ణనీ, తనని తను కంట్రోల్ చేసుకోవడం కష్టమయ్యేదనీ రంగారావే స్వయంగా చెప్పుకున్నట్టు చదివాను.

సామాన్య గృహస్థు గా వున్న ఒక మనిషి పరిస్థితుల ప్రభావం వలన కరుడు గట్టిన రౌడీ గా మారతాడు, అలా మారిన రౌడీ అనుకోని పరిస్థితులలో ఒక చిన్న పాపను చేరదీయాలిసి వస్తుంది. ఆ క్రమంలో అతనిలో సాత్త్వికత మొలకెత్తి అంత పెద్ద రౌడీ మామూలు తండ్రిలాగా మారిపోయి పాప బాగోగుల కోసం తపించి పోతాడు. అదీ సినిమాలో కథ. ఈ చిత్రం ఆ యేటి ఉత్తమ జాతీయ చిత్రంగా అవార్డ్ సాధించింది.పాలగుమ్మి  .పద్మరాజు గారిని చిత్రసీమకు రచయితగా పరిచయం చేసిందీ చిత్రం. ఇందులో "బంగారు పాప"గా కృష్ణ కుమారి అందంగా,అమాయకంగా వుంటుంది.ఆమె జోడీ రామశర్మ కూడా తాజాగా సరిపోయాడు. జగ్గయ్య నటన తూకంగా వుంటుంది . ఉండేది కొంచెం సేపే అయినా తళుక్కున మెరిసే పాత్ర జమునది. పాప మేనత్త గా వేసిన హేమలత నటన చక్కగా కుదిరింది. జగ్గయ్య భార్యగా నటించింది విద్యావతి, ప్రముఖ నటి సంధ్యకు సోదరీ, జయలలితకు పిన్నీ.ఆమె అండతోనే సంధ్య సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది.

కెమెరా బి.యన్ .కొండా రెడ్డి, బి.యన్ .రెడ్డి సోదరుడు. సంగీతం అద్దేపల్లి రామారావు. పాటలన్నీ మృదుమధురంగా వుంటాయి.సాహిత్యం సమకూర్చింది దేవులపల్లి,అయితే అన్నిటిలో తలమానికమనదగిన పాట "తాథిమి తకథిమి తోల్ బొమ్మా "రాసింది బాలాంత్రపు రజనీకాంతరావు. అలా ఆ ఒక్క పాట ఆయన రాసిన నేపథ్యమేమిటో మనకు తెలీలేదు. ఆ విషయం  వారబ్బాయి హేమచంద్ర కేమైనా తెలుసేమో వివరిస్తే బాగుండు. ఎంతో తాత్త్వికత నిండిన ఈ పాట కు యస్వీ.ఆర్ నటనా,మాధవపెద్ది గొంతూ ఎంత బాగా సూటయ్యాయో ఇక్కడ  వీడియో లింక్ లో గమనించండీ. (https://www.youtube.com/watch?v=lABmUat-cjM) అన్నట్టు తాను తీసిన చిత్రాలలో తన కిష్టమయిన చిత్రంగా "బంగారు పాప"ను చెబుతారట బి.యన్ .రెడ్డి, అందరూ మెచ్చిన "మల్లీశ్వరి "ని కాదు.

  


Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము