వైవిధ్యమయిన గాయని రాణి


పదీ, పదకొండేళ్ల వయసులో 'దేవదాసు'లో పాడిన పాటల ద్వారా ఆమె  శ్రోతల గుండెల్లో కొలువు తీరిపోయింది. ఎన్నాళ్లు గడిచినా మరవని ఓ మధురిమ మనల్ని  వెన్నాడుతూనే ఉంటుంది. ఆమె తెలుగు చలనచిత్ర  గాయని కె.రాణి. ఆమెది భలే విచిత్రమైన గొంతు. ఘంటసాల గారి చేత 'రాణీ, నీ గొంతులో మిర్చి మసాలా ఘాటు ఉందమ్మారు!' అని అనిపించుకున్న ప్రత్యేకమైన గొంతు ఆమె సొంతం! ఆమెవి కొన్ని పాటలు వింటుంటే జిక్కీ గుర్తొస్తుంది. కొన్ని వింటుంటే పి.లీల పాడారేమో అనిపిస్తుంది. మరికొన్ని పాటల్లో జమునారాణి గుర్తొస్తుంది. అప్పుడప్పుడూ సుశీలలాగానూ అనిపిస్తుంది. అందుకే ఆమె గొంతు గుర్తుపట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది. చాలామంది ఆమెనీ, జమునారాణినీ కన్‌ఫ్యూజ్‌ అవుతారు. కొంచెం జాగ్రత్తగా వింటే మాత్రం ఆ గొంతులోని విలక్షణత అర్థమవుతుంది. ఆమె గొంతులో విలక్షణత పలికే చక్కని శృతినీ, పెప్‌నీ గమనించిన సంగీత దర్శకులు ఆమెకు చక్కటి అవకాశాలిచ్చారు. అన్ని భాషలూ కలుపుకుని ఆమె సుమారు 500 పాటలు పాడారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీలోనే కాకుండా, సింహళ, ఉజ్బెక్‌ భాషల్లోనూ పాడారు. సింహళ భాషలో సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వంలో ఆవిడ పాడిన జాతీయగీతం చాలా పాపులర్‌ అయింది. ఈనాటికీ సింహళులకదే జాతీయగీతం.

ఆమెను మొట్టమొదట గుర్తించి, సినిమాల్లో అవకాశమిచ్చి ప్రోత్సహించింది సిఆర్‌ సుబ్బరామన్‌. నటి వైజయంతిమాల డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌లో ఏదో హిందీ పాట పాడిన రాణిలోని ప్రతిభను గుర్తించిన ఆయన, ఆమె ఇంటికి వచ్చి ఆమె చేత పాడించి వినీ, మర్నాడే ఒక తమిళ సినిమాలో పాడటానికి పిలిపించారు. ఆ సినిమా పేరు 'పారిజాత.' ఆ తర్వాత తెలుగులోనూ ఆయనే అవకాశాలివ్వడం ఆరంభించారు. ఆయన దర్శకత్వంలో 'రూపవతి', 'ధర్మదేవత' సినిమాల్లో పాడింది. 'ధర్మదేవత'లో మూడు పాటలు పాడింది. అందులో ఒకటి పెండ్యాల గారి దగ్గర వయొలనిస్ట్‌ ప్రసాదరావుతో డ్యూయెట్‌. ఈ సినిమాలోనే 'లంబాడా లంబ లంబ' అనే హుషారైన పాట పాడేటప్పుడు ప్రముఖ నిర్మాత బి.నాగిరెడ్డి చూసి ముచ్చటపడి వారి 'పెళ్లిచేసి చూడు' సినిమాలో అవకాశమిచ్చారు. అలా ఆవిడ ఘంటసాల దర్శకత్వంలో 'అమ్మా నొప్పులే; అయ్యొయ్యో బ్రహ్మయ్యా' పాటలు పాడింది. అవి సూపర్‌ హిట్టయ్యాయి. అయితే ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చి సినిమా రంగంలో నిలబెట్టిన పాటలు, సిఆర్‌ సుబ్బరామన్‌ దర్శకత్వంలో 'దేవదాసు'లో పాడిన 'అంతా భ్రాంతియేనా,' ’ ఓ దేవదా’, 'చెలిమి లేదు' పాటలు. ఈనాటికీ చాలామంది ఆమెను 'దేవదాసు'లో పాడిన రాణిగానే గుర్తిస్తారు. ఇంతా చేసి అప్పటికామె వయసు తొమ్మిదేళ్లే! 

ఆవిడ అసలు పేరు ఉషారాణి. ఆమె 1942లో కర్ణాటకలోని తుముకూరులో జన్మించారు. అలా అని ఆమె కన్నడ దేశస్థురాలు కాదు. ఉత్తర హిందూస్థాన్‌కి చెందిన కుటుంబం. తండ్రి పేరు కిషన్‌, తల్లి పేరు లలిత. తండ్రి ఇండియన్‌ రైల్వేలో పనిచేస్తూ, చివరకు కడపలో స్థిరపడ్డారు. వివిధ ప్రాంతాలు తిరగడం వల్ల ఆవిడకి చాలా భాషలతో పరిచయం ఏర్పడింది. అలా ఆమె తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, తమిళ, మలయాళం, కన్నడ భాషలు మాట్లాడగలిగేవారు. దానివల్ల ఆయా భాషల్లో పాడటం సులువైంది.  ఆమె మొట్టమొదటి పాట 1951లో పాడితే, 1953లో 'దేవదాసు'లో పాడారు. 1966లో నిర్మాత, స్టుడియో సొంతదారూ అయిన జి.సీతారామిరెడ్డి గారితో వివాహం జరిగింది. వారికి విజయ, కవిత అని ఇద్దరు కూతుళ్ళు. సీతారామిరెడ్డి గారికి 'సదరన్‌ మూవీటోన్‌' అనే స్టూడియో హైదరాబాద్‌లో ఛార్మినార్‌ దగ్గర ఉండేది. అక్కడే 'రహస్యం' సినిమా షూటింగ్‌ జరిగింది. ఆయన నిర్మాతగా 'సతీ అరుంధతి', 'నిజం చెబితే నమ్మరు' అనే సినిమాలు తీశారు. 1974లో ఆయన చనిపోయారు. రాణి అప్పటినుంచి సినిమాల్లో పాడటం మానుకున్నారు. ఆమె చివరగా పాడింది, ఘంటసాల చివరి సినిమా 'వస్తాడే మాబావ.'

ఆవిడ చలనచిత్ర జీవితం పరిశీలిస్తే 'దేవదాసు'లో ఆమె పాడటానికి అభ్యంతరం చెప్పినవాళ్లూ ఉన్నారు. దర్శకుడు వేదాంతం రాఘవయ్య తది తరులు 'చిన్నపిల్ల పాడగలదా?' అని అనుమానపడితే.. దర్శకుడు సుబ్బరామనూ, నిర్మాత డిఎల్‌ నారాయణా పట్టుపట్టి పాడించారు. ఘంటసాల గారితో పాడటానికి ఆమె భయపడుతుంటే సుబ్బరామన్‌ ధైర్యం చెప్పేవారు. ఆ తర్వాత ఘంటసాల, టివి రాజు, టిజి లింగప్ప, ఎం.సుబ్రహ్మణ్యరాజు, అశ్వత్థామ, సుసర్ల దక్షిణామూర్తి, రాజేశ్వరరావు లాంటి సంగీత దర్శకుల దగ్గర పాడినా, ఒక సుశీలకీ, జిక్కీకీ, జానకికీ, జమునారాణికీ, లీలకీ వచ్చినంత గుర్తింపు ఆవిడకి రాలేదనిపిస్తుంది. అలా అని ఆవిడ కొన్ని రకాలైన పాటలకే సూటవుతుందని అనుకోవడానికి వీలు లేదు. ఆవిడ కూడా 'నేనీ పాటలే పాడతాను' అని గిరి గీసుక్కూచున్నట్టూ కనపడదు. ఆవిడ హీరోయిన్‌కీ పాడింది, వాంప్‌కీ పాడింది, క్లబ్‌సాంగ్స్‌కీ పాడింది, ఏడుపు పాటలూ పాడింది, చిన్నపిల్లల పాటలు పాడి, చివరకు బృందగానాల్లోనూ పాడింది. ఆవిడ ప్రయివేటు రికార్డులూ ఇచ్చింది. బి.గోపాలంతో కలిసి ఆమె పాడిన 'చల్లగాలిలో' చాలా హిట్‌.

సినిమా అవకాశాలు తగ్గాక బయట ఫంక్షన్లకు పాడటం, కచేరీలు చేయడం చేసేవారు. అలా ఘంటసాల గారితో చాలా కచేరీలు చేశారు. హిందీ గాయకులైన ముఖేష్‌, తలత్‌ మొహమూద్‌లతో కలిసి చాలా కచేరీల్లో పాల్గొన్నారు. అని. ఆయన దర్శకత్వంలో ఆవిడ చాలా మంచి పాటలు పాడారు. 'శభాష్‌ రాముడు'లో 'జాబిల్లి వెలుంగులో' పాటలో ప్రతి చరణం చివరా వచ్చే మెలిక సంగతి వింటుంటే, ఘంటసాల గారు ఆవిడ గాత్రానికుండే ప్రత్యేకతని గుర్తుపెట్టుకుని అలా పాడించారనిపిస్తుంది. 'ఈ పాటలో గోపిక విరహాన్ని బాగా చూపాలమ్మా నువ్వూ' అనే వారంట. అందులోనే 'చందమామ ఇటు చూడరా' చాలా ప్రత్యేకమైన పాట. అవడానికి క్లబ్‌సాంగే అయినా, చరణానికీ, చరణానికీ వేగంలో తేడా ఉంటుంది. మధ్యలో ఘంటసాల ఆలాపన ఉంటుంది. కథానాయకుడికి ఇటు వస్తే ప్రమాదం అనే హెచ్చరికా ఉంటుంది. గాయకులకు పరీక్షపెట్టే పాట ఇది. అయినా అలవోకగా పాడేసిందావిడ. ఆయన దర్శకత్వంలోనే 'వినాయక చవితి'లోని 'వేసేను నా మది చిందులూ' ఎంత మధురంగా ఉంటుందో! 'పెళ్లిచేసి చూడూ, చంద్రహారం, మాయాబజార్‌' ఇలా వరసగా ఆయన చిత్రాలన్నింటిలో ఒకటో, అరో పాటలు పాడారావిడ. ఈ నెల 13వ తేదీన ఆమె హైదరాబాద్‌లోతన  కుమార్తె ఇంట్లో పదమూడు జూలై రెండువేల పద్దెనిమిదిన కన్నుమూశారు. ఎప్పుడో పాడటం మానేసిన ఆవిడ మరణం చిత్రరంగానికి తీరని లోటని చెప్పలేంగానీ, ఆవిడ పాడిన మంచి, మంచి పాటలు వింటూ ఆవిడని తలుచుకోవడం కంటే చక్కని నివాళి ఇంకేముంటుంది. 

రాణి గొంతున రవళించిన గీతాలు
రాణి పాడిన పాటలు కొన్ని చూస్తే, ఎంత వైవిధ్యమైన పాటలు పాడారో తెలుస్తుంది. మచ్చుకు కొన్ని :
రూపవతి : ఒయ్యారి రాజా, జిలిబిలి రాజా
ధర్మ దేవత : పాటకు పల్లవి కావాలోరు, లంబాడా లంబలంబ
చండీరాణి : రావో వరాల ఏలిక
మనోరమ : గతిలేని వాణి?, గుడ్డివాణ్ణి బాబయా
దేవదాసు : అంతా భ్రాంతియేనా, చెలిమి పోయే, చెలువూ పోయె
పెళ్లి చేసి చూడు : అమ్మా నెప్పులే, బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా
శభాష్‌ రాముడు : జాబిల్లి వెలుంగులో, ఓ చందమామ ఇటు చూడరా
వినాయక చవితి : వేసేను నామది చిందులూ
చంద్రహారం : ఎవరే, ఎవరే చల్లని వెన్నెల జల్లులు
లవకుశ : రామన్న రాముడు, అశ్వమేథయాగానికి జయము
మాయా బజార్‌ : ఒకటే మావయసు
జయసింహ : కొండమీద కొక్కిరాయి
స్వయం ప్రభ : ఒరే దున్నా
అన్నా తమ్ముడు : చిన్నారి చిరు గాజు మ్రోతలా
సతీ సులోచన : ఆలపించుమో సుకవీ
కలిమిలేములు : కొమ్మలమీద కోతి కొమ్మచ్చులాడింది
మదన మంజరి : తెలిసెను నీ రంగ రంగేళీ, రవ్వల నేత్రాల గాధా

Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము