"ఏది పత్యం--ఏదపత్యం"


చల్లని గాలి,వర్షంకూడా మొదలయ్యేలా వుంది.ఇలాంటప్పుడే వేడి వేడి గా మిరపకాయ బజ్జీలో,ఉల్లిపాయ పకోడీలో తింటూ ఇష్టమయిన పుస్తకం చదువుకుంటూ మధ్య మధ్యలో బయట కురిసే వర్షాన్ని చూడటం ఇష్టం కుమారికి.చూడబోతే అత్తగారు వంటింట్లో పకోడీలు వండుతున్నట్టుంది,కమ్మటి వాసనతో ఇల్లంతా ఘుమఘుమలాడుతోంది,అబ్బ ఎన్నాళ్లయిందో పకోడీలు తిని,కడుపుతో వున్నావనీ,బాలింతరాలవనీ గత తొమ్మిదీ ,పదీ నెలలుగా పత్యపు కూడుతో నోరంతా చవిచచ్చి వుంది ఈ రోజేమయినా పకోడీలు తినాల్సిందే గట్టిగా నిర్ణయించుకుంది.రెండు వారాల పసిబిడ్డ ఏడుపుతో పడగ్గదిలోకి పరుగు తీసింది. కాసేపటికి కుమారి అత్తగారువంటగదిలోంచీ బయటకు వచ్చి ,అందరికీ తలో ప్లేటూ పకోడీలందించి ఆశగా చూస్తున్న కుమారి వేపు తిరిగి "అమ్మాయ్ నువ్వు శెనగపిండి వస్తువులు తినడానికి వీల్లేదుగా పాపం ,పచ్చి బాలింతరాలివి,పైగా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని పదిహేను రోజులు కూడా దాటలేదాయె ,ఆ డబ్బాలో నాన్ రొట్టుంది తిను ,వేడి వేడిగా టీ ఇస్తాలే "అంది.ఇక కుళ్లిపోవడం కుమారి వంతయింది. ఇక్కడ ఇంకో కథ జలుబూ ,జ్వరంతో బాధ పడుతున్న జనార్దన్ కి వేడి వేడి గారెలలో అల్లం పచ్చడి నంచుకు తినాలనుంది,వాళ్లావిడ ససేమిరా పసుపేసిన పాలూ,రొట్టే తప్ప ఇంకేమీ తినగూడదంటుంది.

అలాంటివే మరో రెండు కథలూనూ- ఏడో నెల గర్భిణీతో వున్న ఎల్లమ్మ ఎండలకి దాహంగా వుండి కొబ్బరి నీళ్లు తాగుదామని కొబ్బరి బొండాం తెప్పించుకుంటే "రామ రామ గర్భిణీలు కొబ్బరినీళ్లు తాగితే ఇంకేమన్నా వుందా?పుట్టబోయే బిడ్డకి జుట్టు మొలవకుండా బోడిగుండయిపోదూ"అంటూ ఆ నీళ్లు అవతల పారబోసింది వాళ్లమ్మ. ఇక కామేశ్వరరావు కథ మరీ అన్యాయం పచ్చ కామెర్లొచ్చి తగ్గి ఆర్నెల్లయిపోయినా  చప్పిడి మెతుకులు వడ్డించడంతోపాటు "అమ్మో స్త్రీ పత్యం పత్యం చేయాలి కామెర్లు వచ్చిన వాళ్లు"అంటూ భర్తని మీద చెయ్యి వెయ్యనీయడం లేదు భార్య కమల.

ఏమిటీ పత్యాలు? అసలు పత్యం అంటే ఏమిటీ?అది చేయకపోతే ప్రమాదమా?ఎన్నాళ్లు చేయాలి?ఈ విషయంలో డాక్టర్లేమంటున్నారు?ఒక సారి చూద్దామా? పత్యమంటే ఒక మనిషికి వచ్చిన జబ్బుకీ,అతను తీసుకునే చికిత్సకీ వ్యతిరేకంగా వుండే పదార్థాలు తీసుకోకుండా,అనుకూలంగా వుండే ఆహార పదార్థాలు తీసుకోవడమే. మనదేశంలో పురాతన కాలం నుండీ వున్న ఆయుర్వేదమూ,ఇంకా ఇతర ప్రత్యామ్నాయ వైద్య విధానాలలో ఈ పత్యానికి ప్రధాన స్థానమిచ్చినట్టు కనపడుతుంది,అందుకే మన దేశంలో పత్యాలెక్కువ. ఆధునిక వైద్య విధానంలో ఏవో కొన్ని జబ్బులకు తప్ప దాదాపు కఠినమైన పత్యాలు లేవనే చెప్పాలి. విదేశాల సంగతి నాకు పెద్దగా తెలీదు కానీ మన దేశంలో ఈ పత్యాల గురించి ప్రజలలో చాలా అపోహలున్నాయి. అవి ఏ స్థాయిలో వుంటాయంటే ఒకో సారి రోగి పత్యమేమీ లేదు అన్న డాక్టర్ని అనుమానంగా చూడటం,అతన్ని సమాధాన పరచడానికి డాక్టర్ నానా యాతనా పడటం కద్దు.

అందుకే  డాక్టర్ కి రోగనిర్థారణ చెయ్యడమూ,దానికి తగిన చికిత్స చేయడమూ ,రోగికి తన జబ్బుగురించి చక్కని అవగాహన కల్పించడమూ ఒక ఎత్తయితే ,రోగిని సంతృప్తి పరచే పత్యాలు చెప్పడం ఇంకొ ఎత్తు.సంతృప్తి పరచే అని ఎందుకంటున్నానంటే మనదేశంలో రోగీ,అతని చుట్టుపక్కల వాళ్లూ కూడి డాక్టర్ సామర్థ్యాన్ని చికిత్స ఇవ్వడంలోనే కాక,పత్యాలు చెప్పడాన్ని బట్టికూడా అంచనా వేయడానికి ప్రయత్నిస్తారు.అందుకే కొంతమంది డాక్టర్లు ప్రమాదం కలిగించని తేలిక పాటి ఒకటి రెండు పత్యాలు చెపుతూ వుంటారు. మరి ఆధునిక వైద్య విధానం అసలు ఏం చెబుతోంది అంటే శరీర ధర్మాన్ని అనుసరించి ఆహారం తీసుకోమని అంటే ఉదాహరణకి రోగికి దాహం వేస్తోంది అంటే,శరీరం లో నీరు తక్కువయింది ,అడుగుతోంది అని అర్థం.ఆకలి వేస్తోంది అంటే జీర్ణశక్తి బాగానే వుంది ఆహారం అవసరం అని అర్థం.

జ్వరాలూ-పత్యాలూ:
సాధారణంగా వచ్చే జ్వరాలకి పత్యమంటూ ప్రత్యేకంగా వుండదు.ఆకలి బాగుంటే భోజనం చేయవచ్చు,అంతగా ఆకలి లేకపోతే, తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు పాలూ,రొట్టే లేదా మజ్జిగాన్నం,కాఫీ,బిస్కట్ వగైరాలు తినవచ్చు. కానీ టైఫాయిడ్  జ్వరంలో మాత్రం తప్పనిసరిగా ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించమంటాం.ఎందుకంటే కలుషితమైన నీటివల్లా,కలుషితాహారం వలన శరీరంలో ప్రవేశించిన టైఫాయిడ్ సూక్ష్మజీవులు ఆహారపు పేగు గోడలలోని లింఫాటిక్ టిష్యూ లో కాపురమేర్పరుచుకుంటాయి.రోగి ఘన పదార్థాలు తీసుకోవడం వలన ,అవి వృధ్ధి పొంది జ్వరం తగ్గకుండా ఇబ్బంది పెడుతుంది.అందుకే టైఫాయిడ్ రోగిని కాచి చల్లార్చిన నీళ్లు తాగమంటాం,తేలికగా జీర్ణమయ్యే ద్రవ పదార్థాలూ,జావలూ తాగమంటాం జ్వరం తగ్గుముఖం పట్టే వరకూ.జ్వరం తగ్గిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఘన పదార్థాలూ,కూరా అన్నం తినమని చెబుతూ వుంటాం. జ్వరం తగ్గి పత్యం పెట్టాక రోగిని నిద్ర పోనివ్వకుండా నానా హింసా పెట్టేస్తుంటారు చాలామంది.జ్వరం తగ్గి కోలుకునే దశలో శరీరం ఎక్కువ విశ్రాంతి కోరుకుంటుంది కాబట్టి రోగిని నిద్రపోనివ్వడంలో తప్పులేదు

ఆపరేషన్లూ ---పత్యాలూ:
ఇక ఆపరేషన్ జరిగిన వాళ్లల్లో అయితే అది జరిగి ఆర్నెల్లయినా పత్యాల విషయంలో పెట్టే ఇబ్బంది అంతా ,ఇంతా కాదు.కందిపప్పూ,పెసరపప్పూ,శెనగపప్పూ,శెనగపిండీ ఇవేమీ తిన కూడదనీ తింటే కుట్లు చీములు పడతాయనీ భయపెడతారు.నిజానికి పప్పులలో ప్రోటీన్లుంటాయి,అవి శరీరానికి ఎంతో అవసరం .చీము పట్టడానికి కారణం,శారీరక అపరిశుభ్రత,పరిసరాల అపరిశుభ్రతా,ఆపరేషన్ పరికరాలు సరిగా స్టెరిలైజ్ చేయకపోవడం,వ్యాథి నిరోధక శక్తి తక్కువగా వుండటం,షుగర్ వ్యాధి వుండటం,ఇంకా కొన్ని ఇతర కారణాలూ  కారణమవుతాయి కానీ తినే వస్తువుల వల్ల చీము తయారవదు,చీము పట్టే వస్తువులంటూ వుండవు.

గర్భిణీ స్త్రీలూ-పత్యాలూ:
గర్భిణీ స్త్రీలలో పత్యాల పట్ల వుండే అపోహలకు అంతే లేదు.
.కొబ్బరి నీళ్లు తాగితే పుట్టబోయే పిల్లలకి జుట్టు రాదనీ,తలకాయ కొబ్బరి బొండంలా తయారవుతుందనీ
.బొప్పాయి తింటే అబార్షన్ అవుతుందనీ
.నువ్వులుండలు తింటే వేడనీ
.వంకాయ తింటే వాతమనీ
.బీరకాయ,సొరకాయ నెమ్ము చేస్తాయనీ
.కొబ్బరి తింటే దగ్గొస్తుందనీ ................ఇలా వుంటాయి ఇవన్నీ నిరాధారమైన అపోహలని వేరే చెప్పక్కరలేదు.ఆమెకు కావలసింది అన్ని రకాలయిన ఆహార పదార్ధాలూ కలిసిన పరిశుభ్రమైన సమతులాహారం. ఇక్కడొక  విషయం చెప్పాలి,కానుపు నెప్పులు మొదలవంగానే తలస్నానం చేయించి ,ఆమె ఏదికోరితే అది పెట్టాలని మాంసాహారం లాంటివి తినిపించి తీసుకొస్తారు.ఇక చూడాలి ఆమె పాట్లూ ,మా పాట్లూ కానుపు నెప్పుల తీవ్రతకి చాలా సార్లు తిన్నదరక్క వాంతి అయిపోయి హైరానా అవడం,మామూలు కానుపయితే కొంతవరకూ నయమే ,ఆపరేషన్ చెయ్యవలసి వస్తే మత్తిచ్చే సమయంలో ఆహార పదార్థాలు ఊపిరితిత్తులలోకి వెళ్లిపోయి పేషెంట్ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది,దీనినే "ఆస్పిరేషన్ న్యూమోనియా "అంటారు.కాబట్టి కానుపు సమయంలో సాధ్యమయినంత వరకూ తేలికపాటి ద్రవాహారం ఇస్తే మంచిది.

బాలింతలూ--పత్యాలూ:
ఇక బాలింతరాళ్లలో పెట్టే కఠిన పత్యాల సంగతి సరేసరి.చాలా కూరగాయలను పత్యం పేరుతో తిననివ్వరు.కారప్పొడీ,నెయ్యీ,వెల్లుల్లీ విస్తారంగా వాడి మజ్జిగా ,పెరుగూ ఇవ్వకుండా,ఎంత దాహమేసి నాలుక పీక్కున్నా మంచినీళ్లు చిన్న,చిన్న గ్లాసులతో కొలిచి ఇస్తారు.దాని వలన డీహైడ్రేషనూ,యూరిన్ ఇన్ ఫెక్షన్ లాంటి కాంప్లికేషన్ల బారిన పడతారు.
ఉత్తర హిందూస్థానంలోనూ,రాజస్థాన్ లోనూ బాలింతలకి గోధుమపిండీ,నెయ్యీ,బెల్లం కలిపి తాగిస్తారట
పాశ్చాత్య దేశాలలో ఇంత అన్యాయం లేదనుకుంటా ,ప్రసవం కాగానే చక్కని బలవర్థకమయిన ఆహారం ఇస్తారు.
నిజానికి బాలింతరాలికి కావలసింది సమతులాహారం అంటే పాలూ,పళ్లూ,ప్రోటీన్లూ సమృధ్ధిగా వుండే ఆహారం ఎందుకంటే ఆమె బిడ్డకు పాలివ్వాలి కదా!

పచ్చకామెర్లూ-పిచ్చిపత్యాలూ:
పచ్చ కామెర్ల రోగికయితే పత్యాలతో పిచ్చెక్కిస్తారు.అసలు పచ్చ కామెర్లు అనేది లివర్ కేదైనా సమస్య వచ్చినపుడు మనకు బయటకు కనిపించే లక్షణం,అంటే లివర్ కి సంబంధించిన యే వ్యాధి వచ్చినా మనకు బయటకు కనిపించే లక్షణం పచ్చకామెర్లు.ఇది మన రక్తంలో బిల్ రుబిన్ అనే పదార్థం స్థాయిని మించి వుండటం వలన వచ్చే జబ్బు.ఈ స్థాయిని లివర్ నియంత్రిస్తూ వుంటుంది, బిల్ రుబిన్ స్థాయి పెరిగినపుడు,ఒళ్లంతా పచ్చబడటం,కళ్లు పచ్చబడటం,మూత్రం పచ్చగా రావడంతో బాటు ,ఆకలి లేకపోవడం ,జీర్ణశక్తి తగ్గడం,నీరసం,నిస్త్రాణ లాంటి లక్షణాలుంటాయి. లివర్ జబ్బుకి అనేక కారణాలున్నాయి,జన్యుపరమైన లోపాల నుండీ,కాన్సర్ వరకూ లివర్ వ్యాథికి కారణమవవచ్చు. వాటిలో కామన్ గా మనం చూసేవి ,అప్పుడే పుట్టిన బిడ్డలలో రక్తం మారి కొత్త రక్తం యేర్పడేటప్పుడు వచ్చే "ఫిజియొలాజికల్ జాండిస్ "ఒకటి. ఇది బిడ్డ పుట్టిన మూడు నాలుగు రోజులకు మొదలయి ,వారం రోజులకు దానంతట అదే తగ్గు మొఖం పడుతుంది,సాధారణంగా యే చికిత్సా అవసరం వుండదు .అరుదుగా బిల్ రుబిన్ స్థాయి పెరిగితే పిల్లల డాక్టర్లు ఫోటోథెరపీ ఇస్తారు లేకుంటే కాసేపు పొద్దుటే వచ్చే లేత ఎండలో బిడ్డను వుంచితే సరిపోతుంది. ఇంకా కొన్ని జన్యు పరమైన లోపాలు,పిత్తాశయంలో వచ్చే రాళ్లూ,ఆల్కహాలూ,కొన్ని రకాల మందులూ,ఇన్ ఫెక్షన్లూ,కాన్సర్లూ, అనేక రకాల కారణాల వలన కామెర్లు వస్తాయి వాటినన్నిటి గురించీ ఇక్కడ చర్చించడం సాధ్య పడదు కానీ కామన్ గా కామెర్లు కలగ జేసేది హెపటైటిస్ ఏ,బీ వైరస్ లు, హెపటైటిస్ ఏ-----కలుషిత నీటివలనా ,ఆహారం వలనా వస్తుంది ,సాధారణంగా దానంతటఅదే తగ్గి పోతుంది,రోగి నీరస పడకుండా సపోర్టివ్ థెరపీ ఇవ్వాలంతే. హెపటైటిస్ .బి --ప్రాణాంతకమైన వ్యాధి,కలుషిత రక్తం ద్వారానూ,ఇంజక్షన్ సూదుల వలనా,సెక్స్ సంబంధాల వలనా వ్యాపిస్తుంది.ఒకసారి వచ్చాక నివారణ వుండదు,ఉపశాంతిగా మందులు వాడగలం .వ్యాధిరాకుండా ముందు జాగ్రత్తగా టీకాలు వేసుకోవాలి.ఇంకా హెపటైటిస్ .సి,డి,ఇ అనేవి కూడా ప్రమాదకరమైన వ్యాధులే .

అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇన్ని రకాల కారణాలుండగా కామెర్లకి అవేమీ తెలుసుకోకుండా ఒళ్లు పచ్చబడగానే ,నాటుమందులనీ,వాతలేయించుకోవడమనీ ,పత్యాలనీ రోగిని నానా హైరానా పెట్టేస్తూ వుంటారు. మా ప్రాంతాలలో నానా విధాలైన ఆకుపసర్లు మింగించడంతో పాటు,విరేచనాలకి ఆముదం తాగించడం ,మణికట్టుమీద ఒక ఇనప రింగుతో కాల్చి వాతలు పెట్టి దానిమీద యేదో గుడ్డవేసి ,ఆపైన నూనె పోసి ,పప్పు పదార్థాలవీ పెట్టి ,ఆ గాయం చీము పడితే ఆ చీము ద్వారా లోపలున్న కామెర్ల వ్యాథి బయటకు పోతుందని భావిస్తారు. ఇదంతా చాలా అనాగరికమైన ,ప్రమాదకరమైన వ్యవహారం , అసలే లివర్ బలహీనంగా వుండి జీర్ణశక్తీ,వ్యాథి నిరోధక శక్తీ తక్కువగా వుండటం వలన అనేక కాంప్లికేషన్ల బారిన పడే ప్రమాదం వుంది పైగా ఈ వాతల వలన ధనుర్వాతం కూడా రావచ్చు. అంతే కాక కామెర్లు వచ్చి తగ్గిన చాలా కాలం వరకూ స్త్రీ పత్యం అనే పేరుతో దాంపత్య సంబంధాలకి దూరంగా వుంచుతారు.ఇక్కడొక మాట హెపటైటిస్ ఏ,బీ కామెర్లు ముఖ్యంగా బీ రకం కామెర్లు దాంపత్య సంబంధాల వలన ఒకరి నుండీ ఒకరికి సోకుతాయి కాబట్టి ,జీవిత భాగస్వామి రక్తంలో ఆ సూక్ష్మజీవులు అప్పటికే ప్రవేశించాయో లేదో పరీక్షించి,ఆ సూక్ష్మజీవులు రక్తంలో లేకపోతే టీకాలు ఇచ్చి జబ్బువచ్చిన రోగి జీవిత భాగస్వామినీ,ఇంట్లో వుండే వారందరినీ వ్యాథి సోకకుండా కాపాడవచ్చు.ఇప్పుడు బిడ్డ పుట్టిన వెంటనే హెపటైటిస్ .బి టీకాలు వేసి జీవితకాల రక్షణ కలిపిస్తున్నారు ఇది శుభ పరిణామం. ఇంతకీ నే చెప్పొచ్చేదేమంటే కామెర్లు కనపడగానే భయపడవద్దు ,డాక్టర్ వద్దకు వెళ్లి ఏ రకమైన కామెర్లో నిర్థారించుకుని,సాధారణ రకాలయితే దానికి తగిన తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలూ ,విశ్రాంతీ తీసుకుంటూ ,రక్తంలో బిల్ రుబిన్ శాతం తగ్గుముఖం పట్టగానే మామూలు ఆహారం తీసుకుంటూ,సాధారణ జీవితం గడపొచ్చు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పత్యాల గురించి పెద్ద గ్రంథమవుతుంది.

ముఖ్యంగా తెలుసుకోవలసింది చాలా వ్యాథులకి కారణం కలుషితమైన నీరూ,ఆహారం  ,అపరిశుభ్రమైన అలవాట్లూ ,పరిసరాలూ కాబట్టి వాటికి దూరంగా వుండాలి. దెబ్బలు తగిలిన వాళ్లకీ ,ఆపరేషన్లు జరిగిన వాళ్లకీ,ఆహారంలో చీము పట్టే వస్తువులు అని  బలవర్థకమయిన ప్రోటీన్లు కలిగి వున్న పప్పు పదార్థాలకి దూరంగా వుంచడం సరికాదు.ఎవరికి తోచిన పత్యాలు వాళ్లు చేయకుండా డాక్టరు సలహాలు పాటించడం వలన రోగి తొందరగా కోలుకుని వ్యాథి బారినుండీ బయట పడే అవకాశ ముంది..

Comments

Post a Comment

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము