కూలుతున్న కల్పవృక్షం

మా చిన్నప్పుడు తాడి చెట్టుని "ఆంధ్రుల కల్పవృక్షం "అంటారని పాఠాలలో చదువుకున్నాం. దానిలో భాగాలు ఎలా ఉపయోగ పడతాయో బడిలో వ్యాసాలుగా రాశాం, ప్రత్యక్షంగా చూశాం. పెళ్లి పందిళ్లుగా, చల్లని నీడనిచ్చే పాకలుగా, చల్లని గాలినిచ్చే విసనకర్రలుగా, బొమ్మల పెళ్లిళ్ల కోసం తాటాకు బొమ్మలుగా తాడిచెట్టు భాగాలు ఉపయోగ పడేవి.ఇంకా తాటి ముంజలూ, తాటిపళ్లూ, తేగలూ, బుర్రగుంజూ తినడానికి ఉపయోగ పడేవయితే, తాటికల్లు తాగే వాళ్లకి విందు చేస్తుంది. అంతే కాక పంటచేను గట్టు మీద తాటిచెట్లు గట్లని ధృఢంగా పట్టి వుంచుతాయి. రైతుకి ఆదాయానికి ఆదాయం బలానికి బలం. బలం అంటే గుర్తొచ్చింది తాడి చెట్టు చాలాబలమైనది ఒక్క మనిషి దానిని కదిలించడం కష్టం, ఒక సారి నా చిన్నప్పుడు తాటి చెట్టు పీకిన మనిషిని బండిలో ఊరేగించారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన తాటి చెట్లని ఇప్పుడు కొట్టేస్తున్నారు . కారణం ఏంటని ఆందోళనగా అడినగిన నాకు ఒకాయన చెప్పిన జవాబేంటంటే "ఇప్పుడు తాటాకు ఎవ్వరూ వాడటంలేదు, తాడిచెట్టు ఎక్కి కల్లు గీయాలన్నా కాయలు కొయ్యాలన్నా అందరికీ చేతకాదు.ఆ విద్య వచ్చిన వాళ్లు తగ్గి పోతున్నారు, ఒకవేళ ఎవరినైనా ఎక్కమన్నా ఎక్కినందుకు మనిషికి వంద రూపాయలు ఇవ్వాలి,ఉపయోగం తక్కువగా వున్న చెట్లని ఎవరుంచుకుంటారు అమ్మా ,ఇంకో రెండు మూడేళ్లలో తాడి చెట్లన్నీ పోతాయి"అని



మన ఆంధ్ర రాష్టృంలో ఎక్కువగా కనువిందు చేస్తూ ,మనకి అనేక రకాలుగా ఉపయోగ పడుతూ,మనజీవితాలలో భాగమయిన తాడిచెట్లు ఇక కంటికి కనిపించకుండా కనుమరుగవుతాయంటే ఎందుకో తెలియని సన్నని బాధ.ఇవాళ నడక దారిలో నరికేసిన తాడిచెట్లను చూసి ఆబాధ రెట్టింపయింది

Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము