నా కళ్లతో అమెరికా - ఒక యాత్రానుభవం.


మళ్లీ 19 సంవత్సరాల తర్వాత అమెరికా గడ్డ మీద అడుగు పెడతాననుకోలేదు. అదీ సరిగ్గా మళ్లీ వాషింగ్టన్ డి.సి.లోనే.  అసలు ఈ ప్రయాణం గురించిన ఆలోచన ఈ సంవత్సరం మొదట్లోనే కలిగింది. ఎవరైనా ఇద్దరు ముగ్గురు స్నేహితులం అభిరుచులు కలిసిన వాళ్లం కలిసి వెడితే బాగుంటుందనుకున్నా. అలా మాటల్లో ప్రసూనా నేనూ కలిసి వెళదామా అంటే వెళదాం అనుకున్నాం. నేనేమో ఆగస్ట్ తొమ్మిదిన హైద్రాబాద్ వెళ్లి వీసా సాధించుకున్నా మా అమ్మ దయ వలన ఏకంగా పదేళ్లిచ్చేశాడు, మళ్లీ మళ్లీ వాడి గడప తొక్కకుండా. ప్రసూన మధ్యలో కాస్త వెనకడుగు వేసింది, సరే నేనన్నాను నువ్వొచ్చినప్పుడే నేనూ వెళతానని. హఠాత్తుగా ఏప్రిల్ లో అనుకుంటా మే నెలలో వెళదాం నాకు శెలవులు అంది,  మళ్ళీ సరే అంటే సరే అనుకున్నాం. ఈలోగా తనుకూడా వీసా తెచ్చుకుంది. అన్ని ఏర్పాట్లూ చేసుకుని మే పదిహేను తెల్లవారు జామున ఇంటినుండీ బయలు దేరాను వేళ్లు తెంపుకున్న చెట్టులాగ.


విజయవాడ లో ప్రసూన ఇంటికి చేరి ఇద్దరం కలిసి వాళ్ల కారులో హైద్రాబాద్ ప్రయాణమయ్యాం. మధ్యలో 7 రెస్టారెంట్ లో నురగతో వున్న ఫిల్టర్ కాఫీ , టిఫిన్ తో సహా కానిచ్చి, ఒక ఫోటో లాగించి,హైద్రాబాద్ లో వాళ్లబ్బాయింటికి తనూ,మా ఫ్రెండ్ శశికళ ఇంటికి నేనూ చేరాం. భోంచేసి మధ్యాహ్నం కాసేపు కబుర్లు చెప్పుకుంటుండగానే నా అసలు కొడుక్కంటే ఎక్కువయిన పెంపుడు కొడుకు బబ్లూ,అతని భార్యా వచ్చి రాసుకోడానికి డైరీ పెన్నులూ ఇచ్చారు. అయిదన్నరకే ఏర్ పోర్టుకి బయలు దేరినా,రంజాన్ సంరంభంతో ట్రాఫిక్ జామయ్యి కొంత ఆలస్యమయింది ,అప్పటికే ప్రసూన నాకోసం ఎదురు చూస్తోంది.మేము ప్రయాణించబోయే "ఎమిరేట్స్ "విమానయాన సంస్థ వారి క్యూలో నిలబడి చెకిన్ అవడానికి రెండు గంటలు పట్టింది.ఏర్ పోర్ట్ లో యేమైనా  తిందామని శాండ్ విచని  ప్రయత్నించి చాలా ఘోరంగా వుండటంతో అవతల పారేసి మళ్లీ యేదో దోసెలాంటిది ఒకతి  తిని ఫ్లయిట్ ఎక్కాం.నిజంగా ఏర్ పోర్ట్ లో తినుబండారాలు కానీ మిగతా వస్తువులు కానీ అంతా నిలువుదోపిడే.

ఫ్లయిట్ లో "ఎమిరేట్స్ "వారి సేవలు నిజంగా మెచ్చుకోవచ్చు, కాసేపటికోసారి యేదో ఒకటి తినడానికో, తాగడానికో ఇస్తూనే వున్నారు.మేము మాత్రం వాళ్లు పెట్టినవి యెంచుకుని తిని, మంచినీళ్లు బాగా తాగి, మధ్యమధ్యలో రెండు గంటలకో సారి లేచి నడుస్తూ వుండేవాళ్లం.కాలక్షేపం కోసం రెండో మూడో సినిమాలు చూశాం. నేను కల్పనా లాజ్మీ రాసిన భూపేన్ హజారికా జీవితచరిత్ర  పుస్తకం  పూర్తిచేశా ఈ ప్రయాణంలో.



మూడున్నరగంటల ప్రయాణం తర్వాత దుబాయ్ చేరాం,డిస్ ప్లే బోర్డుల సహాయంతో మేము చేరవలసిన గేటు తెలుసుకుని ,ఇంకో ఇద్దరు తెలుగు వాళ్లు మాతో పాటు వస్తున్నారని తెలుసుకుని అందరం కలిసి రకరకాల ప్రయాణ సాధనాలూ అంటే లిఫ్టూ, కదిలే మెట్లూ,కదలని మెట్లూ, రైలూ ఇలాంటివన్నీ వినియోగించి చివరికి చేరవలసిన గేట్ చేరడానికి తేలిగ్గా రెండు గంటలు పట్టింది.కాసేపు కబుర్లు చెప్పుకుని,కస్టమ్స్ చెక్ అయ్యాక మా ఏర్ బస్ యెక్కాం.అది చాలా పెద్దది రెండు అంతస్తులుగా వుంది. కింద అంతస్తు ఎకానమీ క్లాసు,పై అంతస్తులో బిజినెస్ క్లాస్ . మేము భయపడినంత అధ్వాన్నంగా లేదు కాళ్లు జాపుకోడానికి కాస్త జాగా వుంది,మా పక్క సీట్ల ఖాళీ అయినప్పుడు ప్రసూన పడుకుని కాస్త కునుకు కూడా తీసింది. ఎలాగో మొత్తానికి పధ్నాలుగు గంటలు ప్రయాణించి వాషింగ్టన్ చేరాం,అంతసేపు ప్రయాణం చేసిన ఓపికంతా ఇమ్మిగ్రేషన్ కౌంటర్ ముందు మూడు గంటలు పడిగాపులు పడటంతో ఆవిరయిపోయింది.

పసిపిల్లల తల్లులూ,ముసలివాళ్లూ ,ఎక్కువసేపు నిలుచోలేని వాళ్లూ అల్లాడిపోయారు, కనీసం కూర్చునే సౌకర్యం కూడా లేదు. అక్కద నేరస్థుల్లాగా ఎంతసేపయినా నుంచోవాలిసిందే. అమెరికాలాంటి అభివృధ్ధి చెందిన దేశాల్లో కూడా ఈ పరిస్థితి యేవిటో!బహుశా వాళ్లదేశంలో అడుగు పెట్టేవరకూ పెద్దగా మర్యాదలుండవేమో? చివరకు ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ ఎందుకు వస్తున్నారు? ఎన్నాళ్లుంటారు? మీ పాస్పోర్ట్ఆగస్ట్ తో అయిపోతుందిగా,ఆర్నెల్లుంటావా?ఎ లా వుంటావు? ఎన్ని డాలర్లు తెచ్చావు? పళ్లూ,గింజలూ యేమైనా తెచ్చావా? లాంటి ప్రశ్నలడిగి వదిలిపెట్టాడు, బయటకు వచ్చి మా చెకిన్ బాగ్స్ కోసం వెదికాం. నావి వచ్చాయి కానీ ప్రసూనది మిస్సింగ్ఈ.  లోపు మమ్మలిని తీసుకు వెళ్లడానికి ప్రసూనా వాళ్లబ్బాయి "తనయ్ "వచ్చాడు. అందరం కలిసి "ఎమిరేట్స్ "ఆఫీసుకెళ్లి మిస్సింగ్ బాగ్ సురక్షితంగా వుందని తెలుసుకున్నాం. అది మాచేతికొచ్చేసరికి ఇంకో రెండుగంటలు పట్టింది.అంటే 8.30 ని"లకి బయటకొచ్చిన వాళ్లం 1.30 ని"లకి బయటపడ్డాం.



మమ్మల్నిద్దరినీ తనయ్ వాషింగ్టన్ లో తనుండే అపార్ట్మెంట్ కి తీసుకెళ్లాడు. బయట వాతావరణం చాలా ఆహ్లాదంగా వుంది.చల్లగా,హాయిగా పెద్ద పెద్ద చెట్ల నీడలతో చాలా బాగా అనిపించింది.పెద్ద పెద్ద తీరైన బిల్డింగ్సూ,వాటిముందు విరగ బూసిన పూపొదలూ,నున్నగా మెరిసే వీథులూ.... మనసంతా సేదతీరినట్లయింది. ఇంటికి చేరి భోజనం చేశాం టమాటాకూర, చారూ ,పచ్చళ్లూ ,పెరుగూ అంతా ఇండియాలో వున్నట్టే వుంది. కాసేపు పడుకుని లేచి సాయంత్రం అలా నడుచుకుంటూ దగ్గరలో వున్న పార్క్ కి వెళ్లాం,అక్కడ "జోన్ ఆఫ్ ఆర్క్ "బొమ్మ దగ్గర నేనూ ,ప్రసూనా ఫోటోలు తీయించుకున్నాం.అలా ఆరుబయట పార్కులలో తిరిగేటపుడు "పోలెన్ అలర్జీ"వల్ల ఇబ్బందిగా వుంటుందనీ ,ఇక్కడ చాలామందికి ఆ అలర్జీ వస్తుంటుందనీ తనయ్ చెప్పాడు.తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు,స్ట్రీట్ బాండ్ లాగా కొంతమంది పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ కనపడ్డారు చాలా తమాషాగా వుంది.ఇంటికి వచ్చి అన్నం తిని రేపేం చూడాలో ఆలోచిస్తూ పడుకుని మర్నాడు తొమ్మిదిన్నరకు నిద్ర లేచాం ..........
(నా అమెరికా యాత్రానుభవం, గుజరాత్ పర్యటన విశేషాలు రెండూ " ఒక భార్గవి-రెండు ప్రయాణాలు" గా పుస్తక రూపంలో  ఇప్పుడు అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలో లభ్యం. నా  ఇతర పుస్తకాల వివరాలకు బదరి పబ్లికేషన్ ఫోన్ నెంబర్ 08674-253366 నందు సంప్రదించగలరు)


Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము