సుస్వరలీల-పి.లీల


ఆమె పాట వింటుంటే ఆమె జన్మతః మళయాళీ అంటే నమ్మబుధ్ధి కాదు , అక్షరాలా మన తెలుగమ్మాయే అనిపిస్తుంది.స్వరమంటారా శాస్త్రీయ సంగీతపు వొదుగు తో ఘనంగా వుంటుంది. క్లాసికల్ టచ్ తో వున్న పాటలకి మాబాగా వొప్పినా, ఆమె పాడిన యే పాటయినా వేరొకరు పాడితే బాగుండేది అనిపించదు పాట యేదయినా నూటికి నూరు పాళ్లూ న్యాయం చేసే సుస్వర నేపథ్య గాయని పొరయత్ .లీల అది ఆమె యింటిపేరు. పుట్టింది కేరళ లోని పాలక్కాడ్ లో మద్రాస్ లో అడుగు పెట్టింది శాస్త్రీయ సంగీతం క్షుణ్ణంగా నేర్చుకోడానికీ, అందులో రాణించడానికీ దీనికంతా తండ్రిగారి ప్రోత్సాహం పుష్కలంగా వుంది. తొమ్మిదవ యేటనే తొలి సంగీత కచేరీ "ఆంధ్ర మహిళా సభ " లో అప్పటి నుండీ తెలుగు వాళ్లతో అనుబంధం పెనవేసుకుంది అని చెబుతారావిడ.

దాదాపు గాయకులందరూ తమని తమిళులు తమిళ దేశం ఆదరించారని చెబుతూ వుంటారు కదా దీనికి విరుధ్ధంగా లీల తనని ఆదరించిందీ,ప్రోత్సహించిందీ,అవకాశాలు యిచ్చిందీ తెలుగు వారే అని చెబుతారు. తర్వాత ఆకాశవాణిలోపాడటం,గ్రామఫోన్ కంపెనీలకు ప్రయివేట్ ఆల్బమ్స్ పాడటం సినీ నేపథ్య గాయనిగా తొలి అడుగులు వేయడానికి తోడ్పడ్డాయి. పరిశ్రమ కొచ్చిన మొదటి రోజుల్లో హెచ్ .ఆర్ .పద్మనాభశాస్త్రి, సి.ఆర్ .సుబ్బురామన్ చిన్నా చితకా అవకాశాలు యిచ్చి ప్రోత్సహించారు. ఆ రోజుల్లా సుబ్బురామన్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఘంటసాల పరిచయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది . ఈమె ప్రతిభ గుర్తించిన ఆయన తను సంగీత దర్శకత్వం వహించిన "మనదేశం "లోనూ "కీలుగుర్రం "లోనూ పాడిస్తే ఓగిరాల రామచంద్రరావు దర్శకత్వంలో "గుణసుందరికథ "లో పాడిన "శ్రీ తులసీ,ప్రియతులసీ జయము నీయవే " ,"ఉపకార గుణాలయవై వున్నావు కదే ఓ మాత " ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి.

ఆ తర్వాతవచ్చిన పాతాళభైరవిలో ఘంటసాల దర్శకత్వంలో ఆయనతో పాడిన డ్యూయట్స్ వారిరువురినీ వొకస్థాయిలో నిలబెట్టాయి ముఖ్యంగా "యెంతఘాటు ప్రేమయో "పాట ,దీని గురించి పి. బి. శ్రీనివాస్ కూడా తనా పాట కోసం సినిమా చాలా సారులు చూశానని చెబుతారు. ఇక వరసగా "పెళ్లిచెసిచూడు,మాయాబజార్,గుండమ్మకథ, లవకుశ, చిరంజీవులు,శాంతినివాసం, వినాయకచవితి, మర్మయోగి, పాండవ వనవాసం " యిలా ఘంటసాల సంగీత దర్శకత్వంలో ఆమె పాడినవి యెటువంటి పాటలు తలుచుకుంటే మనసు మైమరిచి పోతుంది. ఆవిడని వొక చక్కని సినిమా గాయనిగా తీర్చిదిద్దిన ఘనత ఘంటసాల గారిదే యీ మాట ఆవిడే చెప్పుకున్నారు.తెలుగు వుచ్చారణ దగ్గరనుండీ మొదలు పెట్టి సినిమాపాట యెంత మెత్తగా,సౌకుమార్యంగా పాడాలో, శాస్త్రీయసంగీతానికీ లలిత సంగీతానికీ వున్న భేదమేమిటో విడమరిచి చెప్పి ప్రోత్సహించే వారట

"లవకుశ" పాటలు పద్యాల రిహార్సల్స్ లో సుశీల ,లీల "మాస్టారూమేము పాడలేమండీ " అని నిరుత్సాహంగా మాట్లాడితే మీరు కాక యింకెవరు పాడగలరు అని వుత్సాహపరిచే వారటఇంకా యస్ .రాజేశ్వరరావు,పెండ్యాల, టి. వి. రాజు సుసర్ల దక్షిణా మూర్తి యిలా అనేక మంది దగ్గర కొన్ని వేల పాటలు పాడారు ఆమె చివరి చిత్రం "శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర " సినిమా అవకాశాలు తగ్గాక తనకెంతో యిష్టమయిన శాస్త్రీయ సంగీత కచేరీలు చేస్తూ వుండేవారు తన ప్రియ స్నేహితురాలు ఏ. పి. కోమలతో కలిసి ఆవిడ పాడిన వేల పాటలలో నాకు నచ్చినవి చెప్పాలంటే చాలా వున్నా వొక పాటంటే నాకు తగని మక్కువ . అది " బభ్రువాహన "చిత్రంలో "యేలరా మనోహరా, త్రిలోకమోహనా " అన్నపాట ఈ పాటలో ఆమె గొంతులో యెంత మాధుర్యం వొలుకుతుందో, పాట ముందు వచ్చే ఆలాపన మొదలు పెట్టగానే నిజంగావేరే లోకంలో అడుగు పెట్టినట్టుంటుంది.

రచన సీనియర్ సముద్రాల ఆయనే యీ చిత్ర దర్శకుడు సంగీతం చేసింది చాలాకాలం ఘంటసాల అసిస్టెంట్ గా పనిచేసిన పామర్తి వెంకటేశ్వరరావు యిందులో అన్ని పాటలు బాగుంటాయి ఘంటసాల యస్వరలక్ష్మి డ్యూయట్ "నీ సరి మనోహరి "చాలా బాగుంటుంది కానీ యీ పాట యెందుకో చాలా సార్లు వినాలని పిస్తుంది కాకపోతే నాలాంటి వారికి రాజసులోచనని భరించటం కొంచెంకష్టంగా వుంటుంది.

Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము