దోసిట చినుకులు


ఎవరైనా ఒక వ్యక్తి ఎదురవగానే  ముందస్తుగానేను  చూసేది ముక్కు.నాకు ముక్కు నచ్చితే మనిషి నచ్చినట్టే.సూటి ముక్కున్న వాళ్లు సూటిగా వ్యవహరిస్తారని కూడా అంటుంటారు కదా?.అలా చక్కటి కను ముక్కు తీరున్న ప్రకాష్ రాజ్ నాకు నచ్చుతాడు,అతని నటన కూడా నచ్చుతుంది.ఏ సినిమాలో నయినా తన పాత్రకు తన పరిథిలో న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాడనిపిస్తుంది.అతనివి చాలా సినిమాలున్నా ,నాకు బాగా ప్రత్యేకంగా అనిపించేది "నాగమండల "అనే సినిమాలో అతని నటన. అయితే ఒక నటుడి నటనను బట్టి అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేం కదా?బాహ్య సౌందర్యం వున్న వాళ్లందరికీ,అంతః సౌందర్యం వుంటుందనే గ్యారంటీ కూడా లేదు.ఈ మధ్య విజయవాడ పుస్తక మహోత్సవంలో అతను రాసిన వ్యాసాల సంకలనం "దోసిట చినుకులు"కొన్నాను.అది చదివాక అతని ఆలోచనా ధోరణీ,భావజాలం కూడా నచ్చాయి..అతనిది ధృఢమైన వ్యక్తిత్వం అనీ,తగు మాత్రంగా సాహిత్యం కూడా చదివాడనీ,నాటకరంగం అనే బలమైన పునాది కలిగి వున్న వాడనీ అర్థం అయింది.

ప్రకృతి గురించీ,మానవుని గురించీ,స్త్రీ గురించీ,తల్లి గురించీ, బిడ్డల గురించీ అతను వెలిబుచ్చిన అభిప్రాయాలు విలువైనవిగా,పరిణతి చెందినవిగా అనిపించాయి. అందమైన పెద్ద భవంతిని నిర్మించుకుని,అందులో కుటుంబానికీ,స్నేహితులకీ,తనకీ విశాలమైన పెద్ద గదులు కేటాయించినఒక స్నేహితుడు,తన తల్లికి మాత్రం మారుమూల ఒక చిన్న గదిని యేర్పాటు చేయడం చూసి ఎంతో ఆవేదన చెందుతాడీయన."పిల్లలకి ఈతకొట్టడం నేర్పిస్తాము,పాడటం నేర్పిస్తాము కానీ పెద్దలను గౌరవించడం నేర్పిస్తామా? "అని ప్రశ్నిస్తాడు. అలాగే జీవితపు మలిసంధ్యలో పిల్లలకు దూరమయ్యి వాళ్లు కట్టిన ఇళ్లకు కాపలాగా దీనంగా,తలుపుల వెనక బందీలయి జీవితం గడుపుతున్న తల్లిదండ్రుల గురించి ఆవేదన పడతాడు.మనం మన పిల్లలకి తల్లిదండ్రులనెలా చూడాలో పాఠాలు చెప్పడం కాదు,అలా బతికి చూపించాలి అని చెబుతాడు.

ప్రకృతికి దూరంగా కాదు,దానితో మమేకమై బతకాలి అని ఆక్రోశిస్తాడు.

ఇంకా భాష గురించి యేమంటాడంటే"నా ప్రకారం భాష ఒక అభివ్యక్తి చిహ్నం,సుఖ-దుఃఖాలిని వ్యక్త పరిచే మాధ్యమం.మనం బతికే ప్రాంతంలో,మన చుట్టూ వుండే జనం యే భాష మాట్టాడతారో,దాన్ని శుధ్ధంగా మాట్లాడటం మనం వారికిచ్చే గౌరవం.నేను మీలా కాదు డిఫరెంట్ అని ప్రదర్శిస్తూ మాట్లాడటం మనలోని అనాగరికతకు చిహ్నం, భాష అనేది కేవలం పదబంధం అని అర్థం చేసుకున్న వారికి జీవితమే తెలియదని అర్థం,బ్రతకడం కూడా తెలియదని అర్థం.ఒక భాష నేర్చుకోవడం అంటే దాని ద్వారా ఆ మనుషుల సంస్కృతిని అర్థంచేసుకోవడం 

అలాగే టీనేజ్ పిల్లల గురించి రాస్తూ "మన ఇళ్లల్లో వుండే అమ్మ,అక్క,చెల్లి,భార్య,కూతురు అనే ఆడవారి నెలసరి సమస్యనూ,బాధనూ ,ఇంట్లోని మగవారు తెలుసుకుని,అర్థం చేసుకుంటే చాలు ప్రపంచంలో మూడొంతుల మగవారి ఆధిపత్యం తగ్గిపొతుంది "అంటాడు.

ఒక పుస్తకం చదవడం అంటే యేమిటీ? ఆ వ్యక్తి హృదయాన్ని చదవడం,అతని ఆలోచనలను తెలుసుకోవడం,అతని అభిప్రాయాలను అర్థం చేసుకోవడం .మన పక్కనే మసిలే మనుషుల మనసులో యేముంటుందో కూడా మనకు తెలియదు కదా!అదే వారు రాసిన పుస్తకం చదివితే చాలా వరకూ ఆ మనిషిని అర్థం చేసుకోవచ్చు.అందుకే  పుస్తకాలు వ్యక్తుల హృదయాలను తెరిచే కిటికీలు అనిపిస్తుంది నాకు.

అలా ప్రకాష్ రాజ్ హృదయాన్ని చదవడానికి తెరిచిన ఒక కిటికీ ఈ పుస్తకం.అంతా చదివాక అతనొక మానవతా వాది అనిపించింది. అనువాదం బాగుంది ,నలుపు తెలుపుల్లో వున్న బొమ్మలు అంతగా ఆకట్టుకునేట్టుగా లేవు.ఒక కాలమ్ గా రాసిన వ్యాసాలనుకుంటా,ప్రతిదాని చివరా"మీరేమంటారు?"అనో,"మరి మీరూ?" అనో వుండటం ఒక లోపంగా అనిపించింది. పుస్తక ప్రియులకీ,ప్రకాష్ రాజ్ అభిమానులకీ ఈ "దోసిట చినుకులు" చక్కటి బహుమతి అనడంలో సందేహం లేదు.

Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము