తలనెప్పి---సాధారణమైన జబ్బేనా?



అప్పుడే ఆఫీసు నుండీ ఇంట్లో అడుగు పెట్టిన మూర్తి తలపట్టుకుని కుర్చీలో కూలబడ్డాడు."అయ్యో ఏమైందండీ"అంది అరుణ గాభరాగా,"ఏంలేదు తలనెప్పి "అన్నాడు మూర్తి."పదండి డాక్టర్ దగ్గరకి వెళదాం"అంటుంటే "వద్దులే,అదే తగ్గిపోతుంది ,మాత్ర వేసుకుంటా "అన్నాడు మూర్తి."లేదండీ,ఈ మధ్య తరచూ ,తలనెప్పి అంటున్నారు" అని బలవంతంగా డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్లింది అరుణ.డాక్టర్ వివరాలన్నీ అడిగి,బి.పి,షుగర్ చెక్ చేసి,తలకి స్కాన్ కూడా తీసి,అది "టెన్షన్ హెడ్ ఏక్ "అనీ పని చేసేచోట వత్తిడి ఎక్కువగా వుండటం,కంప్యూటర్ వాడేటప్పుడు,ఒకే పొజిషన్లో కూచోవడం,అపసవ్య పధ్ధతిలో కూచోవడం ఇవన్నీ కారణమయి వుండవచ్చని వివరించాడు.మందులతో పాటు కొన్ని సూచనలు కూడా ఇచ్చాడు.


వంటింట్లో పోపు పెడుతున్న ప్రియాంకకి ఉన్నట్టుండి ధన ధన మని తలలో సుత్తులతో మోదుతున్నట్టు నెప్పి మొదలయింది.ఈ మధ్య కొన్ని వాసనలు తగిలినప్పుడూ,కొన్ని రకాలయిన ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడూ తలకు ఒక పక్కనే నెప్పి మొదలయి రెండు మూడు రోజులు నిలబడిపోతోంది,ఏ విధమయిన శబ్దం విన్నా,వెలుతురు చూసినా చికాకుగా వుంటోంది.తలనెప్పితో పాటు వాంతులు కూడా అవుతున్నాయి.కంగారు పడి హాస్పిటల్ కి వెళితే ,వాళ్లు అన్ని రకాలుగా పరీక్షించి "పార్శ్వ నెప్పి "(మైగ్రేన్ )అని చెప్పారు.కొన్ని రకాలయిన మందులు వాడమని చెప్పి పరిసరాలూ ,మనసూ కూడా ప్రశాంతంగా వుంచుకోవాలని సూచించారు.


మూడు రోజులక్రితం ,ఆక్సిడెంట్లో తలకు దెబ్బ తగిలిన మాధవరావు బాగానే తిరుగుతూ తిరుగుతూ హఠాత్తుగా తీవ్రమయిన తలనెప్పితో బాధ పడుతూ,స్పృహ కోల్పోతే కంగారుగా హాస్పిటల్లో చేర్చారు.పరీక్షల్లో తేలిందేమంటే తలకి తగిలిన దెబ్బ వలన మెదడులో రక్తం గూడు కట్టిందనీ,వెంఠనే ఆపరేషన్ చేయాలనీ లేకపోతే ప్రాణప్రమాదమనీ...

వీరి ముగ్గురి కథలూ ఇలా వుంటే డాక్టర్ కిరణ్ కథ పూర్తిగా వేరుగా వుంది,అతను యే దురలవాట్లూ లేని ఆరోగ్యంగా తిరిగే యువ డాక్టర్ ,అతని భార్యకూడా డాక్టరే .ఒక పది రోజులుగా సన్న గా వేధించే తలనెప్పి నేమీ లెక్క చేయకుండా తలనెప్పి బిళ్లలేసుకుని రోగులను చూస్తూ ,వైద్యం చేస్తూనే వున్నాడు.హఠాత్తుగా ఒక రోజు వాంతులయి ,ఫిట్స్ కూడా రావడంతో చాలా ఆందోళనకు గురయి న్యూరాలజిస్ట్ ని సంప్రదిస్తే సి.టి.స్కాన్ తీసి"బ్రెయిన్ ట్యూమర్ "అని నిర్థారించి,అప్పటికే అడ్వాన్స్డడ్ స్టేజ్ లో వుందన్నారు.


దీనిని బట్టి అర్థం చేసుకోవలసిందేమంటే తలనెప్పికి సాధారణమైన ,ప్రమాదంలేని కారణాలతో బాటు (ఉదా,,,,ఒత్తిడి ,ఆందోళన),అసాధారణమైన,ప్రమాదకరమైన జబ్బులు కూడా కారణమై వుండవచ్చని.

వయసూ,జాతీ,వర్గం, జెండర్ ,భేదం లేకుండా ప్రతి ఒక్కరినీ పట్టి పీడించే ఆరోగ్య సమస్య ఈ తలనెప్పి.

అసలు జీవితంలో ప్రతి ఒక్కరూ యేదో ఒక సమయంలో ,ఏదో ఒక సందర్భంలో దీని బారిన పడకుండా వుండరు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం ప్రపంచ జనాభాలో సగం మంది కనీసం సంవత్సరానికొక సారయినా దీని బారిన పడుతూ వుంటారంటే ,ఇది ఎంత కామన్ గా వచ్చే సమస్యో అర్థం అవుతుంది కదా!

అసలు వైద్య లోకంలో ఒక నానుడి వుంది "తల వున్న వారికి తలనెప్పి తప్పదు "అని.నిజమే లోకంలో యే వ్యాధి బారినా పడని వాళ్లుండవచ్చేమో కానీ,తలనెప్పితో బాధ పడని వ్యక్తి మాత్రం వుండడు అంటే అతిశయోక్తి కాదు.


అలాంటి ఈ తలనెప్పి అంటే ఏమిటీ? అది ఎలా ఎందుకు వస్తుంది?దానిలో రకాలేమైనా వున్నాయా? చికిత్సా,నివారణోపాయాలూ ఒక సారి చూద్దామా?


తల భాగంలో కలిగే బాధనే తలనెప్పి అంటారు.తల చుట్టూ వుండే కండరాలూ,రక్తనాళాలూ,నరాలూ,కపాలం లో వుండే ఎముకల పై పొరా ,బ్రెయిన్ ని చుట్టుకుని వుండే "మెనింజెస్ "అనే పొరలూ,ఇవన్నీ నెప్పిని తెలియజేసే రిసెప్టార్స్ ని కలిగి వుంటాయి ,మరీ ముఖ్యంగా మెదడు అడుగు భాగం ఈ నెప్పికి తీవ్రంగా స్పందిస్తుంది.విచిత్రంగా మెదడు లో పెయిన్ రిసెప్టార్స్ లేని కారణం గా,మెదడు కి దెబ్బతగిలినా,కోసినా కూడా నెప్పి తెలియదు.వాపు కారణం గానో ,కణుతుల కారణంగానో అది వ్యాకోచించి ఒత్తిడి పెరిగినపుడు మాత్రమే నెప్పి తెలుస్తుంది.

తల నెప్పి ఎలా వస్తుందంటే ,యేదయినా దెబ్బ తగిలినపుడు పెయిన్ రిసెప్టార్స్ స్పందించి,అక్కడున్న నాడీ కణాలలో తీవ్రమయిన స్పందనలని కలగ జేస్తాయి,తద్వారా పెప్టయిడ్స్ ,సిరటోనిన్ అనే పదార్థాలు విడుదలవు తాయి.ఇవి మెదడు పొరలలోనూ,రక్తనాళాలలోనూ,వాపుని కలగ జేస్తాయి.రక్తనాళాలు వ్యాకోచిస్తాయి కూడా .ఈ కార్యక్రమమంతా నెప్పిని మెదడుకు తెలియ జేస్తుంది.కొన్ని రకాల మందులు ఈ సిరటోనిన్ ని బ్లాక్ చేయడం ద్వారా తలనెప్పిని తగ్గిస్తాయి ఉదా---ట్రిప్టాన్ గ్రూపుకి చెందిన మందులు,మైగ్రేన్ తలనెప్పిలో సమర్థవంతంగా పని చేయడం.

తలనెప్పులూ రకాలూ-----IHS--ఇంటర్నేషనల్ హెడ్ ఏక్ సొసైటీ వారు తలనెప్పులని ప్రధానంగా రెండు రకాలుగా విభజించారు.

1. ప్రయిమరీ హెడ్ యేక్స్

2.సెకండరీ హెడ్ యేక్స్

ప్రయిమరీ హెడేక్స్ ------తల చుట్టూ వుండే కండరాలలోనూ ,రక్తనాళాలలోనూ,నరాలలోనూ యేదైనా వత్తిడి కలిగినపుడూ లేదా యేదైనా దెబ్బ తగిలినప్పుడూ వచ్చే తలనెప్పులు.
ఇవి 20-40 సంవత్సరాల వయసులో వస్తూ వుంటాయి.
తలనెప్పులలో తొంభై శాతం నెప్పులు ప్రయిమరీ హెడేక్సే.
ఇవి తరచూ వస్తూ పోతూ వుంటాయి,ప్రమాదంలేనివీ,వీటికి యే ఇతర జబ్బులూ కారణం కాదు.ఇందాక చెప్పుకున్నట్టు మెదడులో జరిగే రసాయనిక చర్య వీటికి కారణమని భావిస్తున్నారు.

కారణాలు ----- అలసట,శారీరకంగా గానీ ,మానసికంగా గానీ కలిగే ఒత్తిడి
.నిద్రలేమి
.అతినిద్ర
.ఎక్కువగా ఏడవటం ,వేదన చెందడం
.డీహైడ్రేషన్ 
.మలబధ్ధకం
.కంప్యూటర్ల ముందూ,ఆఫీసులోనూ,పని చేసే చోట ఒకె పొజిషన్లో ఎక్కువ సేపు కూచోవడం వలన కండరాలు పట్టేయడం.

ఇవి సర్వ సాధారణ మయిన కారణాలు. మళ్లీ ప్రయిమరీ హెడేక్స్ ని మూడు రకాలుగా విభజించ వచ్చు

*టెన్షన్ హెడేక్స్ -----
*క్లస్టర్ హెడేక్స్ 
*మైగ్రేన్ లేక వాస్క్యులర్ హెడేక్స్

టెన్షన్ హెడేక్ -----ఇది చాలా కామన్ గా వచ్చే తలనెప్పి .ప్రతి యేటా ప్రపంచ జనాభాలో 1.6 బిలియన్ల మంది దీని బారిన పడుతూ వుంటారు.ఇది ఆడవాళ్లలో ఎక్కువగా కనపడుతుంది.
శారీరక లేదా మానసిక ఒత్తిడి ముఖ్య కారణం.
లక్షణాలు-----తలచుట్టూ ఒక బాండ్ తో బిగించినట్లుగా ,టైట్ గా అనిపిస్తుంది.
సాధారణంగా మధ్యాహ్నం పూట వస్తుంది.
మెడ నుండీ,తలకు గానీ,తల నుండీ మెడకు గానీ వ్యాపిస్తుంది.
కొన్ని గంటలనుండీ కొన్ని రోజుల వరకూ వుండవచ్చు.


క్లస్టర్ హెడేక్స్ ---------ఇవి మగ వారిలో ఎక్కువ కనపడతాయి.తలకు ఒక పక్కన వస్తుంది,ఒక కంటి చుట్టూ నెప్పిగా వుంటుంది,కన్ను ఎర్రబడటం,నీరు కారడం.ఒక్కొక్క సారి కన్ను మూతబడటం,బుగ్గ వాచడం కూడా జరగ వచ్చు
ఈ తలనెప్పి రోజులో అప్పుడప్పుడూ కనపడి తగ్గిపోతూ వుంటుంది.అలా కొన్ని వారాలూ ,నెలలూ కనపడి మళ్లీ కొంతకాలం అసలు కనపడక పోవచ్చు ,అందుకే వీటిని "క్లస్టర్ హెడేక్స్ "అంటారు.
ఇవి రావడానికి కారణం "హైపోథలామస్ "(బయలాజికల్ క్లాక్ )లో యేర్పడినఅసాధారణ పరిస్థితి అని భావిస్తున్నారు
ప్రతి యేటా ఒక మిలియన్ పైగా దీని వలన బాధ పడుతున్నారు.అందువలన విలువైన పనిగంటలు నష్టపోవలసి వస్తుంది.దీనికి చికిత్స "ట్రిప్టాన్ "గ్రూపు మందులు వాడటం


*మైగ్రేన్ లేక వాస్క్యులర్ హెడేక్ -----


దీనినే పార్శ్వనేప్పి అంటారు.ఇది చాలా తీవ్రమయిన నెప్పి.తలకు ఒక పక్కనే వస్తుంది.ఏటా 848 మిలియన్ల మంది ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్యతో బాధ పడుతున్నారు.
నెప్పి లక్షణం------ధన్ ధన్ మని కొట్టుకుంటున్నట్టూ,సుత్తులతో మోదుతున్నట్టూ వుంటుంది ,దీనినే "థ్రాబింగ్ లేక పల్సటైల్ హెడేక్ "అంటారు.ఇది ఆడవారిలో ఎక్కువగా కనపడుతుంది.
తలనెప్పితో పాటు వికారం ,వాంతులూ వుంటాయి,కాంతినీ ,శబ్దాలనీ తట్టుకోలేక పోవడం,చీకటినీ,నిశ్శబ్దాన్నీ కోరుకోవడం దీని లక్షణాలు.


కొన్ని గంటలనుండీ,కొన్నిరోజులపాటు వేధిస్తుంది.పని గంటలు నష్టపోవడానికి కూడా కారణమవుతుంది.ప్రపంచ వ్యాప్తంగా అనారోగ్యంతో పనిమానెయ్యడానికి ఆరవ ప్రధాన కారణంగా మైగ్రేన్ నిలుస్తోందని స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి.
కారణం-----జెనెటిక్ కారణాలతో పాటు ,పరిసరాలూ వాతావరణ పరిస్థితులూ కూడా ప్రభావం చూపుతాయంటున్నారు.

కొంతకాలం క్రితం మెదడులోని రక్త నాళాలలో కలిగే మార్పులు కారణం అనుకునే వారు,ఇప్పుడు నరాల పనితీరు సక్రమంగా లేకపోవడం మైగ్రేన్ కి కారణమని భావిస్తున్నారు,అలా వాస్క్యులర్ థీరీ వెనక్కు వెళ్లిపోయింది.
మైగ్రేన్ తలనెప్పి కి ముందు గా హెచ్చరించే "ఆరా" -------

.కళ్ల ముందు జిగ్ జాగ్ లైన్లు కనపడటం
.కళ్లు చీకట్లు కమ్మడం
.కళ్ల ముందు వెలుతురు 
.కళ్లలో నీళ్లు రావడం
.కళ్లెర్ర బడటం
.చెవులలో శబ్దాలు
.మాట్లాడలేకపోవడం
.శరీరం ఒక పక్క సూదులు గుచ్చినట్టు వుండటం
.ఇన్వాలెంటరీ జెర్కీ మువ్మెంట్స్

ఈ లక్షణాలు మైగ్రేన్ తలనెప్పి రాబోతోందని సూచిస్తాయి వీటినే "ఆరా "అంటారు.

ట్రిగ్గరింగ్ ఫాక్టర్స్ ------

.కొన్ని రకాల ఘాటైన వాసనలూ
.కొన్ని రకాల ఆహార పదార్థాలూ
.నిద్రలేమి
.మలబధ్ధకం
.ఒత్తిడి
.ప్రీ మెన్సట్రువల్ టెన్షన్ 
.ఆల్కహాల్ ముఖ్యంగా రెడ్ వైన్ 
.స్మోకింగ్ 
ఇవన్నీ మైగ్రేన్ తలనెప్పిని ప్రేరేపిస్తాయి వీటినే ట్రిగ్గర్ ఫాక్టర్స్ అంటారు.
మైగ్రేన్ వచ్చి తగ్గిన వెంటనే కూడా మందకొడిగానో,అత్యుత్సాహంగానో ,డిప్రెషన్ గానో కనిపించవచ్చు,నీరసం,నిస్త్రాణ,మూడీ గా వుండటం కూడా జరగవచ్చు. 
మైగ్రేన్ ని మళ్లీ మూడు రకాలు గా కూడా విభజిస్తారు.

.క్లాసికల్ మైగ్రేన్ ----"ఆరా "లక్షణాలుంటాయి ,తలనెప్పీ,వాంతులుంటాయి.

.కామన్ మైగ్రేన్ ----"ఆరా "వుండదు ,తలనెప్పీ ,వాంతులుంటాయి

.కాంప్లికేటెడ్ మైగ్రేన్ --నరాలలో చచ్చు వచ్చినట్టుంటుంది (న్యూరలాజికల్ డెఫిసిట్ )

ప్రివెన్షన్ లేక మైగ్రేన్ రాకుండా నిరోధించడం-----ఒకనెలలో నాలుగు అటాక్స్ కంటే ఎక్కువ వస్తే ,మైగ్రేన్ రాకుండా నిరోధించేందుకు మందులు వాడతారు ఉదా----సుమా ట్రిప్టాన్ ,ట్రై సైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్,బీటాబ్లాకర్స్ ఇలాంటి మందులు .ఇలా వాడడం వలన అటాక్స్ రావు ,వచ్చినా అంత తీవ్రంగా వుండవు.

సెకండరీ హెడేక్స్ ------ఇవి శరీరంలోని కొన్ని వ్యాధుల ప్రభావం వలన కలిగే తలనెప్పులు.

.జ్వరాలు------వైరల్ ,బాక్టీరియల్ ,టి.బీ,లేదా చీము గడ్డల వలన వచ్చే జ్వరాలు
.తలకు,బలమైన దెబ్బ తగిలి నప్పుడు----బ్రెయిన్లో రక్తం గూడు కట్టినా,కపాలం ఎముక చిట్లినా,రక్తస్రావమయినా,కంకషన్ ఇంజురీ (అంటే అదురు దెబ్బ)అయినా

.పళ్లకి సంబంధించిన వాపులూ,దెబ్బలలోనూ
.కళ్లు-----దృష్టి దోషాలూ,ట్యూమర్లూ,అక్యూట్ కంజెస్టివ్ గ్లాకోమా
.చెవి సమస్యలలో-----వాపులూ,చీముగడ్డలూ
.ముక్కు సమస్యలలో -----ఇందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది "సైనసైటిస్ "లో వచ్చే "సైనస్ హెడేక్ "-- నుదురు దగ్గర,ముక్కు మొదట,బుగ్గల ఎముకల దగ్గర నెప్పి అనిపిస్తుంది,ముందుకు వంగినా దగ్గినా తుమ్మినా ఎక్కువ అవుతుంది.

జీర్ణాశయ సమస్యలలో-----వాంతులు,విరోచనాలు,

.బి.పి ఎక్కువయినప్పుడు
.బ్రెయిన్ ట్యూమర్ ,ఇతర కాన్సర్లలో-----.బ్రెయిన్ ట్యూమర్లో ,తలనెప్పే ప్రధాన లక్షణం
.స్ట్రోక్ లో--బ్రెయిన్ స్ట్రోక్ లో తలనెప్పి ఎక్కువగా వుంటుంది
.గర్భిణీ లో------తలనెప్పీ,బి.పి పెరగడం గుర్రపు వాతానికి దారి తీస్తాయి.
.చిన్న పిల్లలలో అంటే 10-20మధ్య వయసు వారిలో------మెదడులో చేరిన పురుగుల గుడ్లు తలనెప్పికీ,ఫిట్స్ కీ కారణమవు తాయి"న్యూరో సిస్టిసిర్కోసిస్ .

.మెనింజైటిస్ ,ఎన్ సెఫలైటిస్ ----వీటిలో తీవ్రమైన తలనెప్పి వుంటుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గ్రంథమవుతుంది,ఒక్క మాటలో చెప్పాలంటే అనేక వ్యాథులలో కనపడే కామన్ లక్షణం తలనెప్పి.
కొన్ని విచిత్రమైన తలనెప్పులు

*ప్రయిమరీ కాఫ్ హెడేక్ ---తీవ్రమైన దగ్గుతెర వచ్చాక కానీ,తుమ్ములు వచ్చాక కానీ వచ్చే తీవ్రమైన తలనెప్పి

*ప్రయిమరీ ఎక్జర్షనల్ హెడేచ్ -వ్యాయామం తర్వాత వచ్చే తలనెప్పి

*ఐస్క్రీమ్ హెడేక్ ---చాలా చల్లగా వున్న ఆహార పదార్థాలని త్వరగా తినడం వలన వచ్చే తలనెప్పి.

*రిబౌండ్ హెడేక్ --తలనెప్పి మందులు ఎక్కువగా వాడి హఠాత్తుగా ఆపేయడం వలన కలిగే తలనెప్పి

*ప్రయిమరీ సెక్స్ హెడేక్ ----సంయోగం తర్వాతా,సుఖప్రాప్తి సమయంలోనూ వచ్చే తలనెప్పి .అప్పుడప్పుడూ దీనికి సబ్ అరఖ్నాయిడ్ హెమరేజ్ కారణమవుతూ వుంటుంది.అందుకే అశ్రధ్ధ చేయగూడదు.

అయితేతలనెప్పులు సాధారణ కారణాల వలన ,వస్తున్నాయా?లేక అసాధారణమైన ,ప్రమాదకరమైన జబ్బుల వలన వస్తున్నాయా తెలుసుకుని ,జాగ్రత్తగా తగిన పరీక్షలు చేసి వ్యాధిమూలాలను అన్వేషించి తగిన చికిత్స ఇవ్వడం వలన ప్రాణప్రమాదాలను తప్పించవచ్చు
తలనెప్పి తో బాటు ఈ కింది లక్షణాలు కనపడితే తప్పనిసరిగా,ఆ తలనెప్పి కారణాన్ని శోధించాలి ------

.జ్వరం వుండడం
.బరువు తగ్గడం
.నలభై యేళ్ల వయసు తర్వాత తలనెప్పి రావడం
.కాన్సర్ ,హెచ్ .ఐ.వి లాంటి వ్యాథులు వుండడం
.హఠాత్తుగా తలనెప్పి తీవ్రమవడం
.తలకి దెబ్బ తగిలాక తలనెప్పి రావడం
. స్పృహ కోల్పోవడం
.ఫిట్స్ రావడం
.కాళ్లూ.చేతులూ చచ్చుబడటం

వ్యాధి నిర్థారణ-----

ఈ తలనెప్పి అనేది నిజం చెప్పాలంటే జబ్బు కాదు .అనేక జబ్బులలో కనపడే ఒక లక్షణం.రోగితో మాట్లాడి ,వ్యాధి లక్షణాలు సమగ్రంగా తెలుసు కోవడం వలన చాలావరకూ వ్యాధి నిర్థారణ జరిగిపోతుంది అంటే అది ప్రయిమరీ హెడేకా?,సెకండరీ హెడేకా? అనేది అవగాహనవుతుంది.
ప్రయిమరీ హెడేక్ కి కారణమైన శారీరక మానసిక ఒత్తిడిని తగ్గించుకోమని సలహా ఇవ్వడంతో పాటు ,పెయిన్ కిల్లర్స్ అదీ ప్రమాదం కలిగించని పారసిటమాల్ ,అసిటమైనోఫెన్ లాంటి మాత్రలు డాక్టర్ సలహాపై వాడొచ్చు

సెకండరీ హెడేక్ లో

.బి.పి చెక్ చేయడం
.రక్త పరీక్షలునిర్వహించడం
.న్యూరలాజికల్ పరీక్షలు నిర్వహించడం
.ఎక్స్ రే పరీక్షలు
.సి.టి స్కాన్ 
.యం.ఆర్ .ఐ
.సి.టి. యాంజియో గ్రామ్ 
ఇవన్నీవ్యాధి నిర్థారణకీ ,తలనెప్పికి మూలకారణాన్ని అన్వేషించడానికీ తోడ్పడతాయి.ఒకసారి తలనెప్పికి మూలకారణం తెలిశాక,చికిత్స సులువవుతుంది.

చికిత్స--వ్యాధి మూలకారణాన్ని బట్టి చికిత్స వుంటుంది.

.ప్రయిమరీ హెడేక్స్ ని తగ్గాలంటే పాటించాలిసిన విషయాలు

.ఒత్తిడిని తగ్గించుకోవడం

.రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించడం

.క్రమం తప్పని వ్యాయామం---దీనివలన కండరాలు రిలాక్సవుతాయి.


.వేళ తప్పని సమతుల మితాహారం

.మైగ్రేన్ వున్న వాళ్లు,కొన్ని పదార్థాలు తీసుకోకూడదు.ఛీజ్ ,నట్స్ ,ఆల్కహాల్ ,స్మోకింగ్ వీటికి దూరంగా వుండాలి,తమకు పడని వాసనలకి కూడా దూరంగా వుండటం మంచిది.

.రోజుకి కనీసం యెనిమిది గంటలు చక్కని ప్రశాంతమైన నిద్ర పోతే చాలా వ్యాధులు దూరంగా వుంటాయి.

.గోరు వెచ్చని నీటితో స్నానం,యోగా,మెడిటేషన్ లాంటివి మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను కలిగిస్తాయి.

.ఇలా జీవన శైలిలో మార్పులు చేసుకోవడంతో పాటు అవసరమైతే డాక్టర్ సలహాతో ప్రమాదంలేని పెయిన్ కిల్లర్స్ ని యెంచుకుని వాడాలి ఉదా------పారాసిటమాల్ ,అసిటమైనోఫిన్ ,నాప్రాక్సిన్ లాంటివి.

.చిన్నపిల్లలలో యాస్పిరిన్ వాడకూడదు.

.మైగ్రేన్ తలనెప్పులుండే వాళ్లు ప్రశాంతంగా చీకటి గదిలో చల్లని వాతావరణంలో సేదదీరడంతో పాటు,సుమా ట్రిప్టాన్ ,ఆమ్లో ట్రిప్టాన్ లాంటి మందులతో పాటు, ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్ లాంటి మందులని చికిత్సకోసమూ,తరచూ ఎటాక్స్ రాకుండా ప్రొఫైలాక్టిక్ గానూ కూడా వాడవచ్చు.

.ఇంకా ఇతర లక్షణాలను బట్టి మందులు వాడుకోవాలి అంటే వాంతులవుతుంటే వాంతుల మందులు వాడటం అలా

.మెనింజైటిస్ ,బ్రెయిన్ ట్యూమర్ ఇంకా ఇతర జబ్బులవలన వచ్చే తలనెప్పులకి ,ఆయా వ్యాధులకి తగిన చికిత్స చేయడం ద్వారా తలనెప్పిని నివారించవచ్చు.

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము